Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue173/493/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

వారం రోజుల తరువాత –

“మధూ, బావ ఫోన్ చేసాడు... నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండు...వచ్చి తీసుకు వెళతాడు...” చెప్పాడు గిరి.

“సారీ అన్నయ్యా, నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశ్యం లేదు...” ఖరాఖండీగా చెప్పింది మధుబాల.

“మధూ, నీకేమైనా పిచ్చెక్కిందా? కాపురాన్ని వదులుకుని ఇక్కడ ఉండటం ఏమిటసలు? నాన్న వింటే ఎంత బాధ పడతారు?” తగ్గు స్వరంతో మందలింపుగా అన్నాడు గిరి.

“నాన్న కోసమని, మీ పరువు ప్రతిష్టల కోసమనీ  నా కడుపులోని పసిపాపనీ, నా ప్రాణాన్నీ పణంగా పెట్టలేను అన్నయ్యా... ఇంకా పుట్టకుండానే నాలోని బిడ్డ నాకు బంధాలు వేస్తోంది...” చెప్పింది మధుబాల.

“చెల్లాయ్, నువ్విక్కడ ఉండటం నాకు ఏమాత్రం భారం కాదే... కానీ, నువ్వే ఆలోచించు... అక్కడ నీ భర్త, అత్తగారూ, మామగారూ ఎంత బాధపడతారు? సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరువు ఏమవ్వాలి?”

“ఆ జ్ఞానం వాళ్లకి కూతురు అలా తయారవుతున్నప్పుడు ఉండాలి... కోడలిని మనిషిగా చూడనప్పుడు, తప్పు చేసి దొరికిపోయినా ఇంకా తన కూతురు అలాంటిది కాదని వెనకేసుకు వచ్చే అత్తగారి దగ్గర నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలుసు...  తరువాతి సంగతి చెప్పలేను... కానీ డెలివరీ అయ్యే వరకూ ఇక్కడే ఉంటాను నేను... “ స్థిరంగా చెప్పింది.

“అసలు ఏమిటి నీ భయం?”

“అన్నయ్యా, నీకు అర్థం కావటం లేదు... మా అత్తగారికి, వేణుకీ వినత అంతే ప్రాణం... ఇంట్లో ఎప్పుడూ ఆమె ఆడింది ఆటా, పాడింది పాటా... ఆమె ఇంటికి రాకుండా ఉండదు... వీళ్ళు రావద్దని కూడా చెప్పరు. ఆమె వస్తే ఏ అఘాయిత్యానికి ఒడిగడుతుందో నాకు తెలియదు. అనుక్షణం ప్రాణభయంతో వణికిపోతూ నేను గడపలేను... నీకూ తెలుసు కదా, గర్భిణీ స్త్రీకి భయాందోళనలు పనికి రావని... నేను ఒళ్ళు దాచుకోకుండా అమ్మకి సహాయం చేస్తాను. నిర్మల వదినకు ఏ పనీ చెప్పను... ప్లీజ్, నన్ను ఇక్కడే ఉండనీయండి... కాన్పు అయ్యాక వెళతాను...” వేడికోలుగా చెప్పింది మధుబాల.

“సరేరా... నువ్వు మరీ అంత బ్రతిమాలనక్కర లేదు... ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీకూ అంతే... అయితే ఒక్క సారి బావ ఫోన్ చేస్తే ఆన్సర్ చేసి మాట్లాడు... అంత కన్నా నేనేమీ చెప్పలేను... ఏదో ఒకటి నీ వైపు నుంచి జవాబు కూడా వాళ్లకి వెళ్ళాలి కదా... అలాగే, అమ్మా నాన్నలకి నేను చెబుతాను... డెలివరీ అయ్యాక చూద్దాము...” అన్నాడు గిరి ఆమె తల నిమిరి.

ఆ మధ్యాహ్నం వేణు ఫోన్ చేసినప్పుడు అయిష్టంగానే ఆన్సర్ చేసింది మధుబాల.

“మధూ, గిరి చెప్పాడు, నీవు రానని అంటున్నావని... నిజంగానే మా వలన తప్పు జరిగింది... వినతను అతిగారాబంగా పెంచి నేనూ, అమ్మా చెడగొట్టాము... అందుకు రియల్లీ వెరీ సారీ... నేను వచ్చి నిన్ను తీసుకువస్తాను... నువ్వు వచ్చేయి... నాన్నగారు కూడా చాలా బాధపడుతున్నారు...”

“వేణూ... కాదన్నంటున్నందుకు నన్ను క్షమించు... బేబీ పుట్టాక నేనే వస్తాను... అంతవరకూ ఓపిక పట్టు...”

“ఇన్ని వసతులున్న ఈ సిటీలో కాకుండా ఆ పల్లెటూరిలో పురుడు పోసుకుంటావా? అంత కాలం ఉద్యోగం వదిలేస్తావా? ఇటీజ్ టూ మచ్ మధూ...”

“ఉద్యోగానికి లీవు పెట్టాను వేణూ... అదెక్కడికీ పోదు... కాకపోతే పల్లె అని అంటున్నావు కానీ ఇక్కడా డెలివరీలు అవుతున్నాయి, పిల్లలూ పుడుతున్నారు... అక్కడ  క్షణం క్షణం భయంతో ఛస్తూ నే బ్రతకలేను...”

“నన్ను వదిలి నువ్వెక్కడో ఉండటం నీకు భావ్యమా?”

“ఎందుక్కాదు, అక్కడ నాకు రక్షణ లేనప్పుడు?  పెళ్ళయిన ఆడపిల్లకు అయితే అత్తగారిల్లు, లేదా అమ్మగారిల్లు ఇవే కదా ఉండేవి? నిజం చెప్పు, నువ్వు కానీ, మీ అమ్మగారు కానీ నా డెలివరీ అయ్యేదాకా వినతను ఇంటికి రానీయకుండా ఉండగలరా?”

“అదెలా కుదురుతుంది? వినత ఈ ఇంటి ఆడపిల్ల... దాన్ని రావద్దని చెప్పటం కుదరదు...” నిష్కర్షగా అన్నాడు వేణు.

“థాంక్స్... మళ్ళీ కలుద్దాం...” కసిగా ఫోన్ పెట్టేసింది... అతను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నా జవాబు ఇవ్వకుండా ఏడుస్తూ ఉండిపోయింది మధుబాల.

***

“అమ్మా!” వెనకనుంచి వచ్చి వీపు మీదపడి కౌగలించుకుంది వినత.

సుగుణమ్మ చిరాగ్గా ఆ చేతుల్ని వెనక్కి నెట్టింది.

“ఏమిటే, ఇంత కోపంగా ఉన్నావు?” ఆశ్చర్యంగా చూస్తూ డైనింగ్ చైర్ లాక్కుని కూర్చుంది వినత.

“అమ్మా... నేనేదో బ్రేక్ అయి నీకు చెప్పేనే అనుకో... నాన్నకి ఎందుకమ్మా చెప్పావు? ఆయన అక్కడికి వచ్చి క్లాసు పీకాడు...” కోపంగా అంది వినత.

“అందుకేగా నేనస్సలు ఆ పని  చేయలేదని ఆయన దగ్గర బొంకావు?” కటువుగా అంది సుగుణమ్మ.

“అమ్మా, ఇదేమిటే నీలో ఇంత మార్పు? అసలు నేనేం చేసానని?? ఏదో కోపంలో... ఉక్రోషంగా...”

“వినతా, నువ్వింక మారవా?  నిన్ను కన్నందుకు ఈ వయసులో ఆయన నాతో మాటలే మానేసారే... నీ ఆకతాయి తనాన్ని, చిన్నపిల్లతనంగా చూసాను... పోనీ నువ్వే ఎదిగిన తర్వాత మారతావని ఆశించాను... అలాంటిది మంచీ మానవత్వం లేకుండా, ఆ పిల్ల పడిపోవాలని బాత్ రూమ్ నిండా అవి పోయాలని నీకెలా అనిపించిందే? ఇంతవరకూ టీవీ సీరియల్స్ లోనే అలాంటి విలన్లు ఉంటారని అనుకున్నాను... నా కడుపునే పుడతారని నేను అనుకోలేదమ్మా...” భోరున ఏడ్చింది సుగుణమ్మ.

“అమ్మా ఈ ఇంటికి నేనే మహారాణిలా ఉండాలని అనుకున్నాను... మీ అటెన్షన్ అంతా ఆవిడ వైపు తిరిగేసరికి నన్ను మర్చిపోయారు. తనకి ప్రాధాన్యత... తనకి మీ అపురూపాలు... కొన్నాళ్ళకి వైభవంగా సీమంతం చేస్తారు... ఆ తర్వాత పుట్టిన పిల్లకో పిల్లాడికో బారసాల వేడుకలు... అన్నీ వాళ్ళకే... మరి నేను వెనకబడిపోతాగా, నాకు పిల్లలు పుట్టలేదు, ఎప్పుడు పుడతారో తెలియదు... అందుకే అలా చేసాను... అసలు ఆ మధూ ఇంటికి వచ్చినప్పటి నుంచీ అన్నయ్య కూడా మారిపోయాడు. ఎప్పుడూ ఆవిడ కొంగు పట్టుకు తిరగడమే... నాకు మధూ అంటే అస్సలు ఇష్టం లేదమ్మా... అర్థం చేసుకో...”

కూతురివైపు భయంగా చూసింది సుగుణమ్మ. చేసిన దానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదా పిల్లలో. పైగా అన్నతో కాపురం చేస్తున్న వదినగార్ని చూసి అసూయ పడుతోంది... ఏమిటి దీని మానసిక స్థితి?

“చూడు విన్నూ, నువ్వు అక్కడ నీ ఇంట్లో ఎలా అడుగు పెట్టావో, ఇక్కడ మధూ కూడా అలాగే మన ఇంట్లో అడుగు పెట్టింది... అక్కడ నీ మాటే చెల్లాలని, నువ్వు హాయిగా ఉండాలని ఎలా అనుకుంటావో, ఇక్కడ మధు కూడా అంతే... అది ఈ ఇంటి కోడలమ్మా... నీ తల్లి తర్వాత అంతటి స్థానం తనకి ఇచ్చి తీరాలి... మన వంశానికి అంకురాన్ని ఇవ్వబోయే అమ్మ తను... అలాంటి దాని మీద ఇలాంటి అఘాయిత్యం చేసిందే కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఎంత అహంకారమే నీకు? అవునులే, ఆ పాముపిల్లకి పాలుపోసి పెంచింది, నేనే కదా...”

“అమ్మా!” అసహనంగా అరచింది వినత.

“మొన్న ఆయన పాఠం చెప్పాడు, ఇప్పుడు ఇక నీ వంతా? ఆకలేస్తోంది... ఏమైనా చెయ్యి...” హఠంగా అంది వినత.

“మీ ఇంటికి వెళ్లి వళ్ళు వంచి వండుకో... నేను చేసి పెట్టలేను... మీ నాన్న వస్తే ఆయనతో గొడవ...  వెళ్ళు తల్లీ...” విసుగ్గా అంది సుగుణమ్మ.

“అమ్మా, నువ్వేనా నన్ను వెళ్ళిపొమ్మని అంటున్నావు?” నమ్మలేనట్టు చూసింది వినత.

“నువ్వే ఆ పరిస్థితి తెచ్చుకున్నావు వినతా... ప్లీజ్... అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాస్తయినా మారటానికి ప్రయత్నం చెయ్యి...” బాధగా కళ్ళు మూసుకుంది సుగుణమ్మ.

“అది మీకందరికీ ఏదో మందు పెట్టి మార్చేసిందే... అందుకే నెత్తి  మీద పెట్టుకునే నన్ను కాలి కిందేసి తొక్కుతున్నారు... సరే, వెళ్తాలే...” విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వినత.

‘ఇంటి పరిస్థితి ఎప్పటికి మారుతుందో? ఆయన కోపం ఎప్పటికి చల్లారుతుందో? కోడలు డెలివరీ అయ్యే వరకూ రానని కబురు చేసింది... ఆ తర్వాతయినా వస్తుందా అసలు? దాని ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటో... అన్నీ ప్రశ్నలే...’ బరువుగా అనుకుంది సుగుణమ్మ.

***

మధుబాలకి ఐదవ నెల వచ్చింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ, టౌన్ హాస్పిటల్ లో రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటోంది మధు. అవసరమైన మందులు, విటమిన్లు వాడుతూ, మంచి ఆహారం తీసుకుంటూ, దిగులుగా ఉండకుండా మంచి పుస్తకాలు చదువుతూ, ఇంట్లో అందరితో కలసి మెలసి ఉంటూ కాలం గడుపుతోంది. పూర్ణమ్మ పనుల్లో వద్దన్నా సాయపడుతుంది.

నిర్మల కూడా చాలా మంచి అమ్మాయి. ఆడపడుచు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో తెలుసు... అందుకనే, సాధ్యమైనంత వరకూ ఆమెను బాగా చూసుకోవటానికే ప్రయత్నం చేసేది. తానూ వట్టి మనిషి కాకున్నా మధూ చేతుల్లో పనిని బలవంతంగా లాక్కునేది.

“వదినా, నీ సహకారం, స్నేహం లేకపోతే నేను ఇంత స్వతంత్రంగా ఇక్కడ ఉండగలిగేదాన్ని కాదు...” సజల నేత్రాలతో చెప్పేది మధుబాల.

“ఇది ముందు నీ ఇల్లు మధూ... నీ  తర్వాతే నాది... ఏ ఆలోచనలూ లేకుండా ప్రశాంతంగా ఉండు...” చెప్పేది నవ్వుతూ నిర్మల.

అనంతరామయ్యకు కూతురి కాపురం గురించి దిగులు పట్టుకుంది...

ఒక సారి వేణుగోపాల్ వచ్చి చూసి వెళ్ళాడు. మరోసారి తన తల్లితో కలిసి వచ్చేడు...

‘కాన్పు కాగానే ఇంటికి వచ్చేయాలని’ మరీ మరీ చెప్పి వెళ్ళింది సుగుణమ్మ.

మధుబాలను కలవక ముందేమో కానీ కలిసిన తర్వాత ఆమెకు తృప్తిగా అనిపించింది... మధుకి పుట్టింట్లోనే కావలసిన నిశ్చింత... ఆమె, ఆమె తల్లి పూర్ణమ్మ తీసుకుంటున్న కేర్, ఆరోగ్యం పట్ల జాగ్రత్త, పుట్టబోయే బిడ్డ మీద శ్రద్ధా తమ ఇంట్లో ఉంటే నిజంగానే కుదిరేవి కాదు... ఎంతైనా తల్లి తల్లే... వియ్యపురాలికి వెయ్యి జాగ్రత్తలూ, కృతజ్ఞతలూ చెప్పి మరీ బయలుదేరింది సుగుణమ్మ.

మనవరాలితో ఎంతో అనుబంధం ఉన్న అంజమ్మ కూడా మధుబాలకు ఎవరి మీదా కోపం పెట్టుకోకుండా వెళ్లి కాపురం చేసుకోమని నచ్చజెప్ప సాగింది.

మధుకి కూడా మనసులో ఏ మూలో వెళ్లిపోవాలనే అనిపిస్తోంది కానీ, వంటికి బాగా నీరు పట్టి, డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పటం వలన తన ఆలోచనను కాన్పు అయ్యే వరకూ వాయిదా వేసుకుంది. వినత, ఆమె చేసిన పనులు జ్ఞాపకం వస్తే మాత్రం రక్తం మరిగిపోతూ ఉంటుంది...

***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్