Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

గతసంచికలో ఏం జరిగిందంటే..... http://www.gotelugu.com/issue169/481/telugu-serials/atulitabandham/atulitabandham/

సాయంత్రం వరకూ తన ప్రియ నేస్తంతో, అన్నపూర్ణతో గడిపి ఇంటికి తిరిగి వచ్చిన మధుబాల ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చుని టీవీ లో సినిమా చూస్తున్నారు. మధు రాగానే ఆమె వైపు ఎర్రగా చూసాడు వేణు. 

కొంచెం కలవరపాటుకు గురి అయినా అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లి కాళ్ళూ, చేతులూ ముఖమూ కడుక్కుని వచ్చి కూర్చుంది మధుబాల. 

సుగుణమ్మ వంటింట్లోంచి స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చి ఇచ్చింది.  “అయ్యో, మీరు తెచ్చారెందుకు అత్తయ్యా, నేను కలుపుకుందును కదా...” కొద్దిగా నొచ్చుకుంటూ అందుకుంది. వేణు సీరియస్ గా టీవీ చూస్తున్నాడు. మధుబాలకు అర్థమైంది, తాను ఐశ్వర్య దగ్గరకు వెళ్లినట్టు తెలిసి ఉంటుంది... అందుకే ఈ కోపం అనుకుంటూ, మెల్లగా కాఫీ సిప్ చేస్తూ, తాను కూడా టీవీ చూడసాగింది. 

“మధూ, ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి రండి అమ్మా...” చెప్పింది సుగుణమ్మ.

“అలాగే అత్తయ్యా, రేపు వెళతాము...”

“ రోజే వెళ్ళి ఉండేవాళ్ళం నువ్వు ఊరంతా పెత్తనాలు చేసి ఆలస్యంగా ఇంటికి రాకపోతే...” విసురుగా అన్నాడు వేణు.

“వేణూ...” వారింపుగా అన్నాడు గోవర్ధన రావు. 

“సారీ, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది...” క్లుప్తంగా చెప్పింది మధుబాల.

ఈలోగా వేణు మొబైల్ కి కాల్ రావటంతో వరండాలోకి వెళ్లి మాట్లాడసాగాడు. 

“మధ్యాహ్నం మీ ఆఫీసుకు వచ్చాడు... పని అయిపోయి, నువ్వు వెళ్ళిపోయావని చెప్పారట... నీ మొబైల్ రింగ్ అయినా నీవు తీయలేదట... అప్పట్నుంచీ ఈ చిందులు...” చెప్పింది నవ్వుతూ సుగుణమ్మ.

“బాగ్ లో ఉండిపోయింది అత్తయ్యా... చాలా రోజులు అయిందని ఐశ్వర్య దగ్గరకు వెళ్లాను...”

“ఐశ్వర్య అంటే... ఓ ఆ అమ్మాయా?” సుగుణమ్మ ముఖం అప్రసన్నంగా అయింది.

“అవును అత్తయ్యా, విధి వంచితురాలు... పాపం చాలా మంచి అమ్మాయి...” నచ్చజెబుతున్నట్టు అన్నది మధుబాల.

“ఒక సారి మనింటికి తీసుకురామ్మా...” చెప్పాడు గోవర్ధన రావు.

“ప్చ్... మీ అబ్బాయి ఇష్టపడరు మామయ్య గారూ... వద్దులెండి...” అన్నది మధుబాల.

వేణు లోపలికి వచ్చేయటం తో సంభాషణ ఆగిపోయింది.

“పదమ్మా, కొంచెం కూర తరిగి ఇద్దూగాని...” అంటూ లేచింది సుగుణమ్మ...

ఆవిడ వెనకాలే వంటింట్లోకి వెళ్ళింది మధుబాల.

***

“సారీ వేణూ... చెప్పకుండా వెళ్ళినందుకు...” ఎడముఖంతో ఉన్న భర్త గడ్డం పట్టి బ్రతిమిలాడింది మధుబాల. 

“నువ్వెప్పుడూ ఇంతే మధూ... ఈరోజు నువ్వు త్వరగా వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లి అటునుంచి సినిమాకి వెళ్ళాలని అనుకున్నాను... నీకు నా కన్నా నీ స్నేహితులే ఎక్కువలే...”

“లేదు వేణూ... అలా అనుకోకు. స్నేహితులను వాళ్ళ బలహీనతలతో సహా స్వీకరించాలి అట... జీవిత భాగస్వామిని వాళ్ళ స్నేహితులతో సహా స్వీకరించాలి మరి... ఒక మంచి మాట, నాతో కాసేపు కలిసి గడపటం ప్రస్తుతం ఐశ్వర్యకు ఎంతో సాంత్వన కలిగిస్తోంది... అయినా నేను వెళ్ళింది ఎప్పుడని? చాలా కాలం తర్వాత ఇప్పుడే కదా... నువ్వు ముఖం ముడుచుకోకు... ప్లీజ్...” 

“ఊ...” 

“అయితే రేపు వెళదామా డాక్టర్ గారి దగ్గరకు?”

“సరే వెళదాం లే... ఈ శనివారం నేను టూర్ కి వెళ్ళాల్సి రావచ్చు...”

“అరె అవునా? ఎక్కడికి??”

“తిరువనంతపురం.”

“ఆహా, కేరళా! నేనూ రానా?”

“వద్దులే మధూ... ముందు ముందు నీకు లీవు చాలా కావలసి వస్తుంది కదా... నేను కూడా ఆఫీసు పని మీద మూడు రోజులే వెళ్లి వస్తాను... తర్వాత ప్లాన్ చేసుకుందాం...”

“సరే... నీ ఇష్టం...మంచి పేర్లు రాయి నీ టూర్ లో... అందంగా, అర్థవంతంగా, మోడరన్ గా ఉండాలి... మన బిడ్డ కోసం...”
“అలాగే... రాస్తాను... ఇంతకూ, పాపని ఇస్తున్నావా, బాబునా?” కొంచెం ప్రసన్నమైంది వేణు మూడ్.

“నీకు ఎవరు కావాలేం?”

“అమ్మకీ, నాన్నకీ అబ్బాయి కావాలని ఉంది... నాకు ఎవరైనా ఒక్కటే మధూ... అచ్చు నీలాగే ఉండాలి...” మధుబాల తల నిమురుతూ దగ్గరకు తీసుకున్నాడు.

ఆ  ఆప్యాయతకు ఆనంద బాష్పాలతో, అతని గుండెల్లో తలదాచుకుంది మధుబాల.

***

గిరి భార్య నిర్మల కూడా నెల తప్పింది. పూర్ణమ్మ కోడలిని అపురూపంగా చూసుకుంటూ కాలు నేల  మీద పెట్టనీయడం లేదు. ఒక సారి మధుబాలను ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు కొడుకుతో అనంతరామయ్య. 

సరేనన్నాడు గిరి.

***

“అత్తయ్యా, మామయ్యా, బాగున్నారా?” వారికి ఎదురేగి పాదాభివందనం చేసింది అమల. 

“ఏదో ఇలా ఉన్నాము తల్లీ... అరుణ్ ఉన్నాడా?” సోఫాలో కూర్చుంటూ అన్నాడు, పరమేశ్వర రావు. 

“లేదండి, బయట ఏదో పని ఉండి వెళ్ళారు. లంచ్ కి వచ్చేస్తారు. మీ ఆరోగ్యం బాగుందా అత్తయ్యా?”

“అవే కీళ్ళ నొప్పులు, అమలా... ఈ చిన్నాడితో అవే బాధలూనూ...” మూలిగింది కాత్యాయని.

“ఏమైంది అత్తయ్యా, చిన్నా  బాగున్నాడా?”

“ఏమో ఎవరికి  తెలుసు?” నిరసనగా అన్నాడు పరమేశ్వర రావు.

“అదేమిటి మామయ్యా?”

“అవునమ్మా, వాడు ఇంటికి వచ్చి ఈ సారి పదిహేను రోజులు దాటింది. ఫోన్ చేసినా తీయడు... మీ అత్తయ్య ఆరోగ్యం వాడి మీద బెంగ వల్లనే ఇంకా దిగజారిపోతోంది. వాడికి పెళ్ళి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకుందామని అనుకుంటే, ఏవేవో పిచ్చి జీవన విధానాలు వీడివి సహజీవనాలు అంటూ... ఆ సహజీవనం చేసే అమ్మాయినే చేసుకోవచ్చును కదా... మాకు కులమత పట్టింపులు ఏవీ లేవు... వాళ్ళిద్దరూ సామరస్యంగా ఉంటే అదే చాలు... ప్చ్... వీడు వినడమ్మాయ్...” బాధగా నిట్టూర్చాడు పరమేశ్వర రావు.

అమల కనుల ముందు ఐశ్వర్య మెదిలింది... అయితే కార్తీక్ ఇంటికి కూడా వెళ్ళనంత బిజీగా ఎక్కడో ఎవరితోనో ఉన్నాడన్న మాట... ఏ రకంగా చూసినా ఐశ్వర్య మాత్రమే కార్తీక్ కి తగిన జోడీ... ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఉంటే ఎంత బావుండేది? ఏమిటో అర్థం లేని ఆదర్శాలు... పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి, విదేశీ సంస్కృతిలో ఒక భాగమైన లివిన్ బంధాన్ని నమ్మారు ఇద్దరూ... అసలు ఇందులో ‘ప్రేమ’ అనే పదానికి స్థానం ఎక్కడ ఉంది?

“అమలా, ఏమిటమ్మా ఆలోచనలో పడ్డావు? రూప ఎలా ఉంది? ఏదీ?” అడిగింది కాత్యాయని.

“రండి అత్తయ్యా, రూమ్ లోనే పడుకుని ఉంది, టీవీ చూస్తూ...” ఇద్దరినీ రూప గదిలోకి తీసుకుపోయింది అమల.

“నాన్నమ్మా...” రెండు చేతులూ చాచిన మనవరాల్ని చూడగానే కాత్యాయని కళ్ళు సజలాలు అయ్యాయి. 

“బంగారు తల్లీ, బాగున్నావా?” దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుని, వంగి  మనవరాలిని గట్టిగా హత్తుకుంది కాత్యాయని.

“తాతయ్యా, బాగున్నారా?” ప్రేమగా పలకరించింది.

“బాగున్నానురా... బాగా చదువుకుంటున్నావా తల్లీ?” రూప తల నిమిరాడు.

“ఎప్పుడూ ఇక్కడే ఉండవచ్చు కదా నాన్నమ్మా... బాబాయ్ కి ఎప్పుడూ టూర్లే కదా... మీరు ఒంటరిగా అక్కడ ఎందుకు? ఇక్కడికి వచ్చేయండి...”

“అలాగే అమ్మా... వచ్చేస్తాము... మేమూ ఒక్కళ్ళం ఉండలేకపోతున్నాము...” 

“అబ్బ, ఎంత మంచి మాట చెప్పారు అత్తయ్యా... మీరు వచ్చేస్తే నాకెంతో హాయి అండీ... ముఖ్యంగా రూపకు తోచక పిచ్చెక్కుతోంది పాపం...” ఇద్దరికీ చెరో మజ్జిగ గ్లాసూ అందించింది అమల.

“అప్పటికీ నేను ఇంట్లో ఉన్నంత సేపూ తనతోనే ఉంటాను... సాయంత్రం క్లబ్ పనుల మీద బయటకు వెళతాను... ట్యూటర్ వచ్చి వెళ్ళేంత వరకూ చదువుకుంటుంది... ఆ తర్వాత డిన్నర్ చేసి పడుకుంటుంది... నేను లేనప్పుడు మాత్రం చాలా బోర్ ఫీల్ అవుతుంది...”
“డాక్టర్ ఏమన్నారమ్మా?”

“ఇంకా ట్రీట్మెంట్ అవుతోంది మామయ్యా...” క్లుప్తంగా చెప్పింది అప్పటికి అమల.

“ఈరోజు ఇక్కడే ఉండిపోండి తాతయ్యా...” అడిగింది రూప.

“సాయంత్రం వరకూ ఉంటాము తల్లీ... మళ్ళీ వస్తాముగా...”

“అయితే త్వరగా వంట చేసేస్తాను. రండి అత్తయ్యా...” అమల కాత్యాయనిని వంటింట్లోకి తీసుకువెళ్ళింది.

“రూప బెడ్ రిడెన్ కావటానికి మానసికంగా బాగా దెబ్బ తినటమే కారణం అని చెప్పారు అత్తయ్యా... యాక్సిడెంట్ లో కాలికి తగిలిన దెబ్బ కన్నా, తలకు తగిలిన దెబ్బ వలన మానసిక స్థైర్యం కోల్పోయింది. ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన ఉండాలి... అందుకే చదువులోనూ పెద్ద చురుకుగా ఉండటం లేదు... ఐశ్వర్య దగ్గర పాఠాలు బాగా నేర్చుకునేది... తర్వాత వచ్చిన ట్యూటర్స్ నామమాత్రమే... మందులు పని చేస్తున్నాయి... ఇదివరకటి కన్నా చురుగ్గా ఉండగలుగుతోంది... త్వరలోనే వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి తిప్పవచ్చు అన్నారు...” 

“అవునా అమ్మా... అయితే వచ్చే నెలలో మేము వచ్చి ఉంటాము కొన్ని రోజులు...”

“అంతకన్నానా అత్తయ్యా? వచ్చేయండి...”

“అమ్మాయ్, ఆ ఐశ్వర్య అంటే...”

“అవును అత్తయ్యా, కార్తీక్ ఆమెను ప్రేమించి కొన్నాళ్ళు...”

“ఓహ్.. అవును... అన్నీ బాగుంటే నాకు చిన్న కోడలు అయి ఉండేది అన్నమాట...”

“అసలు మీ కడుపున పుట్టిన ఈ కార్తీక్ కి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయో ఏమో అత్తయ్యా... మీ పెద్దబ్బాయికీ నాకూ అదే ఆశ్చర్యంగా, బాధగా  ఉంటుంది...”

“అవును అమ్మా... మంచినీళ్ళు తాగినట్టు తప్ప తాగుతున్నాడు... డ్రెస్సులు మార్చినట్టు అమ్మాయిల్ని మారుస్తున్నాడు... నా కడుపున చెడబుట్టాడు. ఆరోగ్యం అంతా నాశనం చేసుకుని... ఎప్పుడో... ఎక్కడో...” దుఃఖంతో ఆవిడ మాట పూర్తి చేయలేకపోయింది.
“అయ్యో, అంత మాట అనకండి అత్తయ్యా... కన్నతల్లి మీరు...”

“మరి అలాంటి తల్లిని నన్ను, ఆయన్నీ ఈ పండు వయసులో క్షోభ పెట్టవచ్చునా?” ఆవిడ పచ్చటి బుగ్గల మీదుగా కన్నీళ్లు జలజలా రాలాయి.

“లేదులే అత్తయ్యా, చిన్నా మారతాడు... తన తప్పు తెలుసుకుని తిరిగి వస్తాడు...” అంది ఓదార్పుగా అమల.

“అదే జరిగితే భగవంతుడు మన మీద కరుణ చూపినట్టే తల్లీ...” కళ్ళు తుడుచుకుని, “ఏమైనా పని చెప్పమ్మా చేస్తాను...” అంది కాత్యాయని.

“వద్దు అత్తయ్యా, అలా విశ్రాంతిగా కూర్చోండి... మీ అబ్బాయి వచ్చేస్తారు కాసేపట్లో... కబుర్లు చెబుతూ ఉంటే వంట చేసేస్తాను...”

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్