Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: సెల్ఫీ రాజా 
తారాగణం: అల్లరి నరేష్‌, కామ్నాసింగ్‌ రణవత్‌, సాక్షి చౌదరి, పృధ్వీ, రఘుబాబు, నాగినీడు, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, జ్యోతి తదితరులు 
సంగీతం: సాయి కార్తీక్‌ 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి 
కథ: శ్రీధర్‌ సీపాన 
నిర్మాత: చలసాని రామబ్రహ్మం చౌదరి 
నిర్మాణం: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
సినిమాటోగ్రఫీ: ఎస్‌.లోకనాథన్‌ 
విడుదల తేదీ: 15 జులై 2016 
క్లుప్తంగా చెప్పాలంటే 
సెల్ఫీ రాజా (అల్లరి నరేష్‌) పోలీస్‌ కమిషనర్‌ (నాగినీడు) కూతురు శ్వేత (కామ్నా రనవత్‌)తో ప్రేమలో పడతాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక కొన్ని కారణాలతో సెల్ఫీ రాజా, కామ్నా రనవత్‌ విడిపోతారు. అయితే సెల్ఫీ రాజాని అపార్ధం చేసుకున్నానని గ్రహించి తిరిగి అతని వద్దకు వెళ్ళాలనుకుంటుంది శ్వేత. ఈలోగా తొందరపడ్తాడు సెల్ఫీ రాజా, కాంట్రాక్ట్‌ కిల్లర్‌కి తనను చంపేయమని చెప్పడం ద్వారా. ఆ కిల్లర్‌తోపాటు మరో క్రిమినల్‌ గ్యాంగ్‌ సెల్ఫీ రాజాని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. తనను తాను రక్షించుకోవడంతోపాటు, తన భార్యతో వైవాహిక జీవితం కొనసాగించడం కోసం సెల్ఫీ రాజా పడే పాట్లు తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
అల్లరి నరేష్‌ ఇంకోసారి ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రల్లోనూ కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా స్పూఫ్‌ల మీదనే ఆధారపడ్డాడు అల్లరి నరేష్‌. పలు గెటప్స్‌లో తనవరకూ ప్రేక్షకుల్ని అలరించగలిగాడు. హీరోయిన్లలో కామ్నా రనవత్‌, సాక్షి చౌదరి ఇద్దరూ గ్లామర్‌కే పరిమితమయ్యారు. ఫృధ్వీ, రఘుబాబు, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌ ఇలా మిగతా నటీనటులంతా కామెడీతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగినీడు ఫర్వాలేదు.

కథ కొత్తదేమీ కాదు. స్ఫూఫ్‌ల మీదనే దర్శకుడు కూడా ఆధారపడిపోయాడు. కథనం కూడా కొత్తగా ఏమీ అనిపించదు. కామెడీ కోసమే రూపొందిన సినిమా కావడంతో కామెడీ పరంగా డైలాగులు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే.

అల్లరి నరేష్‌ సినిమా అంటే కామెడీ కోసమే. ఆ కామెడీలోనూ కొత్తదనం లేకపోతే ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టాలనుకోవడం కత్తిమీద సామే అవుతుంది. బుల్లితెరపైనా కామెడీ స్కిట్స్‌ అదిరిపోతున్నాయి. ఈ మధ్య సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలా ఎక్కువైంది కాబట్టి, కామెడీ హీరో అల్లరి నరేష్‌ కామెడీ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. దర్శకుడి వైపు నుంచి కూడా అలాంటి కొత్తదనం కోసం ప్రయత్నాలు జరగకపోవడంతో కామెడీ మరీ అంతగా పండలేదు. ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ అంతా కామెడీనే నింపెయ్యాలి, ఎందుకంటే ఇది అల్లరి నరేష్‌ సినిమా. ఆ ప్రయత్నమైతే చేశారుగానీ, అనుకున్న రేంజ్‌కి కామెడీని తీసుకెళ్ళలేకపోయారు. ఓవరాల్‌గా ఓ సారి చూసెయ్యచ్చనిపించే కామెడీ మాత్రమే.

ఒక్క మాటలో చెప్పాలంటే 
సెల్ఫీ రాజా ఇది రొటీన్‌ స్ఫూఫ్‌ రాజా 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
rakul act with super star