Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> బాంధవ్యాలు

bhandhavyalu

“ఒరేయ్!సీతారామ్,నేనూ అమ్మ హైదరాబాద్ వస్తున్నాం.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి రా!”నాన్న ఫోన్..

“అదేంటి చెప్పాపెట్టకుండా వస్తున్నారు. ఏ ఏమయింది?  అడిగా ఫోన్లో 

“ ఆ! ఏమీ లేదు ఈ మధ్యన తరుచుగా కడుపులో నెప్పి వస్తుంది అని ఇక్కడ డాక్టరుకి చూపిస్తే ఒక్కసారి పెద్ద హాస్పిటల్ వెళ్ళి పరీక్ష చేయించుకోండి అన్నారు.అందుకే అక్కడ కొచ్చి ఒకసారి చూపించు కొందామని” అన్నారు

“సరే, అలాగే నేను రైల్వే స్టేషన్ కి వస్తా” అని ఫోన్ పెట్టేసా. రైల్వే స్టేషన్ కి వెళ్ళి అమ్మ, నాన్నని ఇంటికి తీసుకొచ్చా. అప్పటికే పిల్లలు సాత్విక, శ్రీరామ్ కాన్వెంట్ కి వెళ్ళి పోయారు. వాళ్ళు కాన్వెంట్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు కొత్త వ్యక్తులు కనిపించే సరికి “ఎవరు డాడీ!” మా అబ్బాయి నాన్న ఎదురుగానే ప్రశ్న. నాకు షాక్! వెంటనే నాన్నే సమాధానమిచ్చారు

“నేను మీ నాన్న నాన్నని అంటే తాతని, అదుగో అక్కడ కూర్చుందే ఆవిడ మీ నాన్న అమ్మ అంటే నానమ్మ” అన్నారు. నా పిల్లలకు తాత, నానమ్మలను వాళ్ళే పరిచయం చేసుకోవటాన్ని విస్తుపోయి చూస్తుంటే నాన్నే అన్నారు దీనికి కారణం ఒక రకంగా మనమే ఎందుకంటే ఎప్పుడో పిల్లల చిన్నపుడు తీసుకొచ్చావు, తర్వాత ఏ సందర్భంలో వచ్చినా కోడలు, నువ్వు రావడమే, అలాగే మేం కూడా ఇక్కడికి పిల్లలకి కాస్త జ్ఞానం తెలిసిన తర్వాత రావడం ఇదే ప్రధమం. అందుకే వాళ్ళననుకోవలసిన పనేం లేదు” అనేసరికి నిజంగా సిగ్గనిపించింది.

**************************

నాన్నకి హాస్పిటల్ లో గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కి చూపిస్తే అన్ని పరీక్షలు చేసి లివర్ కేన్సర్ చివరి దశలో ఉందని తేల్చారు. వయసు రీత్యా ఈ స్థితిలో ఆపరేషన్ లేదా కిమో ధెరపి ఏవీ అంత ఉత్తమం కాదని ఇక రెండు నెలలు మాత్రమే అని చెప్పేసారు. నాన్నకి ఈ విషయాలేవి చెప్పకుండా తగ్గడానికి ఇంకా కొద్ది కాలం పడుతుంది ఇక్కడే ఉండండి అని చెప్పా. అతి కష్టం మీద ఒక పది రోజులున్నారు. ఈ లోపు స్వగ్రామం లోని బంధు మిత్రులకు తెలిసి పరామర్శలు. అందరూ ఒకటే గొడవ, అక్కడకు పంపించేయ్! అక్కడ మేమంతా ఉన్నాం కదా మేం చూసుకొంటాం అని. అక్కడే నాక్కూడా కాల క్షేపం అని చెప్పి అమ్మ, నాన్నలు మా సొంతూరికి వెళ్ళిపోయారు. నిజం గానే మా బంధు మిత్రులు చెప్పినట్లుగానే నాన్నకు ఏ లోటు రాకుండా చూసుకొన్నారు అందుకే రెండు నెలలన్నది ఆరు నెలలు గడిచిన తర్వాత చని పోయారు. పిల్లలకు అదే సమయంలో పరీక్షలుండటంతో స్నేహితుల ఇంట ఉంచి నేను, నా భార్య కార్యక్రమాలకు హాజరయ్యాం.
మేము ఇద్దరం అన్నతమ్ములం. అన్నయ్య రఘరామ్, అక్క చెళ్ళెళ్ళు ఇద్దరు అక్క ఉమ, చెల్లి హైమ. అన్నయ్య రఘురామ్ ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నాడు. అన్నయ్యకు కూడా అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి పేరు జయరామ్, అమ్మాయి పేరు జనని. వాళ్ళ పిల్లలకు పరీక్షలుండటంతో అన్నయ్య వదినలు మాత్రమే వచ్చారు. ఊరు ఊరంతా మా ఇంటి దగ్గరే ఉండి అందరూ తలో బాద్యత తీసుకొని నాన్న గారి కార్యక్రమాలన్నీ చక్కబెట్టారు. కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తరువాత అమ్మను మా వద్దకు తీసుకొని వెళ్ళి పోతామంటే అమ్మ కూడా ఆ ఇంటిని విడిచి పెట్టి రానని అక్కడే ఉండి పోయింది.

**********************

మరల చాలా రోజుల తర్వాత మా చిన్నాన్న వాళ్ళ చిన్నబ్బాయి పెళ్ళికని అన్నయ్య కుటుంబం, మా కుటుంబం మా స్వగ్రామం వచ్చాం. మా అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆడుకొని వీధి అరుగు మీద మేం కూర్చున్న చోటికి వచ్చి కూర్చున్నారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి జయరామ్ ని అడిగా “ఒరేయ్! నేనెవరో తెలుసా అని!” దానికి వాడిచ్చిన సమాధానం విని మరల షాక్!! వాడి సమాధానం ఏంటంటే “మీరు శ్రీరామ్ వాళ్ళ డాడీ కదా!”. నిజంగా చాలా బాధ వేసింది. మా అబ్బాయి ద్వారా నేను పరిచయం కాబడటం. ఆలోచిస్తుంటే ఇపుడు అన్పిస్తుంది, మనుష్యుల మధ్య బాందవ్యాలు ఎంత కృత్రిమంగా తయారయినాయో! గతంలో ఉమ్మడి కుటుంబాలకు, ఇప్పటి ఏకాకి కుటుంబాలకు మధ్య వ్యత్యాసం, అలాగే ఉద్యోగ బాధ్యతలతో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతూ ఆప్యాయతలు, అనురాగాలను ఎంతగా గాలికి వదిలేసామో! అలా ఆలోచిస్తూ ఉంటే గతంలోకి జారుకొన్నాయి నా తలపులు.

**********************

ప్రతి పండగలకు కుటుంబ సమేతంగా మేము మా మావయ్యల ఇంటికో, మేనత్తల ఇంటికి వెళ్ళడమో లేదా వాళ్ళు మా ఇంటికి రావడమో జరిగేది. ఉదయాన్నే చేల గట్ల వెంబడి తిరగటం, మామిడి చెట్లెక్కి మామిడి కాయలు కోసుకోవడం, ఈత పళ్ళు రాలగొట్టి అవి పంచుకొని తినడం,సాయంత్రమయ్యే సరికి కాలువలో ఈత కొట్టడం….ఒకటా, రెండా ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు. ఆ పండగ రోజులన్నీ ఎంతో ఉత్సాహంగా ఆనందంతో ఆట పాటలతో గడిచి పోయేది. ఆ ఆనందాన్ని, ఉత్సాహన్ని మూట గట్టుకొని మరల వచ్చే పండగ కోసం ఎదురు చూసేవాళ్ళం. అలాగే బంధు మిత్రులలో ఎవరికి ఏ ఆపద గానీ, అనారోగ్యమొచ్చినా  క్షణాల్లో వాలి పోయి అక్కడుండి కంటికి రెప్పలా కాపాడుకొనేవారు.

******************

“చిన్నాన్నా! డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. అర్జంటుగా రండి” మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి జయ రామ్ ఫోన్. వెంటనే బయలు దేరి వెళ్ళా. అప్పటికే జరగరానిది జరిగి పోయింది. అన్నయ్య చని పోయాడు. అన్నయ్య పార్ధివ దేహం ప్రక్కన వాళ్ళ అబ్బాయి జయ రామ్ ఒక్కడే ఉన్నాడు. ఎవరెవరో వస్తున్నారు. ఒక్క క్షణం పలకరించి వెళ్ళి పోతున్నారు. అన్నయ్య అంత్య క్రియలు జరిపే చోటు కి తీసుకెళ్ళడానికి “కైలాస రధం” పేరుతో గల వాహానాన్ని పంపించమని జయరామ్ ఫోన్ చేసాడు. దానిలో అన్నయ్య పార్ధివ దేహంతో పాటు నేను, వాళ్ళ అబ్బాయి జయరామ్ అనుసరించాము. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొచ్చాం. ఈ సంఘటనతో నాకు పూర్తిగా జ్ఞానోదయమయ్యింది. ఇన్నాళ్ళుగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏం కోల్పోయామో! ఆత్మీయంగా పలకరించడం మాట అటుంచి కనీసం కూడా నలుగురు రాని పరిస్థితి. ఆ క్షణమే నిర్ణయం తీసుకొన్నా! చుట్టూ ఉన్న నలుగురి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం, సొంత ఊరికి వీలు చూసుకొని కుటుంబం తో సహా సందర్శించడం, అలాగే ఇకపై ప్రతి పండుగకు ఖచ్చితంగా  కుటుంబ సమేతంగా బంధు మిత్రుల యింటికి మేమే వెళ్ళడమో, వాళ్ళని ఆహ్వానించడమో చేయాలని స్థిరంగా నిశ్చయించు కొన్నా. దానిలో భాగంగా రాబోయే పండగ కోసం ఆతృతగా ఆత్మీయత, ఆప్యాయతలతో  కూడిన ఆ మధుర క్షణాలను ఆనందించేందుకు వేచి చూస్తున్నా…

మరిన్ని కథలు
nishacharulu