Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము

కాశీపట్టణ వైభవాన్ని, అక్కడి చతుర్వర్ణాల వారిని, చతురంగ బలాలను, అక్కడి సుందరీమణులను వర్ణించిన తర్వాత అగస్త్యుని కథను ప్రారంభించాడు తెనాలి  రామకృష్ణుడు. వారణాసీ పట్టణంలో సిద్ధతటి  వద్ద సిద్దాశ్రమంలో మహానుభావుడు అగస్త్యుడు తన సతీమణి, పతివ్రతాశిరోమణి ఐన  లోపాముద్రతో నివాసం ఉంటున్నాడు. దేవతలు  ప్రార్ధించడం వలన వింధ్యపర్వతానికి గర్వభంగం చేయడం కోసం దక్షిణాపథానికి  బయలుదేరాడు అగస్త్యుడు.

పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ  రెక్కల సహాయంతో అవి ఆకాశంలో హాయిగా  ఎగురుతూ ఉండేవి. క్రింద భూమిమీది ప్రజలు భయపడేవారు, ఎక్కడ  తమ  మీద  పడుతాయో అని. దేవేంద్రుడు వాటి రెక్కలను నరికేశాడు. అందుకే ఆయనను నగభేది  అన్నారు. మేరుపర్వతం మీది అసూయతో, తన దర్పాన్ని చూపిద్దామనుకున్నది వింధ్యపర్వతం. మహా గర్వంతో నన్ను మించిన వారు లేరని పెరిగి పెరిగి ఆకాశాన్ని  ఒరుసుకుని, సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డంగా నిలిచింది. అటునుండి యిటు  వెళ్లేవారికి కూడా ఆటంకమైపోయింది. ఆ పర్వతాన్ని, దాని గర్వాన్ని అణచడానికి తమరే  సమర్ధులు స్వామీ అని దేవతలు, మునులు అందరూ ప్రార్ధిస్తే అగస్త్యుడు సరేనని  దక్షిణదిశకు బయలుదేరాడు.

అబ్దితోఁగూడమునుగ్రోలునౌర్వవహ్ని
యుదరబిలమున నొకచోట నుండియుండి
జటిలవరునకుఁ గద్రూజకటక కటక
విరహతాపమిషంబున  వెడలెనపుడు               (తే)

పూర్వం ఒకప్పుడు దేవతల కోరికమేరకు సముద్రాన్ని పుక్కిటబట్టాడు అగస్త్యుడు. అప్పుడు సముద్రంలో దాగి, అఘాయిత్యాలు చేస్తున్న రాక్షసులను దేవేంద్రుడు  సంహరించాడు, లోకక్షేమంకోసం. ఆ  సముద్రజలాన్ని తాగినప్పుడు సముద్రంలో  ఉండే బడబాగ్ని కూడా అగస్త్యుడి కడుపులోకి చేరి ఉంటుంది బహుశా. యిప్పుడు  కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుడిని విడిచివెళ్ళడం అనే విరహబాధ మిషతో ఆ బడబాగ్ని మంటలు బయటకు వచ్చాయి కావొచ్చు అన్నట్లు, తాపభారంతో బయలుదేరాడు  అగస్త్యుడు అని చమత్కరిస్తున్నాడు రామకృష్ణుడు.

పుడిసిటఁ బట్టెనే తపసిపొంగుపయోనిధి, నిల్వలానుజున్
గడుపున వేల్చెనేతపసి, గాఢతపోనిధి నయ్యగస్త్యునిన్
బొడగని వింధ్యభూధరము పొంకము బింకముఁదక్కి నేలలో
నడగె, బిలాంతరస్థలి భయాహతిజొచ్చు కుళీరమోయనన్               (చ)

ఏ మహా తపస్వి పొంగులెత్తే సముద్రాన్ని పుక్కిటబట్టాడో, యిల్వలుని తమ్ముడైన  వాతాపిని ఏ మహా తపస్వి తన కడుపులో మసి చేశాడో, ఆ గాఢతపోనిధి ఐన అగస్త్యుని రాకను గమనించి, రంధ్రంలో దూరే ఎండ్రకాయలాగా నేలలో అణిగిపోయాడు  వింధ్యుడు. అతని బింకము, పొంకము అన్నీ అణిగిపోయాయి.

ఆవింధ్యాచలమట్లు వంధ్యనిజగర్వారంభమైయుండ, న
గ్గోవిందాభుఁ డభంగురోదయనిధిన్ గొల్లాపురీలక్ష్మి, ర
క్షోవిద్వేషి భుజాంతరాళపదవీశుద్ధాంతసైరంధ్రికన్
సేవించె న్నుతియించె నాగమకథాసిధ్ధాంత శుద్దోక్తులన్             (శా)

ఆ వింధ్యపర్వతం తన గర్వసంరంభం నశించి అణిగిమణిగి ఉండగా, ఆ గోవిందుని  యంతటివాడైన అగస్త్యుడు ఆ పర్వతాన్ని తను వెనక్కు తిరిగి వచ్చేవరకూ అలాగే  అణిగి ఉండమని చెప్పి దాన్ని దాటి ముందుకు, దక్షిణాపథానికి అడుగులేశాడు.  అనంతమైన అభ్యుదయానికి ఆటపట్టైన శ్రీమహాలక్ష్మిని, రాక్షసుల విద్వేషి ఐన  శ్రీమహావిష్ణువుయొక్క హృదయపీఠంపై కొలువై ఉండే శ్రీమహాలక్ష్మిని, కొల్హాపురిలో దర్శించుకున్నాడు. వేదసూక్తులతో ఆమెను నుతించాడు, సేవించాడు.

అభ్యుదయము అంటే పురోగతి, అంటే ప్రగతిశీలమైన, ప్రయత్నశీలమైన మనుగడ. ఉత్సాహము, కార్యస్ఫూర్తి, కార్యదీక్ష, శ్రమించే తత్త్వము దైవీసంపద, సాత్త్విక లక్షణం  అని గీతలో భగవానుడు నిర్దేశించాడు. సోమరితనము, నిరాశ, నిస్పృహ ఆసురీ సంపదలు,   తామసిక లక్షణము అని కూడా సెలవిచ్చాడు. శ్రీమహాలక్ష్మిని ఉపాసించడంవలన  ప్రయత్నశీలత కలుగుతుంది. ఎక్కడ ప్రయత్నం ఉంటుందో అక్కడ ఫలితం ఉంటుంది.  సత్ప్రయత్నాలకు లభించే సత్ఫలితాలే అసలైన సంపద, అది రమ్యంగా ధ్వనిస్తున్నాడు  రామకృష్ణుడు! ఆ ప్రయత్నశీలతకు, నిరంతర కృషికి, లోకశ్రేయస్సుకోసం తపించడానికి  అగస్త్యుడు, విశ్వామిత్రుడు గొప్ప ఉదాహరణలు మన పురాణప్రపంచంలో. కనుక అగస్త్యుడి  సందర్భంలో ఈ పరామర్శ!

ఆపరమేశ్వరి తను నా
జ్ఞాపింపఁగ సామిమలకు షణ్ముఖపదసే
వాపరతఁజనియె నమ్ముని
లోపాముద్రయును శిష్యులును సేవింపన్           (కం)

కొల్హాపురిలో కొలువైవున్న శ్రీమహాలక్ష్మి అగస్త్యునికి ప్రసన్నురాలైంది. తన దర్శనాన్ని  ప్రసాదించింది. ఇక్కడినుండి నీవు 'స్వామిమల'కు వెళ్ళు, లోక శ్రేయస్సు సిద్ధిస్తుంది  అని ఆజ్ఞాపించింది. అనుగ్రహించింది. అలాగేనని, లోపాముద్ర, శిష్యులు తనను  సేవిస్తుండగా స్వామిమలకు ప్రయాణమయ్యాడు అగస్త్యుడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
weekly horoscope 24th june to 30th june