Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

తారాగణం: వెంకటేష్‌, నయనతార, సంపత్‌రాజ్‌, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్‌, సోనమ్‌ బజ్వా తదితరులు. 
సంగీతం: జిబ్రాన్‌ 
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌ 
నిర్మాణం: సితార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌ 
దర్శకత్వం: మారుతి 
విడుదల తేదీ: 12 ఆగస్ట్‌ 2016 


క్లుప్తంగా చెప్పాలంటే: 
పోలీస్‌ అధికారి అంటే కొంచెం కఠువుగా ఉంటారు. కానీ మన పోలీస్‌ అధికారి కృష్ణ (వెంకటేష్‌) నిజంగానే బంగారం. మనసు వెన్నపూస. నేరస్తులైనాసరే, వారికి ఏ చిన్న కష్టమొచ్చినా చలించిపోతాడు. అంతటి జాలిగుండె కృష్ణది. అలాంటి కృష్ణ ఐటీ అధికారి శాస్త్రి కేసుని డీల్‌ చేయాల్సి వస్తుంది. ఆ శాస్త్రి కూతురు శైలజ (నయనతార)తో ప్రేమలో పడతాడు కృష్ణ. అయితే కేసు విచారణ కోసమే తనతో ప్రేమలో పడ్డట్టు కృష్ణ నటిస్తున్నాడని భావించి శైలజ, కృష్ణకి దూరమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందన్నదే మిగతా కథ. శాస్త్రి ఎవరు? శైలజకి దగ్గరయ్యే క్రమంలో కృష్ణ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? వంటివన్నీ తెరపై చూస్తేనే బాగుంటుంది. 


మొత్తంగా చెప్పాలంటే:
ఎంటర్‌టైనింగ్‌ పాత్రలు దొరికితే వెంకీ చాలా ఈజ్‌తో చేసుకెళ్ళిపోతాడు. ఈ సినిమాలోనూ అంతే. వెంకటేష్‌ చెలరేగిపోయాడు. జాలితనం చూపించే క్రమంలో వెంకీ చూపించిన కామెడీ అదుర్స్‌. మునుపటి సినిమాలతో పోల్చితే వెంకీ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టేశాడు. ఓవరాల్‌గా సినిమా అంతా తానే అయి, వన్‌ మ్యాన్‌ ఆర్మీలా నడిపించేశాడు తనదైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో. 


నయనతార చాలా స్లిమ్‌గా కనిపించింది. చాలా గ్లామరస్‌గా కూడా ఉంది. నటన పరంగా ఓకే. ఉన్నంతలో బాగానే చేసింది. ఆమెకు నటన పరంగా పెద్దగా ఛాన్స్‌ దక్కలేదు. 30 ఇయర్స్‌ పృధ్వీ తన 'బత్తాయి బాబ్జీ' పాత్రలో నవ్వులు పూయించాడు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కూడా కామెడీతో నవ్వించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ఓవరాల్‌గా సినిమా ఎంటర్‌టైనింగ్‌ మోడ్‌లోనే సాగుతుంది. 
కొత్త కథేమీ కాదు. పోలీస్‌ అధికారికి జాలి గుండె.. అన్నదొక్కటీ కొత్త పాయింట్‌ అనుకోవాలి. మిగతాదంతా రొటీన్‌ కమర్షియల్‌ కథ. కథనం ఓకే. మాటలు ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. మ్యూజిక్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్సయ్యింది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలాబాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి ప్లస్సయ్యాయి. 


మారుతి సినిమాల్లో ఓవర్‌ డోస్‌ అడల్ట్‌ కామెడీ అన్నది ఒకప్పటి మాట. ఎంటర్‌టైనింగ్‌ సినిమాలకి పెట్టింది పేరు అనే మాట బాగా బలపడిపోయిందిప్పుడు. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ని దాటి, మారుతి సాహసం చేయలేదు. ఫస్టాప్‌, సెకెండాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే నింపేశాడు. ప్రతి సీన్‌ నుంచీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రాబట్టడానికి ప్రయత్నించాడు. స్టార్‌ హీరోతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని, స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలనే ఆలోచనతో, సాహసాలు ఏమీ చెయ్యకుండా సేఫ్‌ జోన్‌లో సినిమాని తెరకెక్కించేశాడు. దాంతో ఆడియన్స్‌ ఎక్కడా బోర్‌ ఫీలయ్యే ఛాన్స్‌ లేదు. ట్విస్ట్‌లు పెద్దగా ఏం లేవుగనుక సినిమా సాఫీగా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోయిందంతే. మొత్తంగా చూస్తే మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీతో ఆడియన్స్‌ని మెప్పించే ప్రయత్నమే చేశారు. 


ఒక్క మాటలో చెప్పాలంటే: ఎంటర్‌టైనింగ్‌ బంగారం!


అంకెల్లో చెప్పాలంటే: 3 / 5

మరిన్ని సినిమా కబుర్లు
.sushanth  atadukundam movie ready to relese