Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మనమంతా చిత్రసమీక్ష

manamantaa movie review

చిత్రం: మనమంతా 
తారాగణం: మోహన్‌లాల్‌, గౌతమి, విశ్వాంత్‌, రైనా రావు, ఊర్వశి, హర్షవర్ధన్‌, గొల్లపూడి మారుతీరావు, ధన్‌రాజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్‌ తదితరులు 
సంగీతం: మహేష్‌ శంకర్‌ 
సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాస్తవ్‌ 
నిర్మాణం: వారాహి 
నిర్మాత: రజనీ కొర్రపాటి 
సమర్పణ: సాయి కొర్రపాటి 
దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి 
విడుదల తేదీ: 5 ఆగస్ట్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

ఓ షాపింగ్‌ మాల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు సాయిరామ్‌ (మోహన్‌లాల్‌). మధ్యతరగతి జీవితాన్ని ఎలాగోలా గడిపేస్తుంటాడు. గాయత్రి (గౌతమి) మధ్యతరగతి జీవితానికి అలవాటుపడిపోయిన గృహిణి, తన భర్త పిల్లల బాగోగుల గురించే ఆమె చింత అంతా. కష్టపడి పైకి రావాలనే తపనతో బాగా కష్టపడి చదువుకునే కుర్రాడు అభిరామ్‌ (విశ్వాంత్‌). ఉన్నదాంట్లో నలుగురికి సాయం చేయాలనే తపన ఉన్న చిన్నారి మహిత (రైనారావు) కాన్వెంట్‌లో చదువుతుంటుంది. నలుగురివీ నాలుగు కథలు. ఆ నాలుగు కథలకీ ఓ టర్నింగ్‌ పాయింట్‌. ఆ తర్వాత ఏమవుతుందన్నది మిగతా కథ. అదేంటన్నది తెరపైనే చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ బాగా నటించాడు అని ప్రతి సినిమాకీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమానే అయినా, ఇప్పటిదాకా చేయని లాంగ్వేజ్‌ అయినా మోహన్‌లాల్‌ చాలా ఈజ్‌తో నటించి, నటనకు భాష అడ్డంకి కాదని నిరూపించాడు. సొంత డబ్బింగ్‌ చెప్పుకోవడం ఇంకో సాహసం. అక్కడక్కడా ఆ యాక్సెంట్‌ డిఫరెంట్‌గా అనిపిస్తుందే తప్ప, ఇబ్బందిగా ఉండదు. 

కుటుంబం కోసమే తపనపడే గృహిణి పాత్రలో గౌతమి ఒదిగిపోయింది. తన నటనతో సినిమాకి ప్రాణం పోసింది. గౌతమి తెరపై కన్పిస్తున్నంతసేపు గాయత్రి అనే ఆమె పాత్ర మాత్రమే గుర్తుకొస్తుంది ప్రేక్షకులకి. మహితగా రైనా రావు తన నటనతో ఆకట్టుకుంది. విశ్వాంత్‌ బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

నాలుగు కథల్ని సైమల్టేనియస్‌గా ఒకే సినిమాలో చూపించడం అంటే పెద్ద రిస్క్‌. ఆ రిస్క్‌ని చాలా జాగ్రత్తగా చేశాడు దర్శకుడు. కథ, కథనం అన్నీ కొత్తవే. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు బలం. ఎడిటింగ్‌ అక్కడక్కడా కాస్త అవసరం అన్పిస్తుందంటే కారణం కథలో ఎమోషన్‌ తప్ప, సినిమా నెమ్మదిగా సాగుతుందని కాదు. అయినప్పటికీ ఫస్టాఫ్‌ కొంచెం స్లోగా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఆ ఇబ్బంది ఏమీ లేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు చాలాబాగున్నాయి. |

రొటీన్‌కి భిన్నంగా చంద్రశేఖర్‌ ఏలేటి ఆలోచనలు సాగుతుంటాయి. ఇలాంటి కథల్ని ఎంచుకునేటప్పుడే అందులో పాత్రధారుల గురించి గట్టిగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆ కసరత్తు గట్టిగానే చేశాడు దర్శకుడు. కథకు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంతో, దర్శకుడి పని తేలికయ్యింది. మోహన్‌లాల్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడనగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. చాలాకాలం తర్వాత గౌతమి ఓ తెలుగు సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడంతోనే ఈ సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. అలా అన్నీ కలిసొచ్చి, సినిమా పట్ల సినీ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమయ్యింది. ఇంతటి అంచనాల నడుమ, ఎవరి అంచనాల్నీ తగ్గించకుండా దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించాడు. ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువ అనిపించినా, అక్కడక్కడా స్లో అనిపించినా, సినిమా ఆలోచనాత్మకంగా సాగుతుంది. కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేస్తుంది. వెరసి, ఓ మంచి ప్రయత్నమనే ప్రశంసలు దక్కించుకునేలా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిందని చెప్పడం నిర్వివాదాంశం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
మనసంతా నిండిన భావోద్వేగంతో 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with allu sirish