Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నిహారికతో ఇంటర్వ్యూ

interview with  niharika
గ్లామర్ పాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను - నిహారిక‌

నిహారిక‌.. ఒక మ‌న‌సుతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న మెగా హీరోయిన్‌.
ఓ గొప్ప ఇంటి నుంచి వ‌స్తున్నా అనే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ నిహారిక‌లో లేదు.
త‌న బ‌లాల గురించి, త‌న బ‌ల‌హీన‌త‌ల గురించీ ఓ అవ‌గాహ‌న ఉంది.
దాంతో పాటు ఇండ్ర‌స్ట్రీ గురించి కావ‌ల్సినంత క్లారిటీ ఉంది.
అన్నింటికి మించి త‌న ప్ర‌తిభ‌పై న‌మ్మ‌కం ఉంది. అందుకే ''ట్యాగ్ లైన్‌ని ప‌ట్టించుకోను.. ప్ర‌తిభ‌నే న‌మ్ముకొన్నా'' అంటోంది.  నిహారిక న‌టించిన ఒక మ‌న‌సు ఇప్పుడు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈ సంద‌ర్భంగా మెగా హీరోయిన్‌తో జ‌రిపిన‌ చిట్ చాట్ ఇది.

* హాయ్ నిహారిక‌..
- హాయ్‌..

* కానీ ఇప్పుడు పేరు మార్చుకొన్నార‌ట క‌దా.. సంధ్య అని..
- (న‌వ్వుతూ) ఒక మ‌న‌సులో నా క్యారెక్ట‌ర్ పేర‌ది. ఆ పాత్రలో ఎంత‌గా ఇన్‌వాల్వ్ అయ్యానంటే.. నా పేరు మ‌ర్చిపోయా. సెట్లో సంధ్య అని పిలిస్తేనే ప‌లికేదాన్ని.

* అంత‌గా ఆ పాత్ర మిమ్మ‌ల్ని మాయ చేసిందా?
- అవునండీ..  రామ‌రాజు గారు క‌థ చెబుతున్న‌ప్పుడే సంథ్య పాత్ర‌కు అంత‌లా క‌నెక్ట్ అయిపోయా. `ఈ సినిమా త‌ప్ప‌కుండా చేయాలి` అని పించింది. తెర‌పై నా క్యారెక్ట‌ర్‌ని తీర్చిదిద్దిన విధానం కూడా చాలా బాగా న‌చ్చింది.

* సినిమా విడుద‌ల అన‌గానే టెన్ష‌న్ ఏమైనా ప‌డ్డారా?
- ఏమీ లేదండీ. సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా మ‌న‌సుకు న‌చ్చి చేసిన సినిమా ఇది. ఆ జ‌ర్నీనే ఎంతో గొప్ప‌గా అనిపించింది.

* మీ నాన్న‌గారు ఏమ‌న్నారు..
- డాడీ ఇంకా సినిమా చూళ్లేదు. ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షో ఆయ‌న కూడా మిగిలిన ప్రేక్ష‌కుల్లానే సినిమా చూడాల‌నుకొంటున్నారు.

* అస‌లు క‌థానాయిక అవ్వాల‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చింది?
- నిజం చెప్పాలంటే యాక్ట‌ర్ అవ్వాల‌ని అస్స‌లు అనుకోలేదు. దాని గురించి కూడా ఆలోచించ‌లేదు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు అంటే ఇష్టం.  అందుకే ప్రొడ్యూస‌ర్ అవ్వాల‌నుకొన్నా. కానీ ఎప్పుడు ప‌డిందో... న‌ట‌న అనే బీజం నా మైండ్‌లో ప‌డిపోయింది.

* స్టార్ కుటుంబాల నుంచి వ‌చ్చిన క‌థానాయిక‌లెవ‌రూ అంత‌గా రాణించ‌లేదు క‌దా.. ఆ సెంటిమెంట్ భ‌య‌పెట్ట‌లేదా?
- దాని గురించి ఆలోచించిన మాట వాస్త‌వ‌మే. అయితే.. ఎవ‌రి జాత‌కం వాళ్ల‌ది. మ‌రొక‌రితో పోల్చుకోవ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. నా ప్ర‌తిభ ఎంతో తెలుసుకోవాల‌నిపించింది.

* ఈ విష‌యం ఇంట్లోవాళ్ల‌కు చెబితే ఏమ‌న్నారు?
- వాళ్లేం పెద్ద‌గా షాక్‌కి గుర‌వ్వ‌లేదు. కాక‌పోతే క‌థానాయిక అవ్వ‌డం వెనుక ఉన్న లాభ‌న‌ష్టాల్ని విడ‌మ‌ర్చి చెప్పారంతే. చిరంజీవి డాడీ అయితే.. `క‌థానాయ‌కులెలాగైనా నెట్టుకొచ్చేస్తారు... హీరోయిన్ అంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డాలి` అన్నారు. క‌ష్ట‌ప‌డ‌డానికి నేను రెడీ.

* తొలి సినిమాకే మెగా హీరోయిన్  అనే ట్యాగ్ లైన్ ప‌డిపోయింది..
- నిజానికి ఆ పిలుపు బ‌రువు బాధ్య‌త‌ల్ని గుర్తు తెస్తుంది. చిరంజీవి డాడీ ఎదిగారంటే అది రాత్రికి రాత్రే వ‌చ్చిన గుర్తింపు కాదు. ఎన్నో ఏళ్ల క‌ష్టం. మెగా హీరోయిన్ అని ఎవ‌రో చెబితే తీసుకోను.. నాకు నేను సంపాదించుకొంటా. నాగ‌బాబు కూతురిగా తొలి సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. మ‌రి రెండో సినిమాకి నేనేం చేయాలి?  ఎలా న‌టిస్తానో తొలి సినిమాతో తెలిసిపోతుంది.  నా బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు అర్థ‌మైపోతాయి. ఇక నా రెండో సినిమా ఎందుకు చూస్తారు?  అంటే.. మెగా ట్యాగ్ లైన్ తొలి సినిమాకే ప‌రిమితం అన్న‌మాట‌. ఆ విష‌యాన్ని నేనెప్పుడూ మ‌ర్చిపోను.

* నాగ‌శౌర్య‌తో ఎఫైర్ న‌డుపుతున్నట్టు వార్త‌లొచ్చాయి... వాటిపై మీ కామెంట్‌?
- సినిమాల్లోకి అడుగ‌పెడుతున్న‌ప్పుడే ఇలాంటి రూమ‌ర్ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఇంట్లోవాళ్లు చెప్పారు. కాబ‌ట్టి రూమ‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు భ‌య‌ప‌డ‌లేదు. పెద్ద‌గా ఆందోళ‌నా చెంద‌లేదు. సెట్లో న‌న్నో ఫ్రెండ్‌లా ట్రీట్ చేశాడంతే.

* మీ రోల్ మోడ‌ల్ ఎవ‌రంటే ఏం చెబుతారు?
- ఇంకెవ‌రూ పెద‌నాన్న చిరంజీవి గారే. నాకే కాదు.. నాలాంటి వేల‌మందికి ఆయ‌నే స్ఫూర్తి.

* ఇంట్లోవాళ్లు కాకుండా..
- క‌మ‌ల్‌హాస‌న్‌, కాజోల్‌.

* నిహారిక‌ని ఇక మీద‌ట‌ ఎలాంటి పాత్ర‌ల్లో చూడొచ్చు..
- కుటుంబం అంతా క‌లిసి చూసే సినిమాల్నే చేస్తా. గ్లామ‌ర్ పాత్ర‌ల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఓ సినిమా ఒప్పుకొనే ముందు మెగా అభిమానుల ఆశ‌లు, ఆకాంక్ష‌ల్ని గుర్తుపెట్టుకొంటా.

* మ‌రి టీవీ షోల మాటేంటి?
- చేయాలా, వ‌ద్దా అనే విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే మొద‌టి ప్రాధాన్యం మాత్రం త‌ప్ప‌కుండా సినిమాల‌కే.

* రెండో సినిమా ఎప్పుడు, ఎవ‌రితో?
-  ఇంకా ఏం అనుకోలేదు. ఒక మ‌న‌సు విడుద‌లైంది క‌దా.. ఆ రిపోర్ట్‌ని బ‌ట్టే నా నిర్ణ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
oka manasu movie review