Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kathasameekshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనంవేంకట వరప్రసాదరవు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

దేవతల కోరికమేరకు వింధ్యపర్వతగర్వాన్నిఅణిచి వేయడానికి దక్షిణభారతానికి బయల్దేరాడు అగస్త్యమహర్షి. కొల్హాపూరు శ్రీమహాలక్ష్మి ఆజ్ఞ మేరకు స్వామిమలైని దర్శించుకున్నాడు. అక్కడ కుమారస్వామిని సేవించుకుని ఆయన ముఖతా సమస్త తీర్థముల, క్షేత్రముల గాథలను విన్నాడు. స్కాందమహాపురాణాన్ని విన్నాడు. అంతటితో ఆగకుండా అత్యత్తమమైన దేవుడు-క్షేత్రము-తీర్థము ఒకేచోట ఉన్న స్థలం ఏదైనా వుంటే దానిగురించి వినాలని ఉన్నది అని కోరాడు కుమారస్వామిని.

ఈ ప్రశ్నకు సమాధానం యివ్వగలవాడు, దేవాదిదేవుడు, పరమశివుడే అని చెప్పాడు కుమారస్వామి.

పొడమిన సందేహంబుల 
జడిసిన మందేహులం బ్రసన్నులఁ జేయన్ 
మృడునకుఁ బని గావున మన 
మడిగిన యర్థంబు నతఁడ యాదేశించున్             (కం)

ఎప్పటికప్పుడు మరల మరలా జనించే  మందేహులవంటి సందేహాలతో చలించిపోయే  మనలాంటి వారిని ప్రశాంతపరచడం, సందేహ నివృత్తి చేయడం మృడునకు  (పరమశివునకు) పని. మృడుడు అంటే సంతోషింపజేసేవాడు అని అర్థం. మందేహుడు వరుణుడు అనే యిద్దరు నిశాచరులు, చీకటికి అజ్ఞానానికి ప్రతీకలు.  సూర్యునితో పోరాడగలిగే శక్తి కోసం బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఆ వరాన్ని 
పొందారు. గాయత్రీ మంత్ర మననం చేసి, ఆ  అర్ఘ్యాలతో వారిని సంహరించడం వారికి నివారణ. కనుకనే గాయత్రీమంత్రానుష్ఠానం చేసి మూడుపూటలా సూర్యునికి అర్ఘ్యాలు యివ్వడం. బ్రహ్మదేవుని వరప్రభావంగా మరల మరలా జన్మిస్తూనే  ఉంటారు. గాయత్రీమంత్రానుష్ఠాన ప్రభావం వలన మరల మరలా చస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మరలా జన్మించే సందేహాలు చీకటి మందేహులవంటివి. వాటికి నివారణ చేయడమే జ్ఞానమూర్తియైన, దక్షిణామూర్తియైన పరమశివుని పని. కనుక  ఆయనను ఆశ్రయించి సందేహనివృత్తి చేసుకుందాము పదండి అని షణ్ముఖుడు  అగస్త్యుడిని, ఆయన సతీమణిని, మిగిలినవారందరిని వెంటబెట్టుకుని కైలాసానికి బయలుదేరాడు.

ఆసమయంబునన్ ధృతనిజాయుధు లాదృతభూషణుల్ మహో
ల్లాసలసన్ముఖుల్, వివిధలాంఛనలక్షితు లాసురాన్వయ 
త్రాసకరుల్ విమానగులు దైవతవీరులు తారకారి పెన్ 
మోసలమ్రోల నిల్చిరొక ముప్పదికోటులు మూఁడుకోటులున్                  (ఉ)

ఆ సమయంలో తమ తమ ఆయుధాలను ధరించినవారు, వివిధ ఆభరణాలను  ధరించినవారు, వివిధ చిహ్నాలను ధరించినవారు, రాక్షస వంశములకు నాశనాన్ని  కలిగించేవారు, విమానాలలో ముప్పైమూడుకోట్ల దేవతలు తారకారి ఐన కుమారస్వామి  మొగసాలలో, ఆయనకు ఎదురుగా నిల్చున్నారు.

పవితప్రక్రియ నల్దెరంగులెసఁగం బ్రస్థాననైపథ్య శో
భనముం గైకొని బ్రహ్మగర్భుఁడు, వహత్పల్యాణకళ్యాణమై 
ఘనగర్జన్ సకిలించు వాపురమునెక్కంబోవుచోఁ బర్వె సం
జనితాశాకరి కర్ణసంజ్వరభరాంచత్కంచుకి ధ్వానముల్                   (మ)

బ్రహ్మగర్భుడైన కుమారస్వామి నాలుగుదిక్కులకు ప్రతిధ్వనిస్తున్న పొగడ్తలతో,  ముఖంలో ఠీవితో శుభప్రదమైన శోభతో, గర్జనలను, ధ్వనులను చేస్తున్న తన వాహనాన్ని,  నెమలిని అధిరోహిస్తుండగా రేగిన కంచుకుల అరుపులు భూమిని మోస్తున్న దిగ్గజాలచెవులు  దిబ్బెళ్ళు పడేలా చేసి వాటికీ బాధ కలిగించాయి. బ్రహ్మ అంటే శివుడు అనికూడా. కనుక  బ్రహ్మగర్భుడు అంటే శివుని కుమారుడు అని చమత్కరించాడు రామకృష్ణుడు. యిక  కుమారస్వామి వాహనమైన నెమలిని యిలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. 

ఆటకు మెచ్చి బలారి యీఁగొను మరు
త్ఫలమిదియన బర్హభార మమర
హరుఁ గుత్తుకన కాక శిరసునఁ బోలఁ దా
ల్చిన జటాచ్ఛటలీల శిఖ వెలుంగ
క్షితిశిరో భూషావిశేష నిర్మితికిఁ బా
ల్పడు పడియచ్చులట్లడుగులు దగ 
ధాతృవాహముభుక్తిఁ దానభ్యసింప బి
సము మ్రింగుభంగి దష్టఫణి గ్రాలఁ                              (సీ)

గంఠ గంభీరనినదంబు ఖచరయువసతి 
గానవిద్యకు షడ్జసంధాన మొసఁగ
నెసఁగు దెలికన్నుఁగోనల యెక్కిరింత 
నెక్కె బలుకొండఁ దూఁటువోనేయు మేటి                (తే)

ఆ నెమలికి దాని ఆటకు, నాట్యానికి మెచ్చి దేవేంద్రుడు యిచ్చిన కానుకవంటి  యింద్రధనుస్సు వంటి పింఛం ఉన్నది. అది కంఠంలో శివుని పోలి ఉన్నది, దాని కంఠమూ నీలంగా, నల్లగానే ఉంటుంది, విషాన్ని ధరించిన కారణంగా శివుని  కంఠం కూడా అలానే ఉంటుంది. ఒక్క కంఠంలోనే కాదు, శిఖలో జటాజూటంలో  కూడా శివుని పోలి ఉన్నది అది, దాని కేశాలు అలా ఉన్నాయి. భూదేవికి నగలు 
చేయించడానికి అచ్చులు వేసినట్లుగా దాని అడుగులు ఉన్నాయి, దాని అడుగులు  భూదేవికి అలంకారాలుగా  ఉన్నాయి. బ్రహ్మదేవుని వాహనమైన హంస తామర  తూడును తినే విధానాన్ని తానూ నేర్చుకుంటున్నట్లు దాని నోట ఉన్న పాము ఉన్నది. దాని గంభీరమైన కేక దేవతాస్త్రీలకు గానకళలో (పై) షడ్జమాన్ని నేర్పుతున్నట్లు ఉన్నది. దాని కన్నులు వారి కన్నులను ఎక్కిరించే తెల్లదనంతో ఉన్నాయి. అటువంటి తన వాహనాన్ని, నెమలిని ఎక్కాడు బలిష్టమైన క్రౌంచపర్వతాన్ని కూలనేసిన మేటి యైన  కుమారస్వామి.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
vrukshamu - jeeva samrakshakulu