Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు

kamanu veedhi kathalu

మాటలు...మాటలు...మాటలు...అబ్బబ్బా...!అయినా అంతసేపు చెప్పుకోడానికి ఏముంటాయి..? ఏడాది పొడుగునా రోజూ అన్నేసి గంటలు మాట్లాడుకుంటూనే ఉంటే విసుగేయదా? నోరు నొప్పెట్టదా? పోనీ రోజూ అన్ని విశేషాలుండేంత గొప్ప బతుకులా మనవి? అనుకునే వారికి కమాను ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు. వారొక మిస్టరీగానే కనిపిస్తారు. కానీ ఇది వాస్తవం. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు ఎకాఎకి 20ఏళ్ళుగా వారు అలాగే మాట్లాడుకున్నారు. పదహారు గంటలపాటు పాడారనో..ఇరవై గంటలు నీట్లో నిలుచున్నారనో ...ముప్పై గంటలు ఏట్లో ఈత కొట్టారనో ఇలా అయినదానికీ కానిదానికీ రికార్డులు ప్రకటించే గిన్నిస్ వారికి తెలియకపోయింది గానీ లేకుంటే మా కమాను లేడీసు ఎప్పుడో ఆ రికార్డులో ఎక్కేసేవారు. కమాను అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది అక్కడి ఆడవాళ్ళు...వాళ్ళ కబుర్లు..!!చుట్టుపక్కల వటారం వాళ్ళు కమాను వనజమ్మ, కమాను విశాలాక్షమ్మ, కమాను శాంతమ్మ, కమాను శేషమ్మ, కమాను కోమలమ్మ అంటూ పేరుకు ముందు కమాను తగిలించడంతో వారికి ఎక్కడలేనంత ప్రచారం వచ్చేసింది.

తెల్లారు లేచింది మొదలు పరుపుగడ నుంచే మోసుకుపోయేంత పనుల్లో కనిపించేవారు. చిన్న ఇల్లే అయినా మూల మూలనూ కసవు నూకడం...అంగడిలో నీళ్ళు చల్లి ముగ్గులు వేయడం. పని మనిషి రాకపోతే ముసుర్లు తిక్కుకోవడం  లాంటి పనులుండేవి. ఓవైపు వంతులు గమనిస్తూ నీళ్ళు తెచ్చుకుంటూనే ఈ పనులు చేసుకునేవారు. విశాలాక్షమ్మక్క, పార్వతమ్మక్క ఇళ్ళల్లో ఉదయం ఏడు గంటలకే ఠప..ఠపా అంటూ జొన్నరొట్టెలు కొట్టే శబ్దం వినిపించేది. ఇక 10గంటలు తర్వాత ...అంటే పిల్లలు స్కూలుకు, మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాక ఇంట్లో బండలు తుడిచేవారు. మరికొందరిళ్ళల్లో బట్టలుతుక్కునేవారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి దగ్గరదగ్గర 12గంటలయ్యేది. కాస్త తీరిక దొరికి వంటమొదలెట్టే వేళలోనే కొందరిళ్ళల్లో ఆత్మీయ సమావేశాలుండేవి. ఇరుగు పొరుగు కబుర్లకంటే వారి కష్టసుఖాలు, ఇబ్బందులు...చెప్పుకోడానికే ఇష్టపడేవాళ్ళు. ఇంక రాత్రి సరేసరి. ఆ మాటలు ఎంతకూ తెమిలేవి కావు. అందరూ నిద్రపోతున్న ఆ నిశ్శబ్దంలో గుసగుసమంటూ వీరి కబుర్లు.. అప్పుడప్పుడూ ' అంతేలేమ్మా..ఏం చేద్దాం..' అని గట్టిగా అన్నారంటే వాళ్ళముందెవరో వెళుతున్నారని అర్థం.

ఎంతో ఆత్మీయంగా ఉంటూనే...కొన్ని విషయాల్లో చాలా కట్ నిట్ గా ఉండేవారు. విశాలక్ష్మమ్మక్క ఇంటికొచ్చి బోల్డన్ని కబుర్లు చెప్పేది. కానీ పొరపాటున కూడా వంటింట్లోకి వచ్చేది కాదు. వంటగదిలో అమ్మ..ముందుగదిలో ఈవిడ కూర్చొని మాట్లాడుకొనేవారు. అలాగూ అమ్మయినా..నేనయినా వారింటికెళ్ళినపుడు వంటింట్లో వెళ్ళేవాళ్ళం కాదు. సంప్రదాయాలు...ఆచారాలను పోటాపోటీగా ఆచరించేవారు. అమ్మ తడిబట్ట చుట్టుకుని చంకలో బిందె, చెంబునీళ్ళు ముందు చల్లుతూ మడుగు నీళ్ళు తెస్తున్న దృశ్యాలే కాదు... విశాలాక్షమ్మో, పార్వతమ్మో నుదుటిపై దట్టమైన విబూది రేఖలతో...మడుగు బట్టలతో శివశివా అంటూ చెంబులో నీళ్ళు చల్లుకుంటూ మడుగు నీళ్ళు తెస్తూ కనిపించేవారు.

పండుగలంటే పచ్చని తోరణాలు..పిండి వంటలూ సరే! వీటికంటే ఓ నెల ముందు నుంచే ఉతసాహం కమాను గుమ్మాల్లో వచ్చి వాలిపోయేది. కార్తీకంలో రోజూ తెల్లారు జామునే దేముడి ముందు దీపాలు వెలిగించడమనేది అతిపెద్ద కార్యక్రమం. దీనికోసం వత్తులు తయారీ ఇంకా పెద్దపని. రోజూ మధ్యాహ్నమ్మ్ నుంచి పిల్లలు బళ్ళ నుంచి వచ్చేదాకా ఇదే పని. కాసింత పత్తి..వేళ్ళ తడికి చిన్ని గ్లాసులో మజ్జిగ...చెప్పుకోడానికి కబుర్లు..వత్తుల తయారీకి ఇంకేం కావాలి? పోయిన సారి ఎలా చేశాం...ఎవరింట్లో ఎన్ని దీపాలు వెలిగాయి? నూనె ఖర్చు ఎంత కొచ్చింది? వత్తులు చేస్తున్నంతసేపూ మాటలే! రోజుకిన్ని అని లెక్కగట్టి గుత్తులుగా ఉంచేవారు ఆ తర్వాత నెలవారీ సరుకుల్లో నూనెకోసం పోరాటం మొదలయ్యేది. ' ఇంత ఖర్చు అవసరమా? ' చాదస్తం మరీ ఎక్కువైపోయింది '  ' నూనె లీటరు ఎంతో తెలుసా?' మగాళ్ళు ఎన్ని విసుర్లు విసిరినా..నోరు మెదిపితే ఒట్టు. చివరికి నూనె క్యాను వంటింటికి చేరుకునేది. రాత్రి భొఓజనం తర్వాత వత్తుల్ని నూనెలో తడిపి ప్రమిదల పళ్ళెంలో ఉంచేవారు. ఆ తర్వాతే నిద్ర. నెలంతా ఇదే తంతు. ఇప్పట్లా లక్షదీపోత్సవం, కోటి దీపోత్సవం అంటూ హైప్ పెంచే మీడియాలు లేని రోజుల్లోనే కార్తీక దీపోత్సవాన్ని చక్కగా నిర్వహించేవాళ్ళు. ప్రమిదల్లో వెలిగే దీపాలు వారి కళ్ళల్లోనూ మెరిసేవి.

కార్తీకంలో నెల్లిచెట్టుకింద భోజనం. ఏడాది దాకా ఉరకలెత్తే చురుకుదనానికి మనసులో నాటుకునే తొలివిత్తు..బావాజీ మఠం, రామజలకు క్యారియర్లు సిద్ధం అయ్యేవి. వాటొతోబాటు మనసులో మాటల్నీ మురిపెంగా మూటగట్టుకునేవాళ్ళు. కమానులో ఇళ్ళమధ్యే గిరికీలు కొట్టే ఉత్సాహం.. ఆ క్షణాల్లో ఊరిబైట కాల్వలా ఉరికెత్తేది. కమాను నుంచి బావాజీమఠం రెండు కిలోమీటర్ల దూరం. ఉదయం 10గంటలకు మమ్మల్ని వెంటేసుకుని వెళ్ళేవారు.  అప్పట్నుంచి షురూ. మాటలు..నవ్వులు..చెణుకులు..విసుర్లు...ఈ హోరులో దూరం తెలిసేది కాదు. మఠం ఆనుకొని కొండ..పచ్చని చెట్లు.. ఇరుకు గదుల్లో బతికిన మనసులోపలి అలసటను ఇట్టే తీసేసేవి. ఊరి నలుమూలల్నుంచి జట్లు జట్లుగా వచ్చి కలుసుకునేవారు. మధ్యాహ్నం సేమ్యా పాయసం, సిరా, పెరుగన్నం, చిత్రాన్నం, బి సి బేళే బాత్, బజ్జీలు, నాలుకకి పండగే పండగ.! చూస్తుండగానే పొద్దువాలిపోయేది. స్నేహం అందించిన సరికొత్త ఉత్సాహాన్ని వచ్చే కార్తీకం దాకా భద్రపరచుకునేవారు. రోజూ కాసింత మాటల్లో ఒంపుకునేవారు. శ్రావణమాసంలో వ్రతాలు, పూజలు ఒక ఎత్తు అయితే ప్రతి శనివారం కొండపైని రణమండల ఆంజనేయుడ్ని దర్శించుకోవడం మరో ఎత్తు. కమాను నుంచి మైలు దూరం వెళ్ళాక...కొన్ని వందల మెట్లు ఎక్కాలి అయితే ఏం వీరి ఉత్సాహం ముందు ఆ కొండే చిన్నబోయేది. ఈ రెండు మాసాల్లోనూ కమాను అప్పుడే విడుదలైన గొప్ప భక్తిరస చిత్రంలా కళకళలాడేది.

ఈ హంగామా చాలదన్నట్టు వారానికో, పదిహేనురోజులకో ' స్టీల్ సామాన్లూ ' కేకేసుకుంటూ పాత్రలమ్మే వాడు ప్రత్యక్షమయ్యేవాడు. మాంచి ఎండలో వాడొస్తూంటే నెత్తిపై వెదురు బుట్టలో తళతళలాడే స్టీలు పాత్రలు ధగధగమంటూ మెరిసిపోయేవి. వీధిలో కేకలు వినిపించగానే ఇంట్లో సందడి మొదలయ్యేది..బీరువా ముందో..ట్రంకు ముందో కూర్చొని పాతబట్టల్ని వెదికేవారు. కొందరు ముందుగానే దాచుకున్న మూటను వాడిముందు పడేసేవారు. బొంతలున్న చొక్కా, పట్టుకుంటే సర్రుమని చినిగిపోయే చీరల్ని అపురూపంగా పరిచి ' ఎంత బాగున్నాయో నువ్వే చూడు....ఈ చొక్కా ఇప్పుడే కుట్టినట్టు లేదూ.....ఈ చీర పోయిన వారం పేరంటానికి కట్టిందే.! నీకిచ్చినట్టు ఆయనకి తెలిస్తే ఇంక అంతే బాబూ...తిట్టించుకోవాల్సిందే.ఏదో వచ్చావని తీసుకుంటున్నాం అంతే! ' అంటూంటే వారి మాటకారితనానికి వాడు ఏడ్వలేక...వీటికేమొస్తుందమ్మా..ఇది కూడా రాదు అంటూ ఓ స్పూను చూపేవాడు. కానీ బేరాలాడడంలో వీళ్ళకు వీళ్ళే సాటి. ఎదుటివాడు వ్యాపారం చేస్తున్నాడు..వాడికీ కొంచెం లాభం రావాలి...లేకుంటే బిచాణా కనికరం ఏమాత్రం ఉండేది కాదు. గీసిగీసి బేరమాడాక ...ఓ పాత్ర ...ఓ గిన్నె....ఓ గరిటె తీసుకునేవారు. వాడు జాగా ఖాళీ చేసాక అటూ ఇటూ తిప్పుతూ ఫరవాలేదు బాగానే బేరమాడామని మురిసిపోయేవాళ్ళు.

కూరగాయల మార్కెట్టు., కిరాణాకొట్టుకు వెళ్ళాలంటే వెనకాముందాడే వాళ్ళ్వాళ్ళు గానీ షరాఫ్ బజారులోని బంగారు అంగళ్ళకు, రోషన్ మార్కెట్లోని చీరల దుకాణాలకు మాత్రం తయ్యారు. పద్దులపై చీరలు, బంగారు వస్తువులే కాదు, ఇచ్చేవాళ్ళుంటే షాపులకు షాపులే కొనేసేంత ఉత్షాహం వారిది. పాత గొలుసు, గాజులు...పాత కమ్మలు, ఇవ్వడం, కొత్తవి కొనడం..వాడు తరుగు అదీ ఇదీ అంటూంటే ' అప్పుడూ నీకాడే కదా కొనిందీ..తరుగని తగ్గిస్తే ఎట్ట..మాకు తెలుసులేగానీ ఇచ్చే మాట చెప్పు ' అంటూ లైన్లో పెట్టేవాళ్ళు. గుడికి వెళ్ళాలన్నా, జాతరకు వెళ్ళాలన్నా పేరంటాలకెళ్ళలన్నా జట్టు కట్టాల్సిందే. టీవీల ఊసులేని ఆ రోజుల్లో సినిమాలే పెద్దవినోదం. ఇంట్లో పనులు చెడరాదు. సినిమా వదులుకోరాదు. సెకండ్ షోకి రెడీ అయ్యేవారు. తెల్లారింది మొదలు పనుల్లో ఉండే వీరు ఎప్పుడు ప్లాన్ చేసుకునేవారో మరి. రాత్రి ఎనిమిది కాగానే అమ్మ మెల్లిగా సినిమా విషయం బైట పెట్టేది. ' ఇంత రాత్రి సినిమాకా..బుద్దుందా? ' ' ఇలాగ వెళ్ళండి ఎవడో ఒకడు దారికాచి దోచుకెళతాడు ' అని నాన్న రుసరుసలాడుతూనే ' ఇక వెళ్ళుమరి తలుపేసుకోవాలీ అంటూ సాగనంపేవాడు.

జీవితం ఎలా ఉంటే అలా స్వాగతించాలన్నదే వీళ్ళకు తెలిసొచ్చిన గొప్ప రహస్యం.! ఇరుకిరుకు ఇళ్ళల్లోనే ఉన్నారు. గంపెడంత సంసారాన్ని గుట్టుగా లాకొచ్చారు. గుళ్ళకు వెళ్ళారు. సినిమా టాకీసులకూ వెళ్ళరు. సంతోషమొస్తే నవ్వారు. కష్టాలొస్తే ఏడ్చారు. అన్నిటికీ మించి ఏ భావాన్నయినా పంచుకునేంత మాటల్ని పుట్టించుకున్నారు. సాధించడానికో గొప్ప లక్ష్యం, అనుసరించడానికో అద్భుత ఆదర్షం లాంటివేమీ లేకుండా సాదాసీదాగా గడిపేసారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విశాలాక్షమ్మ, కోమలమ్మ, శేషమ్మలు మాయమైపోయారు. మిగిలినోళ్ళు తలోదిక్కయ్యారు. వీరెవరూ లేని కమాను కాస్త మాటపడిపోయి మూగదైపోయింది!!

మరిన్ని కథలు
manchi - chedu