Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of himalayas

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు.

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము

మునుల, దేవతల కోరికమేరకు వింధ్యపర్వతాన్ని  అణిచి దక్షిణానికి బయలుదేరిన అగస్త్యుడు  కొల్హాపూరు లక్ష్మీదేవిని సేవించుకుని ఆమె  ఆజ్ఞమేరకు స్వామిమలకు బయలుదేరాడు. మాల్యవంత పర్వత ప్రాంతాన్ని చేరుకున్నాడు. పంపానదీ తీరాన్ని చూశాడు. మాల్యవంతపర్వతాన్ని, మతంగాశ్రమాన్ని చూశాడు. ఆ ప్రాంత ప్రకృతిని  యిలా వర్ణిస్తున్నాడు.  

ఇవె యూపవృత శాఖు లివె లూనముఖ దర్భ / సందర్భ వేళంత  సైకతంబు 
లివె శబ్దసహమృగయువయుగంబులు వీరె / చల కాకపక్ష మస్తకులు బ్రహ్మ
చారులు నిజ హోమసౌరభేయీ తర్జ / కముల నీడల నిల్చి  కాచియున్న
వారు సామోదిత స్వరసంశయమునొంది / చిలుక కోయిలనిదె తెలియనడిగె        (సీ)

భసలకలభ కులాస్పృష్ట కుసుమవిసర 
మసృణ మకరందమయమైన మావిమోక 
కిసలయచ్చవి బునరుక్తి నసలుకొలిపె
ఋషుల చెంగావి వలువందు నిందువదన                           (తే)

యిదిగో  యివే యూపస్తంభాలకోసం నరికి ఉంచిన వృక్షశాఖలు. యివే దర్భలకోసం  నరికితే మిగిలిన మొదళ్ళు. యివే శబ్దాలకు, మానవుల ఉనికికి అలవాటుపడిన జింకలు, కదలకుండా ఉన్నాయి. యిదిగో వీరే బ్రహ్మచారులు, తమ శిఖలు జునపాలు  చలిస్తుండగా చెట్ల నీడలలో  నిలిచి  తమ గోవులను  దూడలను కాస్తున్నారు. యిదిగో! చిలుకకు సంగీతశాస్త్ర, సామవేదగాన సంబంధమైన సంశయం కలిగి, కోయిలను అడిగి  తన  సంశయాన్ని తీర్చుకుంటున్నది. తుమ్మేదలచేత పీడింపబడిన పూలనుండి కారిన  తేనెలు, మావి చవుళ్ళు  చెట్లకు కట్టిన కాషాయాంబరాలకు అంటుకుని, మావిడిచివుళ్ళ  రంగును కలిగిస్తున్నాయి కాషాయ వల్కలాలకు. చూశావా! ఎంత అద్భుతంగా ఉన్నదో  మతంగముని ఆశ్రమప్రాంతం!

నిర్ధూత పాతకములు హ
విర్దూమలతాగ్ర లాస్య విలసన శిక్షా 
దూర్ధరములు నిజభజన వి
వర్ధితసుకృతంబు లిచటి వాయువులబలా!                                 (కం)

యిచటి వాయువులు పాతకాలను పూర్తిగా తుడిచివేస్తాయి. యజ్ఞవాటికలలో హవిస్సుల  కారణంగా లేస్తున్న పొగలు లతల చివరలవలె అటూ యిటూ ఊగుతూ నృత్య  అభ్యాసకులు ఆనందంగా తాండవం చేస్తున్నట్లున్నాయి చూశావా, ఆ  పొగలను  మోసుకుస్తున్నవి ఈ  వాయువులు. తమను కొలిచేవారి పుణ్యాలను వృద్దిచేస్తాయి  ఈ వాయువులు. హోమ ధూమాన్ని ఆఘ్రాణించడం కూడా మహా పుణ్యం అని చమత్కారంగా చెబుతున్నాడు రామకృష్ణుడు.

ఓలలితాంగి యిందు సుఖముండు మృకండు కణాద గాధి వా
ధూల ముఖాతిరిక్త చరితుండు మతంగమహాతపస్వి ని
ష్కాలగళుండు నిర్యువతిగాత్రుడు నిర్నిటలేక్షణుండు ని
ర్వ్యాళవిభూషణుండగు నంబరకేశుడనంగ బెంపునన్                        (ఉ)

ఓ లలితాంగీ! ఈ  ఆశ్రమంలో మతంగమహాతపస్వి ఉంటాడు. ఆయన మృకండ, కణాద, గాధి, వాధూల మహామునులను మించిన పవిత్రచరిత్రుడు. నల్లని గళం లేని, అంటే  మురికిలేని శివుడు! యువతిపెనవేసుకుని సగమై లేని శరీరంకలిగిన శివుడు, కామ  వికారాన్ని నాశనంచేసినవాడు. నుదుట కన్నులేని శివుడు, ఆగ్రహాన్ని, కోపాన్ని, తామసాన్ని   జయించినవాడు. పాములను కూడా ఆభరణాలుగా లేనివాడు. అసలు ఏ ఆభరణాలూ  లేనివాడు. వ్యోమకేశుడు(శివుడు, అంబరకేశుడు) కావచ్చు అన్నట్లు ఉంటాడు ఆయన! 

హోమధూమాసితప్రభ నీమహాత్ము 
నాశ్రమంబొప్పు నీయద్రియంతికమున,
వలుదయై మించు నప్పంటవలఁతినెలత 
చంటికడ నంటు మృగనాభిచర్చవోలె                                 (తే)

ఈ మహాత్ముడి ఆశ్రమం నల్లని హోమధూమ ప్రభలతో  ఈ మల్యవంత పర్వతము చెంత  ప్రకాశిస్తూ ఉన్నది. ఈ భూమి అనే స్త్రీ యొక్క చన్నువద్ద పూసుకున్న మృగనాభి(కస్తూరి) వలె ఉన్నది కదూ! పంటవలతి అంటే పంటలను యిచ్చేది, భూమి. ఆ భూమి అనే స్త్రీ  వక్షోజంలా మాల్యవంతపర్వతం ఉన్నది, ఆ వక్షోజానికి పూసుకున్న కస్తూరిలా ఆ ఆశ్రమం  ఉన్నది అంటున్నాడు తెనాలి రామకృష్ణుడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
Arthritis in Children | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)