Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అగస్త్యమహర్షి దక్షిణదేశ యాత్ర చేస్తూ వింధ్యపర్వత గర్వాన్ని అణిచి, కొల్హాపూరు 
శ్రీ మహాలక్ష్మి  ఆజ్ఞమేరకు స్వామిమలకు  పయనమైనాడు. మతంగముని ఆశ్రమాన్ని,  మాల్యవంతపర్వతాన్ని, పంపానదిని, 
తుంగభద్రానదిని దర్శించుకుని, స్వామిమల చేరుకున్నాడు. అక్కడ కుమారస్వామిదర్శనం చేసుకుని స్వామిని నుతిస్తున్నాడు.

అహిత గోత్రహృత్వ్యథారోపకృతి నీదు 
శక్తికుగ్రబాహుశక్తికిఁ దగు 
ఘనవివృద్ధిఁ బేర్చి గర్వించుటలు నీదు 
శిఖికి సత్ప్రతాపశిఖికి నమరు                                  (ఆ)

నీకు హితులుకానివారి వంశములకు గుండెలలో వ్యథను కలిగించడం నీ ఉగ్ర బాహువుల శక్తికి, నీ 'శక్తి' అనే ఆయుధానికి తగునయ్యా! గోత్రము అంటే పర్వతము కూడా, కనుక  క్రౌంచపర్వతాన్ని బ్రద్దలు చేయడం నీ బాహువుల శక్తికి తగునయ్యా అని శ్లేష! మేఘముల 
వృద్ధిని(ఘన వివృద్ది)చూసి అతిశయించిన గర్వముతో నాట్యమాడడం నీ వాహనమైన  నెమలికి(శిఖి)తగును స్వామీ! ఘనమైన, అంటే, గొప్ప వృద్ధిని,పెంపును, విజయాన్ని  చూసి గర్వించడం నీ సత్ప్రతాపజ్వాలలకు తగినది స్వామీ అని మరొక శ్లేష. ఇక్కడ ఒక చమత్కారరసమయమైన వచనంలో అగస్త్యులవారి ద్వారా కుమారస్వామిని  ప్రస్తుతింపజేశాడు తెనాలి రామకృష్ణుడు. వచనమే అయినా, రామకృష్ణుని ప్రతిభాపాటవ దర్శనం చేసుకొనడంకోసం క్లుప్తంగా పరిశీలిద్దాము.

కార్తికేయా, ఆశ్రితార్తిహరా! శరవణభవా, పరమపురుషార్ధ ప్రవణా! మహాసేనా, దీనజన  మందారా! శాశ్వత బాలుడా, కృపా విశాలుడా! షడాననా, కీడును తొలగించి బ్రోచెడి ప్రోడా!  నీలదంష్ట్రా, జయశ్రీ లాభమునకు మూలమైనవాడా! గాంగేయా, ముంగిటిలోని పెన్నిధి 
ఐనవాడా! కుక్కుట ధ్వజా, మ్రొక్కతగిన దేవా!బ్రహ్మగర్భా, అనంతమైన బ్రహ్మవిద్యోపదేశికా!  విశాఖా, కుశాగ్రబుద్ధీ! సుబ్రహ్మణ్యా, గొప్ప సుగుణములనే రత్నములకు గని ఐనవాడా!  శిఖివాహనా, సాధుజన మిత్రుడా! పార్వతీ నందనా, సచ్చిదానందమునకు మూలమైనవాడా! బాహులేయా, మోహమనే కొండపాలిటి దేవేంద్రునివంటివాడా! తారకాసురవైరీ, అకారణముగ సత్కార్యములు చేయువాడా! శక్తిధరా, భుక్తినీ ముక్తినీ ప్రసాదించువాడా! స్వామీ,  యోగక్షేమములకు నెలవైన భూమివంటివాడా! స్కందా, జగములను సంరక్షించుటయందు 
మగ్నుడైన వాడా! క్రౌంచపర్వతభేదీ, అపర శివావతారా! గుహా, కొరతలులేని తరిగిపోని  శుభములను ప్రసాదించువాడా! కుమారా!  దేవ సమూహములను ఉద్ధరించే నిర్వికారుడా!  షణ్మాతురా, దేవేంద్రునికి సైతమూ సుఖమును ప్రసాదించువాడా! అని ఆనందరసమగ్నమైన మనసుతో బహువిధములుగా కుమారస్వామిని ప్రస్తుతి చేశాడు అగస్త్యమహర్షి.

కార్తికేయా, ఆశ్రితార్తిహరా!కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రముల సమూహం. ఈ నక్షత్ర అధిదేవత సాక్షాత్తూ అగ్నిదేవుడు.  పరమశివుడు ఈ నక్షత్రములో నివాసం చేస్తాడు అని సంప్రదాయం. ఆయనకు అందుకే కృత్తివాసుడు అని పేరు. అగ్నిదేవుడు ఒకసారి సప్తమహర్షుల భార్యలను చూసి మోహించి, వారితో తన కోరికను వెల్లడిస్తే శాపాలతో దహించి వేస్తారు అని చెప్పలేక  లోలోపలే విరహంతో క్రుశించిపోతుంటే, ఆయన  భార్య  ఐన స్వాహాదేవి అది గమనించి,  వశిష్ఠమహర్షి భార్య ఐన అరుంధతీదేవి తప్ప మిగిలిన వారి రూపములను తనే ధరించి, 
అగ్నిదేవుడి కోరికను తీర్చింది. అది చూసిన ఋషులకు కోపం వచ్చి నిజంగా తమతమ  భార్యలే ఆ పని చేశారు అని వారిని విడిచిపెట్టారు. వారు ఆతరువాత కుమార స్వామికి  తమ స్తన్యాన్ని యిచ్చి, ఆయన  ఆకలిని తీర్చారు. కృత్తికలచేత పోషింపబడ్డాడు కనుక  ఆయన కార్తికేయుడు అయినాడు. తనను ఆశ్రయించిన ఆ మునిపత్నుల దుఃఖమును  తొలగించి వారి భర్తలతో కలిపాడు, అలా ఆశ్రితుల ఆర్తిని నాశనంచేసే స్వామి అని స్తుతి.

శరవణభవా, పరమపురుషార్ధ ప్రవణా! శరవణము అంటే రెల్లుపొదల అడవి, యిహలోకపు  బంధాలకు ప్రతీక. మాయాబాలుడైన కుమారస్వామి రెల్లుపొదలలో జనించి, కృత్తికల ఆర్తిని, దేవేంద్రుని బాధలను, తారకాసురుని ఆగడాలను నివారించి, బ్రహ్మవిద్యామూర్తియై, 
సుబ్రహ్మణ్యుడు అంటే ఉత్తమ బ్రహ్మభావము గలవాడు అంటే మహా యోగేశ్వరుడు అయినాడు. పరమపురుషార్ధమును ప్రసాదించగలవాడు అని స్తుతి. మహాసేనా, దీనజన మందారా! మహాసేనుడు, అంటే మహా సేనాని, సమస్త దేవతా సైన్యమునకు సేనాని. అసురుల బాధలకు తాళలేక దీనులైన దేవతలకు నాయకుడై, వారికీ   విజయాన్ని ప్రసాదించిన పరదైవతము, కనుక దీనులైనవారిపాలిటి కల్పవృక్షము అని స్తుతి. శాశ్వత బాలుడా, కృపా విశాలుడా! ఎల్లపుడూ ఏడురోజుల బాలుని రూపములో ఆనందించేవాడు, ఏడురోజుల వయసున్న బాలకుని చేతిలో మాత్రమే మరణము ఉన్న తారకాసురుని సంహరించి, దేవతలకు, మునులకు, ఋషులకు ఆనందాన్ని కలిగించిన  కరుణామయమూర్తి కనుక ఈ స్తుతి. షడాననా, కీడును తొలగించి బ్రోచెడి ప్రోడా! ఆరుముఖముల బాలకుడైన కుమారస్వామి  విశేషించి బాలగ్రహముల, మంత్రప్రయోగాల, మానసిక రుగ్మతల, శత్రు పీడల కీడును తొలగించే దైవం, కనుక యిలా స్తుతించడం.

నీలదంష్ట్రా, జయశ్రీ లాభమునకు మూలమైనవాడా! మహానుభావులైన పూర్వ వ్యాఖ్యాతలు, బ్రాహ్మీమయ మూర్తులు, పుంభావ సరస్వతులు ఐన పెద్దలు గతంలో ' నీల దంష్ట్రా' అంటే నల్లని దంతము గలవాడా అని సంబోధనగా భావించారు. నేను అల్పుడిని, వారి ప్రతిభా పాండిత్యములలో అణుమాత్రమైనా లేనివాడిని. అయినా ఆ భావన సరికాదు అనిపించింది నాకు. యిది చాలా విచిత్రమైన సంబోధన. బాలకునిగా, తరుణుడిగా ఎప్పుడైనా నల్లని దంతములు కలవాడు అవుతాడా ఆదిదేవుడైన షణ్ముఖుడు? నీలదంష్ట్ర అంటే నల్లని కోర, విషపుకోర, మృత్యువు కోర, ఎవరికి? ఆయన శత్రువులకు, రాక్షసులకు, కనుకనే ఆ వెంటనే 'జయ'శ్రీ లాభమునకు మూలమైనవాడా అంటున్నాడు కవి.

మరొకటి, అగ్ని సంబంధమైన సూచన. అగ్నిదేవుని కోరలు/నాలుకలు ఏడు, అందులో మొదటిది, ప్రధానమైనది 'కాలి/కాళి'. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, ఉగ్ర, ప్రదీప్త అనేవి ఆ  ఏడు పేర్లు.  అగ్నిదేవుని పుత్రుడు, అగ్నిమూర్తి అని కుమారస్వామికి పేరు, కనుక నల్లని 'కాళి' అనే కోరను కలిగిన అగ్నిస్వరూపా అని సంబోధన! శాత్రవవిపిన దాహక నీలదంష్ట్రా అని స్తుతి! కనుకనే శత్రువులనే కీకారణ్యదహనము చేసి, 'జయ'శ్రీ లాభాన్ని ప్రసాదించే స్వామీ అని స్తుతి,  తెనాలి రామకృష్ణుని 'కటు వికట కవన భావనా పటిమకు' యిదొక చక్కని ఉదాహరణ!గాంగేయా, ముంగిటిలోని పెన్నిధి ఐనవాడా! పరమపవిత్ర ఐన గంగానదికి సుతుడు కనుక అంతటి పవిత్రుడు, పాప నాశకుడు, మహా  మహిమాన్వితుడు కనుక ముంగిటిలోని పెన్నిధి,

పుణ్యమనే పెన్నిధి! కుక్కుట ధ్వజా, మ్రొక్కతగిన దేవా! నెమలిని ధ్వజలాంఛనంగా కలిగినవాడా, మ్రొక్కదగినవాడా! నెమలి అమలిన శృంగారానికి, కుమారస్వామి యోగ విద్యకు, అస్ఖలిత బ్రహ్మచర్యానికి ప్రతీకలు, కనుక మ్రొక్కదగిన దేవుడు.బ్రహ్మ గర్భా, అనంతమైన బ్రహ్మవిద్యోపదేశికా! వేదములయందు, జ్ఞానమునందు నెలవై ఉన్నవాడు, వేదనిలయుడు, జ్ఞాననిలయుడు, జ్ఞానమయుడు కనుక బ్రహ్మగర్భుడు, కనుకనే అనంతమైన బ్రహ్మవిద్యను ప్రసాదించగలడు, బోధించగలడు, తన ఉపాసకులకు. విశాఖా, కుశాగ్రబుద్ధీ! విశాఖా నక్షత్రములో జన్మించినవాడు, చురుకైన బుద్ధిని కలిగినవాడు, చురుకైన బుద్ధిని ప్రసాదించేవాడు అని స్తుతి.సుబ్రహ్మణ్యా, గొప్ప సుగుణములనే రత్నములకు గని ఐనవాడా! విశిష్టమైన బ్రహ్మజ్ఞానము కలిగినవాడు, విశిష్టమైన బ్రహ్మజ్ఞానమును ప్రసాదించేవాడు అని స్తుతి. శిఖివాహనా, సాధుజన మిత్రుడా! శిఖి వాహనుడు అంటే నెమలిని తనకు వాహనముగా  చేసుకున్నవాడు.

నెమలి మురిసిపోయేది మేఘాల రాకకు. మేఘములు ఔదార్యానికి, ప్రతిఫలాపేక్ష లేని త్యాగనిరతికి ప్రతీకలు, ఇక్కడా అక్కడా అనే వివక్ష లేకుండా అవకాశము ఉన్నమేరకు నీటిని కురిపిస్తాయి కనుక. సాధుజనులు, జ్ఞానులు కూడా అంతే. అడగకముందే,  ప్రతి ఫలాపేక్ష  లేకుండా, దాచుకోకుండా యితరులకు పంచిపెడతారు, తమ వద్ద ఉన్నదానిని దేనినైనా, ఎవరికైనా, ఎంతైనా! ఆయన లక్షణాలు, ఆయన వాహనపు లక్షణాలు ఒక్కటిగానే, పరస్పరం అనుగుణంగానే ఉంటాయి కదా, కనుక ఈ చమత్కారపు స్తుతి.పార్వతీ నందనా, సచ్చిదానందమునకు మూలమైనవాడా! పార్వతి అంటేనే సగం అమ్మ, సగం అయ్య, వారిరువురు సచ్చిదానందమయ మిథునము,కనుక ఈ సంబోధన!

బాహులేయా, మోహమనే కొండపాలిటి దేవేంద్రునివంటివాడా! బాహులేయుడు అంటే  బహువిధములుగా జన్మించినవాడు, పలువురి ప్రమేయముతో ఉద్భవించినవాడు అని  అర్ధం. ఒక్క కుమారస్వామికే ఈ బిరుదు. పారవతీ పరమేశ్వరుల కలయిక కారణంగా, ఆ  కలయికను భగ్నం చేసిన అగ్నిదేవుడు శివుని వీర్యాన్ని గ్రహించి ఆ శక్తికి తట్టుకోలేక గంగలో  విడిచిన కారణంగా, గంగ కూడా తట్టుకోలేక రెల్లుపొదలలో విడిచిన కారణంగా, కృత్తికలు చనుబాలను యిచ్చి పోషించిన కారణంగా, యిందరికీ, శివపార్వతులకు, అగ్నికి, గంగకు, 
రెల్లు పొదలకు, కృత్తికలకు కుమారుడు ఐన కారణంగా 'బాహులేయుడు'అని పిలువబడ్డాడు. మోహాన్ని, కామవికారాన్ని నాశనము చేసేవాడు కనుక మోహమనే కొండను భేదించే దేవేంద్రునివంటివాడు అని స్తుతి.తారకాసురవైరీ, అకారణముగానే సత్కార్యములు చేయువాడా! తారకాసుర నాశకుడు, సహజముగానే సత్కార్యములు చేసేవాడు, అలా చేసే శక్తి యుక్తులను ప్రసాదించేవాడు కనుక 
యిలా స్తుతించడం.

శక్తిధరా, భుక్తినీ ముక్తినీ ప్రసాదించువాడా! శక్తి అనే ఆయుధాన్ని కలిగినవాడు, తన సాధకులకు  శక్తిని భుక్తిని, ముక్తిని ప్రసాదించేవాడు, భుక్తిని ముక్తిని సంపాదించుకునే శక్తిని, ఇహ పరములను సాధించే శక్తిని ప్రసాదించేవాడు కనుక ఈ సంబోధన! స్వామీ, యోగక్షేమములకు నెలవైన భూమివంటివాడా! స్వామి అంటే సర్వప్రభువు,  ప్రభువైనవాడు తన ఆశ్రితుల యోగక్షేమాలకు నిలయుడు కనుక ఈ స్తుతి.

స్కందా, జగములను సంరక్షించుటయందు మగ్నుడైనవాడా! స్కన్నము కావడం అంటే  నిలువకుండా జారడం, విచ్ఛిన్నం కావడం. పరమేశ్వరుని వీర్యం నిలువవలసిన చోట నిలువకుండా జారిన కారణంగా, ఆ తరువాత కూడా అంచెలంచెలుగా నిలువకుండా 
జారడం వలన జన్మించిన కారణంగా ఆయన స్కందుడు అని పిలువబడ్డాడు. సమస్త జగములను, వేల్పులను తన నాయకత్వముతో రక్షించేవాడు కనుక ఈ స్తుతి.

క్రౌంచపర్వతభేదీ, అపర శివావతారా! గుహా(తన సేనలను రక్షించువాడు)కొరతలులేని  తరిగిపోని శుభములను ప్రసాదించువాడా! కుమారా! దేవసమూహములను ఉద్ధరించే నిర్వికారుడా! (షడ్వికారములు లేనివాడు)షణ్మాతురా(ఆరుగురు తల్లులు, కృత్తికలు,  స్వాహాదేవి) కలవాడా, దేవేంద్రునికి సైతమూ సుఖమును ప్రసాదించువాడా! అని అనేక రహస్య, చమత్కారరసమయమైన స్తుతిని అగస్త్యులవారి నోట పలికించాడు తెనాలి రామకృష్ణుడు. 

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
weekly horoscope july 29th to august 4th