Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lokam teeru

ఈ సంచికలో >> కథలు >> తనను మాలిన ధర్మం

tanadu malina dharmam

పూర్వం వైశాలి  నగరంలో  వరదయ్య  శ్రేష్టి  అనే  ఒక  వర్తక  ప్రముఖుడు  ఉండేవాడు. అతనికి  వైశాలి  నగరంలోనే  అత్యంత పేరు  పొందిన  వజ్ర  వైడూర్యాలు, నగల  వ్యాపారం  ఉండేది.  వైశాలి నగరం భోగ  భాగ్యాలతో తులతూగుతుండేది. వైశాలి  నగరంలోని ఎందరో సంపన్నులు  ఆయన  దగ్గర వజ్ర వైడూర్యాలు, బంగారు నగలు కొనేవారు. దేశ విదేశాలనుంచి విలువైన  వజ్రాలు, వైడూర్యాలు   తెప్పించి, పేరు మోసిన స్వర్ణకారులతో  అందమైన ఆభరణాలను తయారు చేయించి సరసమైన ధరలకే వరదయ్య శ్రేష్టి విక్రయించేవాడు.  నిజాయితీగా వ్యాపారం  చేస్తాడని  మంచి  పేరు  రావటంతో పుర  ప్రముఖులందరూ తమ ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు, ఇతర శుభ  కార్యాలకు అవసరమైన వజ్రాలు, నగలు వరదయ్య  శ్రేష్టి దగ్గరే  కొనుగోలు చేసేవారు. వైశాలి నగరంలో వేరే దుకాణాలు  ఉన్నా అందరూ వరదయ్య శ్రేష్టి దగ్గరే కొనుగోళ్లకు మక్కువ చూపేవారు.

వరదయ్య  శ్రేష్టి కి  ఒక్కగా నొక్క  కొడుకు  సురేంద్ర శ్రేష్టి.  చిన్న తనం నుండే తండ్రి తో  పాటు దుకాణం లో  ఉంటూ  వ్యాపార  నిర్వహణలో  మెలకువలు నేర్చుకున్నాడు సురేంద్ర శ్రేష్టి.  కొంతకాలానికి  తన  కుమారుడు ఎదిగి అంది వచ్చాడని, ఒక్కడే వ్యాపారం చక్కగా చూసుకోగలిగే స్తితి లో  ఉన్నందున  తానూ  తన  భార్య,  బంధు మిత్రులతో  కొద్దికాలం పాటు  తీర్ధ  యాత్రలు  చేసి పుణ్య క్షేత్రాలను దర్శించి  వద్దామని తమ వ్యాపారాన్ని కొడుక్కి అప్పగించి వరదయ్య  శ్రేష్టి  తీర్థ యాత్రలకు బయలు దేరాడు.

ఒక  రోజు  సురేంద్ర శ్రేష్టి  దగ్గరకు రామ శాస్త్రి  అనే  ఒక  బ్రాహ్మణుడు వచ్చాడు.  అతను  వైశాలి  నగరం సమీపంలో ఉన్న  మాధవనగరం నుండి వచ్చాడు.  ఆ వూరు వాడైన సురేంద్ర శ్రేష్టి చిన్ననాటి మిత్రుడు   గోపాలుడు  ఒక సిఫార్సు  లేఖ ఇచ్చి పంపాడు.    రామశాస్త్రి కి  ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి సహాయం చేయవలసిందిగా  అర్ధిస్తూ  గోపాలుడు  లేఖ వ్రాసాడు.  చిన్ననాటి  మిత్రుడి  మాట  మన్నించి రామ శాస్త్రి  ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నాడో  తెలుసుకున్నాడు సురేంద్ర శ్రేష్టి.  రామ శాస్త్రి   నస్యం తయారు  చేయటంలో  మంచి అనుభవం ఉన్నవాడు.  వైశాలి నగరంలో  చాలా మంది  ప్రముఖులకు నస్యం పీల్చటం అలవాటు అని తెలిసింది -- మీరు అనుమతిస్తే మీ దుకాణం ముందర ఒక  మూలగా నా  నస్యం వ్యాపారం ప్రారంభిస్తాను అని రామశాస్త్రి చెప్పటంతో  సురేంద్ర శ్రేష్టి అంగీకరించాడు. త్వరలోనే రామశాస్త్రి  నస్యం వ్యాపారం వరదయ్య శ్రేష్టి  నగల  దుకాణం ముందర ఉన్న ఒక  అరుగు మీద  మొదలు అయింది.  రామ శాస్త్రి తయారు చేసి  అమ్మే నస్యానికి  మంచి  పేరు రావటంతో  క్రమేణా రామశాస్త్రి  నస్యం దుకాణము లో  వ్యాపారం పెరగసాగింది.  ఎప్పుడు చూసినా ఒక  అయిదారుగురు రామశాస్త్రి నస్యం దుకాణం దగ్గర కనిపించే వారు.

ఆశ్చర్యకరంగా ఇదే సమయంలో  సురేంద్ర శ్రేష్టి నగల  వ్యాపారం రోజు రోజు కీ క్రమేణా తగ్గిపోసాగింది.  పెద్ద  పెద్ద బేరాలు వచ్చినట్లే వచ్చి ఉన్నట్లుండి వెనక్కు పోయేవి. సురేంద్ర శ్రేష్టి కి  అలా ఎందుకు   జరుగుతుందో  అంతు పట్టేది కాదు.

ఈ లోగా తీర్థయాత్రలకు వెళ్ళిన వరదయ్య శ్రేష్టి యాత్రలు  ముగించుకొని వైశాలి నగరానికి తిరిగి వచ్చాడు. ఒక రోజు దుకాణానికి  వచ్చి పద్దు పుస్తకాలు సరి చూసుకొన్నాడు. తమ వ్యాపారం  రోజు రోజుకీ  దిగజారి పోతున్నట్లు  గమనించాడు.  అలా  ఎందుకు  జరుగుతుందో  వరదయ్య  శ్రేష్టి కి  రెండు రోజులలో అర్ధమైంది.  ఎవరైనా  మంచి  విలువైన వజ్రాభరణాలు కొనుగోలు కోసం   వచ్చి నప్పుడే  రామ శాస్త్రి  దగ్గర  నస్యం కొన్న  వారిలో  ఎవరో  నస్యం పీల్చి తుమ్మేవారు. ఒక్కొక్క సారి నస్యం ఘాటుకు రెండు మూడు తుమ్ములు కూడా తుమ్మటం కద్దు. ఆ తుమ్ముల శబ్దం వింటూనే తుమ్మును అప శకునం గా భావించిన కొనుగోలుదారులు కొనుగోళ్లను వాయిదా  వేసుకోవటమో,  లేక  అత్యవసరంగా కొనవలసిన వారు వేరే దుకాణం లో కొనటమో చేస్తున్నట్లు వరదయ్య శ్రేష్టి గమనించాడు. ఇలా రామ శాస్త్రి నస్యం   వ్యాపారం తమ  దుకాణం ముందే  చేసుకోవటానికి  అనుమతి ఇవ్వటం వల్లనే  తమ  వ్యాపారానికి దెబ్బ తగిలిందని అనుభవజ్ఞుడైన వరదయ్య శ్రేష్టి  తెలుసుకున్నాడు.  తన కుమారుడికి వ్యాపార నిర్వహణ లో  అనుభవం వచ్చింది గానీ  లోక జ్ఞానం  సరిగా రాలేదని గ్రహించాడు.

వరదయ్య శ్రేష్టి  మరు నాడే రామ శాస్త్రిని పిలిపించి తానే  స్వయంగా ఆ వీధి చివర లో ఉన్న ఒక  దుకాణాన్ని  రామశాస్త్రి కి   బాడుగకు ఇప్పించి  అతని  నస్యం దుకాణాన్ని  ఆ వీధి  చివరలో ఉన్న  మరో   ప్రాంతానికి  తరలించాడు.  ఆశ్చర్యకరంగా కొద్ది కాలానికే మళ్ళీ  వరదయ్య శ్రేష్టి  వ్యాపారం పుంజుకొంది.  మళ్ళీ ఎప్పటిలా వరదయ్య శ్రేష్టి దుకాణం కొనుగోలుదారులతో కళకళ లాడ  సాగింది.  సురేంద్ర  శ్రేష్టికి  ఇదంతా  ఏమీ అంతు పట్టకుండా ఉన్నది.

ఒక రోజు వరదయ్య శ్రేష్టి సురేంద్ర  శ్రేష్టి ని  దగ్గరకు  పిలిచి  --నీ స్నేహితుడి సిఫార్సు మూలంగా రామ శాస్త్రి కి  సాయం చేయాలనే నీ ఉద్దేశ్యం మంచిదే !   దానిని తప్పు అనను. కానీ అది  కాస్తా "తనను  మాలిన  ధర్మం మొదలు  చెడ్డ  బేరంగా" మారింది.  రామశాస్త్రి  అమ్మే  నస్యం  పీల్చిన   జనాలు తుమ్మటం  మన  వ్యాపారాన్ని దెబ్బ తీసింది.  ఆ తుమ్ముల దెబ్బకు మన  వ్యాపారం దెబ్బతిన్నది. మనలో చాలా మంది తుమ్మును  అపశకునముగా  భావించుతారు. అంటే రామశాస్త్రి  చేసే నస్యం వ్యాపారం మన  వ్యాపారానికి చుక్కెదురు అన్న మాట.  ఈ సంగతి  నేను  వివరించ గానే రామశాస్త్రి కూడా అందులోని  విషయాన్ని అర్ధం చేసుకున్నాడు.  అందుకే  రామ శాస్త్రి కి  నష్టం లేకుండా, అతని జీవనోపాధికి ఇబ్బంది రాకుండా  అతని నస్యం దుకాణాన్ని  మన దుకాణానికి  దూరంగా మార్పించాను.  ఫలితం నువ్వు చూసావుగా?" అన్నాడు వరదయ్య శ్రేష్టి.  నిజమే నంటూ తల ఊపాడు సురేంద్ర  శ్రేష్టి.

మరిన్ని కథలు
etti vitto atti panta