Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు

kaman veedhi kathalu
రండి...రండి...ఇదే మా కమాను వీధి..!
--------------------------
  ఔనండీ...ఇదే మా కమాను. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ చిన్ని వీధి ఇది. ఇటు ఏడు అటు ఆరు ఎదురెదురుగా  పదమూడు ఇళ్లు. మధ్యలో వీధి. వీటికి ముందర ఇంద్ర ధనస్సులా కమాను. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఇదో గేటెడ్ కమ్యూనిటీ! నాకు ఊహ ఇక్కడే తెలిసింది. ఓనమాలు నుంచి నా ఆనవాళ్లు ఇక్కడే వేళ్లూనుకున్నాయి.అందుకే కమాను నాకో సుందర ప్రపంచం. ఇక్కడ ప్రతి అణువూ నా జ్ఞాపకాల జాడను పట్టిచ్చేదే! ఎండకు ఎండి...వానకు తడిసి...మట్టిలో దొర్లిన బాల్యానికి అంటిన రంగురంగుల గురుతులు ఎన్నో! అమ్మలక్కల కబుర్ల మధ్య మురిపెంగా ఎదిగిన ఆ పసితనం ఎన్ని పసిడి వన్నెలు అద్దుకుందో....వెనుదిరిగి చూసుకుంటే ఇప్పుడు అర్థమవుతోంది. బడిలో మేస్టార్లు బడితె పూజ చేసినా...ఇంట్లో నాన్న విసనకర్ర తిరగేసినా...అదేంటో ఎప్పుడు ఒక్క వ్యతిరేక భావన మనసును తాకలేదు. అసలవి గుర్తుంటేగా...బొంగరాలు, గోలీలు, గాలిపటాలు మా బాల్యాన్ని ఎంత అర్థవంతం చేశాయో! ఆ ఆటలకు చేతులెత్తి మొక్కాలి!! పచ్చని ఆకును ముద్దుపెట్టుకుంటున్న మూగెండ...ముసురేసిన ఆకాశం నుంచి కురిసే చినుకులు ఇంటి గుమ్మం పై నుంచి ముత్యాల్లా రాలడం...దయ్యంలా వీచే గాలి నెట్టేస్తుంటే...పులకరిస్తూ అలానే మిద్దెపై  పొగ చట్టం పైన నిలుచుని గాలిపటం ఎగరేయడం...ఇంగువ కట్టిన గుడ్డలా ఒక జీవితకాలం గుబాళించే ఈ సువాసనలు కాలం మాకు అందించిన ప్రసాదం! టీవీ భూతం రాక ముందు గొప్ప తైలవర్ణచిత్రంలా రూపుదిద్దుకున్న జీవితాన్ని పదే పదే తలచి నెమరువేసుకోవడ ఎంత హాయో!! ఇదో స్మృతి ప్రవాహం. ఎప్పుడో యాభై ఏళ్ల కిందటి మాటలు...ఆటలు...అన్నీ గుర్తుంటాయా? ఒకవేళ గుర్తున్నా...ఆ పరిమళాలను ఒడిసి పట్టుకోవడం...ఆ సువాసనల్ని ఈ గాలికి పూయడం...జరిగే పనేనా? కమాను వీధి జ్ఞాపకాల్ని కతలుగా రాస్తే ఎలా ఉంటుంది? అనుకున్నప్పుడు నా మనసులో మెదిలిన సందేహాల దొంతరలివే! అసలు కత అంటేనే ఓ భావనాత్మక ప్రయాణం కదా! గుండె పొరల్లోంచి కనుపాపల్ని దాటుకుని ఈ దృశ్య యాత్ర సాగాలి. ఇదంత సులువైన పని కాదు. అదృశ్య దృశ్యాలను దృశ్యీకరించుకోవడం...వాటిని అక్షరాల్లో ఆవిష్కరించుకోవడం...ఇదంతా వేదన విద్య! అయితే ఈ వేదనలోనూ  తీయదనం తీవలా అంతర్లీనంగా సాగుతునే ఉంటుంది. రాస్తున్నంత సేపూ పెదాల కొసల్లో నవ్వులు...కంటి కొసల్లో నీళ్లు మెరుస్తునే ఉంటాయి. మెదడును తవ్వుతున్న కొద్దీ...గుండె స్పందిస్తున్న కొద్దీ...జ్ఞాపకాలు ఊటలా ఉబుకుతునే ఉంటాయి. ఇప్పుడు మీ ముందుకొస్తున్న కమాను వీధి కతల వెనక కత ఇదీ! ఈ చైతన్యానికి వేదిక, ఈ మాటల బాటకు బాసట గోతెలుగు.కామ్ యాజమాన్యమే! ఈ కతలను మీతో చెప్పుకోడానికి నాకు అవకాశం కల్పించడం వారి ఔదార్యం...నా అదృష్టం!! కాదు...కాదు...కమాను అదృష్టం. ఇప్పటి నుంచి ప్రతి వారం కమాను వీధే మీ ముందు నిలుస్తుంది. అక్కడి వాళ్ల...అప్పటి కబుర్లు బోల్డెన్ని మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ గుండె గొంతుకల్లో ఎగసిన ప్రతి భావాన్ని గో తెలుగు.కామ్ మీ ముందు ఓ ఇంద్రచాపంలా పరుస్తుంది. రండి...కమానులో కలుసుకుందాం...మాటల చావడిల కాసింత సేదదీరుదాం!!

 

మరిన్ని కథలు
talavonpu