Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఎప్పటికైనా ఓ మాంచి సినిమా అందించాలి -రాజ్ కందుకూరితో ఇంటర్వూ
 
రాజ్ కందుకూరి అంటే ఎవరు అని అడిగేవారు వుంటారేమో కానీ, సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి అబ్బాయి అంటే ఇక పరిచయం పెద్దగా అక్కరలేదు. ఎంత మంది మహా మహా వాళ్లకు గురువు అయిన శివానందమూర్తి గారి అబ్బాయి. కానీ వృత్తి మాత్రం అమెరికాలో వ్యాపారం. అయితే ప్రవృత్తి మాత్రం సినిమా. ఇలా భిన్న ప్రపంచాల నేపథ్యం వున్న రాజ్ కందుకూరి నిర్మాతగా అందిస్తున్న సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా ఈవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి
 
*ఎక్కడి నుంచి ఎక్కడకు చేరారు? ఈ సినిమా ప్రపంచం లోకి రావడం ఎలా కుదిరింది?
- నేను ఓ సారి అమెరికా నుంచి తిరిగివస్తూ, మార్గమధ్యంలో బుద్ధ గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాను. సరిగ్గా అదే సమయంలో నాన్నగారు ఫోన్ చేసారు. ఆయన రచించిన గౌతమ బుద్ధ పుస్తకాన్ని తెరకెక్కించమని కోరారు. చాలా యాదృచ్ఛికమైన సంఘటన. కానీ దాని వెనుక ఏదో పరమార్థం వుందనిపించింది. వెంటనే అల్లాణి శ్రీధర్ గారి దర్శకత్వంలో ఆ సినిమా చేసాం. అవార్డులు, ప్రశంసలు దక్కాయి.

* సరే, నాన్నగారి కోరిక మీద సినిమా తీసారు. మరి ఇక్కడే ఎందుకు వుండిపోయారు?
- నిజానికి నా మనసులో ఎక్కడో, ఏదో మూల సినిమాలపై చిన్న ఫ్యాషన్ వుంది. ఇక్కడ అప్పటికే వున్న పరిచయస్తులు, కొత్తగా పరిచయం అయినవారు, అందరితో స్నేహం నన్ను ఇక్కడే వుండేలా చేసింది.

* సాధారణంగా ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టినవారు, ఎప్పటికైనా ఓ పెద్ద సినిమా చేయాలని అనుకుంటారు? మరి మీరు?
- పెద్ద సినిమా అని కాదు కానీ, ఓ మంచి సినిమా, జనాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒకటయినా చేయాలని వుంది. అలాంటి సినిమాలో నిర్మాతగానో, సమర్పకుడిగానో, ఇంకా ఏదైనా చిన్న లేదా పెద్ద భాగస్వామ్యం నాది వుండాలన్నది నా కొరిక.

* మీరు తరచు మంచి మంచి ఫోటోలు ఫేస్ బుక్ లో పెడుతుంటారు. నటించాలన్న కోరిక కూడా ఏ మూలో వుందేమో?
- నిజమే..అయితే ఇప్పుడు కాదు. ఒకప్పుడు వుండేది. ఇక ఇప్పుడు లేదు. అయినా చాలా మంది అడిగారు. అడుగుతూనే వున్నారు చేయమని. కానీ చేయడం లేదు. అంతకు మించి నా బ్యానర్ ద్వారా మంచి టాలెంట్ వున్న నటులు, దర్శకులను పరిచయం చేయడం ఇష్టం. మనం పరిచయం చేసిన వాళ్లు మనకే అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలని కోరుకుంటాను నేను.

* ఇంత‌కీ పెళ్లి చూపులు సంగ‌తేంటి?
-  ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా.  పెళ్లి చూపుల సీన్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ పెళ్లి చూపుల్లోనే హీరో, హీరోయిన్లు ఒక‌రికొక‌రు ప‌రిచ‌యం అవుతారు. అక్క‌డ్నుంచి వాళ్లిద్ద‌రి క‌థ‌లు మ‌లుపు తిరుగుతుంది. అదెలా అనేది తెర‌పై చూడాలి.

* విడుద‌ల‌కు ముందే ఈ సినిమాని చాలామందికి చూపించారు.. మ‌రీ ముఖ్యంగా పాత్రికేయుల‌కు. అంత న‌మ్మ‌కం ఏంటి?
- నా న‌మ్మ‌కం నా సినిమాపైనే. కొత్త‌ద‌నం నిండిన చిత్రాలకు త‌ప్పకుండా ఆద‌ర‌ణ ఉంటుంది. ఓ సినిమా మీడియాకి న‌చ్చితే త‌ప్ప‌కుండా భుజాల‌నెత్తుకొంటుంది. ఈ సినిమా చూసిన‌వాళ్లంతా బాగుంది.. సూప‌ర్ హిట్ అన‌డ‌మే. ఒక్క విమ‌ర్శ కూడా నాకు వినిపించ‌లేదు. మీడియా కూడా బాగా స‌పోర్ట్ చేస్తోంది. కేవ‌లం మౌత్ టాక్‌తోనే మా సినిమాకి విప‌రీత‌మైన ప్ర‌చారం ల‌భించింది.

* త‌రుణ్ భాస్కర్ కొత్త ద‌ర్శ‌కుడు క‌దా, ఏం న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు?
- అత‌ను చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. దానికి తోడు.. ద‌ర్శ‌క‌త్వంలో అత‌నికి అనుభ‌వం ఉంది. ఫీచ‌ర్ ఫిల్మ్ తీసుండ‌క‌పోవొచ్చు. కానీ సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. యూ ట్యూబ్‌లో దానికి ల‌క్ష‌ల వ్యూవ్స్ ఉన్నాయి. అత‌నికి జ‌నాల ప‌ల్స్ తెలుసు అనిపించింది.

* ఈ క‌థ‌లో మీకు న‌చ్చిన అంశాలేంటి?
-  క‌థ‌ని ద‌ర్శ‌కుడు చాలా ఎంట‌ర్‌టైనింగ్ వేలో చెప్పాడు. అంత‌ర్లీనంగా చూస్తే.. అందులోనే ఓ మెసేజ్ ఉంది. యువ‌త త‌మ ప్ర‌తిభా పాట‌వాల్ని బ‌య‌ట‌పెట్ట‌గ‌లిగితే ఎంత‌టి ఉన్న‌త ల‌క్ష్యాల‌నైనా అందుకొంటార‌ని చెప్పాం. క‌థానాయ‌కుడు, నాయిక పాత్ర‌లు రెండూ ఆద‌ర్శ‌వంతంగా ఉంటాయి.

* క‌థాబ‌లం ఉన్న చిత్రాలు రావ‌డం లేదు.. కొత్త త‌రంతో ఈ ప‌రిస్థితి ఏమైనా మారుతుందా?  
- త‌ప్ప‌కుండా. ఏ సినిమాకైనా క‌థే హీరో. ఆక‌లి రాజ్యం సినిమా ఇప్ప‌టికీ మ‌న‌కు గుర్తుండిపోవ‌డానికి కార‌ణం.. క‌థ‌, అందులోని బ‌ల‌మైన భావోద్వేగాలే. అలాంటి క‌థ‌ల‌నే సినిమాలుగా మ‌ల‌చాల‌న్న‌ది నా ప్ర‌య‌త్నం.

* కొత్త‌వారిని ప‌రిచ‌యం చేయ‌డ‌మంటే మీకు బాగా ఇష్ట‌మ‌నుకొంటా..
- అవును. ఎవ‌రిలో ఎంత ప్ర‌తిభ ఉందో  ఎవ‌రికి తెలుసు?  భుజం త‌ట్టి ప్రోత్స‌హిస్తే.. అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌వాళ్లు చాలామంది ఉన్నారు. త‌రుణ్ భాస్క‌ర్ అందులో ఒక‌డు. ఈసినిమా ప‌ట్టాల‌మీద ఉండ‌గానే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. సినిమా విడుద‌ల‌య్యాక‌... మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తాయి.

* అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేయాల‌ని లేదా?
- ఎందుకు లేదు..??  వ‌చ్చే యేడాది త‌ప్ప కుండా ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తా. అందుకు త‌గిన ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నాం. మా సంస్థ‌లో ఇక నుంచి వ‌రుస‌గా సినిమాలు చేస్తాం. త‌రుణ్ భాస్క‌ర్‌తోనే ఓ సినిమా ఉంటుంది. అదో క్రైమ్ థ్రిల్ల‌ర్‌.  షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో నైపుణ్యం చూపించిన ద‌ర్శ‌కుల‌కు మా సంస్థ నుంచి అవ‌కాశాలిస్తాం. ప్ర‌తిభావంతుల‌కు మా సంస్థ త‌లుపులు ఎప్పుడూ తెర‌చే ఉంటాయి.

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
nats yuva kalavahini awards