Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాను అందాలు చూద్దాం రారండి ( పద్దెనిమిదో భాగం ) - కర్రానాగలక్ష్మి

జైసల్ మేరు - 2మరునాడు మా ప్రోగ్రాములో ' శాపగ్రస్థ పట్టణం ' , బడీబాగ్ , డెజర్ట్ నేషనల్ పార్క్ వున్నాయి .

కులధారా పట్టణం -----

యధాప్రకారం పొద్దున్న ఫలహారాలు ముగించుకొని రాజస్థాను లోని మా ఆఖరు పర్యాటక స్థలాలు చూసేందుకు బయలుదేరేం .

జైసల్మేరు కి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో వున్న ' కులధారా ' పట్టణాన్ని చూడ్డానికి వెళ్లేం . కులధారా పట్టణం దాని చుట్టుపక్కల వున్న 85 పట్టణాలు ' శాపగ్రస్థ ' పట్టణాలుగానూ ఆత్మలు తిరిగే పట్టణాలుగానూ స్థానికులు చెప్తారు . రాజస్థాను లో శాపగ్రస్థకోటలు , భవనాలు , సమాధుల గురించి విన్నాం కాని శాపగ్రస్థ పట్టణాల గురించి వినలేదు . 1300 సంవత్సరం నుంచి యీ యెనభైఅయిదు గ్రామాలు బ్రాహ్మణ ఆవాసాలుగా వుండేవి . విశాలమైన రోడ్లు , చక్కగా కట్టుకున్న యిళ్లు , మందిరాలు , పెద్ద మెట్లబావి మొదలయిన వాటితో తీర్చి దిద్దినట్లు యెంతో శ్రద్ధతో కట్టుకున్న పట్టణంలా కనబడింది , అలాంటి పట్టణం రాఖీ పండగ రాత్రి కి రాత్రి వల్లకాడు కావడానికి కారణం యేమిటి అనేది నా వూహకు అందలేదు . యేదో బలీయమైన కారణం వుండి వుండాలి .

కులధారా పట్టణం లో ఇళ్లన్నీ కూలిపోయినా ఒక వీధి శిథిలాలను సంరక్షించి , పర్యాటకులకు అప్పటి జీవన విధానం పట్ల అవగాహన కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మెచ్చుకో దగ్గది .

కులధారా పట్టణం , మిగతా గ్రామాలలో ' పాలివాల్ ' తెగకు చెందిన బ్రాహ్మణ కుటుంబాలు నివశించేవారు . ఆచారవ్యవహారాలు , పరువు ప్రతిష్ట లకు ప్రాణాలిచ్చేవారిగా వీరికి పేరు . 1800 సం,, ప్రాంతాలలో అలాంటి వారి యింట అతిలోక సుందరి జన్మించింది . ఆమె అందచందాల గురించి చుట్టుపక్కల రాజ్యాలలో కూడా చర్చించుకో సాగేరు . ఆమె అందం గురించి విన్న ఆ ప్రాంతపు దివాను ' సలీమ్ సింగ్ ' ఆమెను పెళ్లాడాలనే కోరికను గ్రామ పెద్దకు తెలియ పరుస్తాడు . సలీమ్ సింగ్ ప్రస్తావనను బ్రాహ్మణులు తిరస్కరించగా అతను రాఖీ పండుగ మరునాడు బ్రాహ్మణ కన్యను వివాహమాడేందుకు ముహూర్తం నిర్ణయించి ఆరోజు వివాహం జరిపించవలసినదని లేనట్లయితే వూరి వారిని తన కరవాలానికి బలిచేసి వివాహం మాడతానని వర్తమానం పంపుతాడు . అది విన్న 85 గ్రామాల బ్రాహ్మణులు రాఖీ పూర్ణిమ నాడు సామూహిక ప్రాణత్యాగానికి పాల్పడతారు . మరునాడు వివాహానికై వచ్చిన  ' సలీమ్ సింగ్ ' పరివారం వల్లకాడైన వూరిని చూసి జరిగినది తెలుసుకొని వెనుకకు మరలిపోతారు . ఊరి పొలిమేర దాటకమునుపే సలీమ్ సింగ్ రక్తం కక్కుకొని మరణిస్తాడు . తరవాత వస్తు వాహనాలతో  విడిచి పెట్టిన యిళ్లల్లో నివసించాలని ప్రయత్వించిన వారికి రాత్రి యేడుపులు వినిపించి పొద్దున్న వారు మతిచలించి వీధులలో తిరుగడం చూసిన ప్రజలు ఆ గ్రామాలు బ్రాహ్మణుల శాపానికి గురైందని నిర్ధారించేరు . ఈ సంఘటనకు నిరిసనగా ' పాలివాల్ ' బ్రాహ్మణులు రాఖీ పండుగ యిప్పటికీ జరుపుకోరు . ఇప్పటికీ రాత్రి పూట కులధారా గ్రామంలో పిల్లలు పెద్దలు తిరుగుతున్నట్లు కోలాహలం వినిపిస్తుందట .

ఏమైనా కొన్ని గ్రామాలు కులం కట్టుబాటుకోసం ఆత్మార్పణం చేసుకోడం చాలా అరుదుగా వింటూవుంటాం . ఇలాంటి సంఘటన జరగకుండా వుంటే యీ వూరు యింకెంత అందంగా కళకళలాడుతూ వుణ్ణో గదా అని అనిపించక మానదు .

డిజెర్ట్ నేషనల్ పార్క్ ---

నేషనల్ పార్కులు యెన్నో చూసిన మాకు యెడారిలో నేషనల్ పార్క్ అంటే యెలావుంటుందో అనే కుతూహులంతో వెళ్లేం . కనుచూపుమేర అంతా యిసుకే . ఇసుకలో యే జంతువులను చూడగలమో మాకర్దం కాలేదు . దీనిని ' శుధ్దశ్రీ నేషనల్ పార్క్ ' అని అంటారు .

జైసల్మేరు కి సుమారు 60 కిలోమీటర్ల దూరం లో వుంది . ప్రపంచపు అతి పెద్ద పార్కులలో ఒకటిగా లెక్కించే ఈ పార్క్ వైశాల్యం సుమారు 3162 చదరపు కిలోమీటర్లు . రాజస్థాను లో పర్యటించాలి అంటే నవ్వంబరు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే బాగుంటుంది అనే మా నమ్మకాన్ని మరో మారు నిజమని తెలియచెప్పింది యీ నేషనల్ పార్క్ పర్యటన . ఎక్కడ చూసినా యిసుక , యిసుకలో నడక యెంత కష్టమో అలా నడుస్తూ వెడుతూ వుంటే తెలిసింది . ఇక్కడ విషపూరితమైన తేళ్లు , పాములు వుంటాయనే బోర్డులు భయ పెట్టినా అలాంటివేమీ కనిపించలేదు . జీపు లో ప్రయాణిస్తే చాలా భాగం చూడగలుగుతాము . జీపువారికి జంతువుల నెలవులు బాగా తెలుస్తాయి . వారు అక్కడకి తీసుకు వెళతారు . అందుకే మేము జీపు లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం .

ఒక చోట యెన్నో రకాల పక్షులు కనిపించేయి . చాలా వాటి పేర్లు కూడా తెలియవు . రాబందులు , గద్దలు , పెలికానులు కనిపించాయి . ఇక్కడ చూసిన ఓ పక్షి ని ' గ్రేట్ యిండియన్ బస్టర్ ' అని మా జీపు డ్రైవరు కమ్ గైడు చెప్పేరు . పొడుగైన నల్లని పక్షి  , తలపైన కిరీటంలా వున్న ఈకలతో రాజసం వుట్టి పడుతూ వుంది . ప్రపంచం లో మరెక్కడా యీ పక్షి జాతి కనిపించదు . అతి వేగంగా లుప్తమౌతున్న పక్షి జాతి కూడానట . ఇక్కడ యెక్కువగా కనిపించేవి కృష్ణ జింకలు , జింకలు , యెడారి పిల్లులు , నక్కలు , తోడేళ్లు . దేశ విదేశాలనుంచి వచ్చే పక్షి అధ్యనకారులు వారి పరిశోధనలు చేసుకుంటూ వుండడం కనిపించింది . అక్కడక్కడ రేగుపొదలు , ఖర్జూరపు చెట్లు కనిపించాయి . ముళ్లపొదలు సవన్నా గడ్డి పొదలు అక్కడక్కడ వున్నాయి . మిగతా ప్రదేశమంతా యిసుక గుట్టలే .

ఈ యెడారిలో 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో సంచరించిన ' డైనోసార్ ' ఫోసిల్స్ ను చూడొచ్చు . మన దేశంలో డైనోసార్స్ ఫోసిల్స్ వున్న ప్రదేశం నాకు తెలిసి యిదొక్కటేనేమో . ఫోసిల్స్ అంటే యింట్రస్ట్ వున్నవారు తప్పక చూడవలసిన ప్రదేశం . కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం రాజస్థాను లో సముద్రం వుండేదని వాతావరణ ప్రభావం వలన సముద్రం యెండిపోయిందని చెప్పే పురాణాలు నిజమేనేమో అనడానికి యిక్కడ కనిపించే సముద్ర జీవుల ఫోసిల్సే సాక్షం .

జీపు సఫారీ తర్వాత యిసుకలో కొంత దూరం నడిచేము . ఎడారి నేషనల్ పార్క్ కాళ్ల నొప్పులు యిచ్చినా కొత్త విషయాలు తెలుసుకున్నామనే అనుభూతినిచ్చింది .

బడా బాగ్ ---

జైసల్మేరు పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది . 1700 లలో రాజైన జైసింగ్ - 2 వాన నీటిని నిలువచేసి ఆ నీటితో యిక్కడ వుద్యానవనాన్ని నిర్మించేడు . ఆ పచ్చదనం తో ఆ వుద్యానవనం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రసిద్ధి పొందింది . అయితే ప్రస్తుతం యిక్కడ మాకు యేవిధమైన పచ్చదనం కనిపించకపోగా యేవో రాతి కట్టడాలు కనిపించేయి . పెద్ద గేటు దాటుకొని వెడితే ఒకే రకంగా నిర్మించిన చిన్న పెద్ద కట్టడాలు మధ్యన శివలింగాలు కనిపించేయి . ఆ కట్టడాలపై రాసిన రాతలు చదివితే అవి రాజ వంశస్థుల సమాధులని తెలిసింది . చుట్టూరా స్థంబాలతో పైన గొడుగులా నిర్మించిన నిర్మాణాన్ని ' ఛత్రి ' అని అంటారు .

1743 లో జైసింగ్ --2 మరణిస్తే అతని పుతృడు ' లునకరణ్ సింగ్ ' తండ్రి కి యిష్టమైన బడాబాగ్ లో అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించేడు . తరవాత బడాబాగ్ ని రాజవంశస్థల సమాధి స్థలంగా వుపయోగించుకో సాగేరు . ఇక్కడ వున్న ఆఖరి అసంపూర్తి సమాధి యిరవయ్యో శతాబ్దానికి చెందిన ' జవహర్ సింగ్ ' ది .

ఈ సమాధులని పర్యాటక స్థలాలలో యెందుకు చేర్చేరో నాకైతే అర్దం కాలేదు .

 రాజస్థాను లో మేము పర్యటించిన పర్యాటక స్థలాలు పూర్తయేయి .

త్రిబాణ ధారి , శీష్ కె ధనీ , ఖటు శ్యామ్ అని పిలువబడే బబ్రువాహనుని కోవెల గురించి యిదే పత్రికలో నేను రాసిన వ్యాసం లింక్ యిచ్చేను కాని యెందు చేతనో ఆ లింక్ రాలేదు . రాజస్థాను పర్యటన ఖటు శ్యామ్ గురించి చెప్పకపోతే పూర్తయినట్లు కాదు అని అనిపించింది . అందుకని క్లుప్తంగా ఆ కోవెల గురించి చెప్పి ముగిస్తాను .

రాజస్థాను లోని ' శిఖర్ '  జిల్లాలో ' ఖటు ' గ్రామం లో వున్న భీముని మనుమడు , ఘటోచ్గచుని పుతృడు అయిన బబృవాహనుని కోవెల వుంది . దీనిని శ్యామ్ బాబా మందిరమని , ఖటు శ్యామ్ మందిరమని పిలుస్తారు . ఆ వివరాలు క్లుప్తంగా వివరిస్తాను .

ఘటోచ్గచుని పుతృడు తల్లికి అతి విధేయుడు బార్బారిక నామధేయముడు మూడు అతి శక్తి వంతమైన బాణాలు కలిగిన యితుడు అతి వీరుడు శూరుడూనూ . మహాభారత యుద్ధం లో పాల్గొనాలని కుతూహల పడుతూ వుంటాడు . ఇతని గురించి విన్న కృష్ణుడు యితని మూడు బాణాల శక్తిని పరీక్షిస్తాడు , బబ్రువాహనుడు తల్లి నుంచి పొందిన వరం గురించి తెలుసుకుంటాడు . ఆ వరం యేమిటంటే ' ఓడిపోయే వారిని గెలిపించాలని '  . మహాభారత యుధ్దంలో కౌరవులు పరాజయం పొందుతారని తెలిసిన కృష్ణుడు బబ్రువాహనుడు మహాభారతయుధ్దం లో పాల్గొంటే యుధ్దం యెప్పటికీ ముగియదని తెలుసుకుంటాడు . అందుచే కృష్ణుడు బబ్రువాహనుని శిరస్సు ను దానం గా కావాలని అడుగుతాడు . మహాభారతయుధ్దం చూడాలనే కోరికను తీర్చమని కోరి శిరస్సును దానమిచ్చెస్తాడు బార్బారికుడు . ఆ వీరుని రక్తం తో యుధ్దభూమిని శుధ్ది చేసి అతని శిరస్సును కొండపైన వుంచి , కలియుగంలో తనతో సమానంగా తనపేరుతో ప్రసిధ్ది పొందుతాడని వరమిచ్చి వెడలి పోతాడు కృష్ణుడు .

మహాభారత యుధ్దానంతరము అతని శిరస్సు ఆ కొండపైన వుండిపోగా కలియుగంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నరాజు కలలో కనిపించి తన శిరస్సు వున్న కొండ వునికిని తెలియ పరిచి ఆ ప్రదేశం లో మందిరం నిర్మించమని కోరుతాడు . రాజు ఆ ప్రదేశంలో వెతుకగా బబృవాహనుని శిరస్సు దొరుకుతుంది . అతని శిరస్సు ను సమాధి చేసి అక్కడ మందిర నిర్మాణం చేస్తాడు .

రాజస్థాను వ్యాపార సముదాయం యితనిని యెంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు . ఖటు శ్యాముని నమ్మిన వారికి యెప్పుడూ ఓటమి దరిచేరదని నమ్ముతారు . వారి వ్యాపార సంస్థలలో యితని ఫోటో తప్పక వుంటుంది .

దీంతో మొత్తం మేము చూసిన రాజస్థాను పూర్తయింది .

మళ్లావారం మరో రాష్ట్రంలోని పర్యాటక స్థలాలతో మీముందుకు వస్తానని మనవి చేసుకుంటూ శలవు .

మరిన్ని శీర్షికలు
punch patas