Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథా సమీక్షలు - .

 

కథ: జీవన హేల!
రచయిత్రి: సమ్మెట ఉమాదేవి

                 సమీక్షకుడు: ప్రతాప వెంకట సుబ్బారాయుడు

         గోతెలుగు అర్ధశత (50) సంచిక!

 


ఒక కథ పాఠకులను ఆకట్టుకోవాలంటే పేరు, బొమ్మ, కథారంభం, గమనం, ముగింపు అన్నీ చక్కగా కుదరాలి. అలా అన్నీ అద్భుతంగా కుదిరిన మంచి కథ సమ్మెట ఉమాదేవిగారు రాసిన జీవన హేల.

ఇలా కథ చదవడం ప్రారంభించగానే, ఇహ కళ్లు మన మాట వినవు. చివరికంటా అక్షరాల వెంట పరిగెడతాయి. మనసు భారమవుతుంది. కళ్లలో నీళ్లు నిండుతాయి.

కథ విషయానికి వస్తే, రైల్లో అహల్యకు సావిత్రమ్మ అనే ఆవిడ దుఃఖభారంతో కుంగిపోతూ కనిపిస్తుంది. ఆవిణ్ని ఆప్యాయంగా పలకరిస్తుంది. దాంతో ఆవిడ తన మనసు విప్పుతుంది. కథంతా ధాత్రి అనే పిల్ల గురించి చెబుతూ..ఆమె అందచందాలు, ప్రకృతి పట్ల అభిరుచి, భక్తిభావం అన్నీ మాటల్లో రంగరిస్తుంది.

అలా అలా సాగుతున్న కథ ఆ పిల్లకు లుకేమియా అని చెప్పడంతో చదువరుల మనసులను మెలిపెడుతుంది. తనకూ ధాత్రికి ఏర్పడిన మానసిక అనుబంధం తెగిపోబోతుంటే, ఆ వయసులో అది తనకు ఎంత నరకయాతనో ప్రతి మాటలో వ్యక్త పరుస్తుంది సావిత్రమ్మ.
కథలోని కొన్ని వాక్య మెరుపులు-

"నేను అశ్రువులను తుడవగలనే కాని కొనగోటితో నీ దుఃఖాన్ని తుడచిపారెయ్యలేను సుమా అన్నట్టు నిస్సహాయంగా ముఖాన్ని కప్పేసిందామె కొంగు" 

"భారంగా తలెత్తి చూసిన ఆమె ముఖం మేఘాల నీడ సాగిపోయిన సముద్రంలా వుంది"

"అలాగే లేరా నేను ఏడవను లే పెద్దదాన్ని నేను ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళకెవరు ధైర్యం చెపుతారు..? చివరకు నా పెద్దరికం ఇలా ఓదార్పులకు పనికి వస్తున్నదిరా..."

"రంగుంటే ఏం చేస్తావు ధాత్రి నీకు మంచి మనసుంది. నీ కలుపు గోరుతనం నీకు రక్ష. నీ చిరునవ్వుతో జనాన్ని గెలుచుకుంటావు. ఎవడొస్తాడోగాని చాలా అదృష్టవంతుడు అంటాను నేను"

"వెన్నెల అత్తయ్యా వెన్నెల... ఈ వెన్నెల్లో రాలుతున్న పారిజాతాలను చూడాలి అవి నేలన రాలకుండా నేను వాటిని నా వడిలోకి పట్టుకోవాలి... తెల్లారే వరకూ నా వడి నిండిపోవాలి.."

"ఎక్కడ నుండో పొన్నపూలు ఏరుకొచ్చి అన్ని గదుల్లో అరమరల్లో వేస్తుంది ఏ పెర్ ఫ్యూమ్స్ పనికి వస్తాయి వీటి ముందు అంటుంది"

"నెలకోసారి రొట్టెలు చేసి గుడి మెట్ల దగ్గర బిచ్చగాళ్ళకు పంచుతుంది"

"తన పుట్టినరోజుకి సేవాశ్రమంకి వెళ్ళి పండ్లు పంచింది. వారానికోసారి వెళ్ళి వాళ్ళకు వారపత్రికల్లో కధలో భారత భాగవతాలో చదివి వినిపిస్తుంటుంది"

"అడ్వాన్స్ డ్ స్టేజీలో వున్న తనకు కిమో థెరపీలు ఇచ్చి కడాయిలో వేపినట్టు వేపద్దని"

"అది ఏ సూర్యోదయమో చూసి ప్రశాంతంగా నిదురించిన వేళో... పారిజాతాలు ఏరుకుని అలిసిపోయి పడుకున్నవేళో నిద్దట్లోనే పోవాలి. తను చచ్చిపోతున్నానని తనకు తెలియకుండానే పోవాలి... భగవంతుడా ఈ ఒక్క కోరికా తీర్చు..."

"అయినా ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ కనుక... ఎన్ని సార్లు అనుకున్నానో ఈ సారి నుండి అద్దెకున్న వారితో ఇంత అనుబంధం పెట్టుకోవద్దూ... తీరా ఏ ట్రాన్స్ ఫరో అయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడాల్సి వస్తున్నది అని... చూసావా అమ్మాయి ఇపుడా పిల్ల తన గూడే వదిలి వెళ్ళిపోతున్నది..!"

చివరికి ఆ పిల్ల సావిత్రమ్మగారింట్లో అద్దెకుండేవారి పిల్ల అని తెలిసి ఆ అలౌకిక బంధానికి కళ్లు మళ్లీ చెమరుస్తాయి. పైన ఉదహరించిన వాక్యాలు చదువుతుంటే రచయిత్రి పరిణతి చెందిన కథావిధానం స్పష్టంగా అవగతమవుతుంది.

సావిత్రమ్మకు దూరమవుతున్న ధాత్రిని పంచరంగుల్లో ముస్తాబుచేసి చిత్రకారుడు కథకు నిండుదనం చేకూర్చాడు.

పాఠకుల మనసును పదికాలాలపాటు అంటిపెట్టుకునుండే మంచి కథ జీవన హేల అన్నది నిస్సందేహం! కథకు వచ్చిన 104 లైకులు, స్పందించి అందించిన కామెంట్లు దానికి స్పష్టమైన నిదర్శనం.

*****
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు  

..http://www.gotelugu.com/issue50/1380/telugu-stories/jeevana-hela/

 

మరిన్ని శీర్షికలు
avee - ivee