Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
viseshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం 

దక్షిణదేశయాత్ర చేస్తున్న అగస్త్యమహర్షి  వింధ్యపర్వత గర్వాన్ని అణిచి, కొల్హాపూరు  శ్రీమహాలక్ష్మిని సేవించి, ఆమె ఆజ్ఞ మేరకు  స్వామిమలను దర్శించుకొనడానికి వెళ్ళాడు. దారిలో మాల్యవంతపర్వతాన్ని, మతంగముని  ఆశ్రమాన్ని దర్శించుకున్నాడు. తుంగభద్రానదిని  చూసి, పరవశించి తుంగభద్రను పొగడుతున్నాడు. 

ఓపును భూపరిధిన్ గల 
యాపగలవి బాహ్యతాపమాపఁగ నీవో 
యోపుదుగా యంతర్గత 
తాపత్రయమడఁప నోయుదన్వన్మహిళా!                    (కం)

'ఆపగలు' అంటే నదులు. భూపరిధిలో ఉన్న నదులు బాహ్యతాపాన్ని, వేడిమిని  ఆపగలుగుతాయి. ఓ సముద్రుని సతీ! నువ్వు మాత్రం అంతర్గతమైన మూడు  తాపాలను ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధిభౌతిక తాపాలను అణిచివేయగలవు. యిలా తుంగభద్రానదిని కొనియాడి, ఆ తీర్థజలాన్ని త్రాగి, తీరమునందున్న  పూజనీయులను పూజించి, కాశీపట్టణాన్ని విడిచిన విరహబాధను మరచిపోయాడు  అగస్త్యులవారు. అక్కడినుండి ముందుకు నడిచి స్వామిశైలమును, స్వామిమలను  దర్శించుకున్నాడు.

షణ్ముఖు, శిఖిసంతప్త హి
రణ్మయనిభవర్ణుఁ, గేకిరాడ్ధ్వజుఁ గొలిచెన్ 
షాణ్మాతురుఁ, దపసి, తురా 
షాణ్ముఖ సుఖదప్రభావు, సతియున్ దానున్              (కం)

స్వామిమలమీద షణ్ముఖుడిని, అగ్నిలో కాల్చినబంగారంలాగా ఉన్న శరీరకాంతిని కలిగిన కుమారస్వామిని దర్శించుకున్నాడు. నెమలిని ధ్వజచిహ్నముగా కలవానిని, ఆరుగురు తల్లులు(ఆరుగురు కృత్తికలు)కలిగినవాడిని, దేవేంద్రునికి కూడా సుఖాన్ని  ప్రసాదించగలిగిన ప్రభావము గలవానిని, దర్శించుకున్నాడు మహాతపస్వి ఐన అగస్త్యుడు తన సతీమణితో కలసి.

కొలిచి నుతించెన్ గ్రౌంచా
చల విదళననిపుణ బాహుసారుఁ గుమారున్ 
గలశీసుతుండు పలుకులు 
మొలకలు పుష్పోపహారముల చెలువొసగన్              (కం)

మృదువైన పూల హారములవంటి పలుకులతో క్రౌంచపర్వతాన్ని ఖండించిన  సమర్ధవంతములైన బాహువులు కలిగిన కుమారస్వామిని కొలిచి, యిలా నుతించాడు  అగస్త్యులవారు.

కావుకావనుట రక్కసులమూఁకనె కాని / ననిచె నీయెడ సింహనాద విహృతి 
పొత్తులు తొలువేలుపుల గంటులనె కాని / హత్తె నీమేన వజ్రాంగి జోడు 
పసవల్పు దైత్యులవ్రయ్యుగుండెనె కాని / నినుఁగప్పె వీరచందనపుఁదావి 
యంగుళీ చర్వణం బసురులందునె కాని / గెలుపుచిందము మోవి నిలిచె నీకు             (సీ)

నీవు తలమావివీడని నిసువువయసు 
నాఁడె జేజేలదళవాయి నాయఁకరపుఁ 
బట్టమున నిల్చి తారకుఁ గిట్టి ప్రౌఢ 
తర రణక్రీడ యొనరించుతఱి మహాత్మ!                     (తే)

తెనాలి రామకృష్ణుడు సామాన్య పసిపిల్లవాడి లక్షణాలను చెబుతూ, వాటిని వ్యతిరేక  అర్థాలతో రాక్షసులకు అన్వయించి, కుమారస్వామిని ప్రస్తుతిస్తున్నాడు ఈ పద్యంలో. పసిపిల్లలు 'కేరు కేరు'మంటారు, కావు కావు ..అని అరుస్తారు. కావు అంటే రక్షించు అని  అర్ధం. కావు కావుమనడం, రక్షించుమని ఆర్తనాదాలు చేయడం రాక్షసులకే చెల్లింది కానీ,  నీకు 'సింహనాదం' చేయడం చెల్లింది. పొత్తులు అంటే పొత్తిళ్ళు, అంటే మెత్తని గుడ్డలు. తొలువేలుపులు  అంటే దేవతలకు ముందు జన్మించినవారు, పూర్వదేవులు, అంటే  రాక్షసులు. పసిపిల్లలకు మెత్తని గుడ్డలతో పక్కవేస్తారు సహజంగా. కానీ పొత్తిళ్ళు  (మెత్తని గుడ్డలు)రాక్షసుల గాయాలకు దక్కాయి. నీకుమాత్రం సహజవజ్రకవచం అబ్బింది.యుద్ధంలో నీచేతిలో గాయాలపాలై రాక్షసులు మెత్తని గుడ్డలతో కట్లు కట్టుకున్నారు అని. పసవల్పు అంటే పచ్చిమాంసపు వాసన. శిశువుల పరంగా పురిటివాసన. పచ్చిమాంసపు  వాసన విచ్చిన రాక్షసుల గుండెలకే కానీ, నీకు మాత్రం చందనపు వాసన అంటింది. అంగుళీచర్వణం అంటే వ్రేళ్ళు చీకడం. పసిపిల్లలు వ్రేళ్ళను నోటిలో పెట్టుకుని  చీకుతూ ఆడుకుంటారు. వ్రేళ్ళు కరుచుకుని వణికిపోవడం రాక్షసులకు చెల్లింది కానీ,  నీ పెదవులపై విజయశంఖము నిలిచింది!

స్వామీ! స్వామిమల వాసా! నువ్వు 'మాడు పచ్చి' వదలని మొలకవయసునాడే 'జేజే'లు  పలుకుతున్న దేవతలసేనకు నాయకుడి పట్టములో(పదవిలో)నిలిచి, తారకాసురుడిని  సంహరించి, ప్రౌఢతర రణక్రీడ చేసే సమయంలో నిజానికి పసిపిల్లడివైన నీకు ఉండాల్సిన 
లక్షణాలు వ్యతిరేకసూచనలతో రాక్షసులకు వచ్చాయి అని అద్భుతమైన స్తుతిపూర్వకమైన  పద్యాన్ని అగస్త్యులవారినోట పలికించాడు రామకృష్ణుడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
weekly horoscope july 22nd to july 28th