Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే ...... http://www.gotelugu.com/issue171/487/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

‘‘దేవీ! నీ అభిప్రాయమేమి? ఈ గండము గడచుట ఎట్లు?’’ అనడిగాడు ధనుంజయుడు.

‘‘చూచెదము గాక. పొర బాటున కూడ మీరు ఆయుధము ప్రయోగింప వలదు ప్రభూ. గుట్ట దిగ రాదు. ఇప్పుడే వచ్చెద.’’ అంటూ భద్రా దేవి పొడవాటి ఒక ఎండు కొమ్మ అందు కొని వేగంగా గుట్ట దిగింది.

ధనుంజయ ఉలూచీశ్వరిలు చుట్టూ చూస్తున్నారు. వారికి నాగ రాజు జాడ ఇంకా తెలీ లేదు. ఎటు చూసినా దివి టీలు, వందలు, వేలాది పాములు. అవి గుట్ట సమీపం లోకి వచ్చేస్తున్నాయి.

గుట్ట దిగిన భద్రా దేవి ఏవో మంత్రాలు పఠిస్తూ ఎండు కొమ్మతో నేల మీద గుట్టను చుట్టి గీత గీస్తూ పరుగెత్తింది. వృత్తం పూర్తి కాగానే వెళ్ళినంత వేగం గానూ వెనక్కి వచ్చేసింది భద్రా దేవి. ఆమె ఏమి చేయ బోతోందో అర్థం గాక ధనుంజయ ఉలూచీశ్వరిలు ఉత్కంఠ భరితులై చూస్తున్నారు. అవతల చూస్తే నాగ దండు గుట్ట సమీపం లోకి వచ్చేస్తోంది. పోరాటం తప్పదనిపిస్తోంది ధనుంజయునికి. ఎందుకైనా మంచిదని విల్లు అందుకుని అల్లె తాడు బిగించి దాన్ని సిద్ధంగా వుంచాడు. వారిని చేరు కున్న భద్రా దేవి ముందు హెచ్చరికగా`

‘‘ప్రభూ! ఈ గుట్టను చుట్టి అగ్ని రేఖ గీచితి. ఆ గీతను దాటి పాములే కాదు, ఎవరూ గుట్ట పైకి రాలేరు.’’ అంది.

ఆమె మాట్లాడుతూండగానే`

ఘృతాచి దెబ్బ నుంచి తప్పించుకున్న అయిదు సర్పాలు తొందర పడి గుట్ట పైకి రావాలని ప్రయత్నించాయి. అవి భద్రా దేవి గీచిన గీతను దాటుతుండగా ఒక్క సారిగా ఆ గీత నుండి భగ్గున అగ్ని కీలలు ఎగసి తృటిలో ఆ పాముల్ని భస్మీ పటలం చేసాయి. అది చూసి నాగ లోకం వీరులు  ఘొల్లున అరిచారు.

అవేమీ పట్టించు కోకుండా`

ఘృతాచి కోసం చూసింది భద్రా దేవి.

అప్పటి కింకా ఆ భూతం గుట్ట దిగువన గాల్లో ఎగురుతూ పాములు రాతి గుట్టను సమీపించకుండా పచ్చికొమ్మలతో బాది వెనక్కి విసురుతూ ఎగిరెగిరి చిందులేస్తోంది.

‘‘ఘృతాచి... ఇటు రమ్ము’’ అంటూ ఎలుగెత్తి పిలిచింది భద్రా దేవి.

ఆమె పిలుపు వినగానే`

పచ్చికొమ్మ అక్కడ పడేసి`

రివ్వున వచ్చి గుట్ట మీద వాలింది భూతం.

తన తోలు సంచి లోంచి ఒక నాగ స్వరం బుర్ర తీసి ఘృతాచి కిచ్చింది భద్రా దేవి.

ప్రతి సమయం లోను భద్రా దేవి సమయ స్ఫూర్తి, శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలు ధనుంజయునికి కొత్త గాను ఆశ్చర్య జనకం గాను వుంటున్నాయి. ఇప్పుడీ క్లిష్ట సమయంలో ఆమె ఏమి చేయ బోతుందాయని ఉత్కంఠ భరితుడై చూస్తున్నాడు. అంతకు మించి ఉత్కంఠ భరితురాలై నాగ స్వరం బుర్రను చూస్తోంది ఉలూచీశ్వరి.

పొడవు పీకతో కూడిన ఎండిన సొర కాయ బుర్రకు కింద రంథ్రాలు కలిగిన రెండు సన్నటి వెదురు గొట్టాలు కలిగి వుండి, పీక పైన రంథ్రం నుండి గాలి వూదుతూ వాయించేదే నాగ స్వరం బుర్ర. పాములాడించే వాళ్ళు దీన్ని ఊదుతుంటే ఎలాంటి సర్పమైనా ఆనందంతో పడగ విప్పి ఆడుతుంది. భద్రా దేవి ఆ బుర్రను ఘృతాచి కిచ్చి చెబుతోంది`

‘‘నా పలుకులు శ్రద్ధగా వినుము. మాకును నాగ రేడుకును నడుమ అమాయక ప్రాణులైన ఈ సర్పములు బలి యగుట పాడి గాదు. ఇక నీవు వాటిని తరుమ పని లేదు.

శక్తి వంతమగు ఈ నాగ స్వరం నా తండ్రి గారిది. దీని నాగ స్వర గానమునకు ఇచటి సర్పములన్నియు మై మరచి నీ వెంట పడగలవు. నీవు కొంత ఎత్తులో గాలిలో తేలుతూ గుట్ట దిగువనకు పోయి దీన్ని వూదుకొంటూ అలా దక్షిణ దిశగా పొమ్ము. ఇటకు దవ్వులనే ఒక లోయ గలదు. గుడ్డిగా నిన్ను అనుసరించిన పాములు లోయను చేరగానే ఆ లోయ లోకి పడి పోగలవు. ఆఖరి పాము కూడ లోయలో పడు వరకు నీవు నాగ స్వరము ఆప వలదు.

ఆ పాము లోయ పైకి చేరు సరికి తెల్ల వారుతుంది. అప్పటికి నాగ రాజు ప్రేరణ శక్తి తొలగి అవన్నీ తలో దారిన తమ తావులకు పోగలవు. నీవు మరలి వచ్చి దీనిని తిరిగి నాకు యివ్వ వలెను. పొమ్ము. వేగిరమే ఈ కార్యము సాధించు కొని రమ్ము’’ అంది భద్రా దేవి.

‘‘చిత్తము. తమ ఆన. మీరు చెప్పినటు చేసెద’’ అంటూ రివ్వున గుట్ట దిగువకు ఎగిరి వెళ్ళింది ఘృతాచి.

ఈ లోపల కొన్ని సర్పాలు బుసలు కొడుతూ రాతిగుట్ట మీదికి వచ్చే ప్రయత్నంలో అగ్నిరేఖను దాటాయి. అంతే` ఫెళ్ళున ఎగసిన అగ్నికీలు తృటిలో వాటిని బూడిద చేసాయి. అది చూసిన నాగ లోక భటులు ఎక్కడి వాళ్ళక్కడ ఆగి పోయారు. ఇంతలో `
ఉత్తరం దిక్కులో కాగడాలకు వెనక చిన్న కలకలం. అటు నుంచి అనేక మంది కదిలి రావటం ధనుంజయుడు, భద్రా దేవి, ఉలూచీశ్వరిలు గమనించారు.

వారి వెనక పరివారంతో చీకట్ల నుండి అప్పుడే కాగడాల వెలుగు లోకి వస్తూ కన్పించాడు నాగ రాజు. అతనిపుడు సర్ప రూపంలో వున్నాడు.
అంత ఎత్తున పడగ విప్పిన పది శిరస్సులు, ప్రతి శిరస్సు మీద నీలి రంగులో దివ్య కాంతులు చిందుతున్న నీలి మణులు కలిగి వున్నాడు. పది శిరస్సుతో గొడుగులా విప్పిన పడగలతో ఉగ్ర రూపంగా బిర బిరా ముందుకొస్తున్నాడు. ఆయన రాక గమనించి పక్కకు తొలగి గుట్ట వైపు దారి వదులుతున్నారు నాగ భటులు. వారంతా సగం సర్పం, సగం పురుషాకారంతో ఆయుధ దారులై వున్నారు. నాగ జాతి వీరులు వారితో సిద్ధంగా వున్నారు. నాగ రాజు వెంట నాగా నాయకుడు కుల గురువు అంతా వస్తున్నారు. గుట్టకు వంద ధనువుల దూరంలో కొచ్చి ఆగాడు నాగ రాజు.

సరిగ్గా అదే సమయంలో`

భూతం ఘృతాచి నాగ స్వరం ఊదటం ఆరంభించింది. అంతే` ఒక్క సారిగా అక్కడి నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ గాలిలో అలలు అలలుగా మధుర నాగ స్వర నాదం ఆ ప్రాంతమంతటా మారు మ్రోగ నారంభించింది.

అంతటి నాగ రాజే ఆ స్వరానికి ఉలికి పడ్డాడు. ఇక గుట్టను చుట్టి పడగలు విప్పి ఆడుతున్న సర్పాలన్నీ ఆ గానానికి మై మరచి ఒక్క సారిగా తలలు అటు తిప్పాయి. నెమ్మదిగా వెను తిరిగి ఘృతాచి దిశగా కదలనారంభించాయి.

ధనుంజయునికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం గావటం లేదు. పాములన్నీ గానం విన వస్తున్న దక్షిణ దిశగా కదలి పో నారంభించాయి. యువ రాణి ఉలూచీశ్వరి కూడా నాగ స్వరానికి తన్మయురాలై మై మరచి వెంటనే శ్వేత నాగుగా మారి పోయింది. వేగంగా గుట్ట దిగి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం గ్రహించి వెంటనే ఆ పామును పట్టు కొని ధనుంజయుని కిచ్చింది భద్రా దేవి. ఎందు కంటే గుట్ట దిగి వెళ్ళాలన్నా అగ్నిరేఖను దాటాలి. అది తృటిలో భగ్నం చేసి ప్రాణం తీస్తుంది. ధనుంజయుడు బుజ్జగించిన కొద్ది సేపటికి తనను తాను అదుపు చేసుకుంటూ తిరిగి స్త్రీ రూపం ధరించిన ఉలూచీశ్వరి ధనుంజయని చేతిని గట్టిగా పట్టుకుంది.

ఇదే సమయంలో అక్కడ ఎదురుగా నాగ రాజు పరిస్థితీ అలానే వుంది. రాతి గుట్టను చుట్టి మైదాన ప్రాంతమంతటా నాగ స్వర నాదం సమ్మోహనాస్త్రంలా మారు మ్రోగుతూ రా రమ్మని పిలుస్తున్నట్టుంది. మనసును సంపెంగ పరిమళంలా మురిపించేస్తోంది. నాగ లోకం నుండి వచ్చిన భటులు పరివారంలో చాలా మంది పూర్తిగా సర్ప రూపం లోకి మారి పోతూ తన్మయంతో ఘృతాచి దిశగా కదలి పో నారంభించారు.
నాగ రేడుకు పరిస్థితి అర్థమై పోయింది.

ఇలా సర్ప రూపం లోనే వుంటే`

తను కూడ ఆ గాన వశంలో అదుపు తప్పి అటు వెళ్ళి పోక తప్పదనిపించింది. వెంటనే సర్ప రూపం విడిచి ఎప్పటిలా తన పురుషాకృతిని ధరించాడు. ఆయన నిజ రూపం గాంచి ధనుంజయ, భద్రా దేవిలు మరో సారి విభ్రాంతి చెందారు.

సుమారు పన్నెండడుగుల ఎత్తున `

దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు.

పట్టు పీతాంబరాలు ధరించాడు. గుబురు మీసాలు, శిరస్సున ధగ ధగాయ మానంగా ప్రకాశిస్తోంది మణి మయ రత్న కిరీటం. ఆయన ధరించిన పాదుకలు కూడ మణులతో ప్రకాశిస్తున్నాయి. ఆచ్ఛాదన లేని ఛాతీకి అడ్డంగా స్వర్ణ యజ్ఞోపవీతం మెరుస్తోంది. సకలాభరణ శోభితుడై గంభీరంగా విరాజిల్లుతున్నాడు. ఒక చేత గధాయుధం, రెండో చేతిలో నాగ పాశం కలిగి వున్నాడు.

పురుషాకృతి దాల్చగానే` ‘‘ఆపండి! ఆ నాగ స్వర నాదమును తక్షణం నిలుపు చేయండి.’’ అంటూ హుంకరించాడు. వెంటనే స్పందించిన నాగ వీరులు నాగ లోకం భటులు అంతా ఆకాశం వంక చూసారు. చీకటిలో చీకటిగా కలిసి పోతున్న భూతం ఎవరికీ కన్పించటం లేదు. అయినా నాగ స్వరం వినవస్తున్న దిశగా ఆకాశం లోకి బాణాలు వదల సాగారు. కాని అప్పటికే ఘృతాచి దక్షిణంగా వెళ్ళి పోతోంది. నేలమీద గుట్టలు గుట్టలుగా సర్పాలన్నీ ఒకదాన్నొకటి త్రోసుకొంటూ నాగ స్వర తన్మయంలో అవి కూడ దక్షిణంగా వెళ్ళి పో సాగాయి.

ఎప్పుడైతే సర్పాలన్నీ దక్షిణంగా తరలి పోయాయో ఇప్పుడా మైదాన ప్రాంతం బోసిగా కన్పిస్తోంది. అప్పటికీ దివిటీలు పట్టిన అనేక మంది ఇంకా గుట్టను చుట్టి వున్నారు.

గుట్ట పైన ధనుంజయ, భద్రా దేవిలతో యువ రాణి ఉలూచీశ్వరి లేకుంటే ఈ పాటికి అక్కడ ఘోర సంగ్రామ జరుగుతూండేది. రాగానే ఆంప వర్షం కురిపించే వారు నాగ వీరులు. కాని తన కుమారి క్షేమం కోరి యుద్ధానికి అనుమతి యివ్వ లేక పోతున్నాడు నాగ రాజు. నాగాల నాయకుడు నాగ కేసరిని పిలిచి ఏదో చెబుతున్నాడు.

అదే సమయంలో`

ధనుంజయుడు నారి సవరించి వింటికి బాణం సంధించి వదిలాడు. అది నమస్కార బాణం. గాలిని చీల్చుకొంటూ నేరుగా దూసు కెళ్ళి నాగ రాజు పాదాల వద్ద నేలలో దిగ బడింది. ఉలికి పడి తలెత్తి గుట్ట పైకి చూసాడు నాగ రాజు.

తన వినయాన్ని ప్రకటిస్తూ మోకాలి మీద వంగి కూచుని నమస్కరించాడు ధనుంజయుడు. చేతిలో విల్లు అలాగే వుంది. అతడి పక్కనే మోకాళ్ళ మీద కూచుని తనూ భక్తితో నమస్కరించింది భద్రా దేవి. వారి వెనక నిలబడిన యువ రాణి ఉలూచీశ్వరి కూడ తండ్రికి సవినయంగా ప్రణామం చేసింది.

వారి వినయ విధేయతకు నాగ రాజు అంతరంగం ఒక్క సారిగా పులకించింది. తనకు తెలీకుండానే రెండు చేతులు ఎత్తి అశీర్వదించ బోయాడు. కాని లిప్త కాలం లోనే మనసు మార్చుకున్నాడు. పులకింత నుండి తేరుకుని హుంకరించాడు. నాగ కేసరితో ఏదో చెప్పి గుట్ట వద్దకు పంపించాడు. ఆ నాగ జాతి నాయకుడు ఏ సందేశమో రాయ బారమో తెస్తున్నాడని గ్రహించి ధనుంజయునితో బాటు అతివలిరువురూ గుట్ట వంచ కొచ్చి నిలుచున్నారు. ఓ చేత్తో కాగడా పుచ్చుకొని రెండో చేత్తో ఈటె అందుకొని వూపుకొంటూ పెద్ద పెద్ద అంగలతో గుట్ట కిందికొస్తున్నాడు నాగ కేసరి.

‘‘ప్రభూ! వచ్చు వాడు మర్మ భూమి అటవీ భాగం లోని నాగా జాతి ప్రజ నాయకుడు. అతడి నామధేయము నాగ కేసరి. నాగాలంతా మా జనకునికి వీర భక్తులు’’ అంది ధనుంజయునితో ఉలూచీశ్వరి.

తల పంకించాడు ధనుంజయుడు.

నాగ కేసరి గుట్ట దిగువకు వస్తూండగా` ‘‘ఇక ముందుకు రావలదు’’ అనరిచింది భద్రా దేవి.

‘‘అచట అగ్నిరేఖ వున్నది, ప్రమాదం. మీరు చెప్పదలుచుకున్నది ఎద్దియో అచటి నుండియే చెప్ప వచ్చును.’’ అంటూ హెచ్చరించింది. వెంటనే అక్కడే నిలిచి పోయి తలెత్తి గుట్ట పైకి చూసాడు నాగ కేసరి.

‘‘రత్న గిరి యువరాజులుం గారికి జయము జయము. నేను నాగా నాయకుడను నాగ కేసరి యను వాడను. మా దైవం నాగ రాజులుం గారి పనుపున వచ్చితి. మీతో మాటలాడవలె.’’ అనరిచాడు.

‘‘ఏమి మాటలాడెదవు?’’ వెంటనే అడిగాడు ధనుంజయుడు.

‘‘యువ రాణి ఉలూచీశ్వరిని వప్పగించుము. లేకున్న పోరు తప్పదని మా దైవం తరఫున హెచ్చరింప వచ్చితిని’’

‘‘ఇంత దనుక వచ్చిన మీ దైవం నా ముందు కొచ్చుట కేమి? మధ్య వర్తితో మాటలాడు వాడను గాను. స్వయముగా వారినే ఇటకు వచ్చి మాటలాడమని పోయి వారితో నా మాటగా చెప్పుము’’ అన్నాడు.

నాగ కేసరి తన జాతి జనంలో ఎన్నో చిక్కు సమస్యలు గట్టి తగవులు తీర్చిన అనుభవ శాలి. వయసులో పెద్ద వాడు. అలాంటి వాడే ధనుంజయుని మాటలకు ఖంగు తిన్నాడు.

బహుశ దివ్య నాగ మణి ని యిస్తే మీ యువ రాణిని పంపిస్తానంటూ ధనుంజయుడు మెలిక పెట్ట వచ్చని వస్తూ వస్తూ వూహించాడు. నాయనా పసి వాడివి ఎంతో భవిష్యత్తు కల వాడివి. పెద్దలతో వైరము క్షేమం కాదు. నా మాట విని యువ రాణీ వారిని వప్పగించుము అంటూ హితవు చెప్పాలని కూడ అనుకున్నాడు. కాని ధనుంజయుని ఖచ్చితమైన సమాధానం అతడి ఆలోచనల్ని తలక్రిందులు చేసింది. చూస్తుంటే ఈ సమస్య అంత సులువుగా తేలేది కాదని అర్థమై పోతోంది. హితవు చెప్పే ఉద్దేశాన్ని విరమించుకుని గిరుక్కున వెను తిరిగి చర చరా నాగ రాజు ముందుకెళ్ళి వివరించాడు.

ఆ మాటలు వినగానే`

నాగ రాజు ముఖం జేగురించింది. కళ్ళెర్ర జేసి హుంకరించాడు. గదాయుధాన్ని లేపి భుజాన వేసుకుని ఆగ్రహావేశాలతో విస విసా గుట్ట దిగువకు వచ్చేసాడు. అగ్ని రేఖకు మూడడుగులు ఇవతలే ఆగి పోయి తలెత్తి గుట్ట పైకి చూసాడు. మంద హాసంతో వినమృడై మరో సారి నమస్కరించాడు ధనుంజయుడు. భద్రా దేవి కూడా ప్రణామం చేసింది. ఉలూచీశ్వరి మాత్రం వారికి వెనగ్గా నిలబడి తండ్రి వంక చూడ లేక మౌనంగా తల దించుకుంది. వారి విధేయతకు మరింత ఉడికి పోయాడు నాగ రాజు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali