Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue167/476/telugu-serials/atulitabandham/atulitabandham/

.

వేరే ఉద్యోగంలో చేరింది ఐశ్వర్య. పూర్తిగా తన పనిలోనే  నిమగ్నమౌతూ తనను పరిహసిస్తున్న పరిస్థితులనూ, విలపించే మనసునూ నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తోంది.

ఆఫీసులో ఉన్నంత సేపూ ఫర్వాలేదు కానీ ఇంటికి వచ్చిన తరువాత మాత్రం ఆమె మనసు ఆమె అధీనంలో ఉండటం లేదు. అనుక్షణమూ ఆ ఇంటిలో కార్తీక్ తో గడపిన మధురమైన జ్ఞాపకాలు... ప్రతీ పనిలో తోడుండే వాడు. వర్షం పడినప్పుడు ఉరుముల శబ్దానికి తను భయపడితే గుండెల్లో దాచుకొని, భయం లేదంటూ ఊరడించేవాడు. అలాంటి వాడు ఇప్పుడు ఒంటరితనం అనే చీకటిలో వదిలేసి నిర్దయగా వెళ్ళిపోయాడు.

ఆలోచించే కొద్దీ మనసు మరింత భారమై, కళ్ళు నదులు అవుతున్నాయి... ఎంత ఏడ్చినా మనసుకు శాంతి కలగటం లేదు... ఓ రోజు అలాగే నిద్ర పట్టక, బాధతో కొట్టుకుంటున్న ఐశ్వర్యకు అరలో కనిపించింది కార్తీక్ సగం తాగి వదిలేసిన విస్కీ బాటిల్... ‘ఇది తాగితే కొంచెం నిద్ర పడుతుందేమో... బాధ తగ్గుతుందేమో...’ చిన్న స్టీల్ గ్లాసులో కొంచెం పోసుకుని కొద్దిగా నీరు కలుపుకుని టానిక్ తాగినట్టు తాగేసింది. కాసేపట్లో మత్తు... ఏదో తెలియని సుఖం... మనసు ఏమీ  ఆలోచించటం లేదు... హాయిగా అనిపించింది...

‘ఓహో, ఇందుకేనేమో ఆ దేవదాసు పార్వతిని కోల్పోయిన బాధలో ఇలా దీనికి అలవాటు పడి బాధను తగ్గించుకున్నాడు... నేను దేవదాసునా, పార్వతినా? పార్వతి కూడా దేవదాసును కోల్పోయింది కదా... మరి తను ఎలా తగ్గించుకుంది బాధను? ఏమిటో ఆ శరత్ చంద్ర కూడా దేవదాసు వైపే రాసాడు కానీ పార్వతి వైపు రాయలేదు... ఆడదానిది ప్రేమ కాదా? ఆమెకి వలపు బాధ లేదా? ప్రేమించిన ప్రియుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ సమయంలో వేరే పెళ్లి చేసుకోవలసి వచ్చిన పార్వతి మనసు ఎంత ముక్కలై పోయి ఉండాలి? ప్రియుడి తిరస్కృతికి గురి అవటం కన్నా వేరే నరకం ఉంటుందా ప్రేమించిన ఇంతికి?’ ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్రలోకి జారిపోయింది ఐశ్వర్య.
ఉదయం నిద్ర లేవగానే రాత్రి జరిగింది తలచుకొని, చాలా సిగ్గు పడిపోయింది ఐశ్వర్య. ఛ! తను తాగటం ఏమిటి? పల్లెటూరి వాడైనా తన తండ్రే తాగడు, ఆయన కడుపున పుట్టిన తాను... మద్యపానమంటే అసహ్యించుకునే తను... ఇదేమిటి ఇలా? తనమీద తనకే చిరాకు,  కోపం కలిగాయి. గబగబా బాత్ రూమ్ లోకి వెళ్లి తలారా స్నానం చేసి వచ్చింది. దేవుడి పటం ముందు నిలబడి క్షమించమంటూ చెంపలు వేసుకుంది.

కానీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మరోసారి తాగింది. ఇలా అప్పుడప్పుడూ జరుగుతోంది.

***

మధుబాలకు చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి అయి ఆరునెలలు అయింది... అనుమానంగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళితే తను తల్లి కాబోతోంది అని నిర్ధారణ అయింది. ఎంతో సంతోషంగా, కొద్దిగా భయంగా, కించిత్ గర్వంగా ఎన్నో భావాలు కలబోసిన అనుభూతి కలుగుతోంది. గాలిలో తేలిపోతున్నట్టు అనుభూతి చెందుతూ ఇంటికి వచ్చింది.

హాల్లో కూర్చుని టీవీ లో సీరియల్ చూస్తూ రాత్రి టిఫిన్ చపాతీలలోకి కూర తరుగుతోంది సుగుణమ్మ. కోడలిని చూడగానే ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ టీవీ వైపు దృష్టి సారించింది. పక్కనే సోఫా లో మామగారు కూర్చుని ఉన్నారు.

తనూ నవ్వి తమ రూమ్ లోకి వెళ్లి వేణు కోసం వెదికింది. ఇంకా రాలేదులా ఉంది... అనుకుంటూ త్వరత్వరగా స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇవతలికి వచ్చింది. అప్పటికి వచ్చేసాడు వేణు. డెస్క్ టాప్ లో న్యూస్ పేపర్ చదువుకుంటూ కనిపించాడు.
అంతులేని అనురాగం ముప్పిరిగొనగా వెనకాలే వెళ్ళి అతని కళ్ళు మూసింది. వీపు మీదుగా వంగి అతని చెంపను తన పెదాలతో స్పృశించింది. 

“ఏయ్... ఏమిటోయ్ ఈ హుషారూ? రోజూ ఇలాగే ఉంటే ఎంత బావుంటుంది నువ్వూ?” ఆమె శరీరం నుంచి వచ్చే సురభిని ఆఘ్రాణిస్తూ, కళ్ళ మీదనుంచి ఆమె చేతులు తీసేసి తనవైపు లాక్కున్నాడు ఆమెను.

“వేణూ... ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను...” అతన్ని అల్లుకుపోతూ చెవిలో గుసగుసగా చెప్పింది.

“అవునా, ఏమిటీ విశేషం?”

అకస్మాత్తుగా సిగ్గు ముంచుకు వచ్చింది మధుబాలకు. ముఖం రాగరంజితమైంది. పెదవులు ముసిముసిగా నవ్వాయి...

“ఏయ్, సస్పెన్స్ నాకు నచ్చదు అని తెలుసు కదరా మధూ... ప్లీజ్ చెప్పు...” ఆమెకు కితకితలు పెట్టాడు.

“అబ్బా... ఏయ్ ఆపు... నువ్వు పాసయ్యావోయ్...” అంది కొంటెగా...

“అవునా, ఏ పరీక్షలో నబ్బా?”

“ఒక మెట్టు ఎక్కావులే... నీకు ప్రమోషన్ ఇస్తున్నాను భక్తా... తండ్రివి కాబోతున్నావు...” గబుక్కున చెప్పేసి రెండు చేతుల్లో ముఖం దాచుకుంది మధు.

“హేయ్ నిజమా?” వేణు మనసు, శరీరం రెండూ పులకరించిపోయాయి... మధుబాల ముఖం నిండా ముద్దులు కురిపించాడు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.

“థాంక్స్ మధూ... నిజంగా ప్రమోషన్ ఇచ్చావు... థాంక్స్ అ లాట్...” అప్రయత్నంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

తనను తాను సంబాళించుకొని, “ఈ శుభ సందర్భంలో నీకేం కావాలన్నా ఇచ్చేస్తాను... కోరుకో మధూ...” అన్నాడు ప్రేమగా...

“మన మధ్య ఎలాంటి అరమరికలు ఉండకూడదు... ఈ స్వచ్చమైన ప్రేమ ఇలాగే ఎప్పుడూ కొనసాగాలి. అంతే... అంతకన్నా ఏమీ వద్దు వేణూ... ఇది ఒక్కటీ చాలు...” అన్నది మధుబాల.

“అలాగే మధూ... మరి అమ్మకి ఈ విషయం చెప్పాలి కదా...”

“అమ్మో... నేను చెప్పలేనండి... నాకు సిగ్గు...”

“ఎందుకూ నేనే చెప్పేస్తా... నాకు సిగ్గు లేదుగా?” అంటూ ఫక్కున నవ్వి, “అమ్మా!” అని పిలిచాడు.

“ఏమిట్రా?” ఆవిడా గొంతు పెంచి బదులిచ్చింది.

“అర్జెంట్ గా రా, నీతో మాట్లాడాలి...”

“వెళ్ళు వెళ్ళు, ఏదో వస్తువు పోగొట్టుకుని ఉంటాడు, వెదికి పెట్టటానికి పిలుస్తున్నాడు అమ్మ కూచి...” సుగుణమ్మను ఆట పట్టిస్తూ అన్నాడు గోవర్ధన రావు.

“చాల్లెండి...” చిన్నగా నవ్వుకొని లేచి గదిలోకి వచ్చింది సుగుణమ్మ...

“అమ్మా, రా... ఇలా కుర్చీలో కూర్చో...” అంటూ తల్లిని కూర్చోబెట్టి, మధుబాలకి సైగ చేసాడు. ఇద్దరూ కలిసి సుగుణమ్మ కి పాదనమస్కారం చేసారు.

అర్థం కాక అయోమయంగా చూస్తున్న తల్లితో “మా ముగ్గురినీ ఆశీర్వదించమ్మా...” అన్నాడు వేణు నవ్వు దాచుకుంటూ.

“ముగ్గురా? ముగ్గురేమిటీ?” ఉన్నట్టుండి ఆవిడ తలలో బల్బ్ వెలిగింది...

“అవునమ్మా, నువ్వు బామ్మవి కాబోతున్నావే...” అన్నాడు చిన్నపిల్లాడిలా తల్లి ఒడిలో తలపెట్టుకుని నవ్వుతూ... సుగుణమ్మ ఆనందానికి అవధులు లేవు...

“ఏమండోయ్ త్వరగా రండి...” అంటూ భర్తను పిలిచింది.

“హూ...నేనూ వచ్చి వెదకటంలో నీకు సహాయం చేయాలా ఏమిటే?” అంటూ వచ్చాడు గోవర్థనరావు.

“రండి తాతగారూ... రండి రండి...” గంభీరంగా పలికింది సుగుణమ్మ.

“తాతగారూ...” విషయం అర్థమైపోయింది గోవర్ధనరావుకు.

“ఏరా వేణూ? నిజమా! హార్టీ కంగ్రాట్స్ మై సన్...” వేణును కౌగలించుకున్నాడు ప్రేమగా...

“థాంక్స్ నాన్నా...”

“కంగ్రాట్స్ అమ్మా మధూ...” ఆప్యాయంగా ఆమె భుజం తట్టాడు గోవర్ధన రావు.

ఆయన పాదాలకి నమస్కరించింది మధుబాల.

***

మధుబాల ఫోన్ చేసి తల్లికీ, అక్కలకిద్దరికీ విషయం చెప్పింది. పూర్ణమ్మ ఎంతో సంబరపడిపోయింది.

సుగుణమ్మ పెద్దకూతురు సురేఖకూ, చిన్న కూతురు వినతకూ ఫోన్ చేసి శుభవార్తను చెప్పింది.  సురేఖ ఎంతో సంతోషపడింది కానీ వినత మనసు ఉడికిపోయింది.భర్త బయటనుంచి రాగానే తగువేసుకుంది.

“విన్నారా? ఆ మాయలాడి నెలతప్పింది!” అంది అక్కసుగా..

“మాయలాడి? నిన్నుమించిన ఆ లక్షణాలు గలవారు ఎవరు చెప్మా?” అన్నాడు పవన్  నవ్వేస్తూ.

“అదే... మా అన్నయ్య పెళ్ళాం మధుబాల...”

“మధు చెల్లాయా? ఓ, శుభవార్త... ఎంతో  సంతోషం గా ఉండాల్సింది పోయి, ఈ అసూయ ఏమిటి వినతా?”

“హు... మనకి పెళ్ళి అయి ఇంతకాలం అయింది... నన్ను తల్లిని చేయలేకపోయావు...” అంది ఈసడిస్తూ...

“నీకు నిలువెల్లా అహంకారమే తప్ప మంచితనం ఏ కోశానా లేదు... నువ్వు తల్లివి కాకపోవటమే మంచిది. లేకపోతే పుట్టబోయే పిల్లలూ నీలాంటి వాళ్ళే పుడతారు...” అన్నాడు సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ...

“పవన్... కొంచెం జాగ్రత్తగా మాట్లాడు!” తోక తొక్కిన తాచులా లేచింది వినత.

“అవును వినతా... నీకు మొగుడితో ఎలా ఉండాలో తెలియదు. అత్తగారిని ఆదరించటం తెలియదు. అమెరికాలో ఉన్న ఆడపడుచు ఫోన్ చేసినప్పుడు పలకరించటం ఇష్టం లేదు... అసలు ప్రేమగా  ఎప్పుడైనా నాకు అన్నం పెట్టావా? అనురాగంతో నాదరికి చేరావా? నీకు మూడ్ వస్తే నా దగ్గరికి వస్తావు, లేకపోతే దూరంగా తోసేస్తావు... పరస్పరం మమతానురాగాలు, సానుకూలమైన అవగాహన లేనప్పుడు పిల్లలు కూడా మన ఒడిలోకి రారు వినతా... అది గ్రహించు...”

“హు! లోపం నీలో పెట్టుకుని, అది కవర్ చేసుకోవటానికి ఇన్ని ఉపన్యాసాలు దంచుతున్నావు పవన్... నాకు తెలుసులే... నీకు నాలో లోపాలు ఎంచటం తప్ప ఏం పని లేదు... మీ అమ్మకు సేవ చేస్తానని నీకు నేను అగ్రిమెంట్ రాసివ్వలేదు... అసలు ఈ జబ్బులు, రోగాలు అంటేనే నాకు అలెర్జీ... నీకు వంట చేసి పెట్టటానికి నేను వంటలక్కని కాదు... దేవుడి దయవలన మనుషుల్ని  పెట్టి చేయించుకునే స్తోమత ఉంది. నన్ను వేలెత్తి చూపిస్తున్నావు... నువ్వే ఓ సారి డాక్టర్ దగ్గరకి వెళ్లి చూపించుకో...” బుసలు కొడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది వినత.

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు పవన్.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam