Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....  http://www.gotelugu.com/issue171/488/telugu-serials/atulitabandham/atulita-bandham/


“అయ్యయ్యో ఇదేమిటే అమ్మాయ్! ఇప్పుడెలాగ?? సమయానికి మీ మామయ్య గారు, వేణూ కూడా ఇంట్లో లేరు కదా...” అందావిడ ఆదుర్దా పడుతూ.

“అవునత్తయ్యా...” అంది మధుబాల, కాలి నొప్పి వలన వచ్చే కన్నీటిని ఆపుకుంటూ... ఆమెకంతా అయోమయంగా ఉంది... ఏదీ ఆలోచించనీయటం లేదు నొప్పి.

ఆవిడే ఆపసోపాలు పడుతూ హాల్లో ఉన్న బాత్ రూము లోంచి బకెట్ లో సగానికి నీళ్ళు, ప్లాస్టిక్ చీపురు మోసుకు వచ్చింది. బయట నుంచే నీళ్ళు పోస్తూ, జాగ్రత్తగా కాస్త మేర కడిగింది.

“అమ్మా మధూ... నువ్వు మెల్లగా పాక్కుంటూ తలుపు దాకా వచ్చేయి అమ్మా...”

ఆవిడ మాట పూర్తి  కాకుండానే, “అమ్మా... ఏమిటే హాలంతా చీకటి? లైట్ వేయలేదూ?” అంటూ వచ్చాడు వేణు.

“వేణూ... ఇలా రా నాయనా త్వరగా...” ఒక్క కేక పెట్టింది సుగుణమ్మ...

తల్లి గొంతులో ధ్వనించిన ఆరాటాన్ని గమనించి ఒక్క ఉదుటున లోపలికి  వచ్చిన వేణు ఆ పరిస్థితిని చూసి ఖంగారు పడిపోయాడు.

“అయ్యో... ఏమిటిది? ఏమైంది?? ఏయ్ మధూ... ఆర్యూ ఆల్రైట్?” వాష్ రూమ్ లోకి దూసుకుపోబోతున్న కొడుకును ఆపింది సుగుణమ్మ లోపల జారుతోంది అని విషయాన్ని వివరిస్తూ.

వంగి తన చేతిని మధుకు అందిస్తూ, “ముందుకు జరుగు మధూ... అమ్మ ఇక్కడివరకూ కడిగింది కదా... నా చేయి పట్టుకో... నేను లేవదీస్తాను...” అన్నాడు వేణు.

కాలినొప్పిని బలవంతాన ఓర్చుకుంటూ, బాధతో మూల్గుతూ, మెలమెల్లగా జరుగుతూ గడప దగ్గరకు వచ్చింది మధుబాల.

ఆమెను లేవదీసి నిలబెట్టాడు వేణు. పాదాన్ని నేలమీద మోపలేకపోయింది మధుబాల. ఆమె తడిసిన చీరను తానే విప్పేసి, నైటీని ఇచ్చాడు. అత్తగారు పట్టుకోగా ఎలాగో బట్టలు మార్చుకుంది మధు. ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి, మోకాలు పరీక్షించాడు. మోకాలి కింది భాగం కొద్దిగా వాచింది.

సుగుణమ్మ కు బెదురుగా ఉంది...

“అమ్మాయ్, కడుపులో నొప్పి ఏమీ లేదు కదా...” అంది ఆత్రంగా...

“ఉహు... కాలు నొప్పి అత్తయ్యా...” నీరసంగా జవాబు చెప్పింది మధు.

వేణు వెళ్లి త్వర త్వరగా వీధి చివర ఉండే తెలిసిన డాక్టర్ ను తీసుకువచ్చాడు.

అతను మధును పరీక్షించి, కాలు బెణుకు మాత్రమే అనీ, నొప్పి తగ్గటానికి, నిద్ర పట్టటానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. వేడిగా ఇడ్లీ లాంటిది పెట్టి, పాలు తాగించమని చెప్పాడు.

అదృష్టం కొద్దీ కడుపులో బేబీ కి ఏమీ కాలేదని, మధు అనుకోకుండా పట్టు కోసం కొళాయి పట్టుకోవటం, క్రిందికి కూర్చుండిపోవటం వలన అబార్షన్ ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పటంతో తేలికగా నిట్టూర్చారు తల్లీ కొడుకులు ఇద్దరూ.

టిఫిన్ తినేసి, పాలు తాగేసి ఆదమరచి నిద్రపోయింది మధుబాల. వేణు, సుగుణమ్మ ఇద్దరూ భోజనం చేయలేదు.

ఆ తర్వాత తానే బాగా నీళ్ళు పోసి రుద్దుతూ వాష్ రూమ్ నేలంతా కడిగేసాడు వేణు. ఖాళీ అయిన సీసాలు రెండూ చెత్తబుట్టలో పడ్డాయి.

***

తెల్లవారిన తరువాత నిద్ర లేచిన మధుబాలకు కాలునొప్పి కాస్త నెమ్మదించి, మెదడు పనిచేయటం ఆరంభమైంది. అసలు ఎలా పడిపోయింది తను? ఐశూకి జరిగినట్టు తనకీ గర్భస్రావం జరిగి ఉంటే? అమ్మో... ఆ ఆలోచనే తట్టుకోలేని విధంగా ఉంది తనకు...

అసలు ఆ షాంపూ, కొబ్బరినూనె ఎలా వొలికాయి? మూతలు కూడా లేవు వాటికి... అంటే ఎవరైనా కావాలని చేసారా? కా-వా-ల-ని...?

మధుబాల మెదడులో స్పార్క్... వినత... వినత చేసి ఉంటుందా? వినత అసూయాపరురాలే కానీ స్వంత అన్న భార్య మీద ఇంత దారుణానికి ఒడిగడుతుందా? భయంతో వణికిపోయింది మధుబాల. అత్తగారి మీద కూడా పిచ్చి కోపం వచ్చేసింది.

“అత్తయ్యా...” గట్టిగా పిలిచింది మధు.

“ఏమ్మా, లేచావా? బ్రష్ చేసుకుంటావా? బకెట్ తీసుకువస్తాను... ఇక్కడే ఉండు... అందులో కడుక్కుందువులే... బాత్ రూమ్ కి వెళ్ళాలంటే చెప్పు, నేను తీసుకు వెళతాను...” అంది సుగుణమ్మ  ఆప్యాయంగా.

“నడవగలుగుతున్నాను లెండి... వెళ్లి వచ్చాను వాష్ రూమ్ కి... మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి... నిన్న వినత ఇక్కడికి వచ్చిందా?”

“అంటే? వినత అవి అక్కడ పోసి ఉంటుందనా నీ అనుమానం?” కోపంగా అడిగింది ఆవిడ.

“వచ్చిందా లేదా, అది చెప్పండి ముందు...” కోడలి స్వరంలో తీవ్రతకి జంకింది సుగుణమ్మ. “వచ్చింది... ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళుతూ వచ్చి పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయింది...”

“రెండు నిమిషాలు చాలు లెండి, తాను చేయదలచుకున్న పని చేసి వెళ్ళిపోవటానికి!” విసురుగా అంది మధుబాల.

“మధూ, నువ్వు అనవసరంగా దాన్ని అనుమానిస్తున్నావు. వినత అలాంటిది కాదు... అయినా అది నా కళ్ళ ముందే ఉంది... మీ రూములోకి రాలేదు...” గట్టిగా చెప్పింది సుగుణమ్మ. నిజానికి వినత హాల్లో ఫ్రెండ్స్ తోనే కూర్చుందో, మధు వాళ్ళ రూమ్ లోకి వెళ్లిందో సుగుణమ్మ చూడలేదు... కానీ కన్న కూతురి  మీద నింద  పడుతుంటే భరించలేక అలా చెప్పేసింది.

“మీరే సమర్థించాలి మీ అమ్మాయిని...” ఈసడింపుగా అంది మధుబాల.

“మధూ... ఏమిటా మాటలు? బుద్ధి ఉందా నీకు??” హాల్లోంచి వచ్చిన వేణూ గట్టిగా అన్నాడు.

“నేనేం తప్పుగా  మాట్లాడాను? నా కడుపులో బిడ్డనూ, వీలైతే నన్నూ హతమార్చాలని చూసింది ఆ రాక్షసి... ఆమెకి వత్తాసు మీ తల్లిగారు... నేనే కదా మీకు పరాయిదాన్ని...” ఆక్రోశంగా అంది మధుబాల.

“కిటికీలోంచి కోతులు అప్పుడప్పుడూ వచ్చి నానా కంగాళీ చేసి పోతూ ఉంటాయి కదా మధూ, నీకూ తెలిసిందే... అలా జరిగి ఉండవచ్చు కదా... అనవసరంగా వినతను అంటావేం?”

“కోతులు వస్తాయి, కాదని అనను... అవి జాగ్రత్తగా నూనె సీసాని, షాంపూ సీసాని మూతలు తీసి, ద్వారం తెరవగానే జారి పడిపోయేలా ఒంపవు వేణూ... వాటికంత ప్లానింగ్ ఉండదు... ఇది ఖచ్చితంగా వినత పనే...”

“ఎందుకు? నీకు అబార్షన్ అయితే దానికేం వస్తుందని? అనవసరమైన నిందలు మానేయ్... పిచ్చి పిచ్చిగా ఆలోచించకు...

”“ఇదిగో అత్తయ్యా, వేణూ... ఇద్దరూ వినండి... ఈరోజు మా అన్నయ్య నన్ను మా ఇంటికి తీసుకు వెళ్ళటానికి వస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను, పంపించేయండి... ఇంకేమీ మాట్లాడ వద్దు దయచేసి...” ఉధృతంగా దుఃఖం పొంగుకు వచ్చింది మధుబాలకు. రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరున ఏడవసాగింది.

“ఏయ్ మధూ? ఏమిటిది పిచ్చీ! ఇటీజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్...అంతే...ఇప్పుడేమీ కాలేదు కదరా... చిన్న దెబ్బ తగిలింది అంతే... తగ్గిపోతుంది... లక్కీగా మన బేబీకి ఏమీ కాలేదు... ఇప్పుడెందుకు మీ ఇంటికి? మీ అన్నయ్యను రావద్దని ఫోన్ చేసేయి...

” అనునయంగా ఆమె భుజం మృదువుగా నొక్కుతూ ఆమెను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించాడు వేణు.ట్టిగా విదిలించుకుంది మధుబాల... “ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేయండి...”.

తల్లి వైపు చూసి భుజాలు ఎగరేసాడు వేణు...

“సరే... అయితే ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకో... టిఫిన్ తీసుకువస్తాను... తిందూగాని...” తల్లితో బయటకు వెళుతూ తలుపులు చేరవేశాడు వేణు.

***

“ఏమిటమ్మా ఇది? నాన్నగారు కూడా ఊర్లో లేరు సమయానికి... ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది... వాళ్ళ అన్నయ్య వచ్చాడుగా, సాయంత్రం టాక్సీ చేసుకుని అతనితో వెళ్ళిపోతానని అంటోంది అమ్మా... ఎలాగ?” దిగులుగా అన్నాడు వేణు...

“అవునురా... ఎంత చెప్పినా వినటం లేదు... వాళ్ళ మామ్మగారు చూడాలని ఉందని తీసుకురమ్మన్నారని అంటున్నాడు గిరి.  ఈ పిల్ల ఇప్పుడు వెళితే ఎలా? అసలే కాలు నొప్పితో ఉంది...” గొంతు పెగల్చుకుంటూ అంది సుగుణమ్మ.

“అది కాదమ్మా... వెళ్లి నాలుగు రోజుల్లో వచ్చేస్తే బాధే లేదు... కానీ... కానీ... తను వినతను అనుమానిస్తోంది అమ్మా...” బాధగా కళ్ళు మూసుకున్నాడు వేణు. “ఇక్కడుంటే తన ప్రాణాలకే ప్రమాదమని, వెళ్ళిపోతానని అంటోంది... ఏం చేయనమ్మా?” తల్లి గుండెల్లో తల దాచుకున్నాడు వేణు...

కొడుకు తల నిమురుతూ, “అలా జరగదులే వేణూ... మధుకి నేను నచ్చజెబుతాను...” అందామె.

***

కానీ, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా, అన్నతో పాటుగా ప్రయాణమై పుట్టింటికి వెళ్ళిపోయింది మధుబాల. భర్తను సరే, తనను కూడా లెక్క చేయకుండా, ఒక శత్రువును చూసినట్టు చూసి, మాట వినిపించుకోనందుకు సుగుణమ్మకూ బాగా కోపం వచ్చింది.

గిరికి విషయం తెలియదు కనుక, కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉంటుందని, వారం తర్వాత తీసుకు వచ్చేస్తానని చెప్పి, మరీ మరీ అడగటంతో ఏమీ మాట్లాడలేక ఊరుకున్నాడు వేణు.

ఊరినుంచి వచ్చిన గోవర్ధన రావు జరిగినదంతా తెలుసుకొని మ్రాన్పడిపోయాడు... జరిగిన విషయం దేనికి దారి తీస్తుందో అంతుపట్టటం లేదు ఆ ఇంట్లో ఎవ్వరికీ...

 

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్