Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

పెళ్ళి చూపులు చిత్రసమీక్ష

pelli choopulu movie review

చిత్రం: పెళ్ళిచూపులు 
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ, అభయ్‌ కురువిల్లా, ప్రియదర్శన్‌ తదితరులు 
సంగీతం: వివేక్‌ సాగర్‌ 
సినిమాటోగ్రఫీ: నగేష్‌ బెగెల్లా 
నిర్మాణం: దర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ 
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని 
సమర్పణ: డి. సురేష్‌బాబు 
దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ 
విడుదల తేదీ: 29 జులై 2016

క్లుప్తంగా చెప్పాలంటే

ఇంజనీరింగ్‌ చదువు అబ్బదుగానీ వంటలంటే చాలా ఇష్టపడే కుర్రాడు ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ). ఉద్యోగం చూసుకోమని తండ్రి పోరు పెడుతోంటే, వంటల కాన్సెప్ట్‌తో చిన్నపాటి బిజినెస్‌ చెయ్యాలనుకుంటాడు ప్రశాంత్‌. పెళ్ళయితే కుర్రాడు లైన్‌లో పడతాడనుకుని తల్లిదండ్రులు ప్రశాంత్‌కి పెళ్ళి చూపులు చూస్తారు. అక్కడ పెళ్ళికూతురు చిత్ర (రీతూవర్మ)ని కలుస్తాడు విజయ్‌. అయితే ఆమెకు అప్పటికే ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉంటాడు, బాయ్‌ఫ్రెండ్‌తో చిత్రకి బ్రేకప్‌ అవుతుంది. ప్రశాంత్‌, చిత్ర పెళ్ళిచూపుల తతంగాన్ని ఇష్టపడరు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరి ఇష్టాలు ఇంకొకరికి తెలుస్తాయి. పెళ్ళి గురించి ఆలోచించకుండా తమ తమ అభిరుచుల్ని అమల్లో పెట్టి ఓ బిజినెస్‌ చెయ్యాలనుకుంటారు. అదేంటి? ఆ బిజినెస్‌ ఆ ఇద్దర్నీ వైవాహిక బంధంతో ఒక్కటి చేసిందా? లేదా? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

'ఎవడే సుబ్రహ్మణ్యం'లో నటించిన విజయ్‌, ఈ సినిమాలో హీరోగా సత్తా చాటాడు. ఏ తరహా యాక్టింగ్‌కైనా సరిపోతానన్పించాడు. పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. లవ్‌ స్టోరీస్‌కి బాగా సరిపోతాడని సినిమా చూసినవారంతా విజయ్‌ గురించి మాట్లాడుకుంటారు. నటుడిగా ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు విజయ్‌.

హీరోయిన్‌ రితూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అవసరమైన సందర్భాల్లో అవసరమైనంత మేర నటనా ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆమెకు హీరోయిన్‌గా మంచి గుర్తింపునివ్వడం ఖాయం. అందివచ్చిన అవకాశాల్ని అద్భుతంగా వినియోగించుకుంది రీతూ వర్మ. హీరో పాత్రలో ప్రియదర్శన్‌ నటన బాగుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

చాలా సింపుల్‌ కథని కొత్తగా ప్రెజెంట్‌ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. యువతను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నా దానికి ఫ్యామిలీ టచ్‌ ఇచ్చాడు. యూనివర్సల్‌ అప్పీల్‌ తీసుకురాగలిగాడు. మాటలు బాగున్నాయి. నేటితరం ఆలోచనలకు తగ్గట్టుగా సినిమా ఉంది. యువతను ఆకట్టుకునేలా సినిమాని తీర్చిదిద్దాడు. ఎడిటింగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్పయ్యాయి.

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడం తెలుగు సినీ రంగంలో పరమ రొటీన్‌ ఏమీ కాదుగానీ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ మధ్యకాలంలో ఎన్నో ఉదాహరణలు. చిన్న సినిమాని కూడా లిమిటెడ్‌ బడ్జెట్‌తో అందంగా చూపించవచ్చని, యువతను బేస్‌ చేసుకుని సినిమాని తీసినా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించవచ్చునని కొందరు మాత్రమే గ్రహిస్తారు. వారి నుంచే మంచి సినిమాలొస్తాయి. ఈ చిత్రం కూడా ఆ కోవలోకే చెందుతుంది. మామూలు కథ, మామూలు కథనం ఇవన్నీ అర్థమయ్యేలా, ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం అంటే విశేషమే కదా. కథలోకి ప్రేక్షకుల్ని లీనం చేయగలిగితే ఏ దర్శకుడైనా సక్సెస్‌ అయినట్లే. తెరపై పాత్రలు, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతే సినిమా హిట్టయినట్టే కదా. ఫస్టాఫ్‌ బాగుంది, సెకెండాఫ్‌ కూడా బాగుంది. యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసింది. తగినంత ప్రమోషన్‌ తోడైతే ఈ సినిమా ఓ మంచి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌నిచ్చి విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయం.

ఒక్క మాటలో చెప్పాలంటే

'పెళ్ళిచూపులు' ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka