Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sleeping villages

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి సొగసులు చూద్దాం రండి ( ఆరవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

కాంగ్రా లోయ --1

హిమాచల్ ప్రదేశ్ లో పంజాబు రాష్ట్రానికి దగ్గరగా ' దౌలాధర్ ' పర్వత శ్రేణులను ఆనుకొని వుంది ' కాంగ్రా ' లోయ . ' దౌలాధర్ ' అంటే తెల్లగా వున్న శిఖరాలు అని అర్దం , ఈ పర్వతాలు యెప్పుడూ తెల్లని మంచుతో కప్పబడి వుంటాయి కాబట్టి వీటికి దౌలాధర్ పర్వతాలు అనే పేరు వచ్చింది . ఈ లోయ పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు దౌలాధర్ పర్వత శ్రేణులకు మధ్య వుంది .

హిమాచల్ లో వున్న మరొక ముఖ్య పర్యాటక ప్రదేశం యీ కాంగ్రా లోయ . ఇది జిల్లా కూడా , కాంగ్రా జిల్లా కేంద్రం ధర్మశాల . కాంగ్రా లోయ ' టీ ' తోటలకు ప్రసిద్ది . హిమాలయాలకు అతి దగ్గరగా వుండడం వల్ల వేసవిలో చాలా చల్లగా వుండి నవ్వంబరు నుంచి హిమపాతం కలిగివుంటుంది . ఈ లోయ అతి యెక్కువ జలపాతాలతోను , బియాస్ నదిలో కలిసే సెలయేళ్ల తోనూ , యెంత యెత్తుకు ప్రయాణించినా యింకా యెత్తులో వున్నాం అంటున్నట్టున్న పర్వతాలు , వాటి మీద ఆకాశాన్నందుకుంటాం అన్నట్టున్న పైను , దేవదారు వృక్షాలు కళ్లు తిప్పుకోనివ్వవు .

కాంగ్రా లోయ ఛండీగఢ్ నుంచి సుమారు 226 కిలో మీటర్లు , కులు కి 195 కిలో మీటర్లు , డిల్లీనుంచి సుమారు 450 కిలో మీటర్లు  ప్రయాణం చేసి చేరుకోవచ్చు . రైలు మార్గం ద్వారా అయితే పంజాబ్ లోని పఠాన్ కోట నుంచి సుమారు 120 కిలో మీటర్ల దూరం . కాంగ్రా పట్టణానికి పఠాన్ కోట ను కలుపుతూ నేరోగేజ్ రైలు సదుపాయం వుంది . దీనిని టోయ్ ట్రైను అని కూడా అంటారు .

చాలా ప్రశాంతంగా వుండే పర్యాటక స్థలం . పర్యాటకులను ఆకర్షించేందుకు ఆటలు పాటలు లాంటివి యేవి యిక్కడ లేవు . హాయిగా శలవులు గడపడానికి బాగుంటుంది .

కాంగ్రా పట్టణాన్ని గురించి పౌరాణిక కథ యీ విధంగా వుంది . ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జరాసంధునితో యుధ్దం చేసే సమయంలో జరాసంధుని చెవి తెగి పడిపోయి వాతావరణ ప్రభావం వల్ల మట్టిలో కప్పబడి పోయిందట . కాన్ అంటే చెవి , గర్హ అంటే మట్టిలో పాతిపెట్టబడినది అని అర్దం . కాంగర్హ   ప్రజల నోళ్లల్లో పడి కాంగ్రా గా మారింది . కాంగ్రా కోట నుంచి యూ పట్టణాన్ని చూస్తే చెవి లాగానే కనిపిస్తుందట .

మరోకథ మన పురాతన వైద్యగ్రంధాలయిన ' చక్రసంహిత ' , శుశృత సంహిత గ్రంధాల ప్రకారం యిక్కడ ముక్కు , చెవి లకు సంబంధించిన సశ్త్ర చికిత్సలు అంటే ప్లాస్టిక్ సర్జరీలు జరిపేవారట . ఇటువంటి చికిత్స దక్షిణ భారతదేశంలో మొదలయినా యిక్కడ ప్రత్యేకమైన చికిత్సా విధానాన్ని అవలంబించేరు . అందుచేత దీనికి కాంగ్ర అనే పేరు వచ్చిందట .

కాంగ్ర కోట----

ఇక చరిత్ర ప్రకారం చంద్ర వంశానికి చెందిన కటోచ్ క్షత్రియరాజపుత్ర రాజైన భూమా చంద్ యీ ప్రాంతంలో కోటను నిర్మించుకుని నగరకోట అని నామకరణం చేసుకొని రాజధానిని జలంధర్ నుంచి యీ కోటకు మార్చుకొని పరిపాలన సాగించేడు . కటోచ్ క్షత్రియ రాజులు యీ కోటలో అనేక మందిరాలు నిర్మించేరు .ప్రస్తుతం యీ కోట పాడుబడి వుంది . ఈ కోట ముఖ్య ద్వారాన్ని రంజిత్ సింగ్ గేటు అనిఅంటారు , అందులోంచి ముందుకు వెడితే జహంగీరు గేటు . రంజిత్ సింగ్ గేటు దగ్గర వున్న మ్యూజియం లో యీ కోటలోని చారిత్రిక అవశేషాలను వుంచేరు .

మహాభారతం లో యీ రాజ్యాన్ని త్రిగర్త రాజ్యంగా పిలువబడినట్టు వుంది .

మహమ్మదు గజని ఈ రాజ్యం పై అనేక మార్లు దండెత్తి సంపదలు కొల్లగొట్టినట్లు చరిత్ర చెప్తోంది . మహమ్మదు బిన్ తుగ్లక్ పరిపాలనలోనూ తర్వాత అతని వారసుడైన ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనలోనూ , అనంతరం మొగలు చక్రవర్తుల పరిపాలనలో వుంది . 1786 లో రాజా సంసార చంద్ --2 యీ కోటను గెలుచుకున్నాడు . 1801 లో సిక్కు రాజైన రాజా రంజిత్ సింగ్ పరిపాలనలో కి వచ్చి ఆంగ్లేయుల రాజ్యం వచ్చేంతవరకు సిక్కురాజుల దగ్గరే వుంది . ప్రస్తుతం యీ కోట ఆర్కియాలజికల్ సర్వే వారి ఆధ్వర్యంలో వుంది .

ఈ కోట లో లక్ష్మీ నారాయణ మందిరం , సీతలా మాత మందిరం పాడుబడి వున్నాయి . అంబికగా దేవి మందిరానికి స్థానిక భక్తులు రాకపోకలు చేస్తున్నారు . పూజా విధులు జరుపుతున్నారు . కోట లోపల శీష్ మహల్  వుంది అయితే యిదికూడా పాడుబడి పోయింది . రెండు జైనమందిరాలు పాడుబడిన స్థితిలో వున్నాయి .

1905 లో యీ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపం యిక్కడి భవనాలకు , మందిరాలకు బాగు చెయ్యలేనంత క్షతి కలిగించింది .

వజ్రేశ్వరి దేవి -----

కాంగ్రా లోయ యిక్కడ వున్న వజ్రేశ్వరి దేవి మందిరం వల్ల దేశ వ్యాప్తంగా ప్రసిద్ది పొందింది . ఈ దేవిని కాంగ్రా దేవి అని కూడా అంటారు .     కాంగ్రా పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో వుంది యీ మందిరం .

యెత్తైన రాతిగోడలు , పెద్ద తలపులతో కోట లా వుంటుంది . కోవెల ద్వారం ముందర పెద్ద ' నగారా ' వుంటుంది . లోపల మందిరం కొత్తగా కట్టిన కట్టడం . గదలు ధరించిన ద్వార పాలకులు , లోపల గర్భగుడిలో వజ్రేశ్వరి దేవి ' పిండి ' ( రాయి ) రూపంలో పూజలు అందుకుంటోంది

కోవెల ప్రాంగణం లో చిన్న మందిరం ' భైరవనాధ్ ' కి సమర్పించబడింది . నాలుగు చేతుల దుర్గాదేవి సింహవాహనం మీద కూర్చుని వున్న విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది . కోవెల ప్రాంగణం లో చుట్టూరా కంచె వేసిన స్థల వృక్షం , కంచెకు మొక్కులు మొక్కుకొని కట్టే యెర్రదారాలు వుంటాయి . ముఖ్య ద్వారానికి పక్కగా ' న్యాయ శిల ' వుంది .

ఈ కోవెల యొక్క స్థల పురాణం తెలుసుకుందాం .

వజ్రేశ్వరీ దేవి ని గురించి ముఖ్యంగా మూడు కథలు ప్రచారంలో వున్నాయి .

మొదటి కథ ప్రకారం వేల వేల సంవత్సరాలకు పూర్వం ' వద్వాలి ' ప్రాంతంలో ఋషులు , మునులు తపస్సు చేసుకుంటూ , పుణ్యకార్యాలు చేసుకుంటూ వుండేవారు , ఒకనాడు ' కలికాల ' లేక ' కలికూట ' గా పిలువబడే రాక్షసుడు ఋషులను మునులను అనేక బాధలకు గురిచేస్తూ  యాగాలకు ఆటంకం కలుగ చేస్తూ వుండేవాడు . రాక్షసుని బాధపడలేక ఋషులు మునులు దేవతలకు మొరపెట్టుకొనగా విష్ణుమూర్తి సలహా మేరకు పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకొనేందుకు యాగం చెయ్యనారంభిస్తారు . యే యాగం లో నైనా ఆహుతి ఇంద్రునికి మాత్రమే చెందాలి అలా కాక పార్వతీ దేవికి ఆహుతినివ్వడం ఇంద్రునికి క్రోధం తెప్పిస్తుంది . వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని దేవతలపై ప్రయోగిస్తాడు . దేవతలు వజ్రాయుధ ప్రభావం నుంచి తప్పించుకోలేమని భయపడుతూ వుండగా దేవి హోమగుండం నుంచి ప్రకటితమై వజ్రాయుధాన్ని ముక్కలు ముక్కలు గావించి ' కలికాల ' రాక్షసుని సంహరిస్తుంది . దేవతలు వజ్రాయుధాన్ని ఛేదించిన దేవి కాబట్టి  ' వజ్రేశ్వరి ' గా  స్తుతించసాగేరు . శ్రీరాముడు వజ్రేశ్వరి దేవిని అదే ప్రదేశంలో వుండి భక్తులను బ్రోవమని కోరగా ' వజ్రేశ్వరీ దేవి ' అక్కడ స్వయంభూ గా వెలసి భక్తులను అనుగ్రహిస్తోంది .

రెండవ కథ ప్రకారం ' కలికాల ' అసురుడు దేవతలపై యుధ్దమునకు రాగా దేవతలు అతనిపైకి వారివారి ఆయుధాలను ప్రయోగించగా అసురుడు వాటిని వ్యర్ధపరుస్తాడు , అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించగా దానిని అసురుడి ముక్కలు గావిస్తాడు , వాటి నుంచి పదహారు కళలతో విరాజిల్లుతున్న  దేవి ఉద్భవించి అసురుడి సంహరిస్తుంది , వజ్రాయుధం నుంచి ఉద్భవించిన కారణాన అమ్మవారిని ' వజ్రేశ్వరి ' గా పిలువసాగేరు .

మరో కథనం ప్రకారం కృత యుగం లో దక్షుని యాగానికి పిలువని  పేరంటంగా వెళ్లిన సతీదేవిని దక్షుడు అవమానపరచగా , సతీదేవి ఆత్మ త్యాగం చేసుకొంటుంది . ఈశ్వరుడు సతీ దేవి వియోగాన్ని సహించలేక ఆమె శరీరాన్ని భుజాన ధరించి రుద్రతాండవ మాడగా , ఆ తీవ్రతకు ముల్లోకాలూ కంపించసాగేయి . దేవతలు విష్ణుమూర్తిని రుద్రుని శాంతింప జేయవలసినదిగా వేడుకొనగా విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆ భాగాలు దేశం నలుమూలలా విరజిమ్మ బడ్డాయి . అలా సతీదేవి శరీరభాగాలు పడ్డ ప్రదేశాలలో అమ్మవారు స్వయంభూగా వుద్భవించిందని , వీటిని శక్తి పీఠాలని అంటారు .

ఈ ప్రదేశం లో సతీ దేవి యొక్క యెడమ స్థనం పడింది .

పాండవులు అరణ్యవాసంలో వుండగా వారికి కలలో అమ్మవారు కనిపించి తాను అక్కడ భూమి లో వున్నట్లు  , తనను అక్కడ నుంచి తీసి మందిర నిర్మాణం చేసి పూజలు చేయవలసినదిగా ఆదేశిస్తుంది . పాండవులు అదేరాత్రి అమ్మవారు ఆదేశించిన ప్రదేశంలో త్రవ్వి ' పిండి ' రూపంలో వున్న అమ్మవారిని వెలికి తీసి తెల్లవారేలోగా మందిర నిర్మాణం పూర్తి చేసి పూజలు చేసుకున్నారు . కురుక్షేత్ర సంగ్రామంలో గెలిచిన తరువాత పాండవులు వజ్రేశ్వరి దేవిని దర్శించుకొని వెలలేని కానుకలు సమర్పించుకున్నారు .

మరో స్థానికంగా వున్న కథనం ప్రకారం మాత వైష్ణవదేవీకి యెనమండుగురు అక్కచెల్లెళ్లు వుండేవారు , వైష్ణవదేవీ పరమశివుని వివాహమాడదలచి ఘోర తపస్సునాచరిస్తుంది .  వైష్ణవదేవి తపస్సు చేసుకొనేటప్పుడు ఆమెకు సహాయంగా వుండేవారు , భైరవనాథుడు వైష్ణవీ దేవిని మోహించి ఆమెను వెతుకుతూ త్రికూట పర్వతాలలో ఆమె వున్నట్లు తెలుసుకొని అక్కడకి వెళ్లగా కోపోద్రేకంతో మాత భైరవుని సంహరించి  తిరిగి తపస్సు చేసుకోసాగింది .

ఆమె అక్కచెల్లెళ్లు ఆమెకు యెటువంటి ఆపదా కలుగకుండా  వుండేందుకు యీ చుట్టుపక్కల పర్వతాలపైన నివాసం యేర్పరచుకొని వుండసాగేరు . కలియుగంలో యీ ప్రదేశాలు శక్తి పీఠాలుగా గుర్తింపబడ్డాయి . ఆ ప్రదేశాలు ధారి దేవి ( రుద్రప్రయాగ దగ్గర అలకనంద వొడ్డున ) , నైనాదేవి ( హిమాచల్ లో బిలాస్ పూర్ జిల్లా ) , జ్వాలాజీ ( హిమాచల్ లో జ్వాలముఖి పట్టణం ) , శీతలా మాత ( హిమాచల్ లోని ధర్మశాల ) , చాముండా దేవి ( హిమాచల్ లోని కాంగ్రా లోయ ) , చింతపూర్ణి ( హిమాచల్ ప్రదేశ్ ) , వజ్రేశ్వరి ( కాంగ్రా లోయ హిమాచల్ ) , మానసా దేవి ( పంచకుల, ఛండీగఢ్ ) . ఈ తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు కన్యలు , అందుకే దశరా నవరాత్రులలలో తొమ్మిది కన్యలకు కన్యా పూజలు చేయడం , వారితో పాటు ఒక మొగపిల్లడికి కూడా కన్యలతో పాటు భోజనంపెట్టి బహుమతులివ్వడం అనే ఆచారం అనాదిగా ఉత్తర భారతదేశం లో వుంది . తొమ్మిది మంది కన్యలు వైష్ణవదేవి మరియు ఆమె అక్కచెల్లెళ్లు అని మగపిల్లాడు వైష్ణవీ దేవి చేతిలో మరణించిన భైరవుడని నమ్ముతారు . ఆ నమ్మకం ప్రకారం వజ్రేశ్వరీ దేవి వైష్ణవదేవి అక్కచెల్లెలు .     మహమ్మదు గజని యీ మందిరాన్ని కనీసపక్షం లో అయిదు సార్లు కొల్లగొట్టినట్లు చరిత్ర చెప్తోంది .

ఈ మందిరం లో ' ద్యాను భగత్ ' అనే అమ్మవారి భక్తుడు , అక్బరు చక్రవర్తి ఒకసారి ఈ ప్రాంతాలలో సంచరిస్తూ  వుండగా అక్బరు అమ్మవారి మహిమలగురించి ప్రశ్నించగా అతను అమ్మవారు యెల్లవేళలా అన్నిరకాలుగా భక్తులను కాపాడుతుంది అని సమాధానం యిస్తాడు . అక్బరు ద్యాను భగత్ గుర్రం శిరస్సును ఖండించి అమ్మవారిని తిరిగి గుర్రాన్ని బ్రతికించమని లేదా అమ్మవారికి యెటువంటి మహిమలు లేవని ఒప్పుకోవలెనని సవాలు చేసి విడిదికి వెళ్లిపోతాడు .

ద్యాను భగత్ అమ్మవారిని పరిపరివిధాలుగా వేడుకొని అమ్మవారు పలుకకపోతే తన శిరస్సును ఖండించుకొంటాడు . అమ్మవారు అతని భక్తి కి మెచ్చి ప్రత్యక్షమయి అతనిని అతని గుర్రాన్ని బతికిస్తుంది . ద్యాను భగత్ అమ్మవారిని పరిపరి విధాలుగా స్తుతించి భక్తులకు సులువుగా కోర్కెలు తీర్చమని వేడుకుంటాడు అందుకు అమ్మవారు సరేనని యెవరైతే కొబ్బరికాయను ఆమెకు సమర్పిస్తారో వారు తనకు శిరస్సు ను సమర్పించినట్లు గా భావించి వారి కోరిక యెంత పెద్దదయినా తీరుస్తానని మాట యిస్తుంది . ఇక్కడ కొబ్బరికాయకు యెర్ర బట్ట కట్టి దేవికి సమర్పించడం కనిపిస్తుంది . " ద్యాను భగత్ " విగ్రహం గర్భగుడి దగ్గర వుంటుంది .

ఈ కోవెలలో వున్న మరో విచిత్ర మైన విషయం యేమిటంటే కోవెల ప్రాంగణం లో మూడు సమాధులు వుండడం . మరే కోవెలలోనూ సమాధులు వుండడం చూడలేదు . విషయం తెలుసుకోవాలని యెంత ప్రయత్నించినా యెవ్వరి దగ్గరనుంచి జవాబు దొరకలేదు . గూగులమ్మ కూడా యెటువంటి సమాధానం చెప్పలేక పోయింది .

ఈ కోవెలలో వున్న న్యాయశిల కి కూడా ఓ మహత్మ్యం వుంది అదేమిటంటే యెవరికైనా న్యాయస్థానంలో న్యాయం జరగకపోయినా , వేరే కారణాల వల్ల న్యాయస్థానం వరకు వెళ్లని విషయమైనా యీ శిల పై  చేయివేసి వివరాలు విన్నవించుకుంటే వారికి వెంటనే న్యాయం జరుగుతుందట .

కోవెల గర్భగుడి పురాతనమైన కట్టడమే కాని బయట , ప్రాకారం అన్నీ కొత్తగా పాలరాతితో నిర్మించేరు .

ఇక్కడ దేవి నవరాత్రులు , మకరసంక్రాంతి ముఖ్యంగా జరుపుకొనే పండగలు . మకరసంక్రాంతి కి అమ్మవారికి వెన్నపూసి అయిదురోజులు పండగ జరుపుతారు .

అద్భుత మైన మందిరాన్ని దర్శించుకున్నామనే తృప్తితో వెనుతిరిగేం .

పై సంచికలో భారతదేశపు ' అంకోర్ వాట్ ' గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
gongoora pappu