Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
selfee stories

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

veekshanam

మిచిగన్ లో సినిమాలు   

సినిమాలంటే సరదా వుండనిదెవరికండీ.  ఏమీ తోచకపోతే సినిమాకి చెక్కేసే ప్రబుధ్ధులు ఎందరో!!   2008 లో లేన్సింగ్ వెళ్ళినప్పుడు నోవై టౌన్ సెంటర్ కి (ఇప్పుడు అది మూసేశారుట) వెళ్ళేవాళ్ళం ఎక్కువగా సినిమాలకి.  అక్కడ తెలుగు వగైరా మన దేశం సినిమాలు వచ్చేవి.  లేన్సింగ్ లోని మా అమ్మాయి ఇంటినుంచి అక్కడికి గంటన్నర పైనే ప్రయాణం.  అవ్వేమీ సినిమాకి వెళ్ళటానికి అడ్డు కాదు.  అయినా ఈ మధ్య మనకి ఒక కిలో మీటరు దూరం వెళ్ళటానికే అంత సమయం పడుతోంది కదా.

పెద్ద హాలో, గో డౌనో అనుకునేట్లు వున్నది.  లోపల ఆరు ధియేటర్లు వున్నాయి పక్క పక్కనే.  మనకిక్కడ టికెట్లివ్వటానికి ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కళ్ళు వుంటారా, అక్కడ ఆరు ధియేటర్లకీ కలిపి ఒకే మనిషి వున్నాడు.  ధియేటర్ మొత్తం ఒకే క్లాసు.  ఇప్పుడు మనకీ మల్టీప్లెక్స్ లు వచ్చాయిలెండి.  అప్పుడు వీటి సంగతి అంత తెలియక విడ్డూరమనిపించింది.  సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పరిస్ధితులనుబట్టి సరదాగా వేరే ధియేటర్లల్లోకి కూడా తొంగి చూస్తూంటారు.

సరే మేము వెళ్ళినవాళ్ళం ఐదుగురం.  తర్వాత ఇంకో రెండు జంటలొచ్చారు.  హాలు మొత్తానికి తొమ్మిదిమంది ప్రేక్షకులం.  సినిమా వేస్తారో వెయ్యరో అనుకున్నానుగానీ వాళ్ళకి ప్రేక్షకులతో సంబంధం లేదనుకుంటా వేశారు.

ఇంకో విశేషమేమిటంటే పాప్ కార్న్ బకెట్, కూల్ డ్రింక్స్ కొనుక్కుంటే ఇంటర్మిషన్ అయిపోయి తిరిగి సినిమా మొదలయ్యేలోగా వాటిని ఖాళీ చేస్తే తిరిగి ఫ్రీగా రీఫిల్ చేస్తారు.  ఇదీ బలే బాగుందికదూ.  ఒక్కళ్ళే తినాలని లేదు.  వెళ్ళిన గ్రూప్ అంతా కలిసి తిన్నా పర్వాలేదు.  అది ఇక్కడుంటే .. సినిమా టికెట్లకన్నా వాటి దగ్గరే క్యూ ఎక్కువగా వుండేదా!!!??  ఇక్కడా మల్టీప్లెక్స్ లు కట్టారు కదా,  మరి పాప్ కార్ని రీఫిల్ పెట్టరేమిటి కంజూషీలు.  

ఒకసారి డెట్రాయిట్ లోని స్టార్ సినిమాకి వెళ్ళాము.  ఇందులో 20 స్క్రీన్స్ వున్నాయి.  ధియేటర్స్ బాగున్నాయి.  ఇంకొకసారి ఇంటినుంచి రెండు మైళ్ళ దూరంలో వున్న సియన్.జి సినిమా కి వెళ్ళాము.  దీన్లోను 20 స్క్రీన్స్ వున్నాయి.  హాల్ బాగున్నది.  ఒకే సినిమా వివిధ సమయాలలో 2, 3 స్క్రీన్స్ లో వేస్తుననారు ఎవరికి వీలుగా వారు వెళ్ళటానికి.  ఇవ్వన్నీ ఇప్పుడు మనదగ్గరా చేస్తున్నారు.  ఇందులో ఒకసారి అప్ అనే 3డి సినిమాకి వెళ్ళాము.  3డి ఎఫెక్ట్ ఇండియాలోలాగా మన మీదకొచ్చేస్తున్నట్లుండవు.  పాప్ అప్స్ వరకే.  కర్టెన్ కి కొంచెం ముందుకొస్తాయి.  అంతే. సెలిబ్రేషన్స్ సినిమా ఐమేక్స్  ..  లేన్సింగ్ లోని ఈ ధియేటర్ లో కుంగ్ ఫూ పాండా చూశాం.  2006లో  బెస్ట్ ఐమేక్స్ స్క్రీన్ అవార్డు వచ్చిందట ఈ ధియేటర్ కి.

ఇక్కడ అంచనాలు ఎక్కువ వున్న సినిమాలు రిలీజ్ రోజున స్పెషల్ షో అర్ధరాత్రి 12 గం. లకి మొదలు పెట్టి  వేస్తారు.  అలా ఒకటి చూశాము.

ఇదండీ మిచిగన్ లో మేము తెలుసుకున్న సినిమా పరిజ్ఞానం.  తర్వాత వెళ్ళినప్పుడు హాలీవుడ్ స్టుడియోస్ కూడా చూశాం....ఆ విశేషాలకి కేలిఫోర్నియా వెళ్ళేదాకా ఆగాలి.  ప్రస్తుతానికి ఇంకా మిచిగన్ లోనే వున్నాము.

తమాషా  ...   నోవై లో మగధీర సినిమాకి వెళ్ళాము.  ఆ రోజు హాల్ నిండిందండీ.  తమాషా ఏమిటంటే  ..  అప్పటికే నా యాత్ర .. a travelogue  ... బ్లాగు ప్రాచుర్యం పొందింది.  దానిలో వున్న నా ఫోటో చూసి నన్ను గుర్తుపట్టి సినిమా హాల్ లో ఒక యువకుడు పలకరించాడు మీరు ఫలానా కదా.  నేను మీ బ్లాగ్ చదువుతూంటాను అని.  నిఝంగా నాకు సీట్ ఎక్కి గంతులు వెయ్యాలి అన్నంత ఉత్సాహం వచ్చేసిందండీ.  అన్నింటికన్నా ఇది బాగుందికదూ...

మరిన్ని శీర్షికలు
Dondakaya Masala Curry! ( Gherkins Masala Curry )