Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vrukshamulu - jeeva samrakshakulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుని అసహనం - అనంత

సింగపూర్ పాఠం-3



చిన్న దేశంలో బోలెడు టూరిస్ట్ ఎట్రాక్షన్స్ ఏర్పాటు చేసుకున్నారు.
సెంటోసా, యూనివర్సల్ స్టూడియోస్, సింగపూర్ ఫ్లైయర్, జురాంగ్ బర్డ్ పార్క్, వండర్ వాటర్ వరల్డ్, సింగపూర్ జూ, నైట్ సఫారి సింగపూర్, సింగపూర్ బొటానికల్ గార్డెన్స్, పెరణకం మ్యూజియం, శ్రీ మరియమ్మన్ గుడి, టైగర్ స్కై టవర్, కోసు ద్వీపం, ఎంటి.యు.సి. డౌన్ టౌన్ ఈస్ట్, అమెరికన్ చర్చ్, క్లైడ్ ఫారెస్ట్, మెరీనా బే, గార్డెన్స్ బైదిబే, నేషనల్ ఆర్చిడ్ గార్డెన్, మెరీనా బే సాండ్స్ స్కై పార్క్సూపర్ టీ గ్రోవ్, మెరీనా బేసాండ్స్ కేసినోవా....ఒకటా, రెండా..!!!
అతి చిన్న దేశంలో రెండురోజులు తిరిగి చూసినా, ఇంకా మిగిలిపోయే టూరిస్ట్ స్పాట్స్...
ప్రతి టూరిస్ట్ స్పాట్ వద్ద నూటికి నూరుశాతం పరిశుభ్రత, పచ్చదనం, ఫుడ్ కోర్ట్స్, చిన్న చిన్న బహుమతులు, బట్టలు అమ్మే షాప్స్..
ఒక్క బిచ్చగాడు కూడా కనిపించడు. అలాగే దొంగతనం, మోసం మచ్చుకు కూడా కనిపించవు..
టాక్సి వాళ్ళు నీతి నిజాయితీలతో టాక్సీఫేర్ తీసుకుంటారు. ఎక్కడబడితే అక్కడ సింగపూర్ పోలీసులు కనిపించరు. కానీ వందశాతం నిఘా 24 గంటలు కొనసాగుతూనే ఉంటుంది.
స్త్రీలకు సంపూర్ణ రక్షణ ఎల్లవేళలా ఉంటుంది.
మరిక్కడ...?
మొట్టమొదటిది అపరిశుభ్రత..
ఎటు చూసినా చెత్తాచెదారం...
పూర్ క్వాలిటీ రెస్టారెంట్స్...
షాపింగ్ మోసాలు...
ఆటోలు, కేబ్స్ డ్రైవర్ల మోసాలు...
రక్షణ శూన్యం..
విదేశస్తుల్ని దోచుకోవటాలు..టూరిస్ట్ లుగా వచ్చే స్వదేశీ, విదేశీ వనితల్ని ఎత్తుకెళ్ళిపోయి, దోపిడీ, అత్యాచారాలు..ఎందుకొచ్చారమ్రా బాబు...అనే అసహనం, అసహ్యం కలిగించేపరిస్థితులు...
ఈ మాత్రం దానికి వేలాది కోట్ల కెటాయింపు...
ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లోని పర్యాటక మంత్రులు గాని, అటు కేంద్రంలో పర్యాటక మంత్రి గాని చేసేదేం లేదు.
ఏమి చేయరు. పైగా నిర్లజ్జగా టూరిజం నిధులు మింగేయటం..
మనది ఎంత పెద్ద దేశం...?
ఎన్ని టూరిస్ట్ ప్లేసులున్నాయి...?
వందలు కాదు...వేలున్నాయి...
అయినా వాటిని పట్టించుకొనే నాఢుడే లేడు.
లక్షల కోట్ల విదేశీ ఆదాయం ఆర్జించాల్సిన భారత దేశపు పర్యాటక పరిశ్రమ 88% మూలన పడుంది.
అష్టాదశ శక్తి పీఠాలు...
పంచారామాలు...జ్యోతిర్లింగాలు..ఇతర సుప్రసిద్ధమైన , అతి పురాతన దేవాలయాలు, కోటలు, పేటలు..
ఒకప్పటి రాజుల ప్యాలస్ లు...ప్రకృతి వింతలు..
వేలకువేలు సందర్శనీయ స్థలాలున్నా వాటిని బాగు చేసి పర్యాటకుల ఆసక్తిని ఇనుమడింప చేసే చర్యలు ఏమీ లేవు ఇక్కడ..
ఈ దేశంలో బాగు రాజకీయ నాయకులకు పట్టదు..
ఇక్కడ అడిగేవాడేడీ?
అందిన కాడికి దోచుకోవటమే ఇక్కడ ప్రధానమైన వ్యాపకం,,
సిగ్గు..శరం..చీము..నెత్తురు, మానాభిమానాలు, నీతినిజాయితీ లేని నాయకుల పాలనలో మగ్గిపోతున్న భారతదేశపు సామాన్య పౌరులు తమ సహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారీ మధ్య..లీ కాన్ చ్యూ మోడరన్ సింగపూర్ ఫౌండర్, ఈయన వేసిన నీతినిజాయితీ విత్తనాలే ఈరోజు ఆదేశానికి శ్రీరామ రక్ష.
ఈయన ఏకధాటిగా 25 సంవత్సరాలకు పైగానే సింగపూర్ ప్రధానిగా ఆదేశానికి దిశానిర్దేశం చేసారు.
ప్రపంచంలో ఎక్కడా ఇంతకాలం దేశాధినేతగా ఉన్న నాయకుడు మరొకరు లేరు.
ఈయన 2015 లో పరమపదించారు.
పీపుల్స్ ఏక్షన్ పార్టీ స్థాపించి దేశాన్ని సరైన మార్గంలో నడిపిన గొప్ప నాయకుడీయన.
89 పార్లమెంట్ సీట్స్ లో 83 సీట్స్ గెలుచుకొన్న ఉన్నతాదర్శాలు కలిగిన పార్టీ ఇది.
ఇప్పుడీయన కొడుకే లీ హెయిన్ లూంగ్. 2004 నుంచి సింగపూర్ కి ప్రధానిగా కొనసాగుతున్నారు.
ఎక్కడా చిన్న మచ్చ లేని నాయకులు ఆ దేశానికి ప్రధానులు కావటం మూలంగానే ఆ దేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలన్నీ సింగపూర్ తమ ప్రాంతీయ కార్యాలయల్ని ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంత నీతి వంతమైన దేశం సింగపఊర్...!!!
వ్యక్తిగత ఆదాయంపై వాళ్ళు విధించే ఇంకం టాక్స్ కేవలం 13.8 శాతం.
కార్పొరేట్ టాక్స్ 17శాతం. కేవలం 55లక్షలు జనాభా కలిగిన దేశం సింగపూర్ తలసరి ఆదాయం 82,762 అమెరికన్ డాలర్స్.
అంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఆదాయం 55,45,054 రూపాయలు సంవత్సరానికి.
నిరుద్యోగం కేవలం 3% మాత్రమే ఆ నిరుద్యోగం తాత్కాలికమే. ఆరు నెలల లోపే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది.
సంవత్సరానికి 67.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ సింగపూర్ లోకి ప్రవహిస్తూంటాయి వివిధ దేశాల నుంచి.
అల్లర్లు..దొమ్మీలు హత్యలు, మోసాలు, రేప్ లు, విపరీతమైన లంచగొండితనం పాతుకుపోయిన మన దేశంలోకి విదేశీ నిధుల రాక అత్యంత స్వల్పమే..
ఒక సింగపూర్ డాలర్ విలువ మన కరెన్సీలో 50 రూపాయలు..ఎంత సిగ్గుచేటు?
మన దేశాన్ని పాలించే పార్టీలు, నాయకులు, ఉన్నతాధికారులు మారరు. ఇక మన దేశం బాగుపడేదెట్లా?
ఇది బిలియన్ డాలర్ల ప్రశ్న...


వచ్చేవారం సింగపూర్ పాఠం-4 

మరిన్ని శీర్షికలు