Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

మామూలుగా ప్రతీవారూ,మాట్లాడేటప్పుడు ఏదో ఒక 'ఊతపదం' వాడతారు. అదో అలవాటు. ' నిజం చెప్పాలంటే','వీడిల్లు బంగారంగానూ', 'దుంపతెగా''అదేదో సామెత చెప్పినట్లు' లాటివి అన్నమాట.ఒక్కొక్క సమయం లో ప్రాచుర్యం చెందినవి ఉంటాయి. మా చిన్నప్పుడు, 'వాడికి గీర ఎక్కువండి'లేక 'టెక్కు ఎక్కువండీ' అని అనేవాళ్ళం.కొంతమందికి ఇంకో అలవాటుంటుంది.ఎవరైనా కనిపించగానే ' అదేమిటండీ బొత్తిగా నల్లపూసైపోయారూ'అని అడగడం.

ఒక్కోళ్ళు ఏమి చెప్పినా 'అబ్బా అలాగా' 'ఏదీ మళ్ళీ చెప్పండీ','అయ్యో పాపం' అని ప్రతీ దానికీ సానుభూతి చూపిస్తూంటారు.మాటకి ముందర 'పాపం' తో మొదలెడతారు, అది శుభవార్తైనా, అశుభమైనా సరే. ఆయన మాట పూర్తి అయేదాకా, మనకి విశేష మేమిటో తెలియదు.కొంతమందుంటారు, అవతలివాడు ఏం చెప్పినా సరే ' పోదూ పేద్ద చెప్పొచ్చావు'అని ఆ మాట్లాడేవారిని చిన్నబుచ్చేస్తారు. అదో పైశాచిక అలవాటు.,

ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు చాలా మంది 'ఐ సీ 'అంటూంటారు, ఫోన్ లో మాట్లాడప్పుడైనా సరే.వీడికి ఫోన్ లో ఏం కనిపిస్తుందో భగవంతుడికే తెలియాలి.మన పై అధికారి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు,మనం 'ఐసీ' అన్నామంటే వాడికి చిర్రెత్తుకొస్తుంది. తను అనొచ్చు, కానీ మనం అనకూడదు!!కొంతమంది, ' బై ద వే 'అంటారు. మా చిన్నప్పుడు ' బై ద బై' అనేవారు. భమిడిపాటి వారి నాటకాల్లో ఈ ఊతపదం ఎక్కువగా వినేవాళ్ళం.

ప్రతీ దానికీ ' టాపు లేచిపోయింది'అనడం వింటూంటాము.అలాగే 'చెప్పొచ్చేదేమిటంటే' 'పోదూ గొప్ప బడాయి' 'దొబ్బుడాయి' ' వెధవ్వేషాలూ'' అయ్యొ నా మొహం మండా'.'వాడిది పెద్ద పోజండీ' లాటివి కొన్నీ.'అసలు ఇప్పుడు సమస్యేమిటంటే',' అయిన కాడికీ' కొన్ని ఉదాహరణలు.కొంతమంది దేనిగురించి వర్ణించాలన్నా 'అబ్బా యమా గా ఉందండి' అంటారు.

ఇంక నాలాటి సగం సగం హిందీ వచ్చినవాళ్ళైతే ,'క్యూం కీ ' 'ఫిల్ హాల్','మేరా మత్లబ్ హై'అని మాటకి ముందర వాడితే, నాకేదో హిందీ బాగా వస్తుందని చాలా మందికి దురభిప్రాయం.' మేరా మత్లబ్' కి మరాఠీ లో అయితే   హంచా మణ్ణాహై 'అనేస్తే, రాజ్ ఠాక్రే గారి దగ్గర పాస్ అయిపోవచ్చు !ఇంక ఇంగ్లీషులోకొస్తే ' కమింగ్ టు ద పాయింట్' ' జనరల్లీ స్పీకింగ్' 'యాక్చుయల్లీ'ప్రతీ వాడూ వాడేదే.మాకు కాలేజీ లో మాథ్స్ చెప్పే మాస్టారొకరు,ప్రతీ మాట తరువాతా ' మా' అనేవారు. 'ఇన్ మా యెనీ మా ట్రైయాంగిల్ మా,దేర్ మా ఆర్ మా త్రీ మా....' అలా సాగిపోయేది ఆయన లెక్చర్. అయినా ఆయన పాఠాలు అర్ధం అయేవి. అంత గొప్పగా చెప్పేవారు. నాకు కొంచమైనా లెఖ్ఖలు వచ్చేయంటే, ఆయన చలవే.

పై చెప్పినవే కాకుండా,  “ చావు “ శబ్దాన్ని కూడా  ఊతపదంగా వాడే ఘనులు మనవాళ్ళు.  “ అబ్బ చచ్చేటంత సిగ్గండీ” అంటుంది ఓ అమ్మాయి. “చచ్చినా వెళ్ళను” అంటాడొకడు. “చచ్చేంత భయం “ అనేదొకటి.మనం ఏదైనా చెప్పినప్పుడు  “ చెప్పావులెద్దూ.. సింగినాదం జీలకర్రానూ..” అని మన ఉత్సాహం మీద నీళ్ళు చల్లేస్తారు. మర్చేపోయాను, మా చిన్నప్పుడు  “ నీ తస్సా దియ్యా” అనికూడా విరివిగా వాడే పదం.

ప్రతీ వారినీ 'గురూ ' అని సంబోధించడం ఆంధ్ర దేశం లో ఎప్పుడు ప్రారంభం అయిందో తెలియదు.అవతలివాడిని ' గురూ' అనేస్తే అసలు గొడవే లేదు.రాజమండ్రీ లో ఉన్నప్పుడు ఒక విషయం గమనించాను- 'అన్నయ్యా''తమ్ముడూ' అని. అబ్బ ఒకేకుటుంబం లోని అన్నదమ్ములు ఒకే వృత్తిలోకి ఎలా వచ్చారూ అని ముందర ఆశ్చర్యపడ్డాను.తరువాత తెలిసింది వాళ్ళకేమీ చుట్టరికం లేదని.ఈ మధ్యన మన సినిమాల ధర్మమా అని ' నీకేం పేద్ద సీన్ లెదోయ్'అనడం.చిన్న చిన్న పిల్లల దగ్గరనుండీ ఇదే అలవాటు.ఇంక ' వీడి అబ్బా' మాములే. అన్నింటిలోకీ అన్ని కాలాల్లోనూ ప్రసిధ్ధి కెక్కిన ఇంకో మచ్చు తునక--' కొంపలేమీ ములగవులేవోయ్' పైన ఉదహరించిన 'ఊత పదాల' లో ఏమీ అర్ధం వెతకాలని ప్రయత్నించడం వ్యర్ధం. ఇలాటివన్నీ అన్నంలో 'నెయ్యి' లాటివన్నమాట.కొంతమంది 'నెయ్యి ' వేసికోరు. కొంతమందికి 'నెయ్యి' లేకుండా ముద్ద దిగదు. అంతే !!,

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam