Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
talavonpu

ఈ సంచికలో >> కథలు >> మానవత్వం పరిమళించిన వేళ

manavatvam parimalinchina vela

తను మరో రెండుగంటల్లో రాజమండ్రిలోని తన చెల్లెలి గారింట్లో వుంటాడు. ఈ మధ్య కాలంలో ఇటొచ్చినా  అప్పటి తన పరిస్తితి పూర్తి యాంత్రిక స్తితి. ఇన్నాళ్లూ తన సర్వస్వం డిస్పెంసరీనే అనుకున్నాడు. ఖరీదైన రోగాలు గల పేషంట్లే  తన ప్రపంచం అనుకున్నాడు. తన వృత్తిలోనే ఆకాశమంత  ఎదగాలని పేరున్న డాక్టర్ గా మిగిలిపోవాలన్న స్వార్ధ చింతన వెంటాడ సాగింది.

నిజానికి తన బంధు వర్గం తననో పెద్ద స్వార్ధ  పరుడినిగా చిత్రీకరించింది. డబ్బులోనే ఆనందం వెతుక్కుంటాడని అపవాదు వేసింది. తన చుట్టూ ఒక బలమైన కంచె వేసుకుని సంప్రదాయాలు, కట్టుబాట్లకు అతీతంగా వ్యవహరిస్తున్నాడని  తీవ్రంగా  దుయ్యబట్టింది.

డాక్టర్ మోహన్రావులో అంతర్మధనం మొదలయ్యింది కొన్నాళ్లుగా..  రాత్రిళ్ళు నిద్ర కరువయ్యి అటూ ఇటూ పచార్లు చేసేవాడు. ఎన్నోసార్లు ఉవ్వెత్తున లేచి పడే ఆలోచనా తరంగాలను బలవంతంగా అదిమి పట్టేవాడు. ఆ సమయంలోనే అతనికి సరైన సమాధానం లభించింది. . కొన్నాళ్ళు తన వృత్తి బంధనాలకు తెరదించి బంధు జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నాడు. ఆ ఆలోచనలకే కార్యరూపం భార్య నిర్మలతో సహా  రాజమండ్రి ప్రయాణం. మరో కొద్ది నిముషాల్లో తన చెల్లెలు భారతి ఇల్లు చేరుకోబోతున్నాడు . డాక్టర్ మోహన్రావులో అతని  వృత్తికి అతీతంగా  భరించలేని టెన్షన్ కనిపిస్తోంది. ఇన్నాళ్ళ తర్వాత భారతి ఎలా రిసీవ్ చేసుకుంటుందో ? నిజానికి తనలో ఇంత త్వరగా జ్ఞానోదయం కలగడం వెనుక తన భార్య నిర్మల సహకారం కూడా  వుంది.

గుమ్మంలో కారు ఆగగానే భారతి అన్నగారికి, వదినకు  స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళను చూస్తూనే ఆమె కళ్ళు  నీటి చలమలయ్యాయి. ఆ వెంటనే మొహం కలువ పువ్వులా వికసించింది. మోహనరావు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర తళుక్కుమంది. ఇన్నాళ్ళకు అదీ తన ముంగిట్లో అన్నగారిని, వదినను చూస్తున్నందుకు భారతి  ఇంకా విచిత్రమైన  భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే వుంది.

     “ కొన్నాళ్ళు మనవాళ్ళు, మన ఆత్మీయుల  మధ్య ఉండిపోదామని వచ్చేసామోయ్” అన్నాడు మోహనరావు సోఫాలో కూర్చుంటూ . ఆ మాట అంటుంటే అతని కళ్ళు గర్వంగా మెరిసాయి. అతనికిప్పుడు నిజమైన స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నట్టుగా వుంది.

“మరి డిస్పెంసరీ మాటో? ’’  అడిగింది భారతి అన్నగారు అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడేమో అన్న అనుమానంతో.

“నాకా వర్రీ లేదోయ్ . ఇకముందు కూడా వుండదు. నీ మేనల్లుడు  రఘు ఇప్పుడు  నన్ను మించిపోయాడు.. వాడికి పేషంట్ల మీద ఉన్న శ్రద్ద అంతా ఇంతా కాదు. వృత్తి పట్ల వాడికున్న అంకిత భావం నన్ను బాగా ఆకర్షించింది. అందుకే కొన్నాళ్ళు వాడిని ఒంటరిగా వదిలేసి నా ఆత్మీయులు, మిత్రుల సేవలో గడపాలనుకుంటున్నాను. ” ఆ మాటలు అంటూంటే మోహన్రావులో పెద్ద రిలీఫ్ కనిపిస్తోంది. చక్కని మేడ, దాని చుట్టూ ప్రహరీ గోడ , గోడ లోపల అందమైన చెట్ల సముదాయం, ఆ ఇంటి కొచ్చే అతిధుల కోసం మేడ మీద విడిగా గది మోహన్రావును, నిర్మలను బాగా ఆకట్టుకున్నాయి.

భారతి మోహన రావు ఆఖరి చెల్లెలు. వాళ్ళిద్దరి మధ్య ఎనిమిదేళ్ళ  గ్యాప్ ఉంది. దాంతో మోహన రావుకు ఆ అమ్మాయంటే చాలా ఇష్టం. అందుకే తన ప్రోగ్రాం లో ముందుగా భారతి ఇల్లు ఎంచుకున్నాడు. డాక్టర్ దంపతులు వచ్చారనగానే భారతి భర్త సందీప్  పది నిముషాల్లో ఇంట్లో వాలాడు. ఆ రాత్రి అన్న గారి కిష్టమైన పెసర పప్పు పాటోళీ, ఉల్లి పాయ పులుసు, ప్రక్కన గుమ్మడి కాయ వడియాలు, వగైరా వగైరాతో భోజనం వడ్డించింది.

భోజనం మధ్యలో సందీప్ ఎక్కువగా నీళ్ళు తాగడం గమనించాడు మోహనరావు. వెంటనే అతనిలోని డాక్టర్ బయటకు వచ్చాడు.  “ బావ గారు ఏమి అనుకోకండి. భోజనం మధ్యలో నీళ్ళు ఎక్కువగా త్రాగకండి. మనకందిరికీ తెల్సిందే అనుకోండి. పొట్టలో ఊరిన హైడ్రోక్లోరిక్ ఆసిడ్ బాగా పలుచనయ్యి తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల కడుపులో మంట, అజీర్ణం , గ్యాస్ తయారయ్యి పులి తేనుపులు రావడం లాంటి సమస్యలతో మొదలయ్యి ఇతర రోగాలకు దారి తీస్తుంది. అలా కాకుండా ఒక గంటా గంటన్నర తర్వాత నీళ్ళు తీసుకుంటే జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది.” అన్నాడు మోహన రావు హాస్పిటల్లో రోగులకు చెపుతున్నట్టు మొహం పెట్టి.

“చాల్లెండి  మీ డాక్టర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా , అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ధ్యాస లేకుండా సందీప్ ని  నీళ్ళు తాగకుండా చేసారు.” అంది నిర్మల కోపంగా మొహం పెట్టి.

      “ఏమి లేదు వదినా ! మేము పొరపాటున కూడా ఏమీ అనుకోం. శంఖంలో పోస్తే గాని తీర్ధం కానట్లు డాక్టర్ చెబితేనే, అదీ కావాల్సిన వాడు అన్నయ్య చెపితే చచ్చినట్టు ఎవరైనా వింటాం. అసలు మీ ఇద్దరూ మా ఇంటికి రావడమే అపూర్వం. అన్నయ్య ఎప్పుడొచ్చి తన సలహాలు ఇస్తాడా అని మేము ఎదురు చూస్తూంటే ఇందులో అనుకునేదేముంది? ఇందాక అన్నయ్య చెప్పిన రోగాలన్నీ ఈయనకున్నాయి. ఆ అల్మారా తెరిచి చూడు ఎన్ని మందులు వాడుతున్నారో తెలుస్తుంది. మౌనంగా అలా భాధ పడతారే తప్ప ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లరు.” అని చెపుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్ళు ఉబికాయి. మోహన రావు ఆ రాత్రి కొన్ని మందులు రాసిచ్చాడు ఎలా వాడాలో చెప్పి.

రాజమండ్రిలో ఉన్న రెండు రోజులు సరదాగా కాల క్షేపం అవడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అనేకానేక అనుమానాలు ఇంటిల్లి పాదికి తీరాయి. ఈ మధ్యలో మోహన రావు రాజమండ్రిలో ఉన్న ఇద్దరు ముగ్గురు సన్నిహితులను కూడా కలుసుకోగాలిగాడు. వాళ్ళ మధ్య పాత జ్ఞాపకాలు వెల్లువలా బయట పడ్డాయి.

ఆ తర్వాత పర్యటనలో భాగంగా విశాఖ పట్నంలో ఉంటున్న పెద్ద చెల్లెలి గారింటికి వెళ్లారు మోహన రావు దంపతులు. అక్కడ కూడా వారిద్దరికీ ఘన స్వాగతం లభించింది. చాలా మంది అనుకుంటూ వుంటారు. “ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కు వెళ్ళినా నిలువు దోపిడేనని,  పైగా రోగం పూర్తిగా నయమవుతుందని గారంటీ లేదని, అయిన దానికి, కాని దానికి, అనవసరమైన పరీక్షలు చేస్తారని,  ఏదైనా అనుమానాలు తీర్చుకోవాలంటే ప్రతి డవుటుకు రేటు పెరిగి పోతుంటుందని , వాళ్ళు ‘పల్స్’ చూడటం మానేసి ‘పర్సు’ మాత్రమే చూస్తున్నారని” .  రోగులలో విపరీతంగా అపవాదులున్న ఈ రోజుల్లో నిజాయితీ ప్రదర్శించి , ప్రజలు దేవుడిలా భావించే డాక్టర్లు తమ స్వార్ధ చింతనను కొంత వరకైనా విడనాడి ప్రజలతో మమైకమై పోవాల్సిన అవసరం ఎంతైనా వుందని చాలా మంది బంధువులు, స్నేహితులూ  మోహన రావు పర్యటన సందర్బంగా నిర్మొహమాటంగా వ్యక్తీకరించటం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది.

 విశాఖ పట్నంలో పెద్ద చెల్లెలు గారింట్లో అన్నీ అరటి చెట్లే. అక్కడ మోహనరావు కిష్టమైన అరటి పువ్వు కూర, దూట కూర, దూట పెరుగు పచ్చడి లాంటి కోరికలు తీరాయి. తను వస్తాడని తెలిసి పెద్ద చెల్లెలు కొడుకు శ్రీకాంత్, అతని భార్య సౌజన్య హైదరాబాద్ నుండి వచ్చారు. శ్రీకాంత్ను ఇంతకు ముందు హైదరాబాద్లో రెండు మూడు సార్లు ఈ మధ్య కాలంలో చూసినా హాస్పిటల్లో బిజీగా ఉండటం వల్ల  అతని పైన  సరిగ్గా మనసు పెట్ట లేక పోయాడు.

“ఇప్పుడు వీడేమిచేస్తున్నాడంటావ్ ?” అని అడిగాడు మోహనరావు శ్రీకాంత్ను ఉద్దేశించి  చెల్లెలు సులోచనతో.

 “ హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. రాత్రంతా డ్యూటీ, పగలంతా పడుకోవటం, వీడి జీవితం పూర్తి యాంత్రికం అయి పోయిందనుకో.  నువ్వొస్తున్నావని తెల్సి అతి కష్టం మీద రెండు రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు. మళ్ళీ రేపే వెళ్లి  పోవాలిట. . అప్పుడే వాడికి టెన్షన్ మొదలయ్యింది ” అంది దిగులుగా సులోచన.

శ్రీకాంత్ జబ్బు పడిన మనిషిలా కనిపిస్తున్నాడు. కుర్చున్నంత సేపు ముళ్ళ మీద ఉన్నట్టుగా వుంది అతని పరిస్తితి. అతని అవస్థ మోహనరావు డాక్టర్ గా ఊహించ గలడు.

“సరిగ్గా మాటలాట్టానికిక్కూడా ఆయనకు టైం ఉండదండి. బయటకెళ్ళి ఏదైనా తీసుకు రమ్మంటే అంతెత్తున లేస్తారు. . కళ్ళు, కాళ్ళు లాగేస్తున్నాయంటారు.. ఎప్పుడూ మంచం పక్కన  పెయిన్ కిల్లర్స్ ఉండాలి. దీనికి తోడు ఉదయాన్నే ఆఫీసు నుండి  వస్తూ అడ్డమైన హోటళ్ళలో నూనె పదార్ధాలన్నీ తిని వస్తారు. మేము కల్సి బయటకు వెళ్ళేది మహా అయితే ఏ నాలుగు నెలలకో ఒకసారి. ఏ విషయంలోనూ ఉత్చాహం వుండదు. తన గది లోకి ఎవ్వరని రానివ్వరు.” అంటూ చెప్పుకు పోతోంది సౌజన్య దుఖం పూడుకు పోయిన  గొంతుతో. ఆమె మాటలు శ్రద్దగా వింటున్నాడు మోహన రావు.

“అంతా అర్ధమైందమ్మా! ఈ సమస్య నీ భర్త ఒక్కడిదే కాదు. నేడు ఐటీ పరిశ్రమలలో, కాల్ సెంటర్స్లో  చాలా మంది ఎదుర్కుంటున్నదే . భయంకరమైన ఒత్తిడుల తాలూకు లక్షణాలు అలాగే వుంటాయి. అసలు వీరి మానసిక స్తితిలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఎక్కువ జీతాలకు ఆకర్షింప బడుతున్న వీళ్ళంతా కనీసం వీరి జీవన విధానం మార్చు కోవడానికి ప్రయత్నం చెయ్యాలి. నిజ జీవితం లోని అవసరాలను , ప్రాముఖ్యతలను గుర్తించి , వాటికీ అనుగుణంగా ప్రణాళికలు రూపొందిన్చుకోవాలి. తద్వారా వారికి కొంత ఆట విడుపు దొరుకుతుంది. తాము అన్ని పనులు చేసుకో గలుగుతున్నామన్న సంతృప్తి వారిలో కలుగుతుంది. ముఖ్యంగా ఆహార విషయాలలో జాగ్రత్త వహించాలి. వేళకు  తినడం, అది జీర్ణం కావడానికి కొంత సమయం ఇవ్వడం, వీలయ్యేంత వరకు పోషకాహారం తీసుకోవటం  ఇది కాకుండా వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి గడపటం ద్వారా కొన్ని శారీరక మానసిక అవ లక్షణాలను సవరించుకోవచ్చు. ఇటు వంటి వారికి మందుల కన్నా కౌన్సిలింగ్ బాగా పని చేస్తుంది. మేము చెపుతున్నవన్ని ఉపన్యాసాలుగా పాఠాలు చెపుతున్నట్టుగా  చాలా మందికి అనిపించవచ్చు.. కానీ ప్రతి వ్యక్తీ తెలుసుకోవాల్సిన విషయాలివి. అప్పటికీ వీటి గురించి అన్నీ ప్రముఖ పత్రికల లోనూ మీడియాల్లోనూ సమాచారాన్ని ఇస్తూనే  వున్నాము. నేటి కుర్ర కారుకు  ఇవేమీ చూసే టైం ఉండటం లేదు. అయినా  కంగారు పడాల్సిందేమీ లేదు. ఈపాటికి శ్రీకాంత్ లో కొంత అవగాహన వచ్చి ఉంటుంది”  అంటూ అత్తా కోడళ్ళకు దైర్యం నూరి పోసాడు మోహన రావు .

“ మరి నీ ఆరోగ్యం, బావగారి ఆరోగ్యం ఎలా ఉంది ?  ఇంతకు ముందు ఒకసారి కలిసినప్పుడు  ఏవో కొన్ని సమస్యలు చెప్పినట్టు గుర్తు. “ అడిగాడు చెల్లిలిని..

“ నా ఆరోగ్యం మాటలా ఉంచు.  మీ బావ గారి గురించే నాకు భయంగా ఉంది. ఈ మధ్య కొలెస్ట్రాల్ చూపించుకుంటే చాలా ఎక్కువగా వుందని చెప్పారుట. ఎక్కడ గుండాగి పోతుందేమోనన్న  భయంతో నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నారు. ఆయనకు అన్నంలో నెయ్యి లేనిదే ముద్ద దిగదు. కూరలు. వేపుళ్ళు  నూనెలో మునిగి తేలాలి.. నూనె లేని ఇడ్లీలు లాంటి పదార్ధాలు అస్సలు ముట్టుకోరు. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏమి చెయ్యాలో చెప్పి పుణ్యం కట్టుకుందూ ?” అంది సులోచన అసహాయంగా దైన్యం నిండిన కళ్ళతో.

“ఎవెరికైనా నేను చెప్పాలనుకున్నదేమిటంటే చాలా మంది రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు వీలయ్యేంత వరకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా ఉండేటట్లు చూసుకోవడం వాళ్ళ చేతుల్లోనే వుంది. ఆహారపు అలవాట్లతో పాటు ముఖ్యంగా టెన్షన్ పనికి రాదు . మనకున్న సమయంలో పుస్తక పఠనం, మంచి సంగీతం వినడం , క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం  లాంటి కొన్ని జాగ్రత్తలతో పాటు శరీర శాస్త్రాన్నీ తెలుసుకుని దాన్ని సక్రమంగా పని చేసేటట్లు చూసుకోవడం మనందరి విధి.. ఇప్పుడు నీకు చెప్పిన విషయాలన్నీ మీ ఆయనకు  తెలియనివి కావు. కానీ అశ్రద్ద వహిస్తే దుష్ఫలితాలు వుంటాయి. నువ్వు కూడా బయో టెక్నాలజీ చదువుకున్నావు కాబట్టి కొంత వరకు నీకు కూడా అవగాహన వుంటుంది. . నేను వ్రాసిన మెడికల్ గైడ్ ఒక కాపీతో పాటు  ఈ  మధ్య  మా డాక్టర్లు  నిర్వహించిన  ఒక అవగాహనా సదస్సును  సీడీ  రూపంలో  కూడా చేసింది ఒకటి  ఇస్తున్నాను. వీటిని  మీ ఆయనకు  చూపించు.  అందులో అన్ని రోగాలకు సంబంధించి వివరాలు వుంటాయి. మన వాళ్ళందరికీ కూడా  ఒక్కొక్క కాపీ దానితో  పాటు  సీడీ  ఇచ్చాను.  ప్రస్తుతం నా ట్రిప్ బరంపురం వరకు సాగుతుంది. . ఇక  నుండి  ప్రతి  ఊళ్ళోనూ  ఫ్రీ  మెడికల్  కాంప్ లు  పెట్టాలనుకుంటున్నాను. మందులు  ఉచితంగా  ఇవ్వాలనుకుంటున్నాను.  ఇప్పటివరకు  సంపాదిన్చిందేదో  సంపాదించాం.  నీ  మేనల్లుడిని డాక్టర్  చేసాను.  ఆ  తృప్తి  మాకు  చాలు. ఇక నుండి  ఎవరికీ  ఏ  అవసరం  వచ్చినా  ఏ  మాత్రం సంశయించ కుండా  నాకు  ఫోన్  చెయ్యడమో, మనింటికి  వచ్చేయడమో  మాత్రం మానొద్దు. ” అని మోహన రావు అంటూ ఉంటే అప్రయత్నంగా సులోచన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..

 తన వృత్తి ధర్మంలో పడి తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో ఇతర  బంధువుల, స్నేహితుల  విషయంలో “ నన్ను ముట్టుకోకు నామాల కాకి” సామెత  చందాన  వ్యవహరించి పూర్తిగా  భాద్యతలు  విస్మరించాడన్న తీవ్రమైన  అపవాదుల నుండి బయట పడటం కోసం తన వ్యవహార శైలిని పూర్తిగా  మార్చుకుని బంధు జన జీవన స్రవంతిలో కలిసి  వారితో   మమైకమై పోవడానికి  సిద్ద పడిన డాక్టర్  మోహన్రావులో  అంతర్లీనంగా ఇప్పుడు  చెప్పలేనంత  తృప్తి సజీవంగా  ఊపిరి పోసుకుంది.

 

మరిన్ని కథలు
markat