Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manamantaa movie review

ఈ సంచికలో >> సినిమా >>

అల్లు శిరిశ్ తో ఇంటర్వ్యూ

interview with allu sirish
నా విష‌యంలో... నాకంటే పెద్ద క్రిటిక్ లేడు  - అల్లు శిరీష్‌
 
డాక్ట‌ర్ ఇంట్లోంచి డాక్ట‌ర్ వ‌చ్చినా రాక‌పోయినా...
యాక్ట‌ర్ ఇంటి నుంచి మాత్రం యాక్ట‌రే రావ‌డం టాలీవుడ్‌లో రివాజుగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. ఇంకా వ‌స్తారేమో కూడా.  వీళ్ల‌లో ఎవ‌రికి వాళ్లు త‌మ ప్ర‌త్యేక‌త చూపించుకొంటున్నారు. అల్లు శిరీష్ కూడా త‌న స్పెషాలిటీ చూపించుకోవ‌డానికి ప‌రిత‌పిస్తున్నాడు. గౌర‌వం, కొత్త జంట‌ల‌తో ఓ మాదిరి మార్కులు తెచ్చుకొన్న శిరీష్‌.. శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తుతో ఫ‌స్ట్ క్లాస్ లో పాస్ అవ్వ‌డం గ్యారెంటీ అని న‌మ్ముతున్నాడు. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా శిరీష్‌తో గో తెలుగు చేసిన చిట్ చాట్‌.

* హాయ్ శిరీష్‌....
- హాయ్‌...

* కొత్త జంట త‌ర‌వాత గ్యాప్ ఎక్కువైన‌ట్టుంది...
- అవునండీ. అయితే ఇది కావాల‌ని తీసుకొన్న విరామ‌మే. గౌర‌వం చేస్తున్న‌ప్పుడు మోకాలి నొప్పితో బాధ ప‌డ్డా. అయితే కొత్త జంట స‌మ‌యానికి అది మ‌రీ ఎక్కువైంది. అయినా దాన్ని నిర్ల‌క్ష్యం చేశా. దాంతో ఆప‌రేష‌న్  వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. దానికి తోడు.. మంచి క‌థ‌ల కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సివ‌చ్చింది. ఈమ‌ధ్య‌లో ఓ క‌థ సెట్ట‌య్యేదే. కానీ... ఎందుక‌నో ప‌ట్టాలెక్క‌లేదు. ఆ స‌మ‌యంలోనే ప‌ర‌శురామ్ క‌లిశారు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు క‌థ చెప్పారు. బాగా న‌చ్చింది. అక్క‌డి నుంచి మా ప్ర‌యాణం మొద‌లైంది.. ఇదిగో ఈ రోజు మీ ముందుకు వ‌చ్చింది.

* ఈ సినిమాలో ఏ పాయింట్ ద‌గ్గ‌ర మీరు క‌నెక్ట్ అయ్యారు?
- టోట‌ల్ గా క‌థ బాగా న‌చ్చిందండీ. ఇటు యూత్‌కీ, అటు ఫ్యామిలీకి కావ‌ల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. గొప్ప క‌థేం కాదు. తెలిసిన క‌థ‌లానే ఉంటుంది. కానీ క‌థ‌ని న‌డిపించిన తీరు బాగుంటుంది.

* చిరంజీవి గారు ఇది బొమ్మ‌రిల్లు లాంటి సినిమా అంటున్నారు...
- ఆయ‌న అలా ఎందుక‌న్నారో. ప్ర‌కాష్‌రాజ్ పాత్రని తెర‌కెక్కించిన విధానం చూసి అలా అనిపించిందేమో.  నాకు మాత్రం ఈ క‌థ విన్నాక దిల్ వాలే దుల్హ‌నియా లేజాయింగే గుర్తొచ్చింది. 

* ఇంత‌కీ మీ క్యారెక్ట‌ర్ ఏంటి?  ఎలా ఉండ‌బోతోంది?
- కాలేజీ చ‌దువులు పూర్తి చేసుకొన్న కుర్రాడిని. నాకో పెద్ద కుటుంబం ఉంటుంది. అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటా. నా పాత్ర నుంచే కావ‌ల్సినంత ఫ‌న్ పుడుతుంది. 

* గౌర‌వం, కొత్త‌జంట‌, శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు ఈ మూడు సినిమాల్లోనూ శిరీష్‌లో క‌నిపించిన మార్పేంటి?  
- చెప్పాను క‌దండీ.. ఈ సినిమాలో ఫ‌న్ బాగా పండించా అని. క్యారెక్ట‌ర్ ఎలా బిహేవ్ చేస్తుందో... అలా బిహేవ్ చేయ‌డం నేర్చుకొన్నా. 

* ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర‌కు మీరెళ్లారా?  ఆయ‌నే ఈ క‌థ మీ ద‌గ్గ‌ర‌కు ప‌ట్టుకొచ్చారా?
- నాకు నిజంగానే ఆయ‌న శైలి అంటే చాలా ఇష్టం. సోలో సినిమా బాగా న‌చ్చింది. ఎమోష‌న్‌ని కామెడీతో మిక్స్ చేసి బాగా చెప్తారు. ఇదే విష‌యం ఆయ‌న‌తో చెప్పా.  'మీతో ప‌నిచేయాల‌ని వుంది' అని అడిగా. ఆయ‌న కూడా 'నీతో వ‌ర్క్ చేయాల‌ని నాకూ ఉంది' అన్నారు. అలా... ఈ సినిమా పట్టాలెక్కింది. 

* మెగా హీరో అంటే డాన్సులు ఆశిస్తుంటారు... ఆ అంచ‌నాలు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టాయా?
- అదేం లేదండీ. నా ప్ల‌స్సులు మైన‌స్సులు నాకు బాగా తెలుసు. నేనేం గొప్ప డాన్స‌ర్‌ని కాదు. అయినా స‌రే.. ఆ విష‌యంలో ప్రేక్ష‌కుల్ని నిరుత్సాహ ప‌ర‌చ‌ను. డాన్సుల విష‌యంలోనూ ఈ సినిమాలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

* ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ చేశార‌ట‌..
- సిక్స్ ప్యాక్ చేసిన మాట నిజ‌మే. అయితే ఈ సినిమా కోసం కాదు. సినిమా సినిమాకీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది క‌దా. ఆ టైమ్ లో ఖాళీగా ఉండ‌డం ఎందుకు అని... సిక్స్ ప్యాక్ ట్రై చేశా. ఈ సినిమాలో ఫైట్స్ అవ‌స‌రం లేదు. అందుకే సిక్స్ ప్యాక్ చూపించ‌లేదు.

* భ‌విష్య‌త్తులో చూపించే అవ‌కాశం ఉందా?
- నాకు యాక్ష‌న్ సినిమాలంటే చాలా ఇష్ట‌మండీ. అలాంటి క‌థ‌లు చెబితే త‌ప్ప‌కుండా చూపిస్తా. అయితే మోకాలి నొప్పి ఉంది క‌దా? అందుకే ఫైట్స్ అంటే ఆలోచిస్తున్నా.

* ఇంతకీ హీరో అవ్వాల‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చింది?  మీ ఇంట్లో అంద‌రూ హీరోల‌నా?
- అదేం కాదండీ. నాకు న‌ట‌న అంటే ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ మంది హీరోలున్నారు క‌దా అని నేనూ కెమెరా ముందుకొచ్చేస్తే పెద్ద త‌ప్పు చేసిన‌ట్టు. మ‌న‌సులో ఆశ లేక‌పోతే న‌టుడు కావ‌డం క‌ష్టం.

* నిర్మాత అవ్వాల‌న్న ఆలోచ‌న ఎప్పుడూ ఉండేది కాదా?
- నిర్మాత ప‌ని బోర్. ఎప్పుడూ ఒక‌టే ప‌ని. అందులో క్రియేటివిటీ క‌నిపించ‌లేదు. నాకు క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డ‌మంటే ఇష్టం. కొత్త‌గా ఏదైనా చెప్పాల‌నుకోవ‌డం ఇష్టం. అందుకే ప్రొడ‌క్ష‌న్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు.

* మీపై వ‌చ్చిన కామెంట్ల‌ని స‌ర‌దాగా తీసుకొంటారా?  సీరియ‌స్‌గా దాని గురించే ఆలోచిస్తారా?
- వ్య‌క్తిగ‌తంగా చేసే విమ‌ర్శ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోను. వృత్తి ప‌రంగా ఎవ‌రేం చెప్పినా వింటా. అందులో మంచి ఉంటే తీసుకొంటా. నా స‌ర్కిల్ నాకుంది. ఏమైనా అనుమానాలొస్తే... వాళ్ల‌ని అడుగుతా. పైగా నా విష‌యంలో నాకంటే పెద్ద విమ‌ర్శ‌కుడు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఏదైనా ప‌ని చేసే ముందు ఒక‌టికి వంద‌సార్లు ఆలోచిస్తా. ది బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నిస్తా.

* త‌ర‌వాతేంటి?
- వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాం. అదో పిరియాడిక‌ల్ మూవీ. నా పాత్ర‌, క‌థ అన్నీ కొత్త‌గా ఉంటాయి.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ......

-కాత్యాయని 
మరిన్ని సినిమా కబుర్లు
janata garriage break all records