Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saamaanyudi asahanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథా సమీక్షలు - ..

 

గోతెలుగు -125   వ సంచిక;

కథ: “సద్వినియోగం”

రచయిత్రి: ఆచంట హైమవతి

సమీక్షకుడు:  నూజిళ్ళ శ్రీనివాస్

నిత్య జీవితంలోని సంఘటనలకు కథా రూపాన్ని కల్పించి, చక్కని సందేశాన్ని అందించే కథా రచయిత్రి శ్రీమతి ఆచంట హైమవతి గారు. ఆమె కథల నేపథ్యం మధ్యతరగతి కుటుంబాలయితే, కథలలోని విషయం సాధారణంగా సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక కథే – గోతెలుగు వారపత్రిక 125 వ సంచికలో ఆమె రాసిన “సద్వినియోగం”.

ఆధునిక కాలపు విద్యా విధానం మూలంగా, భిన్న ప్రాంతాలలో ఉద్యోగాలు, బిజీగా మారిన జీవితాల మూలంగా పిల్లలకు పూర్వపు సంప్రదాయాలు, సంస్కృతుల పట్ల అవగాహన, అధ్యయనం కలిగించలేక పోతున్నామనే బాధ అందరూ వ్యక్తపరిచేదే. పూజలు, పునస్కారాలు, పద్ధతులు అటుంచి, కొన్ని రకాల పూజా సామగ్రిని, వస్తువులను ఏమంటారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు నేటి తరం పిల్లలు. అరివేణం, ఉద్ధరిణి, పంచపాత్ర వంటి పేర్లు వారికి చెబితే – వారు బిక్కమొహం వేయాల్సిందే అర్ధం తెలియక. అయితే, లోపం వారిలో లేదని, పెద్దవారు తగిన శ్రద్ధ తీసుకొని వారికి ఆ అపూర్వ  సంపదను అందజేయాలని చక్కని సందేశంతో రాసారు రచయిత్రి ఈ కథని.

ఇందులో ప్రత్యక్షంగా కనిపించే పాత్రలు రెండే. చిన్ననాటి నుంచి స్నేహితులై పెద్ద వయసులో ఉన్న ఇద్దరు స్త్రీలు సరస్వతి , జగదంబ. అయితే, వారి మధ్య సంభాషణ ద్వారా, మన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సంబంధిత విజ్ఞానంలో నేటి కాలం పిల్లలు ఎలా వెనుకబడి ఉన్నారో హాస్య స్ఫోరకంగా సూచిస్తూ, అటువంటి స్థితి నుంచి బయట పడడానికి పెద్దలు తీసుకోవలసిన జాగ్రత్తలను అన్యాపదేశంగా సూచిస్తూ ముగుస్తుంది కథ.

ఇక కథలోకి వెళ్తే, జగదంబతో పాటు ఐదేళ్ళ వయసున్న ఆమె మనుమడు కూడా పూజకు కూర్చోవటం చూసి ముచ్చట పడుతుంది సరస్వతి. అయితే, చిన్ననాటినించే  పిల్లలకన్నీ నేర్పాలని, లేదంటే, అభాసు పాలవుతామని అంటూ ఒక సంఘటనను గుర్తు చేస్తుంది జగదాంబ. ఒక నాడు, ఊర్లో ఎవరింటిలోనో పూజ కార్యక్రమం నిమిత్తం “పంచపాత్ర” తెమ్మని దీక్షితులుగారి  మనుమడిని ఇంటికి పంపుతారు. అయితే, ధిల్లీ నగరంలో చదువుకుంటున్న ఆ పిల్లాడు, ఇంటికి వెళ్లి – ఒక ‘పంచె’, మరో పెద్ద ‘పాత్ర’ తీసుకునివస్తాడు. ఆహితాగ్ని ఐన దీక్షితులు గారి మనవడి జ్ఞానం చూసి, అందరూ నవ్వడం, దీక్షితులు గారి భార్య చిన్నబుచ్చుకోవడం జరుగుతుంది. అయితే, ఈ సంఘటనని ఇక్కడవరకే చెప్పి ఊరుకోలేదు రచయిత్రి. ఒక సానుకూల దృక్పథంతో కథలో ఆసక్తికరమైన మలుపును జోడించారు.  అదే దీక్షితులు గారి అబ్బాయి, డిగ్రీ చదివిన తరవాత, తాతగారి దగ్గరకి వచ్చి, వేదాలూ -శాస్త్రాలు , ఉపనిషత్తులూ- పురాణాలూ ,మీమాంసలూ, తదితరాలని నేర్చుకోవటమే కాక, ఇతర విద్యార్ధులకి కూడా నేర్పే స్థితికి చేరుకుంటాడు.

చివరకు, సరస్వతి కూడా – జగదంబతో ఏకీభవించి, తన మనుమరాలికి కూడా సోత్రాలు, స్తవాలు నేర్పిస్తానని, తద్వారా తన సమయాన్ని కూడా “సద్వినియోగం”  చేసుకొంటానని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ విధంగా కథా శీర్షిక “సద్వినియోగం” అని పెట్టినందుకు సాఫల్యత చేకూరింది.

ఇక కథకు మాధవ్ గారు వేసిన రంగుల చిత్రం నిండుతనం కూరుస్తుంది. అయితే, కథ మొత్తాన్ని తన కుంచె తోనే చూపించే నైపుణ్యం గల మాధవ్ గారు – ఫ్లాష్ బాక్ లో జరిగిన సంఘటన తాలూకు చిత్రాన్ని కాని, చిన్న పిల్లాడు స్తోత్రాలు చెబుతున్న చిత్రాన్ని గాని అందులో జత పరచి ఉంటే ఇంకా బాగుండేది, అని (పట్టి, పట్టి, చూడడం వల్ల కలిగిన) నా అభిప్రాయం.

 

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు
http://www.gotelugu.com/issue125/3266/telugu-stories/sadviniyogam/

 

మరిన్ని శీర్షికలు
panch patas