Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అల్లరి నరేష్ తో ఇంటర్వ్యూ

interview with allari naresh
సెల్ఫీలంటే భ‌య‌మేసేస్తోందండీ బాబూ..!  - అల్ల‌రి న‌రేష్‌
 
రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర‌వాత కామెడీ క‌థ‌ల‌కు అంత‌లా అతుక్కుపోయిందీ... అలాంటి సినిమాల్లో న‌వ్వులు పంచిందీ... అల్ల‌రి న‌రేష్ మాత్ర‌మే!
ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వ‌ర‌కూ న‌వ్వించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొంటాడీ అల్ల‌రోడు. అందుకోసం పంచ్‌లు వేస్తాడు, స్నూఫ్‌లు చేస్తాడు, ఫేస్ బుక్‌లో జోకుల్ని వాడుకొంటాడు.. ఏం చేసినా అతని అంతిమ ల‌క్ష్యం.. టికెట్టు కొన్న ప్రేక్ష‌కుల‌ను వినోదాల్లో ముంచెత్త‌డ‌మే. కాసేపు న‌వ్వుకొందామంటే ఎవరికి ఇష్టం ఉండ‌దు చెప్పండి?  అందుకే... న‌రేష్ సినిమాల‌కు అంత గిరాకీ ఏర్ప‌డింది. ఏమైందో ఏమోగానీ ఈమ‌ధ్య న‌రేష్ బండి కాస్త స్లో అయ్యింది. హిట్లు లేక‌పోవ‌డంతో కామెడీ కోసం న‌రేష్ కొత్త దారుల్ని వెదుక్కోవాల్సివ‌స్తోంది. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా చేసిన సినిమానే.. సెల్ఫీరాజా. ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా గురించి సెల్పీరాజా న‌రేష్ గో తెలుగుతో పంచుకొన్న ముచ్చ‌ట్లు ఇవీ... 

* సెల్పీల స‌ర‌దా మీక్కూడా ఉందా?
- అస్స‌ల్లేదండీ. నాకు సెల్పీలంటే చిరాకు. ఎందుకంటే మ‌నం ఏ మూడ్‌లో ఉన్నా సెల్ఫీలంటూ కొంత‌మంది తెగ విసిగిస్తారు. ఆ మ‌ధ్య ఓ క‌మెడియ‌న్ చ‌నిపోతే వాళ్లింటికెళ్లా. అక్క‌డ కూడా న‌న్ను సెల్ఫీలు అడిగిన వాళ్లున్నారు.  సెల్ఫీ తీసుకొంటూ ప్రాణాలు పోగొట్టుకొన్న‌వాళ్లు చాలామంది క‌నిపిస్తారు. పేప‌ర్లో రోజు మ‌నం ఆ వార్త‌లు చ‌దువుతూనే ఉన్నాం. పైగా సెల్ఫీలో ఫొటోలు తీసుకొంటే మ‌న మొహాలు భ‌యంక‌రంగా వ‌స్తుంటాయి. అందుకే నాకు సెల్పీ అంటే న‌చ్చ‌దు.

* కానీ మొహ‌మాటానికైనా సెల్ఫీ దిగాల్సివ‌స్తుంది క‌దా?
- అవున‌నుకోండి.. అప్పుడు మాత్రం లేని న‌వ్వుని కొని తెచ్చుకోవాలి. నిజానికి సెల్ఫీ కోసం రెండు సెక‌న్లు వృథా చేయ‌డం క‌ష్టమేం కాదు. అందులో మ‌న‌కు పోయేదేం లేదు. కానీ అక్క‌డ ఎదుటివాళ్లు చేసే హంగామా చూస్తేనే భ‌యం వేస్తోంది. ఈమ‌ధ్య ఏం జ‌రుగుతోందంటే.... 'మీరు పొడుగ్గా ఉన్నారు క‌దా.. మీరే తీయండి సెల్ఫీ' అంటూ సెల్ ఫోన్ కూడా నా చేతులోనే పెడుతున్నారు. దాంతో సెల్ఫీ అంటేనే భ‌య‌ప‌డిపోతున్నా. 

* కింగ్ ఫిష‌ర్ విజ‌య్ మాల్యాతో సెల్పీ దిగారు..  ప్ర‌చారం కోస‌మా, నిజంగానే దొరికాడా?
- అదేం లేదండీ.. కేవలం ప‌బ్లిసిటీ కోస‌మే. ఆ టైమ్‌లో దేశ‌మంతా విజ‌య్‌మాల్యా హాట్ టాపిక్‌గా మారాడు. ఏ పేప‌ర్ చూసినా త‌నే.. ఏ ఛాన‌ల్ మార్చినా అత‌ని సంగ‌తే. అందుకే.. సెల్ఫీని క్రియేట్ చేశాం. నిజానికి దాంతోనే మా ప‌బ్లిసిటీ స్టార్ట్ అయ్యింది.

* ఈ సినిమాలో మీరేం చేస్తుంటారు.. సెల్ఫీలు దిగ‌డం కాకుండా...
- సెల్ఫీలు దిగ‌డం నా హాబీ. సెల్ఫీ అంటే వాడొక్క‌డే ప‌డ‌డు క‌దా?  వాడి వెనుక ఓ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ బ్యాక్ గ్రౌండే... మ‌నోడ్ని ప‌రుగులు పెట్టిస్తుంటుంద‌న్న‌మాట‌. దానికి తోడు... హీరోకి లూజ్ టంగ్ ఒక‌టి. నోటి దుర‌ద వ‌ల్ల‌.. ప్రాణంమీద‌కు తెచ్చుకొంటుంటాడు. వాటి వ‌ల్ల ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమాలో మెయిన్ పాయింట్‌. 

* ఇక స్నూఫ్‌లు చేయ‌ను అంటూనే ఈ సినిమాలో కూడా అలాంటి ప్ర‌య‌త్నాలేవో చేసిన‌ట్టున్నారు?
- నిజం చెబుతున్నా... సుడిగాడు త‌ర‌వాత స్నూఫ్‌ల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యా. నిజంగానే సుడిగాడు త‌ర‌వాత స్నూఫ్‌లేం చేయ‌లేదు. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ద‌ర్శ‌క నిర్మాత‌ల బ‌ల‌వంతంతో ఒక‌టీ అరా అక్క‌డ‌క్క‌డా చేశాను త‌ప్ప‌.. ఆ సంగ‌తే మ‌ర్చిపోయా. కానీ.. నా సినిమా అనేస‌రికి అంద‌రూ స్నూఫ్‌లు బాగా ఉంటాయ‌నుకొంటున్నారు. ఆ అపోహ ఎప్పుడు ఎలా పోతుందో నాకే అర్థం కావ‌డం లేదు. పైగా స్నూఫ్ చేసేట‌ప్పుడు నేను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటా. ఏ హీరోనీ త‌క్కువ చేయ‌కూడ‌దు క‌దా. కావాలంటే న‌న్ను నేను త‌క్కువ చేసుకోవ‌డానికైనా రెడీ. సుడిగాడు చూశారు క‌దా? అందులో 108 చిత్రాల్ని స్నూఫ్ చేశా. కానీ ఏ హీరోతోనూ గొడ‌వ రాలేదు. నేనూ ఇబ్బంది ప‌డ‌లేదు.

* కానీ  ఇందులో  'చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌' కూడా వాడేసిన‌ట్టున్నారు?
- ఆ డైలాగ్ పెట్ట‌డానికి ఓ కార‌ణం ఉంది. అదేంట‌న్న‌ది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. అయితే ఇదేదో కాంట్ర‌వ‌ర్సి కోసం పెట్టిన డైలాగ్ కాదు. ఒక‌వేళ మా సినిమాని అల్లు అర్జున్ చూసినా.. ఆ డైలాగ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి హాయిగా న‌వ్వుకొంటాడు.   

* హార‌ర్ కామెడీ చిత్రాల‌కు కాలం చెల్లుతోంద‌న్న ద‌శ‌లో మీరు.. ఆ జోన‌ర్‌లో సినిమా మొద‌లెట్టారెందుకు?
- అలాంటిదేం లేదండీ. ఏ జోన‌ర్ కూడా అవుడ్డేటెడ్ కాదు. స‌రిగ్గా తీస్తే జ‌నం చూస్తూనే ఉంటారు. నా వ‌ర‌కూ దాదాపుగా అన్నీ జోన‌ర్ల‌లోనూ సినిమాలు చేశా. హార‌ర్ కామెడీ ఒక్క‌టీ చేయ‌లేదు. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. 

* ల‌డ్డూబాబు, బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళీ, బంధిపోటు ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డం మీ కెరీర్‌ని ఇబ్బందుల్లో నెట్టేసింద‌ని భావిస్తున్నారా?
- ఫ్లాపులెవ‌రికైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయి. ఇది వ‌ర‌కు ఓ హిట్టు కొడితే నాలుగు కొత్త ఆఫ‌ర్లు వ‌చ్చేవి. అందులో ఓ సినిమా హిట్ట‌యినా స‌రిపోయేది. ఇప్పుడు అలా కాదు. ప్ర‌తీ సినిమాతోనూ నిరూపించుకోవాల్సిందే. అడ్డూబాబుతో ఓ ప్ర‌యోగం చేశా. కానీ బెడ‌సి కొట్టింది. నా సినిమాల్లో హీరోయిన్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ద‌న్న విమ‌ర్శ ఉంది. అందుకే బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళీ, జేమ్స్ బాండ్ సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకొన్నా. అయినా స‌రే లాభం లేకుండా పోయింది. నా సినిమాలు బీసీల‌కే ప‌రిమిత‌మైపోయాన్న ఓ లోటు ఉండేది. దాని కోసం బందిపోటు సినిమా చేశా. అది ఏ సెంట‌ర్లోనూ ఆడ‌లేదు. కొత్త దారిలో వెళ్లిన‌ప్పుడు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వు.  

* వ‌రుస ఫ్లాపుల నుంచి ఏం నేర్చుకొన్న‌ట్టు?
- సినిమాల విష‌యంలో కంగారు ప‌డ‌కూడ‌ద‌న్న‌ది తెలిసింది. నా చేతిలో నాలుగు సినిమాలు ఉండ‌డం కంటే, మంచి సినిమా ఒక్కటున్నా చాలు అనిపిస్తోంది. కామెడీ సినిమాలంటే కాస్త చిన్న చూపు ఉంది. క్వాలిటీ విష‌యంలో అస్స‌లు ప‌ట్టించుకోరు. పాట‌ల్ని కూడా చుట్టేద్దాం అనుకొంటారు. కానీ నేను ఆ విష‌యంలో రాజీ ప‌డ‌ద‌ల‌చుకోలేదు. 

* త‌మిళంలో మ‌ళ్లీ చేసే అవ‌కాశాలున్నాయా?
- త్వ‌ర‌లోనే స‌ముద్ర‌ఖ‌నితో ఓ సినిమా చేస్తున్నా. ముందు త‌మిళంలో విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత తెలుగులోకి వ‌స్తుంది.

* కృష్ణ‌భ‌గ‌వాన్ క‌థ‌లో న‌టిస్తున్నార‌ట‌..
- అవును. అలా ఎలా ద‌ర్శ‌కుడు హ‌నీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మేడ మీద అబ్బాయి అనే పేరు పెట్టాం.

* ఓకే.. ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ సెల్ఫీ రాజా..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్ అండీ....


-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka