Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
room no. 333

ఈ సంచికలో >> కథలు >> పితృదేవతలు

pitrudeatalu

మాధవరావు ఒంటరిగా  బయట అరుగుమీద కూర్చుని తీవ్రంగా  ఆలోచిస్తున్నాడు.ఏదో ఘోరమైన విపత్తు జరగబోతోందన్నట్టుగా అతని మనసు సూచిస్తోంది. ఇన్నేళ్ళ  జీవితంలో ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చాయి.

మాధవరావు  తన వృత్తి ధర్మంలో ఎందర్నో  గుడ్డిగా  నమ్మాడు.కారణం  వాళ్ళల్లో చాలామంది ఏదో కారణంతో రోజూ వచ్చి పోయేవాళ్ళే .  తను సాధారణమైన జీవితాన్ని లాగిస్తున్నా అతని ఇల్లుమాత్రం అతిధులూ, అభ్యాగతులతో  సందడిగా వుండేది. ఇంట్లో జరిగే సాహిత్య గోష్టులు, సొంతంగా ఏర్పాటు చేసుకున్న గ్రంధాలయం అతని సాహితీ పిపాసకు అద్దం పట్టేవి . దాంతో ఆ ఇంటికి వచ్చే కవులూ, కళాకారులతో ఆయనిల్లు కృష్ణ దేవరాయల ఆస్తానాన్ని గుర్తు చేసేదని వచ్చిన  వాళ్ళు అభివర్ణించే వాళ్ళు. కొన్నేళ్ళ నుండి సజావుగా సాగిపోతున్న అతని జీవితంలో   మాయని మచ్చలా ఇప్పటివరకు  అతని  జీవితకాలంలో  ఎప్పుడూ  ఎదురవ్వని  ,ఎదుర్కోని  ఒక ఇబ్బందికరమైన సమస్య  అతన్ని అనుక్షణం  వేధించుకు తింటూనే ఉంది.  . ఇది అతనికి ఆత్మహత్యా సదృశ్యం. అవే ఆలోచనలను, మనసును ఇంకోవైపు మళ్లిద్దామన్నా మనిషిని నిలువునా కాల్చేస్తున్నాయి.    

వారం  రోజుల క్రితం సెక్రటరీ తనతో అన్న మాటలు గుండెల్లో మారు మోగుతున్నాయి.  “ ఇన్నాళ్ళు మీరంటే మాకెంతో గౌరవం. అందుకే మీకు కమిటీ  భాద్యతాయతమైన  పోస్ట్  అప్పగించింది . కాని మీరు డబ్బు కోసం ఇంతగా  దిగజారుతారని ఏ కోశానా  అనుకోలేదు. ఆడిట్ చెకింగ్ లో డబ్బై వేలకు పైగా  గల్లంతయ్యినట్లుగా  బయట పడింది.   ఈ విషయం మేమెలాగో బయటకు పొక్కకుండా చూసుకుంటాం.. ఒక వారం  రోజుల్లో  ఆ డబ్బు తీసుకొచ్చి  కట్టెయ్యండి . ఇంతకన్నా ఒక మానవత్వం ఉన్న వాడిగా నేను చెయ్యగలిగింది లేదు. “   గంభీరంగా  పలికింది  సెక్రటరీ గొంతు.

సెక్రటరీ మాటలు చెళ్ళుమని కొరడాతో కొట్టినట్టుగా అనిపించాయి. ఒంట్లో  రక్తం తోడేస్తున్నట్టుగా ఉంది. జరిగింది కలో  నిజమో తెలియని పరిస్తితి. అక్కడే  తనెలా  నిలబడ గలిగాడోకాని నీరసం, నిక్కాక  శరీరంలోకి  ప్రవేశించి గుండెల్లో ప్రకంపనాలు మొదలయ్యాయి.  సెక్రటరీ తన మీద అంత ఘోరమైన నెపం ఎలా వేసాడో?  ఇన్నాళ్ళు తన వృత్తిని, తన సిన్సియారిటీని ఎంతో గౌరవించే సంస్థ ఒక్కసారిగా  తన మీద వేసిన నిందను జీర్ణించుకోవడం అతని వల్ల కావడంలేదు.   తన మీద అతని  అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతని మాటలు మొదటినుండి తనతో వ్యవహరించిన దానికి పూర్తి భిన్నంగా   ఉండి  కర్కశంగానూ , కటువుగానూ అనిపిస్తున్నాయి.  అతని మాటల తూటాలు  చెవుల్లో మారుమోగుతూంటే  నిస్సహాయంగా ఉలుకూ పలుకూ లేకుండా కొద్దిసేపు అలాగే కొయ్యబారి ఉండిపోయాడు మాధవరావు..

“డబ్బు అవసరం ఎవరికైనా వస్తుంది లెండి . ఆ సమయంలో మీకు అదే  మంచి అవకాశం అనిపించి ఉంటుంది.  పైగా మీ చేతులమీద  కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్  రోజూ జరుగుతూంటాయి. మా లాంటి వాళ్లకు అలాంటి అవకాశం  రమ్మన్నా  వస్తుందా ?   ఏది ఏమైనా ఇప్పుడు  విచారించి ఏమి లాభం ? సెక్రటరీ చెప్పినట్టు మూడో కంటికి తెలియకుండా డబ్బు తెచ్చి అల్మారాలో పెట్టెయ్యండి స్వామీ ! “ అన్నాడు వీరభద్రం అనే సహచరుడొకాయన మర్మగర్భంగా నవ్వుతూ,.   అతని  నవ్వులో  ఒక విధమైన  నీచత్వం, అవహేళన  దాగి వుంది. 

మాధవరావుకు  తల కొట్టేసి నట్టయింది. ఎవరికైతే  చేరకూడదో ఆ మాటలు వారికే  చేరి పోయాయి. . ఇప్పటికే  ఈ విషయం అదిగో ఇదిగో అంటూ  మొత్తం సంస్థ అంతా పాకిపోయి ఉంటుంది.  అతనిలో అప్పటివరకు  బిగపట్టిన ఆవేశం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సెక్రటరీ రూమ్  లోకి దూసుకెళ్లాడు. 

తనని తానూ నిగ్రహించు కోవాలని చూసాడు మాధవరావు . కాని అతని గుండెల్లోంచి ఆక్రోశంగా బయట పడ్డాయి అప్పటివరకు అణగదొక్కుకున్న ఆగ్రహ జ్వాలలు..

“సెక్రటరీ గారు ! నా మీద ఉట్టి పుణ్యాన  వేసిన నిందలు ఎప్పటికైనా మిమ్మల్ని భాదించక మానవు. ఇప్పటికైనా మీరు ఒకసారి  ఆత్మ పరిశీలన చేసుకోండి . మీ మాటలు, మీ ఆరోపణలు  వృత్తి పట్ల నాకున్న అంకిత భావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసాయి. మిమ్మల్ని  ఏ విధంగా నమ్మించాలో నాకర్ధం కావడం లేదు. పూర్తిగా ఏ  విషయం నిర్ధారణ  కాకుండానే  అప్పుడే అందరికి పాకి పోయింది. ఈ సంస్థలో అందరూ నా వాళ్ళే అనుకున్నాను. కాని  చాలా మంది శత్రువులు మధ్య నేను  పని చేస్తున్నట్టుగా ఇప్పుడు అర్ధ మవుతోంది.ఇప్పటికైనా మిమ్మల్ని ప్రాధేయ పడుతున్నాను  ఇంకో సారి బాగా రికార్డులు వెరిఫై చెయ్యండి. ఎంక్వయిరీలు వేయించండి.  నిజాల్ని నిగ్గు తేల్చే అవకాశం ఇవ్వండి. నేను కూడా రాత్రంతా  కూర్చుని బిల్లులూ అవీ చూస్తాను. .  నా హయాంలో పొరపాటున కూడా అవినీతి జరగడానికి  అవకాశమే లేదు. “ ఆరిపోయిందనుకున్న  బాంబులా  పేలాయి  అతని  మాటలు. ఈ హటాత్తు పరిణామానికి సెక్రటరీ షాక్ తిన్నాడు. అతని పెదవుల మధ్య  పొగలు  కక్కుతున్న  సిగరెట్టును నిర్లక్ష్యంగా  నలిపి  యాష్ట్రేలో  పడేసాడు..ఇద్దరి మధ్య  రెండు నిమిషాలు మౌనంగా దొర్లాయి. మాధవరావు మాటలకు  అతని  అహంకారం  భళ్ళున బద్దలయ్యినా ఇన్నాళ్ళుగా మాధవరావుతో  ఉన్నస్నేహాన్ని పురస్కరించుకుని వెంటనే తమాయించుకుని సాధ్యమయినంత  వరకు  మంద్ర స్తాయి గొంతుతోనే ఇలా   అన్నాడు. 

“ సారీ మాధవరావు  గారూ ఈ విషయంలో నేనేమి చెయ్యలేక పోతున్నాను. . ఒకసారి ఆడిటర్ల దృష్టికి వచ్చిందంటే మన చేతిలో ఏమీ ఉండదనీ మీకూ తెలుసు. నేను కూడా మన చైర్మన్ కు జవాబుదారినే. ఆడిటర్లు నోటీసు ఇవ్వక ముందే  ఆ డబ్బు ఎంత కష్టమైనా సరే తెచ్చి ఇచ్చేయండి.   .   అసలు చైర్మన్ గారు పోలీస్ కేసు పెట్టమని అంటున్నారు. నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక విషయాన్ని సామరస్యంగా హేండిల్ చేస్తానని మాటివ్వడంతో ఆయన ఏ కళ నున్నాడో   ఊరుకున్నాడు. .” అన్నాడు సెక్రటరీ  అక్కడ నుండి వెళ్లి పోతూ.

మాధవరావుకు  ఎంత త్వరగా అక్కడనుండి బయట పడిపోదామా అనిపించింది. తనని తాను నిగ్రహించుకోవాలని చూస్తున్నాడు  కాని సాద్యపడటం లేదు.  అసలు ఆ సంస్తలో ఇంకొక్క నిమిషం కూడా  ఉండటానికి  అతనికి మనస్కరించడం లేదు.

ఆ  రోజు  నుండి  మాధవరావును  అనుమానించే వారి   సంఖ్య పెరిగిపోయింది.  అప్పటివరకు అతని  సలహాలు, సహాయం పొందిన  వాళ్ళు  వెనక  నుండి  కామెంట్లు  చెయ్యడం  మొదలు పెట్టారు. కొన్నాళ్ళుగా  అతను  ముభావంగా  ఉంటున్నాడు. భార్యతో కాని  , కూతురితో  కాని  మనసు  విప్పి  ఏమీ  చెప్పడం  లేదు.

“ మాకు  అనుమానంగానే  ఉందండి. ఇద్దరు  కొడుకులను  పెద్ద పెద్ద చదువులు  చదివించడం మామూలు జీతంతో ఈ రోజుల్లో  సాధ్యమా ? మా పిల్లలను స్కూల్ ఫైనల్ వరకు చదివించాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి.  పైగాఆయనకు  పెళ్లి కెదిగిన కూతురుంది. కనీసం చేతిలో నాల్గైదు లక్షలు  ఉంటేకాని పెళ్లి కాదు. అసలు ఇంకా బయట పడలేదు కాని ఇలా ఎన్నాళ్ళ నుండి ఈ భాగవతం నడిపిస్తున్నాడో ఈ పెద్ద మనిషి ? పైకి మాత్రం ఉదార స్వభావుడని, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే కరిగి పోతాడని అందరిచేత అనిపించుకోవాలని వెధవ  తాపత్రయం. రోగాలు, రహస్యాలు ఎంత కాలం దాచగలం? ఈ  రోజు పాపం పండింది. అనుభవించక తప్పదు. “ అంటూ మాధవరావు తో నిన్నటి వరకు  బాగా సంచరించిన సహచర బృందం నిస్సిగ్గుగా, నిర్దాక్షిణ్యంగా వెలివేసి నట్లుగా మాట్లాడుతూంటే కళ్ళ ముందు ఘోరం జరుగుతున్న  ప్రేక్షకుడిలా కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నాడు మాధవ రావు.

ఇంటికొచ్చి వాలుకుర్చీలో కూలబడ్డాడు. భరించలేని ఉద్విగ్నత అతనిలో కనిపిస్తోంది. క్షణ క్షణానికి తన కంపనీ లోని సహచరులు అన్న మాటలే గుర్తొస్తున్నాయి.  ఇప్పుడు వాళ్లకు ఇదో  మంచి అవకాశం. ఈ  పరిస్తితిలో   మీద పడిన నింద నుండి ఎలాగోలా బయటపడటం తప్ప చెయ్యగలిగిన దేమీ లేదు. భవిష్యత్తు ఏమిటో  కాలానికే  వదేలేసే  పరిస్తితి  కాదు.మనసు  అవమానంతో కుతకుతలాడుతున్నా క్షణ  క్షణానికి  పరిస్తితి  విషమిస్తూ ఉండటంతో అప్పటివరకు  మల్లగుల్లాలు  పడుతున్న అతనికి  సమస్యను  కొడుకుల దృష్టికి తేక   తప్పలేదు. ఆ రాత్రి మాధవ రావు అన్యమనస్కంగానే  జరిగిన విషయం కొడుకులకు ఫోనులో చెప్పాడు.

ఇప్పుడు ఈ సమస్య నుండి బయట పడక పోతే పోలీస్ కేసు కూడా ఎదురు కోవాల్సి ఉంటుందని  నిష్కారణంగా తన మీద నిందలు వేసి తనని బయటకు నెట్టేయాలని  చూస్తున్నారని దీని కంతటికీ కారణం సెక్రటరీ నే నని, ఒక నాడు అర్జెంటు గా తనకో లక్ష రూపాయలు కావాలంటూ వచ్చిన సెక్రటరీకి తను సహకరించక పోవడంతో మనసులో కక్ష పెట్టుకుని ఏదో రకంగా తనని వంచిన్చాలనే నెపంతో  అల్మారాలోంచి డబ్బు   కాజేసినట్లుగా కథలు అల్లాడని ఇన్నాళ్ళుగా పరువుగా పనిచేస్తూ   ఏ సమస్య రాకుండా చూసుకుంటున్న తనకు అనుకోని విపత్కర పరిస్తితి ఎదురైందని   ఈ పరిస్తితిలో తలో చెయ్యి వేసి  వాళ్లకు ఏదో విధంగా డబ్బు కట్టేసి భాద్యతలనుండి తప్పుకోవడం తప్ప వేరే దారి లేదని త్వరగా తనని ఆ నరక కూపంనుండి బయట పడేసే  మార్గం ఆలోచించమని అతని అంతరాత్మఎంత  ఒద్దని వారిస్తున్నా తనో అపరాధిలా కొడుకులతో మొరపెట్టుకోక తప్పలేదు.  మనసులో అలజడి రేపుతున్న భయాందోళనలను పిల్లలకు చెప్పేసాక అతని గుండెలు కొద్దిగా తేలిక పడ్డట్టయ్యి  హాయిగా ఊపిరి తీసుకున్నాడు.

తండ్రి ఇన్నాళ్ళుగా జరుగుతున్న విషయాలు ఒక్కటీ చెప్పక  పోగా ఇప్పుడు పీకల వరకు కూరుకు పోయాక ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్ ‘ చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ పరిస్తితిలో ఇంత సడన్గా ఏ సమస్యనైనా పరిష్కరించ గలిగే ధైర్యం, నేర్పరి తనం, చొరవ కొడుకులిద్దరి లోనూ ఉంటుందని మాధవరావు కూడా భావించ లేదు. కాని నదిలో కొట్టుకు పోతున్న వాడికి చిన్న తీగ తగిలినా దాని సాయంతో బయటకు రావాలని ప్రయత్నం చెయ్యడం సహజం.

“ఏమిటీ నాన్నా ఇంత పుట్టి ముంచావు. హాయిగా వేరే డిపార్టుమెంటులో పని చేసుకుంటున్న వాడివి అక్కడ సరైన విలువ లేదంటూ క్యాష్  సెక్షన్ కోరుకున్నావు. చూస్తూ చూస్తూ  ప్రతి వాడినీ నమ్మి ఎదురుగా కూర్చో పెట్టుకుని అల్మారా తాళాలు అప్పగించావు. డబ్బు నీ వల్లే పోయిందని నెపం వేస్తే సరెండర్ అయ్యి అకారణంగా డబ్బులు కట్టే పిచ్చాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా?.  వీటికి ఎంక్వయిరీలు, డిస్కషన్స్ అంటూ ఏమీ ఉండవా   ? ఇంతకు ముందు  కూడా  నీ  విషయంలో  మీ  మ్యానేజ్మెంట్  వాళ్ళకేదో  ఎగైనెస్ట్ గా  వెళ్ళావని  కక్ష  కట్టారని  గుర్తు  లేదా  ? బహుశా  అది  మనసులో  పెట్టుకుని  సాధిస్తున్నారేమో ?  ఏది ఏమైనా వాళ్లకు భయపడి డబ్బులు కట్టేసి భయట పడి పోవాలని వెర్రి వెర్రి ఆలోచనలు చేస్తే వాళ్లకు  ఉట్టిపుణ్యాన  లాభం  చేసిన  వాళ్ళమవుతాం. ఈ పరిస్తితిలో ఎదురొడ్డి సమస్యను ఛేజించుకు రావాలి కాని భయపడి పారిపోవడం మంచి విషయం కాదు. ప్రస్తుతం నీ నిర్ణయం మార్చుకో. నువ్వు తొందరపడి మా దగ్గరకు రావాలనే ప్రయత్నం కూడా నేను సమర్ధించను. మాకూ పిల్లలు ఎదుగుతున్నారు. నీలా   భాద్యతా రహితంగా ఉద్యోగంలో సమస్యలు తెచ్చుకుంటే  మా  ఉద్యోగాలు  కూడా ఊడుతాయి.. డబ్బై వేలంటే మాటలు కాదు. ముప్పై ఏళ్ల నుండి అక్కడ పని చేస్తున్నావు. ఆ మాత్రం సమస్యలను నెగ్గుకు రాలేవా ?  నువ్వు మాత్రం  అనాలోచితంగా  ఉద్యోగం మానేస్తే చాలా ప్రమాదం. నిన్ను వాళ్ళు వదిలిపెట్టరు. నీతో పాటు మమ్మల్ని కూడా  మనశ్శాంతి గా బ్రతకనివ్వరు . . ఇప్పటికే  ఉద్యోగంలో  మాకూ విపరీతంగా టెన్షన్స్  ఉన్నాయి “ అని కొడుకులు నెపం అంతా తన మీదే వేసి సమస్యకు ఏ మాత్రం పరిష్కారం చూపడానికి చొరవ చూపక పోవడంతో మాధవరావు పూర్తి అచేతనుడై పోయాడు. 

“ నన్ను  అర్ధం  చేసుకోండిరా  . నా  పరిస్తితి  ఇంకొక్క  క్షణం  కూడా  వాళ్ళ  దగ్గర  పని చేసే టట్లుగా  లేదు. మీకు  ఇంకా  చాలా భవిష్యత్తు ఉంది.  కావలసినంత  సంపాదించుకునే  అవకాశం  ఉంది. మన  పల్లెటూళ్ళో  ఉన్న  పొలాన్నికూడా  అమ్మేసి  నా  మనవళ్ళ  పేరు మీద  వేసాను  కదా. అందులోంచి  తీసి  ఎంతో  కొంత  పంపించండి .  నా జీవితం  మీ నిర్ణయం మీద ఆధారపడి  ఉంది “ అని కొడుకులతో గొంతెత్తి చెప్పాలనుకున్న మాటలు మాధవరావు గొంతులోనే సజీవ సమాధి అయిపోయాయి.

శరీరం బలహీనమైనప్పుడు రోగాలు  టెర్రరిస్ట్లు   లాగా  దాడిచేస్తాయి. మాధవరావుది  అదే పరిస్తితి. రిటైరయ్యాక  కొడుకుల  దగ్గరకు  వెళ్లి పోతాం  అంటూ  తను  చాలా  మందితో  చెప్పుకుంటూ  ఉంటే  “ పోన్లెండి  మీకు బంగారం  లాంటి  ఇద్దరు  కొడుకులు. కళ్ళకు రెప్పల్లా  చూసుకుంటారు  “ అని  వాళ్ళు  అంటూ ఉంటే  పుత్రోత్సాహము మాధవరావులో  పొంగి పొరలేది.  కాని దురదృష్ట వశాత్తు  కనీసం సానుభూతి వచనాలు కూడా కొడుకుల నుండి  దక్కలేదు.

ఇరవై సంవతరాల తర్వాత సంగతి. ఎప్పుడో ఇల్లు విడిచి వెళ్ళిపోయి అర్ధాంతరంగా ఆత్మ హత్య చేసుకున్న  తండ్రి మాధవరావు గుర్తుకొచ్చినా ఆయన కొడుకులు “ చేతులారా భాద్యతారహితంగా చేసుకున్న దానికి మనం భాద్యత వహించి భాద పడ్తూ ఉండటం  అనవసరం”.అని కొట్టి పారేస్తారే కాని  నానా కష్టాలు పడి తమని పెద్ద చదువులు చదివించి ఉన్నత స్తితికి ఎదగడానికి పునాదులు వేసిన ఆయన్ని ఆపద నుండి ఏదో విధంగా బయట పడేసి ఉంటే ఆయనిలా  ఎవరూ లేని  వాడిలా  దిక్కులేని చావు చావాల్సి వచ్చేది కాదు “ అని మాధవరావు కొడుకులు ఏనాడూ  అనుకున్నది లేదు. .

పిల్లలు తల్లి తండ్రులను ఇడుముల పాలు చేసి కష్టాల కడలిలో ముంచినా చనిపోయాక తల్లి తండ్రుల ఆత్మలు తమ పిల్లలు,వాళ్ళు కన్నపిల్లలు హాయిగా సుఖంగా ఏ కష్టం రాకుండా సుఖశాంతులతో  కలకాలం జీవించాలని కోరుకుంటాయే  తప్ప వారిమీద పగ పూనవు. వారిని పైనుండి  చల్లగా చూసుకుంటాయి. అదే  తల్లితండ్రులకు ఇతరులకు  ఉన్న తేడా.

ఈ నాటికి  కూడా  మాధవరావు గారి పిల్లలు, వారి సంతానం ఉన్నత స్తానాలకు ఎగబాకుతూ జీవితంలో అసంతృప్తి  అనే దానికి ఆమడ దూరంలో ఉంటూ డబ్బులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.

మరిన్ని కథలు