Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యము

అగస్త్యుడు దక్షిణదేశ యాత్రకు బయలుదేరి, వింధ్యపర్వతాన్ని అణిచివేశాడు. అక్కడి నుండి 
కొల్హాపూరు  వెళ్లి అక్కడి  శ్రీమహాలక్ష్మిని సేవించి  ఆమె ఆజ్ఞమేరకు యింకా  దక్షిణానికి, 'స్వామిమల'కు  బయలుదేరాడు, షణ్ముఖుడిదర్శనం కోసం. స్వామిమల దక్షిణాన నేటి తమిళనాడులో, తంజావూరు జిల్లాలో కుంబకోణం వద్ద, కావేరీ తీరంలో ఉన్నది.అగస్త్యుని యాత్రలో ఆయన దర్శించిన స్థలాలను, మార్గంలో ఎదురైన ప్రదేశాల ప్రజల జీవన విధానాలను, రూపు రేఖలను వర్ణిస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు.

కొనలఁ జుట్టినతీఁగె పెనచేఁ జమరవాల / పరికరంబులఁ జుంచుపట్టి తిగిచి,
కమ్మసంపంగి మొగ్గల నిరుగడ రాయు / చిగురుటీరికలచేఁ జెంపవెట్టి 
లేఁదేనెకొడియు శిలీముఖశ్రేణిచే / మేలిపూగుత్తుల రాలరువ్వి,
కబళన త్వరమాణ కరటితుండములచేఁ / గదళికాతరువులఁ గాళ్ళఁదాఁచి           (సీ)

నెఱికురులుఁ, జారునాసలు, నిబ్బరంపు 
గుబ్బచన్నులుఁ, దొడలపెక్కువయుఁ గలుగు
మృగవధాజీవ శుద్ధాంత మీననయన 
లర్చనలు చేసి కొలిచి రయ్యాలుమగల               (తే)

మార్గంలో ఎదురైన బోయపల్లెల బోయవనితల వర్ణన యిది. వారు తమ కేశాలను చుట్టి లాగిముడివేసిన తీరు చమరీమృగాల కేశాలను లాగి కట్టినట్లు ఉన్నది. చమరీమృగాల  కేశముల శోభను తిరస్కరిస్తున్నది. కమ్మసంపంగి మొగ్గలవంటి నాసికలకు రెండుప్రక్కల చెంపల మీద ఎర్రని చివుళ్ళను బోలిన ముక్కుపుడకలున్నాయి. లేత  తేనెను వెలువరించే పూలగుత్తులను గుండ్రని బాణాలతో కొట్టి రాల్చి అలంకరించుకున్నారు. అరటి పండ్లను తినాలనే త్వరపాటుతో ఏనుగులు కాళ్ళతో మట్టగించిన అరటి బోదెలను దాచినట్లున్న, 
అరటి బోదెలలాంటి తొడలు కలిగి ఉన్నారు. తళతళలాడే కేశాలను కలిగి ఉన్నారు.చక్కని ముక్కులు కలిగి ఉన్నారు. సడలని బిరుసైన చన్నులు కలిగి ఉన్నారు. అతిశయిస్తున్న విశాలమైన ఊరువులు కలిగి ఉన్నారు. వారు, జంతువులను చంపి  జీవించేవారి ఆడువారు, స్వచ్ఛమైన గండు చేపలలాంటి కనులు గలవారు, అర్చనలు  చేసి, ఆ  ఆలుమగలను, లోపాముద్రను, అగస్త్యుడిని కొలిచారు.
వారి పూజలను స్వీకరించి, వారిని ఆశీర్వదించి ముందుకు సాగారు ఆ  దంపతులు. యిలా అనుదినమూ ప్రయాణము చేస్తూ కుంతలదేశాన్ని చేరుకున్నారు. మాల్యవంతపర్వత  ప్రాంతానికి చేరుకున్నాడు. పంపానదీ తీరానికి చేరుకున్నాడు.

పంపా తరంగరింఖణ 
ఝంపా సంపాద్యమాన జలకణరేఖా 
సంపాత శీతలానిల
సంపద వొదిలించెఁ బరమశైవోత్తంసున్         (కం)

పరవళ్ళు తొక్కుతున్న(రింఖణ)పంపానదీ తరంగాల దూకుడుకు(ఝంపా) పుడుతున్న  తుంపరల చల్లదనాన్ని పులుముకున్న చల్లనిగాలి ఆనందపరవశుడిని చేసింది  అగస్త్యులవారిని. ఆ ఆనందంతో తన ఇల్లాలికి మాల్యవంతపర్వతాన్ని చూపుతున్నాడు.యిక్కడ లోపాముద్రను వర్ణించాడు రామకృష్ణుడు. రమ్యమైన, పవిత్రమైన, ఠీవియైన వర్ణన. లోపాముద్రను ఎక్కడా ఎవరూ వర్ణించలేదు, బహుశా, చివరికి వాల్మీకివారు కూడా, నాకు తెలిసి. రామకృష్ణుడు ఆ లోటును అందంగా తీర్చాడు, అనన్యసాధ్యంగా పదకుసుమాలను కూర్చాడు.  

నఖరాగ్ర లూనానన స్వేద కోరకం / బర్దకషాయ దృగంచలంబు 
ప్రబల నిశ్వాససౌరభ తర్పితమదాళి / శోషిత శ్రవణ శిరీషయుతము 
దర్శిత మధ్యవృత్త స్రస్తమృదునీవి / యప్రయత్న పయోధరాంబరంబు 
సంతప్త శర్కరాసహ పదన్యాసంబు / నచలరజో ధూమలాలకంబు               (సీ)

సరణి తరుణతరుచ్ఛాయ శమితఖేద 
మలసమృదులాంగకంబునై యరుగుదెంచు 
నన్నిజపరిగ్రహముఁ  గూర్మి నాదరించి 
పలుకు వింధ్యాద్రినిర్బంధ బాంధవుండు                       (తే)

ముఖానికి పట్టిన చిరుచెమటలను కొనగోళ్ళతో విదిలిస్తున్నది. కనులు శ్రమవలన సగం ఎఱ్ఱన అయినాయి. ఆయాసంతో ఆమె నిట్టూర్పులు విడుస్తుంటే తుమ్మెదలు సంతృప్తిని పొందుతున్నాయి, ఆమె నోటినుండి వచ్చే పరిమళం పూల పరిమళంలా ఉన్నది మరి!
దారిన వస్తూ ఆ కొండల్లో కోనల్లో కనిపించే దిరిసెనపూలను తురుముకున్నట్లున్నది, చెవులదాకా ఉన్న ఆ శిరీష కుసుమాలు వాడిపోయాయి, ప్రయాణపు వేడిమికి. ఆయాసపడుతూ నడవడంచేత రవిక ముడి వీడి, నాభి కనిపిస్తున్నది. అంటే నాభివరకూ ఉన్న రవికను ధరించేదన్నమాట, శరీరం కనబడకుండా. అప్రయత్నంగానే వక్షస్థలం మీద ఉన్న వస్త్రాన్ని, పైటను సవరించుకుంటున్నది. ఎండకు వేడెక్కిన గులకరాళ్ళమీద నడిచి నడిచి వేడెక్కిన  పాదాలు, కొండల, గుట్టల ధూళి అంటుకున్న మట్టిగొట్టుకున్న ముంగురులు. బాటలోనున్న చిన్ని చిన్ని చెట్లను కూడా  ఆశ్రయించి, ఆ  చిరు నీడలో సేద తీర్చుకుంటున్నది. ఏ కాస్త నీడ కనిపించినా చాలు, కొద్దిసేపు అలా విశ్రమిస్తున్నది, అంత కఠినంగా ఉన్నది ఆమెకు ఆ ప్రయాణం. ఆమె మృదువైన శరీరం అలసిపోయింది. అయినా అలానే పతిని అనుసరించి  వస్తున్నది. అటువంటి తన సతిని, లోపాముద్రను, ప్రేమగా, లాలనగా ఆదరంగా చూస్తూ  యిలా అంటున్నాడు, వింధ్యపర్వతం బారిన పడి బాధపడినవారి బంధువు, అగస్త్యుడు!

వనితా! చూచితె మాల్యవంతముఁ బ్రభావంతంబు, నానామణీ
జనకోదంచిత సానుకాంతము, మరుత్సంపూర్ణచంద్రాననా 
జన కేళీపదచంద్రకాంతము, నభస్సంబాధకృత్కూట వ
ర్ధనదుర్దాంతము, సర్వపర్వతకథా ప్రాగ్వర్ణితోదంతమున్                  (మ)

వనితా! చూశావా మాల్యవంతాన్ని! అత్యంత ప్రభావంతము. నానావిధముల మణులు  ప్రభవించే సానువులతో నిండి ఉండేది. నిండుచంద్రునివంటి ముఖములున్న దేవతాస్త్రీల ఆటలకు నిలయమైన చంద్రకాంత శిలలకు నెలవైనది. ఆపటానికి శక్యం కాని శిఖరాలతో 
ఆకాశాన్ని ఒరిపిడికి, బాధకు గురి చేసేది. సమస్తపర్వతములకన్నా ముందుగానే గొప్పగా వర్ణింపబడిన కథలు కలిగింది! అంతటి పురాతనము, పవిత్రము, మహిమోపేతము ఈ మాల్యవంతము, చూశావా! అన్నాడు అగస్త్యులవారు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
weekly horoscope 1st july to 7th july