Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .....http://www.gotelugu.com/issue168/480/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

‘‘క్షమించండి ప్రభూ. పొర బాటున నోరు జారితి.’’ అంటూ చేతులు జోడించి ప్రార్థించింది.

‘‘సరి సరి. పిదప ఏమి జరిగినది? ఆ మానవుడు మా తనయను వీక్షించినాడా?’’ అడిగాడు.

‘‘అవును ప్రభూ.’’

‘‘ఉలూచీశ్వరి అతన్ని జూచినదా?’’

‘‘అవును ప్రభూ.’’

‘‘ఇరువురూ సంభాషించినారా?’’

‘‘లేదు ప్రభూ లేదు. వెంటనే శ్వేత నాగు గా మారిన యువ రాణీ వారిని గుర్తించ నేరక తన దారిన వెడలి పోయినాడు అతడు.’’

‘‘పిమ్మట ఏమైనది?’’

‘‘మేము నాగ లోకమునకు మరలితిమి. కాని యువ రాణీ వారు మన లోకమునకు రాక` సంపంగి వనమునే తన ప్రియుని కొరకు విరహమున పొగిలిరి. వారికి అనేక ఉప చర్య లోనర్చి సేద తీర్చితిమి.’’

‘‘ఇంతకూ ఎవరా మానవుడు? తెలిసినదా?’’

‘‘లేదు ప్రభూ! కాని శంఖు పుత్రి కి తెలుసని మా సంశయము.’’

‘‘శంఖు పుత్రి...? తను మా తనయను కలిసినదా?’’ అవునన్నట్టు తలూపారంతా.‘‘సంపంగి వనమున ఉండగా ఆమె మా చెంత కొచ్చి ఏకాంతమున యువ రాణీ వారితో చాలా సేపు ముచ్చటించినది. ఆమె వెళ్ళిన తర్వాత యువ రాణీ వారు ఉత్సాహమున మా వెంట యిటకు వచ్చినారు. మాకు ఆ వీరుని వివరములు తెలియవు గాని అతడి అశ్వము శ్వేత వర్ణమున ఇంద్రుని ఉశ్చైశ్వర తురగము వలె నున్నది. కాని దాని జూలు, తోక భాగము కాటుక వలె చిక్కని నలుపు... ’’

‘‘ఆగాగు.... ఆగుము.’’ అంటూ ఆమెను వారించాడు నాగ రాజు.

ఆమె మాటలకు మహా పద్మునికి రాకూడని అనుమానమే వచ్చింది. ఆ అశ్వము ధనుంజయుని అశ్వముగా తను విని వున్నాడు. అతడు రత్న గిరి యువ రాజు ధనుంజయుడు కాదు గదా. అతడు ఢాకినీ వనమున కన్పట్టి నాడంటే ఖచ్చితముగా అతడిప్పుడు వింధ్యాటవిలో వస్తుండాలి. అతడి కొరకే ఉలూచీశ్వరి ఒంటరిగా వింధ్యాటవికి పోయి వుండునా? అది యును గాక `

శంఖు పుత్రికి నాగుల దిబ్బ మీద నాగా ఆటవికులతో విసృత పరిచయాలున్నాయి. ఆమెకు ధనుంజయుని గూర్చి తెలిసి వుండాలి. తనను దెబ్బ తీసేందుకే ఉలూచీశ్వరికి ధనుంజయుని వివరములు చెప్పి వుండాలి. అయిననూ`

తన గారాల పట్టి ఒక మానవుని వరించుటయా! ఇక్కడ ఆమె కొరకు వరుని ఎంపిక చేసి వుండగా ఆమె ఇలాంటి ఒక నీచ కార్యము జేయుట నమ్మ శక్యం గాకుంది. పరి పరి విధాలా ఆలోచిస్తున్న నాగ రాజుని భార్య కీర్తి మతి పిలుపు ఉలికి పడేలా చేసింది.

‘‘ఏమైనది ప్రభూ! ఎవ రతగాడు?’’ ఆతృతగా అడుగుతోంది.

‘‘ఎవరని చెప్పను! ఏమని చెప్పను దేవీ. అల్లారు ముద్దుగా పెంచినందుకు మన ఘన కీర్తికి మాయని మచ్చ తెచ్చినది. మన నాగ లోకము నుండి సువర్లోకము వరకు అతల సుతల తలా తళ పాతాళము వరకు మనల నవ్వుల పాలు జేసినది. ఒక మానవ మాత్రుడ్ని ప్రేమించినది.

అదీ ఎవరిని? దివ్య నాగ మణి కొరకు మన నాగ లోకమునకు ప్రయాణమై వచ్చుచున్న రత్న గిరి రాకుమారుడు యువ రాజు ధనుంజయుడ్ని. నా శత్రువుని. నా ఆనతి ధిక్కరించి చావును వెతుక్కొనుచూ వచ్చుచున్న మూర్ఖ శిఖా మణిని ఏమని చెప్పుదును? మానవులతో సంబంధము కఠిన శిక్షలకు గురి కావటమని తెలిసీ యిలా జేసినది. ఏమి చేయ వలె?’’ అంటూ కాన గ్రుమ్మరు మత్తేభము ఫీుంకరించునట్టు వ్యథతో అరిచాడు నాగ రాజు.

‘‘అవును ప్రభూ! మీరే గదా, మన తనయ నా వారసత్వము పుణికి పుచ్చుకున్నది. మనుజుల కన్నెత్తి జూడదని పొగడితిరి. తనకు మిమ్ముల ధిక్కురించు ఇంత తెలివి ధైర్యం ఎటుల వచ్చినవో తెలియ కున్నది. ముందు తను ఎచట ఉన్నదో తెలుసుకుని ఇటకు గొని రావలె. గాలించి తెచ్చుటకు వెంటనే కొందరు భటులను వింధ్యాటవికి పంపించండి ప్రభూ.’’ అంది రాణి కీర్తి మతి.

‘‘ఊహుఁ! ఇది భటుల వలన ఆగు కార్యము గాదు దేవి. స్వయముగ నేనే పోయి వచ్చెద.’’ అంటూ చర చరా ఆ మందిరం నుండి బయటకు వెళ్ళి పోయాడు నాగ రాజు.

****************************

శ్వేతాశ్వం బాట మీద ముందుకు సాగు తున్నదే గాని ధనుంజయుని ఆలోచలను వెనక్కు పరుగు తీస్తున్నాయి. భద్రా దేవి కోసం వెను దిరిగి చూస్తూనే వున్నాడు. ఎవరా వృద్ధు రాలు? నిజముగా ఆమె భద్రా దేవికి తెలుసునా? ఏమి జరుగుతోందక్కడ? పరి పరి విధాల ఆలోచిస్తున్నాడు. అప్పటికే అశ్వం బాట మలుపు తిరిగింది. అంతలో `

ఒక్క సారిగా వీచిన సంపంగి పూల సౌరభానికి ఉలికి పడి అశ్వం కళ్ళాలు బిగించాడు. ఇదే సువాసన` ఆనాడు ఢాకినీ వనములో శ్వేత నాగుగా దర్శన మిచ్చినపుడు ఉలూచీశ్వరి నుండి వీచిన మధుర సువాసన. ఇక్కడ ఎచట నుండి వీస్తున్నది? సమీపమున సంపంగి చెట్లు వున్నవా? లేక... సందేహిస్తూ అశ్వాన్ని నిలువరించి` చుట్టూ పరికించి చూడ సాగాడు ధనుంజయుడు. ఇంతలో వెనక నుంచి విన వచ్చింది పాము బుస. చివ్వున త తిప్పి వెనక్కి చూసాడు. తనకి ఎడం పక్కగా బాట సమీపం లోనే వుంది పెద్ద పొన్న వృక్షం ఒకటి. దాని ఛాయలో ఒక బండ మీద చుట్ట చుట్టు కొని లేచి పడగ విప్పి ఆనంద పారవశ్యంతో ఆడుతూ తననే చూస్తోంది ఒక శ్వేత నాగం.

మల్లె పూవు కన్నా తెల్లని శ్వేత వర్ణంలో అద్భుతంగా మెరిసి పోతూ అందమే తానుగా పడగ విప్పి ఆడుతున్న నాగును ఆశ్చర్య సంభ్రమాలతో కొద్ది సేపు అలా చూస్తుండి పోయాడు. ఎవరీ శ్వేత నాగం. ఉలూచీశ్వరి కాదు గదా! గాకున్న ఇలా బహిరంగమున తన ఎదుటకు వచ్చునా... పరిస్థితులు జూడ ఆమె నాగ కుమారి లానే తోచు చున్నది. భద్రా దేవి రాక కోసం తిరిగి తిరిగి చూడ్డంలో పొన్న చెట్టును గమనించకుండా దాటి వచ్చేసాడు. అశ్వాన్ని వెనక్కు మళ్లించాడు. బాట ఇరు వంకలా నిర్మానుష్యంగా వుంది. అడవంతా సందడిగా వుంది. ఇప్పుడిప్పుడే గాలిలో వేడిమి తెలుస్తోంది.

అశ్వాన్ని పొన్న చెట్టు ఛాయ లోకి పోనిచ్చి తాను కిందకు దిగాడు. అప్పుడు కూడ బండ మీదే ఉంది శ్వేత నాగు. వెళ్ళి పోలేదు. తననే చూస్తోంది. సంపంగి సువాసనలు ఇప్పుడు మరింత గాఢంగా వీచి మనసును పరశింప జేస్తున్నాయి. వేయి నాద స్వరాలు ఒక్క సారిగా మోహన రాగం ఆలపిస్తున్నట్టు కోటి వీణలు ఒక్క పెట్టున ప్రణయ గీతికలు ఆలపిస్తున్నట్టు ధనుంజయుని మనసు పులకిస్తోంది. అది ఉలూచీశ్వరియే యను నమ్మిక బల పడ సాగింది. తెలియని పరవశం కలుగుతోంది.

‘‘నాకు తెలుసు దేవీ! నీవు నాగ రాజ తనయ ఉలూచీశ్వరివి. అటుల గాకున్న నను చూచి కూడ వెడల కుండా ఇచ్చటే ఆగవు. ఆనాడు ఢాకినీ వనమున మెరుపులా దర్శన మిచ్చి మాయమైన శ్వేత నాగు నీవని గుర్తించ నేరక మంద భాగ్యుడనై వెడలితి. ఇప్పుడిక తామద మేల? నీ దివ్య సుందర రూపమును ప్రకాశింప జేస్తూ దర్శన మియ వచ్చును గదా!’’ ఎదురుగా నిలబడి సూటిగా చూస్తూ అడిగాడు. శ్వేత నాగులో చలనం లేదు. నిటారుగా లేచి బుస కొడుతూ`

పడగ విప్పి ఆడుతోంది. ధనుంజయనే చూస్తోంది. భారంగా నిట్టూర్చాడు ధనుంజయుడు.‘‘ఒక లక్ష్యంతో నాగ లోకమును వెదుకుచూ బయలు దేరిన నాకు మార్గమున నీవే కన్పించ వలె? కన్పడితివి పో` నీ వివరములు నాకు తెలియనేల? తెలిసినది పో... నా మది నీ యందు లగ్నము గా నేల? లగ్నమైనది పో... నీ దివ్య సుందర రూపమును ప్రకటింప వేల? నీవు ఉలూచీశ్వరివి కాదను కొందునా? వేరెవరో యను కొందునా? నా దారిన పోవచ్చునా? నిను మరిచి పోదునా?’’ అడిగాడు. అప్పుడు`

సరిగ్గా అప్పుడు ఉన్నట్టుండి కదిలింది శ్వేత నాగం. చుట్టలు విప్పుకొని బండ పై నుండి నేలకు దిగి వచ్చింది. ధనుంజయుడు నిర్భయంగా అలాగే నిలబడి నాగాన్ని చూస్తూన్నాడు. అది అటో యిటో వెళ్ళి పోలేదు. నేరుగా అతడి పాదాల వద్ద కొచ్చింది. పాదాభి వందనం జేస్తున్నట్టు శిరస్సును కొన్ని లిప్తల పాటు పాదాల మీద వుంచింది. తిరిగి లేచి అతడి మోకాళ్ళ వద్ద నుండి వలయంగా చుట్టు కొంటూ శరీరం మీదికి ప్రాకింది. వీపు భాగం నుండి ఛాతీ మీదుగా భుజాల వైపు వస్తుంటే సందేహాలు వీడి అనుమానంగా శ్వేతనాగు శరీరాన్ని తాకి నిమిరాడు ధనుంజయుడు.

అలా ఛాతీ మీదుగా పైకి వచ్చిన శ్వేత నాగు అతని భుజం మీద తలాన్చుకొని మిగిలిన శరీరాన్ని నిటారుగా నేకు వదిలి అలాగే వుండి పోయింది.

‘‘ఇంకనూ ఈ సంకోచమేల? నిను జూడ కను కాయలు కాచి వున్నవి. నీ దివ్య సౌందర్యాన్ని ప్రకటింపవా?’’ అనడిగాడు.

అంతే` ఉన్నట్టుండి శ్వేత నాగు అదృశ్యమై ఆ స్థానంలో మోహనాంగి ఉలూచీశ్వరి ప్రత్యక్షమైంది.

తామర తూండ్ల వంటి ఆమె కరములు అతడి ఛాతీని పూల చెండ్లలా చుట్టేసాయి. ఆమె ఎద భారాలు అతడి విశాల మగు ఛాతీని గాఢంగా హత్తుకున్నాయి. ఆమె శిరస్సు అతడి భుజం మీద వుంది. సకలా భరణ శోభితు రాలై తనను బిగియార కౌగిలించి ప్రత్యక్షమైన ఉలూచీశ్వరిని తడవు చేయకుండా తన చేతులతో బంధించి పసిమి ఛాయలో శంఖంలా మెరుస్తున్న ఆమె మెడ వంపు మీద ముద్దాడాడు. పులకింతతో మరింత గాఢంగా కౌగిలి బిగించింది  ఉలూచీశ్వరి.

‘‘దేవీ... నీ సుందర ముఖార విందాన్ని దాచ నేల? నీ మోము జూపవా?’’ అంటూ తన వైపు ముఖాన్ని తిప్పుకో బోయాడు. కాని ఆమె అలాగే ఉండి పోయి చిన్నగా ఏడ్చింది. ఉలికి పడ్డాడు ధనుంజయుడు.

‘‘దేవీ... ఈ శుభ తరుణంలో ఈ దుఃఖం ఎందుకు?’’ లాలనగా వీపు నిమురుతూ అడిగాడు.

‘‘అలసితిని ప్రభూ! మీ కోసం నిరీక్షించి అలసితి. ఒకటి కాదు రెండు కాదు పది దినములుగా మీ రాక కోసం వేయి కనులతో నిరీక్షించితి. కాసేపు మీ కౌగిట సేద దీరవలె ’’ అంది. ఆమె పలుకులు విని` ఉలికి పడ్డాడు ధనుంజయుడు. ‘‘దేవీ ఏమంటివి...! పది దినములా...?’’ అడిగాడు.

‘‘అవును. మీరిటు వత్తురని అత్త శంఖు పుత్రి చెప్పినది. ఇరువురము ఇచటనే ఎదురు చూచు చుంటిమి.’’

‘‘శంఖు పుత్రి ఎవరు?’’

‘‘మార్గమున మీకు ఎదురు పడిన అవ్వ రూపము లోని నాగస్త్రీ.’’ నమ్మ లేనట్టు కౌగిలి వీడి`

ఆమె ముఖార విందాన్ని తన వైపు తిప్పు కొని కళ్ళ లోకి చూసాడు. ‘‘ఆమె నిజముగ అవ్వ కాదా?’’ అడిగాడు.

‘‘కాదు ప్రభూ.’’

‘‘మరి నీవే మా ముందుకు రాకుంటివి?’’

‘‘ఎటుల వచ్చుట? మీ పక్కన ఎవరో బాలకు డగు పురుషు డున్నాడుగా... అతన్ని ఆపి మిమ్ము పనుచుటకే శంఖు పుత్రి అవ్వ రూపమున మీ ఎదుట కొచ్చినది.’’

అప్పటి గ్గాని ధనుంజయునికి విషయం అర్థం కాలేదు. చిన్నగా నవ్వుతూ, బండ మీద కూచున్నాడు. ఆమె కరము పట్టి దగ్గరకు తీసుకున్నాడు. ‘‘అది పురుషుడు కాదు, ఆ వేషం లోని యువతి.’’

‘‘అది యేమి? తను పురుషుడు గాదా?’’ విభ్రాంతు రాలయింది ఉలూచీశ్వరి.

‘‘కాదంటిని గదా. ఆమె భద్రా దేవి యను సుందరాంగి... దేవీ! ముందుగా నీకో నిజము చెప్పవలె సుమా...’’

‘‘చెప్పండి యువ రాజా! నాడు ఢాకినీ వనమున నా జీవము కాపాడినారు. ఆ క్షణమున మీరెవరో నాకు తెలియదు. కాని నా మది మీ చూపు దగులు కొని మరలి రానంది. మీ దివ్య సుందర రూపమును కను లారా దర్శింప నెంచి శ్వేత నాగుగా మారితి. నా దురదృష్ట వశమున మీరు నన్ను గుర్తించక అట నుండి వెడలి నారు. నాగ లోకము జేరి విరహమున కుందుచున్న నను ఓదార్చి అత్త శంఖు పుత్రి మీ వివరము తెలిపినది.’’

‘‘దేవీ! నీ ప్రేమకు పాత్రుడగుట అది నా అదృష్టము. కాని ఇంతకు ముందే నా హృదయ పీఠమున మరో వనిత వున్నది. ఈ విషయములో నీవు నను క్షమించ వలె.’’

‘‘ఇందులో క్షమించున దేమున్నది ప్రభూ. మీ వంటి రాజన్యులకు ఒకరి కన్న ఎక్కువ భార్య లుండుట సహజమే గదా. ఇంతకూ ఎవరా అదృష్టవంతు రాలు? ఎవరా అన్నుల మిన్న?’’ అంది విషయాన్ని తేలిగ్గా త్రోసి పుచ్చుతూ ఉలూచీశ్వరి. భద్రా దేవి కూడ ఇలాగే మాట్లాడింది. పైగా ఉలూచీశ్వరి విషయంలో తనను ప్రోత్సహించింది.

‘‘ఎవరో కాదులే దేవీ. నీవు నా పక్కన మచ్చల గుర్రం మీద గాంచిన బాలకుడను పురుషుడు. అది పురుషుడు కాదు పడతి. పేరు భద్రా దేవి.’’ అంటూ ఏదీ దాచ కుండా తమ గురించి వివరించాడు.

అతడి ఎత్తు భుజ స్కంధాల పైన కోమలమగు తన చేతులుంచి మీదకు వాలుతూ కళ్ళ లోకి నేరుగా చూసింది  ఉలూచీశ్వరి. హిమ పూరిత మగు ఆ చూపుల వేడిమికి వివశుండై తిరిగి బిగి యార ఆమెను సందిట బంధించాడు. భువనైక రూపసి యగు ఆమె సొగ కనుల మీద ముద్దాడాడు.

తేనె లూరు ఆమె పగడాల అధరాలు కంపిస్తూ తొలి అధర చుంభనం కోరి ఆహ్వానిస్తున్నాయి. కాని ఆమె నాగ కన్య. ముద్దు తీసుకోవాలా వద్దాని ధనుంజయుడు సంశయిస్తుండగా తనే అతడి మెడ వంచి అతడి అధరాలను అలుపు తీరా ముద్దాడింది. ‘‘అధర చుంబనానికి అభ్యంతరమేల ప్రభూ? నాగ రూపమున ఉన్నప్పుడే నా కోరల విషముండును. పడతి రూపంలో ఏ విషము వుండదు. మీరు నా ప్రాణమై వుండగా మీకు హాని కలిగింతునా?’’ అని ఉలూచీశ్వరి వివరిస్తుంటే పరవశుడై తిరిగి గాఢంగా ఆమె అధరామృతాన్ని ఆస్వాదించాడు.

‘‘కాని ఒక్క సందియము దేవి!’’ అన్నాడు కళ్ళ లోకి చూస్తూ.

‘‘చెప్పండి ప్రభూ! ఏమా సంశయము?’’ అడిగింది ఉలూచీశ్వరి.

‘‘దివ్య నాగమణి కోసం నాగ లోకమునకు పయనమైన నన్ను ఆది నుండీ నీ జనకుడు నాగ రాజు ఒక శత్రువు గానే భావించి అడ్డుకుంటున్నాడు.  హత మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు నిను నాకు ఇచ్చునా? మన ప్రేమను అంగీకరించునా?’’ అడిగాడు.

‘‘నిక్కముగా వారు అంగీకరించరు.’’ అంది నవ్వుతూ ఉలూచీశ్వరి.

‘‘మా నాగ లోకమున నా కొరకు వరాన్వేషణ జరుగు చున్నది. నాకు మీరు తెలుసు నని గాని, నా మది మీ యందు లగ్నమైన సంగతి గాని వారికి తెలియదు. ఇప్పుడు కూడ వింధ్యాటవిలో వన విహారమునకని సాకు జెప్పి చెలి కత్తెను సంపంగి వన మందే వేచి వుండమని ఆనతిచ్చి శంఖు పుత్రి వెంట మీ దర్శనార్థం వచ్చితి.’’ అంది.

‘‘అయిన ఇక నేమి? నాతో నీ జనకుని శత్రుత్వము ద్విగుణీకృతము అయినట్టే’’ అన్నాడు దర హాసంతో ధనుంజయుడు.

‘‘అగు గాక. ఇక నుండి మీరే నా లోకము, నా సర్వస్వము.’’

‘‘ఇంతకూ నాకు మీ నాగ లోకము చేరు మార్గమేది?’’

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali