Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 గతసంచికలో ఏం జరిగిందంటే ... http://www.gotelugu.com/issue173/495/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

‘‘నిన్ను ఎంపిక జేసి నారా!’’ అంటూ విస్తు పోయింది యువ రాణి. ధనుంజయ, భద్రా దేవిలు ముఖ ముఖాలు చూసుకుని వస్తున్న నవ్వుని బల వంతంగా ఆపుకున్నారు.

‘‘అవును నన్నే’’ అన్నాడు వక్ర దంతుడు సగర్వంగా.

‘‘నాకేమి తక్కువ? మరీ ఆశ్చర్య పోవలదు. మన జోడి అద్భుతమని మన వారంతా మెచ్చిరి. నాగ రేడుకు కాబోవు అల్లుడ. ఒకే కుమార్తెవు గావున ఆయన తర్వాత సింహాసనమునకు నేనే వారసుడనని, తదుపరి నాగ రేడు నేనేయని ఎంతో ఆశతో వుంటిని, ఎన్నో కలలు గంటిని. కాని నీవు జాతి తప్పి ఒక మానవుని వరించి ఘోర తప్పిదము జేసి తల వంపు దెస్తివి. నా ఆశలన్నియు నిరాశ జేసినావు’’ అనరిచాడు.

ఇప్పుడు భద్రా దేవి కల్పించు కొంటూ` ‘‘బాగు బాగు. నీ గురించి తెలిసినది సరి. అందరితో వెడలి పోక కాగడాను ఆశ్రయించు కొని మాటున ఇచటనే ఉండుటకు కారణ మేమి?’’ నిల దీసింది.

‘‘చెప్ప... అది మాత్రం చెప్పజాల’’ అరిచాడు వాడు.

‘‘చెప్ప వలె’’

‘‘చెప్ప నంటిని గదా. ఈ భూతాన్ని అండగా జూచు కొని నను బెదిరింప బని లేదు. నేను తలచిన ఇప్పుడే వెడలి పో గలను’’ అన్నాడు వక్ర దంతుడు.

‘‘అలాగునా. మంచిది. పొమ్ము చూచెదము గాక. ఘృతాచి, వాడ్ని వదులుము’’ అంది భద్రా దేవి.

మౌనంగా చూస్తూ నిలుచున్నాడు ధనుంజయుడు. ఈ విషయంలో తను కల్పించు కోవలసిన పని లేదు. ఏం చేయాలో భద్రా దేవికి తెలుసు.

భూతం ఘృతాచి తృటిలో ఆ సర్ప శరీరుడ్ని చేతి నుండి లాగి కోపంతో నేలకు విసిరి కొట్టింది. వాడు చుట్ట చుట్టు కొని శిరస్సు పైకి లేపే లోన మంత్రంతో వాడికి కట్టు కట్టింది భద్రా దేవి. దాంతో వాడు శిరస్సు పైకి లేపి బొమ్మలా అలాగే వుండి పోయాడు.

‘‘వెడలి పోగలవా? ప్రయత్నించు’’ అంది వ్యగ్యంగా భద్రాదేవి.

వక్ర దంతుడు కదిలే ప్రయత్నం చేసాడు.

కాని అతడి వల్ల కాలేదు.

‘‘సోదరీ! ఇదియే వీడి అసలు రూపమా లేక పూర్తిగా పురుషాకృతి వున్నదా?’’ ఉలూచీశ్వరిని అడిగింది.

‘‘ఉన్నది’’ అంది ఉలూచీశ్వరి.

‘‘అంటే ఈ వింత రూపమున వీడు మనల మోసగించు చున్నాడు. చూడు వక్ర దంతా! నీ నిజ రూపు ప్రదర్శించి, నీవిచట ఎందుకు ఉంటివో చెప్ప వలె. చెప్పకున్న నిన్నిలా వదిలి పోయేదము. అప్పుడు ఆకలి దప్పులతో శుష్కించి మరణించెదవు గాక. చావో బ్రతుకో నీవే నిశ్చయించు కొమ్ము. అవతల ఉషోదయ వేళ సమీపించు చున్నది. మేము బయలు దేర వలె’’ అంటూ కదిలింది భద్రా దేవి.

వక్ర దంతుడు గుటకలు మ్రింగాడు.

మిర్రి మిర్రి చూసాడు.

నిజం గానే తనని లాగే వదలి పోతారేమో నని భయం పట్టు కుంది. భద్రా దేవి మంత్ర శక్తిని అంచనా వేయ లేక సరిగ్గా చిక్కు బడ్డాడు. తన శక్తి యక్తులన్నీ ప్రయోగించి బయట పడాలని చూసాడు. ప్రయోజనం లేక పోయింది.

సాధారణంగా మంత్ర గాడు ఎవడైనా పామును మంత్రంతో కట్టు కడితే అలా వదిలి పోడు. కట్టు విప్పి ఆ పాము నిరపాయంగా ఆవలకు పోయేలా చూసి అప్పుడు వెళతాడు. ఎందు కంటే నాగ దోషం మహా దోషమని వాళ్ళకు తెలుసు. కాని ఇక్కడ భద్రా దేవి వక్ర దంతుడ్ని అలాగే వదిలి పోతాననడంలో తంత్రం వుంది, బెదిరింపు వుంది. ఆమె తంత్రం ఫలించింది. నిజం గానే వెళ్ళి పోతారేమో నని కంగారు పడ్డాడు వక్ర దంతుడు. వాడు ఆలోచించే లోపలే`

తమ వస్తు సామాగ్రిని తిరిగి ఎప్పటిలా అశ్వాల మీద సర్దేసారు ముగ్గురూ. భద్రా దేవి తన మచ్చల గుర్రాన్ని ధనుంజయుడు తన శ్వేతాశ్వాన్ని కళ్ళాలు అందుకొని నడిపించు కొంటూ గట్టు దిగేందుకు బయలు దేరారు. అప్పుడు అరిచాడు వక్రదంతుడు` ‘‘ఆగండి. మీరు చెప్పినట్టు చేసెద’’ అంటూ.

భద్రా దేవితో బాటు అంతా అతడ్ని చూసారు.

‘‘సరి. నిజ రూపం ప్రదర్శింపుము’’ అంది భద్రా దేవి.

వెంటనే అక్కడ సర్ప రూపుడు అదృశ్యుడై ఆ స్థానంలో ఆజాను బాహుడైన ఒక పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. పన్నెండు అడుగుల ఎత్తున ఎర్రటి దేహంతో బలిష్టంగా వున్నాడు. నీలం రంగు పట్టు పంచె దట్టీ బిగించి కట్టి మెడ లోను శరీరం మీద మణి మయ ఆభూషణాలు ధరించి వున్నాడు. అప్పుడు కూడ చలనం లేనట్టు శిలా విగ్రహంలా నిల బడి వున్నాడు. ఎందుకంటే` భద్రా దేవి మంత్ర కట్టు ఉప సంహరించ లేదు. అది అలాగే బంధించి వుంచింది వాడిని.

‘‘చెప్పుము వక్ర దంతా. అంతా వెడలి నారు. నీవే ఇచ్చోటనే వుంటివి?’’ అడిగింది భద్రాదేవి.

వక్ర దంతుడు భారంగా నిట్టూర్చి కారణం వివరించాడు.

‘‘అది మా నాగ రేడు ఆనతి. మరుగున మీ మాటలు విని మీ ఆలోచనలు తెలుసు కొనుట, మీ ప్రయాణ మార్గమును గోప్యముగా అనుసరించుట, సమయము జూచి యువ రాణి ఉలూచీశ్వరిని అపహరించి మా నాగ లోకమునకు ఎత్తుకు పోవుట. ఈ కార్యము సాధించుకు రమ్మని మా ప్రభువు ఉత్తరువిచ్చి నన్నిచట విడిచి వెళ్ళినారు. అలా చేసినచో తక్షణం యువ రాణిని నాకును వివాహము జరిపించెద యని నాకు మాట యిచ్చినారు. అందుకే నేనిచట నిలిచితి’’ అంటూ అసలు విషయం బయట పెట్టాడు.

ఆ మాటలు వినగానే`

దండ తాడిత భుజంగంలా బుసలు కొట్టి వక్ర దంతుని రక్త వీక్షణాలతో చూసింది యువ రాణి ఉలూచీశ్వరి.

‘‘చూచితివా అక్కా ఈ అన్యాయము? నా జనకుడే అనతిచ్చినాడో లేక ఈ గుంటనక్కే స్వయమున నిర్ణయించు కున్నాడో తెలీదు గాని నన్నపహరించుటకే వేచి వుండె. వీడి మంత్ర కట్టు విప్పకుము. ఈ ధూర్తుడు అన్నాహారము లేక ఆకలి దప్పులతో మాడి కృంగి కృశించి నశింప వలె. వీడిని వదలకుము’’ అంది ఆవేశంగా. ఆ మాటు విని ` ‘‘ఇదన్యాయము, ఘోరము’’ అనరిచాడు గాభరాతో వక్ర దంతుడు.

‘‘ఇందున నా దోషమిసుమంతయు లేదు. ఇది నీ జనకుని నిర్ణయము. నా స్వీయ నిర్ణయము గాదు. నను విడిచి పెట్టిన చాలును, నా దారిన బోయెద. బుద్ధి వచ్చినది. ఇక మీ వంక కన్నెత్తి యైన జూచు వాడను గాను. నా యందు దయ జూపి విడిచి పెట్టండి. యువ రాజా ధనుంజయా! కరుణా హృదయుడవు. నీవైన చెప్పుము’’ అంటూ ధీనంగా అర్థించాడు.

‘‘వలదు వలదు. వీడి మాటలు నమ్మ వలదు. ఈ కపటి మనల విడువడు’’ అంటూ హెచ్చరించింది ఉలూచీశ్వరి.

‘‘వదలక ఏమి చేయ గలడు?’’ దర హాసంతో అడిగాడు ధనుంజయుడు.

‘‘నేను చెంత నుండ నిను అపహరింప గలడా? ఇక మన వెంట పడనంటున్నాడు. ప్రాధేయ పడు చున్నాడు. విడిచెదము గాక. భద్రా వీడిని త్వరగా పొమ్మనుము. మనము బయలు దేర వలె’’ అన్నాడు. అంతే కాదు, తన అశ్వాన్ని అధిరోహించి కళ్ళాలు అందుకున్నాడు.

‘‘సరి వక్ర దంతా. మా ప్రభువు ఆనతి శిరసావహించి నిను వదిలెద. ఈ తూరి మా కంట బడిన నీకు మరణము తప్పదు. పొమ్ము, యధేచ్చగా పొమ్ము’’ అని హెచ్చరించి ఏదో ఉచ్చరిస్తూ మంత్ర కట్టు విప్పింది. అంతే`

ఎప్పుడైతే విముక్తి కలిగిందో తక్షణమే కాలు చేతు విదిలించాడు. కనీసం తను వెళ్తున్నట్టు కూడ చెప్పలేదు వారితో. ఓసారి యువ రాణి ఉలూచీశ్వరి వంక వంకరగా నవ్వుతూ జూచి వేగంగా గుట్ట దిగి చీకట్ల మాటున ఎటో నడుచుకుంటూ వెళ్ళి పోయాడు వక్ర దంతుడు.

వక్ర దంతుడు కను మరుగు కాగానే ఎప్పటిలా భూతం ఘృతాచి మచ్చల గుర్రం మీది తోలు సంచిలో ప్రవేశించి విశ్రాంతిగా పడుకుంది. ఉలూచీశ్వరి మాత్రం సూర్యోదయం వరకు నీతో ఉంటానంటూ ధనుంజయుని అశ్వం మీద అతడి ముందు కూచుంది. అశ్వాలు రెండూ గుట్ట దిగి మత్స్య దేశం సరి హద్దు దిశగా దౌడు ఆరంభించాయి. అప్పుడే తూర్పు దిక్కు  తెల్ల బడుతోంది. ఇప్పుడు ఆ గుట్ట మీద ఘృతాచి వదిలిన ఈటె చివర దివిటీ మాత్రం గాలికి రెప రెప లాడుతూ ఒంటిగా మిగిలి పోయింది.

******************************************

గాంధార రాజ్యం.

రాజ ధాని గాంధార నగరం.

ఉదయపు సూర్య కిరణాలకు శతానీకుని కోట అద్భుతంగా ప్రకాశిస్తోంది. కష్ట జీవులైన నగర వాసులు ఎవరి పనులు వారు దిన చర్యలలో భాగంగా చేసుకు పోతున్నారు. కోట లోని తన రాజ మందిరంలో చాలా ఉత్సాహంగా వున్నాడు గాంధార ప్రభువు శతానీకుడు.

అంత క్రితమే రత్న గిరి నుండి అచటి ఉప సైన్యాధ్యక్షుడైన బాహ్లీకుని లేఖను తీసుకొని వచ్చి చేరింది ఒక కపోతం. ఆ పావురం నుండి లేఖ తీసుకొని చదివి ఆనంద భరితుడై పసిడి లోటా లోని మధిరను పూర్తిగా తాగే సాడు.

ఆ లేఖ సారాంశం....

తన మనుషులు హైహియ రాజ్య భూ భాగం లోని పర్వత ప్రాంతాల్లో రత్న గిరి యువ రాజు ధనుంజయుని హత మార్చారు. ఆ విషయం తెలిసిన రత్న గిరి ప్రజలు కూడ భయాందోళనల మధ్య వూగిసలాడుతున్నారు. నా ఆధీనం లోని సైన్యం తిరుగు బాటుకు ఉవ్విళ్ళురుతున్నారు. రత్న గిరి సైన్యంలో ధనుంజయుని మరణ వార్త కలకలం రేపింది. ధైర్యం సన్నగిల్లి వున్నారు. కావున యుద్ధానికి ఇది అనుకూలమైన సమయం. మీరు ససైన్యంగా ఎప్పటికి రత్నగిరి చేర గలరో తెలియ జేస్తే ఆ రోజుకి కాస్త ముందుగా ఇచట మేము తిరుగు బాటు ఆరంభించుటకు అనుకూలంగా వుంటుంది. మీ లేఖ కోసం నిరీక్షిస్తూంటాను. అని పేర్కొన బడి వుంది.

తన చిరకాల వాంఛ నేర వేరు సమయము ఆసన్నమైనందుకు మహదానంద భరితుడై వున్నాడు శతానీకుడు. ఇప్పటికే మిత్ర రాజ్యాలను సంప్రదించి సైన్య సమీకరణ గావించటం జరిగింది. అలాగే పాంచాల దేశాన్ని అనేక నావలను, దిగువ తీర రాజ్యమైన కరూర దేశాన్ని పదివేల యుద్ధనౌకలను సిద్ధంగా ఉంచమని కోరడమైనది. ఆ పనులు అచట ఆగ మేఘాల మీద జరుగుతున్నాయి. ఇక మిగిలింది తన మంత్రులతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించుట, అలాగే సమరానికి బయలు దేరేందుకు ఆస్థాన పురోహితులచే మంచి ముహూర్తము నిర్ణయించుట, బాహ్లీకునికి వర్తమానము పంపించుట మిగిలి వున్నవి. తాము రత్న గిరి సముద్ర జలాల్లో ప్రవేశించుటకు కనీసం ఇరువది దినములు అగును.

ఈ దినము మరిచి పోలేనిది.

కాబట్టి ముఖ్యమైన పనులన్నీ`

ఈ దినము జరిగి పోవలె.

అందుకే తెల్లవారి తొలి జాము జరక్క ముందే తన మంత్ర వర్గ సమావేశం ఏర్పాటు జేయ కబురు పంపించాడు. వారంతా వచ్చి ఉండాలె.

ఆలోచిస్తూనే త్వర త్వరగా తయారయ్యాడు. పట్టు పీతాంబరాలు కట్టి కశ్మీరు సుగంధ లేపనం పూసుకున్నాడు. మణి మయ ఆభూషణాదులు ధరించి శిరస్సున రత్న కిరీటం ధరించాడు. బంగారు జరీ అంచుతో కూడిన ఉత్త రీయం భుజాన వేసుకుని కోర మీసం తిప్పుతూ మణులు పొదిగిన పసిడి పాదరక్షలు ధరించి ఆడంబరంగా సమావేశ మందిరానికి బయలు దేరాడు.

ఇది అంతరంగిక సమావేశం కాబట్టి వెంట వింజామరు వీచు దాసీలను గాని దాస దాసీలను గాని పిలువ లేదు. ఒంటి గానే అనేక కక్ష్యలు దాటి తన సభా మందిరానికి వెనక వున్న అంతరంగిక సమావేశ మందిరంలో హుందాగా ప్రవేశించాడు. వెంటనే మందిర కవాటాలు మూయ బడ్డాయి.

అప్పటికే మంత్రులు పది మందీ వచ్చి వున్నారు. తన అంతరంగిక సలహా దాయి వచ్చారు. తన సైన్యాధ్యక్షుడు ఇద్దరు ఉప సైన్యాధ్యక్షులు, నలుగురు సేనా పతులు వచ్చి వున్నారు. ఇంకా ముగ్గురు ఆస్థాన పురోహితులూ వచ్చి అంతా ఉచితాసనాల్లో కూచునున్నారు. ప్రభువు శతానీకుని రాక గమనించి గౌరవ సూచకంగా వారంతా లేచి నిలబడ్డారు.

వస్తూనే వేదిక మీది తన రత్న ఖచిత స్వర్ణ సింహాసనాన్ని అలంకరించి అందర్నీ కూచోవలసిందిగా సైగ చేసాడు. అసు ఈ అత్యవసర సమావేశం దేని గురించో అర్థం గాక ముఖ ముఖాలు చూసుకుంటూ నిశ్శబ్ధంగా కూచున్నారంతా.

రాజు శతానీకుడు ఓసారి గొంతు సవరించుకుని తన అంతరంగాన్ని అందరి ముందు బయట పెట్టాడు. రత్నగిరి పరిస్థితుల్ని వివరించాడు. సరైన వ్యూహంతో సముద్ర మార్గంగా వెళ్ళి తమ అసంఖ్యాక సైనిక బంతో రత్న గిరి మీద విరుచుకు పడి జయించాలన్నాడు. బాహ్లీకున్ని విజయం వరించాలన్నాడు.

త్వరలో సమరానికి సన్నద్ధం కావాలని సైనిక ముఖ్యులకు ముందే తెలుసు గాబట్టి వారు మౌనంగా వింటూ కూచున్నారు. ఆశ్చర్య పోలేదు. పెదవి విప్పి మాట్లాడ లేదు. సైనిక వ్యూహం గురించి చర్చ ఆరంభమైనపుడు గాని వారు పెదవి విప్పి మాట్లాడరు. అయితే శతానీకుని ప్రసంగం మధ్య లోనే ఒక గొంతు గంభీరంగా విన్పించింది. ‘‘ఇప్పుడీ యుద్ధం మనకి అవసరమా?’’ అంటూ.

ఆ గొంతు ఎవరిదో అందరికీ తెలుసు.

అది శతానీకుని అంతరంగిక సహాదారుల్లో ఒకడైన సచ్చీలుడిది. అక్కడున్న వారిలో కుండ బ్రద్దలు కొట్టినట్టు నిజాయితీగా ప్రభువు నెదిరించి హితవు పలికే వాడు ఎవడన్నా వున్నాడూ అంటే అది సచ్చీలుడు ఒక్కడే. ఇతడు స్వయానా శతానీకుని పిన తండ్రి. తండ్రి తరఫు బంధువుల్లో మిగిలి వుంది కూడ అతడొక్కడే. ఈ కారణం చేత కూడ అప్పుడప్పుడు శతానీకుని యిలా నిల దీస్తూంటాడు సచ్ఛీలుడు. పిన తండ్రి గాబట్టి అతడి పైన ఎన్నడూ ఆగ్రహించడు శతానీకుడు. వృద్ధుడైన సచ్చీలుడు తన ఆసనం నుండి లేచి సూటిగా ప్రశ్నిస్తుంటే దరహాసం చేసాడు శతానీకుడు. అంతడింకా యిలా అడుగు తున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham