Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ -ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 


వర్షాకాలం వచ్చేసింది మొత్తానికి.  ఈరోజుల్లో పిల్లల్ని స్కూళ్లకు పంపడం ఓ యజ్ఞం లాటిదే. ఉన్న పుస్తకాల బరువుకి సాయం, ఓ రైన్ కోటో, ఓ బుల్లి గొడుగో ఇచ్చి, బస్సులో కూర్చోపెట్టడం. నూటికి యాభై పాళ్ళు, వాటిని స్కూల్లోనో, బస్సులోనో మర్చిపోవడం ఖాయం. అందుకోసమని కనీసం మూడు కోట్లూ, ఓ రెండు గొడుగులూ స్పేర్ లో పెట్టుకుంటూండాలి. మర్నాటికి పిల్లల యూనిఫారాలు ఆరవు. వీళ్ళకేమో వర్షంలో తడవడం ఇష్టం. ఏ  రొంపా జలుబూ వచ్చిందంటే డాక్టర్లూ మందులూనూ. వర్షాకాలంలొ స్కూళ్ళు రెండు పూటలు కాకుండా, ఒక్కొక్కప్పుడు  “ కంటిన్యూ “ అని, ఏ మూడింటికో వదిలేసేవారు. రోజూ వర్షం వస్తే బావుండునూ అనిపించేది.

చిన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షం నీళ్ళలో కాగితం పడవలూ, హడావిడీనూ. వర్షాకాలంలో ఇంకో కష్టం కూడా ఉండేది. మన ఇళ్ళల్లో ఉండే కొంతమంది వయోవృధ్ధులైన ఆడవారు, ప్రతీరోజూ పొద్దు చూస్తేనే కానీ, భోజనం చేసేవారు కాదు. ఆ సూర్యుడు ఈ వర్షాకాలంలో ఎక్కడ కనిపిస్తాడూ? ఒక్కోప్పుడు, రోజులు తరబడి  ఉపవాసాలే.


ఇది వరకటి రొజుల్లో పొలాల్లో పనిచేసేవారు, ఏ తాటాకు గొడుగో, లేకపోతే ఏ గోనుగుడ్డో నెత్తిమీద పెట్టుకునేవారు. వర్షాకాలం వచ్చెముందరే ఇంట్లో ఉండే గొడుగులు రిపేరీ చేయించుకోడం అన్నిటిలొకీ ముఖ్యమైన పని. ఈరోజుల్లోలాగ అప్పుడు, ఈ రైన్ కోట్లూ అవీ ఉండేవికావు. సైకిళ్ళమీద వెళ్ళేవాళ్ళు ఓ చేత్తో గొడుగూ, రెండో చేత్తో సైకిలూ. అదో పెద్ద సర్కసులా ఉండేది.. పోలీసులకి " Duckback" వారి కాన్వాసు కోట్లిచ్చేవారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు, పెరట్లో ఉండే నూతుల్లో పైదాకా నీళ్ళొచ్చేసెవి. చేద అవసరంలేకుండా, హాయిగా బిందెతోనొ, బాల్చితోనో నీళ్ళు తోడుకోవడం బలేగా ఉండేది. ఈరోజుల్లో కనిపించడంలేదు కానీ, ఆరోజుల్లో జలగలని నీటి ప్రాణులుండేవి. ఒకసారి పట్టుకుంటే రక్తం పూర్తిగా పీల్చేదాకా వదిలేవి కావు.అలాగే మేతకి వెళ్ళిన పశూవుల పొదుగులకి కూడా పట్టుకునేవి. ఇంక రోకలిబండలూ, నత్తలూ అయితే, తప్పేవేకావు. ఇంక బయటకి ఏ చెప్పులతోనే వెళ్తే ఇంటికొచ్చి ఆ చెప్పులకింద అంటుకున్న ఒండ్రుమట్టిని ఏ సీనారేకుతోనో గీకడం.

వర్షాకాలంలో, బస్సులెక్కడమంత కష్టం ఇంకోటుండదు. ప్రతీవారి చేతులోను నీళ్ళోడే గొడుగులూ. కిటికీపక్క సీటైతే తప్పకుండా తడిసే ఉంటుంది. ఎవరికివారే జరగమంటే ఛస్తే జరగరు. చివరకి ఏ రుమ్మాలో వేసికుని కూర్చోవడమే. ఈ గొడుగులతో ఇంకో గోడవకూడా ఉంది. ఏ కొట్లోకో వెళ్తే,  నీళ్ళుకారుతోన్న గొడుగుతో లోపలకి అడుగెట్టనీయరు. అలాగని బయట పెడితే, ఎవడైనా ఎత్తుకు చక్కాపోతాడేమో అని భయం.  

ఇంక రోడ్డుమీద నడిచివెళ్ళేవారి కష్టాలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత తప్పించుకుందామనుకున్నా, రోడ్డుమీద అతివేగంగా వెళ్ళే ఆటోలూ, కార్లూ, దానివలన వచ్చే నీళ్ళ జల్లులూ, వాటితో నడిచేవారికి జలాభిషెకాలూ . ఇంటికెళ్ళేసరికి చివాట్లూ. పోనీ ఆ ఆటొలోవెళ్ళేవారు సుఖపడుతున్నారా అంటే అదీలేదు, అదేదో ప్లాస్టిక్ గుడ్డ కడతాడు ఒఠ్ఠిపేరుకే. దానివలన ఏమీ ఉపయోగం ఉండదు. పైగా వర్షాలొచ్చాయంటే, ఈ ఆటోలవాళ్ళకి పెద్ద గిరాకీ. తడవకుండా కొంప చేరుకోడానికి, ప్రతీవాళ్ళూ ఆటోలని ఆపెవాళ్ళే, ఇదే అదునుగా తీసికుని, వాళ్ళు కూడా మీటరు ఆపేసి, ఏదో ఒక రేటు చెప్పడం.వీటికి సాయం రోడ్లమీద ట్రాఫిక్కు  జామ్ములూ. ఇంకో చిత్రం ఏమిటంటే, ఏ జంక్షన్ లోనూ, సిగ్నల్ పనిచేయదు. దానితొ నానా గందరగోళమూనూ. ఎవడికి ఖాళీ దొరికితే దూరిపోవడం. అందరూకట్టకట్టుకుని ట్రాఫిక్కు నిజాం చేయడం.


కాలక్రమేణా, గొడుగుల ప్రమాణం కూడా మారిపోయింది. ఇదివరకటిరోజుల్లోలాగ,  భారీగా కాకుండా, హాయిగా మడతపెట్టి బ్యాగ్గులో పట్టేటట్టుగా. పెద్దవర్షం వస్తే ఏమీ ఉపయోగం లేకపోయినా, ఏదో పరవాలేదు నెత్తివరకూ కాపాడుకోవచ్చు. రైన్ కోట్లయితే సూట్లలోకి మారిపోయాయి.

మామూలుగా వేసవి శలవలిస్తారు. కానీ వర్షాకాలంలో ఇస్తే బావుండుననిపిస్తుంది.ఏ సీజనుకి ఆ సీజను అలాగే అనిపిస్తుందనుకోండి.
అన్నీ చెప్పి వర్షాకాలంలో వేసికునే పాదరక్షల విషయం మర్చేపోయాను. రబ్బరు చెప్పులూ, బూట్లూ శ్రేష్ఠం. ఓ సీజను మన్నినా మన్నినట్లే.  ఇవి కాకుండా “ గమ్ బూట్లు “ అని ఉన్నాయి. వాటిని వేసికోడానికి కొద్దిగా తిప్పలు పడాలి.

వర్షాకాలం హాయిగా గడపండి...

సర్వేజనా సుఖినోభవంతూ...

 

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugalu