Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue167/477/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

‘‘అవున్నాయనా. యువరాజా వారు మీరు ఆగుటెందుకు పదండి. మనవడితో కాసేపు ముచ్చటించి, మీ వెనకే పంపించెదను.’’ అంది శంఖు పుత్రి.

‘‘అవును ప్రభు. ఈ బామ్మ యోగ క్షేమములరసి మీ వెనకే వచ్చి చేరుకొందును. మీరు ముందుకు సాగండి.’’ అంది వృద్ధు రాలి మాటల్ని సమర్థిస్తూ భద్రా దేవి.

‘‘కాని భద్రా... నీవే కాదు, నేను యువ రాజునని కూడ ఈమెకు తెలిసింది. ఇంతకూ ఎవరీమె?’’ సందేహిస్తూ అడిగాడు ధనుంజయుడు.

‘‘నేను వచ్చి తెలిపెదనులే ప్రభు. సంశయ మొందక మీరు సాగండి.’’ అంది భద్రా దేవి.

ఇక ఏం మాట్లాడాలో తెలీక`

ఓ సారి యిద్దరి వంక జూచి` కళ్ళాలు బిగించి అశ్వాన్ని అదలించాడు. ధనుంజయుని అశ్వం దూరం కాగానే మచ్చల గుర్రం మీది భద్రా దేవి వంక చూసింది వృద్ధు రాలు.

‘‘ఊఁ !  చెప్పవే ముసలి దానా. నీవు నా బామ్మవా... నేను నీ మనవడినా... ఏనాటి బంధము మనది?’’ పరిహాసంగా అడిగింది భద్రా దేవి.

‘‘మనది ఈనాటి బంధమే లేవే గడుగ్గాయి. పురుష వేషం లోని పరువాల బొమ్మవి. ఓ సారి అశ్వం దిగి నీ వివరములు వినిపించ రాదూ?’’ అనడిగింది ముసలి వేషం లోని శంఖు పుత్రి.

‘‘ఆహాఁ! వృద్ధ నారిగా దర్శన మిచ్చిన నాగ వనితవు. ముందుగా నీవే నిజ రూపం చూపించ వచ్చు గదా!’’ అంటూ అశ్వం దిగింది భద్రా దేవి.

ఆ పలుకులకు ఉలికి పడింది శంఖు పుత్రి.

ఎదురుగా వున్నది సామాన్య బాలిక కాదని ఆవులిస్తే ప్రేవు లెక్కించగల సమర్థు రాలని గ్రహించింది. వెంటనే తన వృద్ధ రూపం వదిలి శంఖు పుత్రిగా మారి పోయింది. ఆమె అసలు రూపం గాంచి విభ్రాంతు రాలయింది భద్రా దేవి. ఆమె అశ్వం బెదరి నాలుగడుగులు వెనక్కి వేసింది.

ఆమె నడుం పై వరకు సుందర మైన ప్రౌఢ స్త్రీ రూపం, నడుం నుండి క్రింది శరీరం సర్ప రూపం. బాట మీద చుట్ట చుట్టు కొని పైకి లేచి భద్రా దేవిని చిరునవ్వుతో చూసింది శంఖు పుత్రి. భద్రా దేవి ఆ విచిత్ర రూపాన్ని వింతగా జూచింది.

‘‘నను జూచినావు గదా. నాగ లోక స్త్రీని. నన్ను శంఖు పుత్రి అంటారు. అసలు నామ ధేయం మధూలిక. ఇక చెప్పు! నీ సంగతేమి? ధనుంజయునితో నీ సంబంధమేమి? పురుష వేషంలో అతన్ని వెన్నంటి రానేల?’’ అనడిగింది.

ఆమె ప్రశ్నల్లో ఒక్క దానికీ సమాధానం చెప్పకుండా భద్రా దేవి అడిగిన ప్రశ్న` ‘‘మీ యువ రాణి నాగ కుమారి ఉలూచీశ్వరి ఎక్కడ వున్నది?’’ అని.

ఆ ప్రశ్న శంఖు పుత్రిని మరో సారి విస్మయ పరచింది. ఉలూచీశ్వరి గురించి ఈమెకు ఎలా తెలుసు? అంటే... తెలుసు గాబట్టే తన పథకం గ్రహించి తన మాటలు సమర్థించి ధనుంజయుని ముందుకు సాగమని ప్రోత్సహించి వుండాలి. అసలు ధనుంజయుని అంతరంగిక విషయాలు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? ఎవరీమె?

‘‘అతిగా ఆలోచించకు శంఖు పుత్రి. ఉలూచీశ్వరి తప్పక వచ్చునను నమ్మిక మాకున్నది. ధనుంజయుని జంపుటకు కాపు వేసిన వైరి వర్గం ఆరుగురినీ తుద ముట్టించటం చూడ గానే అనుమానించితి. యువ రాణి ఈ సమీపమందే ఉండునని. మా వూహ నిజమైనది. నీవు ఎవరు? ఉలూచీశ్వరి చెలి కత్తెవా?’ అనడిగింది భద్రా దేవి.

‘‘నీ నామ ధేయమేమి?’’ అడిగింది శంఖు పుత్రి.

‘‘నను భద్రా దేవి అంటారు. పురుష వేషమున అపర్ణుడని పిలిచెదరు.’’

‘‘చూడుము భద్రా దేవి. నేను యువ రాణి చెలి కత్తియను గాను. ఆమెకు వరుసకు అత్తయగుదును. నా వయసు రెండు వంద యాభై వత్సరముల పై మాటే ’’ అంటూ జరిగిందంతా వివరించింది శంఖు పుత్రి.

‘‘నీవు సందేహింప పనిలేదు. నీ వివరములు తెలిపిన సంతసించెద ’’ అంది.

ఇక ఏదీ దాచకుండా తన గురించి`

శంఖు పుత్రికి వివరిస్తూ బాట పక్కన వృక్ష ఛాయ లోకి దారి తీసింది భద్రా దేవి. ఆమెననుసరించింది శంఖు పుత్రి.

******************************

నాగ లోకం!

అది నేరస్తులను బంధించి శిక్షలు అమలు చేయు కారాగారం. అనేక మంది అక్కడ చెరసాలలో మ్రగ్గుతున్నారు. ఆ శిక్షా విభాగం మొత్తం రాతి కట్టడం. చాలా పొడవుగా విశాలంగా వుండి అటు యిటు కట కటాలతో అనేక గదులున్నాయి. మధ్యలో వరుసగా వున్న రాతి స్థంభాలకు కొందరిని గొలుసులతో బంధించి ఉంచారు. బలిష్టులైన భటులు వారిని కొరడాలతో బాదుతున్నారు. నేరస్తుల ఆక్రందనలతో ఆ ప్రాంతం మారు మ్రోగుతోంది.

గోడకు తగిలించిన కాగడాలు అక్కడి చీకట్లను పారద్రోలుతున్నాయి. అక్కడి కారాగారాల్లో మ్రగ్గుచున్న వారంతా నాగ లోక వాసులే గావటం విశేషం. అందునా వారంతా పురుషులే. వారిలో ఎక్కువ శాతం మంది మానవులతో సంబంధాలు కలిగి వుండటమే వారు చేసిన నేరం. మానవ స్త్లరీతో సంబంధం కలిగి వుండటం మహా నేరం. కొరడా దెబ్బలు తింటున్న పురుషులంతా మానవ స్త్రీలను ప్రేమించి పట్టు బడి కారాగారానికి తేబడిన వారే.

అదే స్త్రీలయితే వారు ప్రేమించిన మానవులని అంతం చేసి ఆ స్త్రీని నాగ లోకం నుండి బహిష్కరిస్తారు. ఆ విధంగా వెలి వేయ బడినదే శంఖు పుత్రి. తనకు సమీప బంధువు, ఆప్తుడని కూడ చూడకుండా శంఖు ఛూడుని కుమార్తె మధూలికయను శంఖు పుత్రిని తమ లోకం నుండి ఏనాడో బహిష్కరించాడు నాగ రేడు మహా పద్ముడు. ఇతని తండ్రి పద్ముడు నాగ రాజుగా వున్న కాలంలో శిక్షలు ఇంత కఠినంగా లేవు. మానవ ద్వేషి అయిన మహా పద్ముడి హయాం ఆరంభమయ్యాకే ఇలా పరిస్థితులు మారాయి.

మహా పద్ముడు ప్రస్తుతం ఆ కారాగారంలో శిక్షలు ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో సంపంగి వనానికి వెళ్ళిన భటులు తిరిగి వచ్చి మహా పద్ముడ్ని దర్శించారు. పరి చారికలు నలుగుర్నీ తెచ్చి విచారణ మందిరంలో ఉంచినట్టు తెలియ పర్చారు. వెంటనే అక్కడికి బయలు దేరాడు మహా పద్ముడు.

నాగ లోకమునకు పైన`

ఎక్కడో మర్మ భూమి యందుగ సంపంగి వనానికి పోయి వచ్చుటకు ఒక పూట పడుతుంది. కాబట్టి ఈ లోపల రాచ కార్యాలు జూచుకొని కారాగార పరిశీలనకు వచ్చాడు నాగ రాజు. అంతలో ఉలూచీశ్వరి చెలికత్తియలు నలుగురూ గొని రాబడిన వార్త విని సరాసరి అచటికి బయలుదేరాడు.

అనేక కక్ష్యలను దాటు కొంటూ`

తన రాజ మందిరాన్ని అనుకొని వున్న`

విచారణ మందిరానికి చేరుకున్నాడు.

అప్పటికే అచట మహా రాణి కీర్తి మతి అతడి రాక కోసం ఎదురు చూస్తోంది. మహా పద్ముడు లోనకు రాగానే విచారణ మందిర కవాటాలు మూయ బడ్డాయి.

విశాలమైన ఆ మందిరంలో సుఖాశీనురాలై వుంది రాణి కీర్తి మతి. ఎదురుగా ఒక పక్కన శిరస్సు వంచుకొని నేల చూపులు చూస్తూ వరుసగా నిలబడున్నారు యువ రాణి చెలి కత్తియలు నలుగురూ.

ఆ మందిరం నాలుగు మూలలా నలుగురు స్త్రీలు చేతుల యందు ధరించి వున్న మణుల కాంతులతో పట్ట పగల్లా ఉందక్కడ. ఆ స్త్రీలు నడుం వరకు సర్ప రూపం పైన మానవ స్త్రీ రూపంతో వున్నారు. నరులతో క్రీడించినందు గ్గాను వారిని బహిష్కరించకుండా దాసీలు గా విధింప బడిన శిక్షలు అనుభవిస్తున్నారు ఆ అభాగినులు.

పెద్ద పెద్ద అంగలతో గంభీరంగా లోనకు వచ్చిన నాగ రేడు తన రాణిని కూడ పలకరించకుండా చెలి కత్తియలు నలుగుర్నీ నిశితంగా చూసాడు.

వారంతా భయ కంపితులై`

గజ గజ వణుకుతూ`

నేల చూపులు చూస్తున్నారు. యువ రాణి ఉలూచీశ్వరి చెలికత్తెలు నలుగురూ. ఇప్పుడు వారి ముందున్న ప్రధాన సమస్య తమ గారాల పుత్రిక ఉలూచీశ్వరి ఒంటిగా ఎక్కడికి పోయినది? ఎచట వున్నది?

రాణి కీర్తి మతి తమ గారాల తనయ గురించి చాలా ఆందోళన చెందుతోంది. భర్త వున్న మూలంగా సమస్య ఆయనకు వదలి మౌనంగా చూస్తోంది.

వచ్చిన వెంటనే చెలి కత్తియల్ని ప్రశ్నించ లేదు నాగ రేడు. అందుక్కారణం కోపం... ఆగ్రహం ముంచుకొస్తోంది. ఇలాంటి సమయంలో కోపం సహజం. కాని కోపం బుద్ధిని మందగింప జేసి ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తుంది. అందుకే కోపాన్ని అదుపు జేసుకునేందుకు కొన్ని లిప్తల కాలం అటు యిటు పచార్లు చేసాడు. పిమ్మట ఆగి నిశితంగా ఆ నలుగురు యువతుల్ని వీక్షించాడు. బహుశ అసలు విషయం వీళ్ళకీ తెలిసి ఉండక పోవచ్చు. వీళ్ళను శిక్షించి ప్రయోజనం లేదు. శాంతంగా అడిగి జరిగిన దేమిటో తెలుసు కోవాలి.

‘‘అమ్మాయిలూ! మీరు అనవసరంగా భయ పడుచున్నారనుకొందును. ఇందులో మీ దోష మెంతయో మాకు తెలియదు. ఇప్పుడు మాకు తెలియాల్సింది మా తనూజ జాడ. చెప్పండి, ఏమి జరిగినది? తను ఒంటిగా ఎచటకు పోయినది? ఎప్పుడు వచ్చును?’’ అంటూ శాంత గంభీర స్వరంతో ప్రశ్నించాడు.

నాగ రాజు మాటలు చెలి కత్తె భయాన్ని కొంత పోగొట్టాయి. అయినా పెదవి విప్పేంతగా ధైర్యం చాల్లేదు ఎవరికీ.

‘‘ఇంకనూ భయమేల? మీరుగా యువ రాణిని విడిచి ఉండరని మాకు తెలుసు. తనే మిమ్మల్ని సంపంగి వనమున వేచి వుండమని వెడలి వుండ వచ్చు. అభయ మిచ్చితిని గదా. మాటలాడవలె. ఏమి జరిగె?’’ తిరిగి అడిగాడు.

అప్పుడు`

ఒక చెలి కత్తియ ధైర్యం చెంది ముందుకొచ్చింది. ‘‘క్షమించండి ప్రభూ! ఏమి జరిగినదో నిక్కముగా మాకును తెలియదు. వింధ్యాటవికనే మేము బయల్వెడలితిమి. మార్గమున కొంత తడవు సంపంగి వనమున ఆగితిమి. అప్పుడు తను తిరిగి వచ్చు వరకు అచటనే వేచి వుండమని ఆజ్ఞాపించి యువ రాణి వారు మేము ఎంతగా వేడు కున్నా వినక ఒంటిగా ఎటకో వెళ్ళినారు. ఒకటి కాదు రెండు కాదు వెడలి పది దినము లైనను తిరిగి రాలేదు. మాకు ఏమీ చేయ వలెనో దిక్కు తోచక సంపంగి వనమందే గ్రుమ్మరు చుంటిమి.’’ అని సవినయంగా మనవి చేసింది.

తను వూహించిందే జరిగింది.

నాగ రేడు భృకుడి ముడిచి`

తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

‘‘తన ప్రయాణ మెచటికో మీతో చెప్పనే లేదా?’’ అడిగాడు.

‘‘లేదు ప్రభూ! చెప్పనేలేదు... కాని...’’ అంటూ అర్ధోక్తి లోనే ఆగి పోయింది మరో యువతి.

‘‘ఊఁ...! కాని...? మీరిక దాచ పని లేదు. చెప్పుము బాలికా ఏమైనది?’’

‘‘మేము క్రిందటి సారి ఢాకినీ వన విహారము చేయునపుడు ఒక విశేషము జరిగినది.’’

‘‘విశేషమా... ఏమది? దానికిని ఇప్పుడు మా పుత్రిక ఒంటిగ ఏగుటకు సంబంధమేమి? తను ఢాకినీ వనమునకే పోయి వుండునా?’’

‘‘ఇప్పుడు పోయినది ఎటకో మాకును తెలియదు ప్రభు. కాని నాటి సంఘటనకు ఇప్పుడు యువరాణి వారు వెళ్ళుటకు సంబంధముండునని మా సందేహము ప్రభు.’’

‘‘నాడు ఏమి సంఘటిల్లినది? ముందుగా ఆ విశేషము చెప్పండి.’’

‘‘నాడు యువ రాణీ వారిని ఓ గరుడ పక్షి తరుమగా అప్పుడు సుందరాకారుడైన ఓ యువకుడు బాణమేసి ఆ పక్షిని సంహరించి కాపాడినాడు. మన్మధాకారుడైన ఆ వీరుని గాంచినది మొదలు యువ రాణి వారి మనసు అతడి యందు లగ్నమైనది. అతడు వెడలి పోయినాడు. కాని తన మనసు అతడి యందు లగ్నమై యువ రాణి వారు వ్యధనొందినారు. వారి బాధ చూడ లేక మేము సంపంగి వన మందే ఆగితిమి.’’

ఆ మాటలు విని`

రాజ దంపతులు ముఖ ముఖాలు చూసుకున్నారు. తమకు ఇంత వరకు తెలియని విషయమిది.

‘‘ఇంతకూ ఎవరా యువ వీరుడు? గంధర్వుడా? కిన్నెరుడా? లేక ఇంద్రాది దేవతలు వశించు స్వర్గ లోకమునకు చెందిన వాడా?’’ అడిగాడు.

‘‘అతడు దివిజుడు గాడు ప్రభు. భూమికి చెందినవాడు. మానవ వీరుడు.’’

‘‘ఏమంటివి? మానవ వీరుడా!’’ ముఖం మాడ్చుకుని చీదరించుకొంటూ ఈసడింపుగా చూసాడు నాగ రాజు.

‘‘అవును ప్రభూ! నిక్కముగా అతడు మానవుడే. కాని దివిజును సైతం ధిక్కరించు మేటి అంద గాడు.’’

‘‘చాలు నీ అధిక ప్రసంగము.’’ అంటూ కోపోద్రక్తుడై అరిచాడు నాగ రాజు.

‘‘మాకు మానవుల పొడ గిట్టదని తెలిసి కూడ పొగడుటకు నీకు ఎంత ధైర్యం?’’ హుంకరించాడు.

గజ గజ వణికి పోయిందా చెలి కత్తె.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali