Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manavatvam parimalinchina vela

ఈ సంచికలో >> కథలు >> మర్కట్

markat

అనగనగా ఒక అడవిలో మర్కట్ అనే కోతి ఉండేది. అది అడవంతా పైలాపచ్చీస్ గా తిరుగుతూ, తాను తెలివైనదాన్నని జంతువులన్నిటితో గొడవపెట్టుకునేది. అది తప్పని మర్కట్ తల్లిదండ్రులు, స్నేహితులూ ఎన్నోసార్లు చెప్పాయి. మర్కట్ వింటేగా.

ఒకసారి ఎండలో అడవిదారిగుండా వెళుతున్న రాజు, శ్రీను కాసేపు సేదదీరాలని ఆకాశాన్నంటుతూ, విశాలంగా పరచుకునివున్న రావిచెట్టు కింద కుర్చున్నారు.

"శ్రీనూ, నువ్వు ఇంద్రజాలం చేస్తావు కదా! నా కోసం ఏదన్నా చేసి చూపించవా?"అని అడిగాడు రాజు.

అదే చెట్టు మీద మర్కట్ కూర్చునుంది. అది వాళ్ల మాటలు విని ‘ఇంద్రజాలం అంటే ఏమిటో, అదెలా ఉంటుందో’ అని ఆసక్తిగా చూడసాగింది. శ్రీను అక్కడే కొద్దిదూరంలో ఎండిపోయి బంతిలా ఉన్న కాయను చేతిలోకి తీసుకుని మాయం చేసి, మళ్లీ రప్పించాడు. రాజు ఆశ్చర్యానందాలతో చప్పట్లు కొట్టాడు.

అది చూసిన మర్కట్ సంతోషంగా ఎత్తైన కొమ్మల మీదుగా, మఱ్ఱిచెట్టు ఊడలను ఆధారంగా చేసుకుని ఎగురుకుంటూ అడవిలోకెళ్లి రాజైన సింహం, మంత్రి నక్కతో సహా జంతువులన్నీంటిని సమావేశపరచి " నేను కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను. దాంతో ఉన్నవి మాయం చేయొచ్చు. లేనివి సృష్టించవచ్చు, చూడండి" అని ఎండిన పండుని మాయం చేసి సృష్టించి చూపించింది. జంతువుల చప్పట్లతో అడవి మారుమోగిపోయింది. దాంతో దాని గర్వం మరింత పెరిగి జంతువులన్నిటి మీద పెత్తనం చేయసాగింది. 

కొంతకాలం తర్వాత ఆ అడవికి కొంతమంది వేటగాళ్లు వచ్చిపావురాళ్లను, కుందేళ్లను, నెమళ్లను వలలేసి పట్టుకున్నారు. అవి కన్నీరు మున్నీరుగా విలపించాయి. అడవిలోని మిగతా జంతువులు దుఃఖంతో మూగబోయాయి.

సింహం అడవి జంతువుల అత్యవసర సమవేశం ఏర్పాటు చేసి, వేటగాళ్ల చేతుల్లో బంధీలైన వాటిని ఎలా రక్షించాలో సలహాలడిగింది.

అప్పుడు నక్క "దీనికంత ఆలోచన దేనికి? మన మర్కట్ ఉందిగా. అది వలల్లోని వాటిని మాయంచేసి మన దగ్గరకు తెస్తుంది" అంది మర్కట్ వంక ఓరకంట చుస్తూ.

ఆ మాటలు విన్న మర్కట్ ఉలిక్కిపడి "అయ్యో నేను చేసింది ఇంద్రజాలం. మనుషుల దగ్గర నేర్చుకున్నాను. అంతేకాని నాకే ,మంత్రాలు తంత్రాలు రావు. నేను వాటిని రక్షించలేను" అని కుయ్యో మొర్రోమంది.

దానికి నక్క "నాకు తెలుసు. నీ గర్వం అణచడానికే నేను నీ పేరు చెప్పాను. ఇంకెప్పుడూ తెలివైన దానివని, మంత్రాలు వచ్చని లేనిపోని ఢాంబికాలు పోకు. అందరితో సఖ్యతగా ఉండు" అని జంతువులవైపు తిరిగి " మనందరం అన్ని వైపుల నుంచి అరుస్తూ వెళ్లి ఆ వేటగాళ్లను బెదరగొడదాం. అప్పుడు వాళ్లు వలలొదిలేసి ప్రాణం మీద తీపితో పరుగులెడతారు. మనం అలా మనవాటిని రక్షించుకోవచ్చు"అంది.

మర్కట్ కు బుద్ధి వచ్చి అన్నీటితో కలసి అరుస్తూ వెళ్లి వలలో చిక్కిన వాటిని విడిపించింది.

నీతి: మనం అందరితో కలిసి మెలిసి ఉండాలి తప్ప లేని పోని గొప్పలు ప్రదర్శించకూడదు.

మరిన్ని కథలు