Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue170/485/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

‘‘ నీ వద్ద సమాచారము సరైనదే అనుకుందాము. వూహ మాత్రం గా నయినా మన శత్రువు ఎవరో తెలియాలి గదా. మన మీద దాడి చేయు ధైర్యం ఏ దేశానికున్నది? కుట్ర దారుడు ఏ దేశాధీశుడు?’’ అనడిగాడు అర్కుడు.

‘‘వదంతులు మున్ముందుగా ఓడ రేవు ప్రాంతమందు మొదలయినవి. సముద్ర మార్గముగా వచ్చిన గూఢచారుల పని యిది....’’ బాహ్లీకుని మాటల్ని మధ్య లోనే ఖండించాడు అర్కుడు.

‘‘మనం పశ్చిమ సముద్ర తీరాన వున్న సంగతి బాహ్లీకుల వారు మరచినట్టున్నారు. మనకు పశ్చిమంగా సముద్రము తప్ప రాజ్యము లేవు.

పశ్చిమోత్తరంగా ఎగువన ఎక్కడో కరూర దేశము, పారశీకలో ఇరాను, ఘరాను, పఠాను మొదలగు పాలకులన్నను వారివి చిన్న దేశములు. సముద్ర మార్గముగా మన రాజ్యముపై దండెత్తు తెగువ ధైర్యం వారికెక్కడివి? ఇలాంటి అర్థం లేని సమాచారములు ఎందుకూ కొరగావు. శత్రువు రాజ్యం బయట లేడు. లోపలే వున్నాడు. మన మధ్యే వున్నాడని సందేహము. ప్రస్తుతం ప్రభుత్వ చారులు అది తెలుసుకునే ప్రయత్నం లోనే వున్నారు. మీరు ఆవేశ పడి ఫలితము శూన్యం. మీరు కూచోండి.’’ అన్నాడు నిర్మొహమాటంగా సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు.

అతడి మాటలు బాహ్లీకునికి చెంప పెట్టు లాంటిది. తన గురించి అర్కుని వద్ద సమాచారం ఉండొచ్చన్న సందేహం ఏర్పడింది. అదే నిజమైతే తను తొందరగా పావులు కదిపి ఈ దొంగాటను త్వరగా ముగించాలి అనుకున్నాడు. అందుకే ఇక మాట్లాడక మౌనంగా వుండి పోయాడు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం` ‘‘యువ రాజా వారు క్షేమంగా వున్నారు. త్వరలో నగరానికి రానున్నారు. ప్రజలు వదంతులు నమ్మి మోస పోవద్దు. వదంతులు వ్యాపింప జేస్తున్న వారిని త్వరలో పట్టుకుంటాం. వారికి కఠిన దండన తప్పదు.’’ అంటూ ఆ రోజే నగర మంతటా దండోరా వేయబడింది. ఆ రోజే కాదు, వరుసగా మూడు రోజుల పాటు కొన సాగిందా దండోరా.

************************************

గాఢ నిద్రలో వున్నాడు యువ రాజు ధనుంజయుడు. అతనికి అటు భద్రా దేవి ఇటు నాగరాజ తనయ ఉలూచీశ్వరి వున్నారు. వారి అశ్వాలు గరుడ, ఢాకినీలు రెండు పక్కనే ఒక శాలి వృక్షానికి బంధింప బడున్నాయి.

అప్పుడు సమయం`

రాత్రి మూడవ మాయం.

ఆకాశం మేఘావృతమైంది.

నలు దిశలా చిక్కటి చీకటి అలుముకునుంది. కాని వర్షం పడే సూచనల్లేవు. చల్లటి గాలి వీస్తోంది. ప్రకృతి ప్రశాంతంగా వుంది. అడవి నుండి కౄరమృగాల సద్దు కూడ విన్పించటం లేదు.

అది హైహియ రాజ్య భూ భాగం.

అక్కడికి మత్స్య దేశ సరి హద్దు ప్రాంతం ఒక పూట ప్రయాణ దూరంలో వుంది. మహా పధానికి కాస్త ఎడంగా సువిశాలమైన మైదానంలో రాతి గుట్టల మీద నిద్ర పోతున్నారంతా. వారికి భూతం ఘృతాచి వేయి కళ్ళతో రేయంతా కావలి తిరుగు తోంది.

మూడు దినముల క్రిందట`

వింధ్యా పర్వత శ్రేణి ప్రాంతం నుండి వారు బయలు దేరారు. ఆ దినమున శంఖు పుత్రితో సహా నలుగురూ సాయం సమయం వరకు అచ్చటనే గడిపారు. వాస్తవానికి ఉలూచీశ్వరి, ధనుంజయలను కలిపాక, ఉలూచీశ్వరిని తిరిగి తమ నాగ లోకం చేర్చే ఉద్దేశంలో వుంది శంఖు పుత్రి. కాని ఉలూచీశ్వరి ఎప్పుడైతే ధనుంజయుని విడిచి రానందో శంఖు పుత్రి ఇరకాటాన పడింది.

అప్పటికే ఆలస్యమైంది గాబట్టి ఈ పాటికి తను ఎక్కడ వున్నదీ నాగ రాజుకు తెలిసి పోయి వుంటుంది. వెనక్కు వెళితే తను కదలకుండా రాజ మందిరం లోనే నిర్బంధిస్తారన్న భయం తోను, ధనుంజయుని విడిచి పోలేక ఉలూచీశ్వరి ఆ నిర్ణయం తీసుకుంది. అయితే`

శంఖు పుత్రిది వారితో ఉండ లేని వెనక్కు పోలేని సంకట పరిస్థితి. ధనుంజయ, ఉూచీశ్వరుల్ని కలపటంలో తన పాత్ర వుందని తెలిస్తే నాగ రాజు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఇంతకాలం తర్వాత మరో సారి శిక్షకు గురి కాలేదు. కాబట్టి వారి వెంట పయనించ లేదు. తనకే సంబంధం లేనట్టు వెనక్కు వెళ్ళి పోవటం మంచిది. అందుకే`

సాయం కాలం వేళ వారిని విడిచి ఆమె వెళ్ళి పోయింది. వెళ్లే ముందు మర్మ భూమిలో వారి రాక కోసం ఎదురు చూస్తానంటూ చెప్పింది.
నాగులకు ఆకాశ గమనం తెలుసు.

పగటి వేళ గరుడ పక్షులకు వెరచి`

ఆకాశ యానం చేయరు.

చీకటి పడుతూండగా ఆకాశ మార్గన వేగంగా వెళ్ళి పోతారు. శంఖు పుత్రి కూడ అదే విధంగా ఆ రాత్రికే ఆకాశ గమనం ద్వారా మర్మ భూమికి చేరుకుంది.

ఆ విధంగా శంఖు పుత్రి నిష్క్రమించాక ధనుంజయడు తన సఖియ లిరువురితో హైహియ రాజ్యంలో ముందుకు సాగి పోతూనే వున్నాడు. యువ రాణి ఉలూచీశ్వరి ఎవరికీ కనబడకుండా పగలు శ్వేత నాగుగా మారి గరుడాశ్వం మీది తోలు సంచిలో విశ్రమిస్తోంది. భద్రా దేవి అశ్వం మీద ఆమెతో బాటు తోలు సంచిలో భూతం ఘృతాచి ప్రయాణం చేస్తోంది. హైహియ రాజ్యం చిన్న రాజ్యం. రాజధాని జయంతీ పురం మహా పథానికి ఎడంగా లోపలికి వుంది. బాట నగరానికి చీలి పోతుంది. అటు పోకుండా పట్టణాలు పల్లెల్లో కొండ కోనలు దాటుకొంటూ అక్కడికొచ్చేసరికి చీకటి పడింది. దాంతో మైదానం లోని ఆ రాతి గుట్ట మీద ముగ్గురూ రాత్రికి మజిలీ చేసారు.

వారి ప్రయాణ మార్గంలో ఎగువన మత్స్య దేశం వుంది. అది దాటితే అంగ రాజ్యం వస్తుంది. అంగ రాజ్యం నుండి ఈశాన్యంగా ఫ్రాగ్‌ జ్యోతిష పురం రాజధానిగా ఒకప్పటి నరకాసురుడి రాజ్యం వుంది. అక్కడి ప్రజలను అసోము అంటారు. ఆ రాజ్యాన్ని ఆనుకొని అవతల వున్నదే సువిశాలమైన మర్మ భూమి అటవీ ప్రాంతం.

ఆ సమయంలో`

గాఢ నిద్రావశుడైన ధనుంజయుడు ఒక కల గంటున్నాడు. కలలో అది ఏ ప్రాంతమో, తను ఎక్కడున్నాడో తెలీదు. చెట్టు చేమలు చెదురు మదురుగా వున్నాయి. వాటి మధ్య తను నిరాయుధుడిగా ఒంటరిగా పరుగు తీస్తున్నాడు. అతడి వెనక ఒకటి కాదు రెండు కాదు అనేక సర్పాలు పగ బట్టినట్టు పోటీ పడి తరుము తున్నాయి. తన ఆయుధాలయిన విల్లంబులు, కృపాణము, శూలము,

బరిసె మొదలయినవి ఏమైనవో తెలియదు. చెంత ఒక్క ఆయుధమూ లేదు. ప్రాణ సఖియగు భద్రా దేవి గాని ఉలూచీశ్వరి గాని లేరు. ఎక్కడున్నారో తెలీదు. అసలు ఏమైనదో ఏమి జరిగినదో కూడ తెలియదు. పరుగు... ఒకటే అలుపెరుగని పరుగు. పాముల బారిన పడకుండా తప్పించుకు పోతూనే వున్నాడు. అలా ఎంత దూరం వచ్చేసాడో తెలీదు.

ఇంతలో`

ఒక్క సారిగా`

కాళ్ళ కింద భూమి రెండుగా చీలింది.

ఆ చీలిక లోకి జారి పోయాడు.

చిమ్మ చీకటి కంటి కేమీ కన్పించటం లేదు. పట్టుకుందామంటే చేతి కేమీ దొరకటం లేదు. చీకటిలో శర వేగంగా ఎక్కడికో జారి పోతున్నాడు. కొంత సేపటికి అలా జారి జారి ఇసుక మీద పడి పోయాడు. పడి లేచి చుట్టూ చూసాడు. అదేదో ఎడారి భూమిలా వుంది. చిరు చీకటి అలము కొని వుంది. నిర్మానుష్యంగా వుంది. సమీపంలో ఎక్కడా ఇళ్ళు గాని కట్టడాలు గాని చెట్టు చేమలు గాని లేవు. పైన నక్షత్రాలూ లేవు. అసలది ఏ లోకమో, తను ఎక్కడి కొచ్చి పడ్డాడో బయటి కెలా వెళ్ళ గలడో ఏమీ అర్థం గాని అయోమయంతో దిక్కు తోచక మోకాళ్ళ మీద ఇసుకలో కూల బడి పోయాడు. పుట్ట వ్రణంతో నరక యాతన అనుభవిస్తున్న తండ్రి ధర్మ తేజుడు గుర్తు కొచ్చాడు. తననే నమ్ముకున్న ప్రాణ సఖియలు భద్రా దేవి, ఉలూచీశ్వరి గుర్తుకొస్తున్నారు.

‘‘అయ్యో భగవంతుడా! ఏమి ఈ దురవస్థ. తండ్రి బాధను పోగొట్టి కన్న రుణం తీర్చుకో లేని అ ప్రయోజకుడనైతినే. ప్రియా భద్రా, మనోహరీ ఉలూచీ... ఎచట వున్నారు. మీరు ఏమి దురవస్థ పాలైతిరో గదా. మీ ప్రేమకు దూరమైతి. మీ ఆశలు వమ్ము జేసితి. నా వంటి నిర్భాగ్యుని వరించి కష్టముల పాలైతిరి గదా. విధి యిలా వంచన జేసిన దేమి? నాకా ఈ దురవస్థ. ఇది యేమి ప్రారభ్థ కర్మ...’’ అని దుఖ్ఖిస్తూ బిగ్గరగా అరిచి రోదిస్తున్నాడు. ఆ మరు భూమిలో అతడి రోదన ప్రతిధ్వనిస్తోంది.

అలా ఎంత సేపు గడిచిందో తెలీదు.

తర్వాత ఏమి జరిగేదో గాని ఇంతలో`

బిగ్గరగా అరుస్తున్న భూతం ఘృతాచి అరుపు ఒక్కసారిగా ధనుంజయుని ఉలికి పడి లేచేలా చేసాయి. దిగ్గున లేచాడు. కొన్ని లిప్తలకాలం ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఎడారి లేదు, చీకటి లేదు. ఇంత సేపు తను గాంచినది స్వప్నమని గ్రహించాడు. దానికి అర్థం ఏమిటో తెలీక తల విదిలించి చూసాడు. అతనికి ముందే నిద్ర లేచిన భద్రా దేవి, ఉలూచీశ్వరిలు కూడ విభ్రాంతులై చుట్టూ చూస్తున్నారు.

తామంతా రాత్రి ఎచట నిద్రించారో అదే రాతి గుట్ట మీద వున్నారు. సమయం తెల్లవారు జాము సమీపిస్తున్నట్టు పశ్చిమాకాశంలో ప్రకాశిస్తున్న శుక్ర గ్రహం సూచిస్తోంది. తామున్న రాతి గుట్టను చుట్టి చక్ర బంధంలా ఎటు చూసినా అనేక దివిటీలు గాలికి రెప రెప లాడుతూ ఆ ప్రాంతాన్ని పట్ట పగలు చేస్తున్నాయి.

ఇది కల కాదు వాస్తవం. ముగ్గురూ లేచి నిల బడి` ముఖ ముఖాలు చూస్తున్నారు.

రాతి గుట్టను ఎవరో ముట్టడించ బోతున్నట్టు ఎటు చూసినా ఒకటి కాదు రెండు కాదు` వందలాది దివిటీలు కదలి వస్తున్నాయి. వాటి వెలుగులో పరసరాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ముందు వరుసలో సర్పాలు అనేకం బారులు తీరి వేగంగా కదలి వస్తున్నాయి. కోకొల్లలుగా సర్పాలు. ఎర్ర త్రాచు, నల్ల త్రాచు, గోధుమ వన్నె త్రాచు, మిన్నాగు, రక్త పింజేరులు యిలా అన్నీ భయంకరమైన విషాన్ని గ్రక్కే కౄరసర్పాలు. బుసలు కొడుతూ పడగలు విప్పి ఆడుతూ ఒక దాన్ని ఒకటి త్రోసుకుంటూ గుట్ట సమీపం లోకి వచ్చేస్తున్నాయి.

ఆ సర్పాల మధ్యలో`

నాగ లోకానికి చెందిన అనేక మంది భటులు కాగడాలు చేత బట్టి వస్తున్నారు. వాళ్ళంతా సగం సర్ప రూపంలోను పైన రెండు చేతులు, శిరస్సుతో మానవాకారం గాను వున్నారు. నాగాభరణాలు ధరించి వున్నారు. ఒక చేత శూలం, బరిసె మొదలైన ఆయుధాలు కలిగి వున్నారు.

ఆ నాగ పటాలానికి వెనగ్గా వస్తున్నారు నాగా జాతి వీరులు. వారంతా మర్మ భూమి (నాగా లాండ్‌) అటవీ ప్రాంతం లోని నాగుల దిబ్బ పరిసర నాగా ప్రజలకు చెందిన నాగా వీరులు. విల్లంబులు, కృపాణాలు, ఈటెలు, బరిసెలు మొదలయిన ఆయుధాలు ధరించి యుద్ధానికి సన్నద్ధులై వీరావేశంతో వస్తున్నారు. వారి వెంట నాగా నాయకుడు నాగ కేసరి, వృద్ధ నాగానందుడు ఇంకా వారి మత గురువు గణాచారిలు కూడ తరలి వస్తున్నారు.

వారంతా రాతి గుట్టను చుట్టి నలు వైపులా ముట్టడికి వస్తుండగా ఉత్తర దిక్కున వారందరికీ వెనగ్గా చిరు చీకట్లలో వస్తున్నాడు నాగ రాజు మహా పద్ముడు. సర్ప రూపంలో పది శిరస్సులను గొడుగులా పడగ విప్పి నాలుకలు తోడుతూ ఉగ్ర రూపంతో జర జరా ప్రాకుతూ వస్తున్నాడు.

ఆకులతో కూడిన పచ్చి కొమ్మ ఒకటి పుచ్చుకుని ఎగిరెగిరి గంతు లేస్తూ అప్పటికే గుట్టను సమీపిస్తున్న పాముల్ని దబ దబ బాది వెనక్కి తోసి పడేస్తూ పెద్దగా భద్రా దేవి బృందాన్ని లేవమని అరుస్తోంది భూతం ఘృతాచి. అప్పటి కింకా ధనుంజయుని కంట పడలేదు నాగ రాజు. కాని తన కూతురు ఉలూచీశ్వరి కోసం అతడే తరలి వస్తున్నాడని ధనుంజయుడు గ్రహించి సఖియలిద్దర్ని ఆశ్చర్య సంభ్రమాలతో చూసాడు.

‘‘భద్రా...! ఏం జరుగుతోంది?’’ అనడిగాడు యుధాలాపంగా.

అతడి ప్రశ్నకు ఉలూచీశ్వరి బదులిచ్చింది.

‘‘నా కోసము స్వయముగా నా జనకుడే తరలి వచ్చినట్టున్నాడు’’ అంది గాభరాతో ధనుంజయుని భుజం మీద చేయి వేసి.

‘‘వారి వెంట మీ లోకమునకు పోదువా?’’ అడిగాడు.

‘‘లేదు సఖా. మీ పాదాల చెంతనే నా ప్రాణము పోయిననూ పోవు గాక, నేను మాత్రం మిమ్ము విడిచి పోజాల’’ అంటూ ప్రేమాతిశయంతో ధనుంజయుని గాఢంగా హత్తు కొని అతడి అధరాలను వలపు మీరా చుంబించింది ఉలూచీశ్వరి.

‘‘భయ పడకు. అవసరమైతే మన కోసం నీ తండ్రితో యుద్ధం చేసెద. దివ్య నాగమణి కొరకు మీ నాగ లోకం వరకు తరుము కెళ్తాను.’’ అన్నాడు ఆవేశంగా ధనుంజయుడు.

అతడి మాటలకు భద్రా దేవి`

‘‘ప్రియా! తొందర పడ వలదు. ఇలాంటి సమయమున మనకు ఆవేశకావేషములు లాభం చేకూర్చవు. పగలు శతృత్వాలను పెంచుకొనుట మంచిది కాదు. వచ్చింది ఎవరు? సాక్షాత్తూ నాగ లోక ప్రభువు. మన ఉలూచీశ్వరి జనకుడు. రేపు మీ పాద ప్రక్షాళనము జేసి కన్యా దాన మొనర్చు మామ గారు. నాకును వారు పితృ సమానులు. వారితో కయ్యమున పనులు కావు. నెయ్యమున సాధించు కొవలె’’ అంది సాలోచనగా.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham