Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bhandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ...http://www.gotelugu.com/issue174/497/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

  ‘‘ఇప్పుడు మనకు ఏమి కొరవ? ఎందుకీ యుద్ధము? నీ పరిపాలనలో మన గాంధారము సుభిక్షముగనే యున్నది గదా. ప్రజానీకము శాంతి సౌఖ్యాలతో జీవించుచున్నారు. కోశాగారమున కొల్లలుగగ ధనమున్నది. పసిడికి కొరత లేదు. రత్న రాసులకు కొదువ లేదు. ఐశ్వర్యమునకు లోటు లేదు. ఆహార కొరతయును లేదు. పంటలు పుష్కలముగ పండుచున్నవి. ఇక రాజ్యమందువా? ఉన్న రాజ్యము మనకు చాలదా? మనిషికి ఆశ మంచిదే గాని దురాశ మంచిది గాదు. పేరాశ పతనమునకు దారి తీయును.రత్నగిరి మన శత్రు రాజ్యమూ కాదు. అలాగని మన పొరుగు రాజ్యమూ గాదు. దక్షిణాన ఎచటో సు దూరమున వున్నది. ఎవని మాటలో నమ్మి నిష్కారణమున సైన్యమును నర మేథమునకు నడిపించుట న్యాయ సమ్మతమా? ఆ బాహ్లీకుడు నీకు మిత్రుడైన అగు గాక. వాడు స్వామి ద్రోహి, రాజ ద్రోహి. అలాంటి నీచునికి నీవు సాయం వెడలుట` ఇది నీ వివేకమనుకొందునా అవివేకమనుకొందునా?’’ అంటూ వాస్తవాన్ని ఆవేశంగా నిదీసాడు సచ్ఛీలుడు.

ఆ మాటలను శ్రద్ధగా ఆలకించి`

గంభీరంగా చూసాడు శతానీకుడు.

‘‘గౌరవనీయులు, హితాభిలాషియగు పిన తండ్రి గారూ! మా హితవు కోరి మీరు చేసిన హిత బోధకు శతాభివందనము. కృతజ్ఞుడను’’ అన్నాడు.

‘‘మీరొక విషయమును మరచినారు. రాజ్యము వీర భోజ్యమను ఆర్యోక్తి మీరు విన లేదా? చరిత్ర మీకు తెలియనిదా! అంది వచ్చిన సదవకాశమును వదలుకొనుట వివేకమా అవివేకమా? గుట్టలుగా సంపద వున్నను ఇంకనూ సంపాదించని పురుషుని లోకమున ఒక్కడి నైనను చూపించ గలరా? అటు మీరు చూపించిన ఈ యుద్ధమును విరమింతును’’ అన్నాడు.

ఆ మాటకు గుంభనగా నవ్వాడు సచ్ఛీలుడు.

‘‘నాయనా శతానీకా! చరిత్ర నేను మరువ లేదు సుమా. మన మూల పురుషుడైన శకుని మాటలు నమ్మి రాజ్యము వీర భోజ్యమని విర్ర వీగి పాండు కుమారులతో వైరమును పెంచుకొని పరిస్థితిని కురు క్షేత్రము వరకు తీసుకెళ్ళాడు సుయోధన సార్వభౌముడు. ఏమైనది? ఆ యుద్ధ ఫలితం నీకు తెలియనిది కాదు. బుద్ధి మంతుడు ఎన్నడూ తొందర చూపడు. అవకాశం అనుకుని ఆపదలు కొని తెచ్చుకోడు. రత్నగిరిని తక్కువగా అంచనా వేయుట మంచిది కాదు. నీ నిర్ణయమును పునరాలోచింపుము’’ అన్నాడు.

‘‘పిన తండ్రి గారూ! ఇంతగా మీరు అడుగుచున్నారు గావున మీకో నిజము చెప్ప వలె. బాహ్లీకుడు నా మిత్రుడే గాని ఇప్పుడు నా యుద్ధ తంత్రమున వాడొక బలి పశువు. నేను విజయము కొరకు అతడిని పావుగా వాడుకొనుచున్నా నంతే...’’

‘‘అది నమ్మక ద్రోహము కాదా?’’

‘‘ఇంతకు మునుపే గదా తమరు శలవిచ్చితిరి ఆ బాహ్లీకుడు ఒక స్వామి ద్రోహి, రాజ ద్రోహియని. అలాంటి ద్రోహికి నేను నమ్మక ద్రోహ మొనర్చుటలో అన్యాయ మేమున్నది? అది న్యాయ సమ్మతమే గదా?’’

‘‘కావచ్చును. కాని వాడు నీకు మాత్రం ద్రోహం చేయడనుటకు హామీ ఏమి వున్నది?’’ సూటిగా అడిగాడు సచ్చీలుడు.

‘‘నీలాగే తగు జాగ్రత్తలో ఉన్నాడేమో ఎవరికి తెలియు? అంత దేనికి, మహా రాజు ధర్మ తేజుడు రోగ పీడితుడైనందున యుద్ధ గళమునకు రాక పోవచ్చును. కాని యువ రాజు ధనుంజయుడు రాకుండునా?’’ అడిగాడు.

ఆ మాటలకు అసహనంగా`

ముఖం చిట్లించాడు శతానీకుడు.

‘‘పిన తండ్రిగారూ! మీకు అర్థము గాకున్నది. బాహ్లీకుని మనుషులు ధనుంజయుని అంత మొందించినారు. ఆ విషయము లేఖలో స్పష్టముగ నున్నది’’ అన్నాడు.

‘‘బాహ్లీకుని లేఖను ఎంత వరకు నమ్మ వచ్చును? ఆ లేఖ గాక యువ రాజు ధనుంజయుని మరణాన్ని ధృవీకరించే మరో ఆధారం వున్నదా? ఆలోచించితివా?’’ సూటిగా అడిగిన సచ్ఛీలుని ప్రశ్నకు ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు  మహారాజు శతానీకునికి. బాహ్లీకుడు లేఖలో అసత్యము వ్రాసినాడని అనుకో లేడు. ఆ లేఖను తను పూర్తిగా విశ్వసిస్తున్నాడు. అందుకే తన అభిప్రాయాన్ని స్థిరంగా యిలా పలికాడు.

‘‘దక్షిణ పథాన రాజ్య స్థాపన మదీయ చిరకాల వాంఛ. మా కుమారుడు విజయేంద్రుడు యుక్త వయస్కుడగు చున్నాడు. నేనింకను వయసు లోనే ఉంటిని. పదవీ కాంక్ష తీర లేదు గనుక వానికి నా రాజ్యమును ప్రస్తుతం పంచి యివ్వజాల. కావున రత్నగిరి జయించి అచట నా కుమారునికి పట్టాభిషేక మొనర్చి నా ప్రతి నిధిగా రత్న గిరి సింహాసనమున కూచుండ జేసెద. సమస్యను అన్ని కోణములు పరిశీలించి ఆలోచించి ఈ నిర్ణయం గైకొనుట జరిగినది. కావున సమరము అనివార్యము. ఈ విషయమున ఇక వాదోపవాదములకు తావు లేదు. మీరు కూచో వచ్చును’’ అన్నాడు నిర్మొహమాటంగా.

ఆ విధంగా మహా రాజు అంతర్యం పూర్తిగా తెలిసాక ఇక ఇంకా తాను వాదించిన కంఠ శోష తప్ప ఎలాంటి ప్రయోజనము లేదని సచ్ఛీలునికి అర్థమైంది.

‘‘సంతోషము ప్రభూ! మీకు విజయము చేకూర గలదని ఆశిస్తున్నాను. మీ నిర్ణయము శిరో ధార్యమైనప్పటికీ నేను యుద్ధ విముఖుడను గావున క్షమించండి. నేను నిష్క్రమించుచున్నాను....’’ అంటూ సమావేశం నుండి బయటికెళ్ళి పోయాడు సచ్ఛీలుడు. అతన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు గాని చివరిగా అతడు పలికిన పలుకు శతానీకునికే కాదు, అచట ఎవరికీ విన బడ లేదు. ఆ పలుకు ఏవంటే` ‘‘వినాశ కాలే విపరీత బుద్ధిః’’ అని.

ఆ విధంగా సమావేశం నుండి సచ్చీలుడు నిష్క్రమించాక శతానీకుడు ఇక ఆలస్యం లేకుండా మంతనాలు సాగించాడు. రణ తంత్రం గురించి సైన్యాధిపతులతో చర్చించాడు. ఆస్థాన పురోహితులు లెక్కులు గణించి పేరు బలం చూసి సరిగ్గా నాటికి పదో రోజున సైన్యం కదులుటకు ప్రయాణ ముహూర్తం నిర్ణయించారు. ఆ సాయంకాలమే శతానీకుని సందేశాన్ని తీసుకొని కపోతం ఒకటి గాంధారం నుండి రత్న గిరికి ఎగిరి పోయింది.

ఇలా ఇక్కడ గాంధారంలో ధనుంజయుని మరణం మీద చర్చ సాగుతున్న తరుణం లోనే అక్కడికి దక్షిణ ఆగ్నేయంగా సు దూరంలో వున్న నాగ లోకంలో యువ రాజు ధనుంజయుని ఎలా అంతం చేయాలాని ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది.

*************************************************

అది మర్మ భూమి అటవీ ప్రాంతం.

అచట భూమి లోపల ఎచటనో వున్న నాగ లోకం. అచట రాజ మందిరంలో నాగ రేడు మహా పద్ముడు కొలువు దీరి వున్నాడు. వేదిక మీది మణి మయ సింహాసనాన్ని అధిష్టించి వున్నాడు. వేదిక ఎదురుగా దిగువన రెండు వరుస ల్లోని ఉచితాసనాలను అలంకరించి వున్నారు అతడి మంత్రులు, హితులు, బంధువులు. అందరి ముందు ఎదురుగా తల దించుకొని చేతులు కట్టుకొని వినమ్రుడై నిలుచుని వున్నాడు వక్ర దంతుడు. తను వప్పగించిన పని నెర వేర్చకుండా తమ వెనకే రిక్త హస్తములతో వచ్చిన వక్ర దంతుని మీద ఆగ్రహించి వున్నాడు నాగ రేడు.

‘‘శిరము వంచి నిలుచుట కాదు వక్ర దంతా. సమాధానము కావలె.’’ ఉరుము లాంటి గొంతుతో గద్దించాడు.

‘‘నిను నమ్మితి. కడు సమర్థుడవనుకొంటి. అందుకే నా కొమరితలనిచ్చి నీకు బెండ్లి జేసి మా అల్లుని జేయ నెంచితి. నీకు వప్పగించిన కార్యము గూడ చిన్నది. నీవు మా తనయ నింటికి జేర్చిన, ఆ పగతురుడు ధనుంజయుని సంగతి తర్వాత చూడ వచ్చునను కొంటి. అందుకే మరుగున వారిని అనుసరించి సమయము జూచి ఉలూచీశ్వరిని ఎత్తుకు రమ్మంటి. కాని నీవు ఏమి జేసితివి? అసమర్థుడవని నిరూపించుచూ  మా వెనకే పారి వచ్చినావు. నిన్నేమన వలె?’’ అంటూ గద్దించాడు.

అప్పుడు తలెత్తి ఓసారి అందర్నీ చూసాడు వక్ర దంతుడు` ‘‘క్షమించండి ప్రభూ. ఇది చిన్న విషయమని మీరనుకొంటున్నది వాస్తవము గాదు. స్వయముగా మీరే వచ్చిన కాని పని నా వల్ల అవునని ఎటుల వూహించినారు? ధనుంజయుని వెంట వున్నది సామాన్యులు గారు. మంత్ర శక్తిలో అజేయమైన కన్యా మణి ఆ భద్రా దేవి. వారికి రక్షణగా వున్న భూతం ఘృతాచి అసామాన్యమైనది. ఇక వారితో వున్న ఉలూచీశ్వరి శక్తి సామార్థ్యములు మీకు తెలియనివి గావు.

ఆ ఘృతాచి నను పసి గట్టి పట్టి కాగడాతో ఒళ్ళు కాల్చినది. అది కొట్టిన దెబ్బలింకను బాధించుచున్నవి. ధనుంజయుని దయా గుణంతో నేను బ్రతికి వచ్చితి గాని లేకున్న ఆ భద్రా దేవి నను మంత్ర కట్టుతో బంధీని చేసి పోయేది. ఆకలి దప్పులతో మరణించి వుండెడి వాడిని’’ అంటూ వివరించాడు.

‘‘అవును ప్రభూ! ఆ భూతం ఘృతాచి ఉండగా వారి నేమీ చేయ జాలము. నాడు అది కొట్టిన దెబ్బలు ఇంకనూ నను బాధించు చున్నవి’’ అంటూ వక్ర దంతుని మాటలను సమర్థించాడు కర్కోటకుడు గతం గుర్తు చేసుకుంటూ.

‘‘అలాగని చేతులు ముడుచుకుని ఉందుమా? ఏదో ఒకటి జేసి నా కుమార్తెను తేవలె. ఇప్పుడైననూ తగు ఉపాయము చెప్పండి’’ అడిగాడు నాగ రాజు.

‘‘ఉపాయము వున్నది’’ అన్నాడు అక్కడే వున్న తక్షకుడు.

‘‘చెప్పండి మహోదయా. మా పెద్దలు పూజ్యులు మీరు. మీ ఉపాయము అనుకూలమైనచో తప్పక ఆచరించెదము’’ అన్నాడు అటు చూస్తూ నాగ రాజు.

తక్షకుడు గొంతు సవరించుకున్నాడు.

‘‘ధనుంజయుడు లేకున్న ఉలూచీశ్వరి అచట ఉండునా?’’ అడిగాడు.

‘‘ఉండదు. మన వద్దకు తప్పక మరలి వచ్చును. కాని ఆ రాకుమారుని అంతము జేయు వీరుడే మనలో కరువైనాడే’’ అన్నాడు వ్యథతో నాగ రేడు.

‘‘ప్రస్తుతము నీ సమస్య ధనుంజయుడు గాదు. నీ తనూజ ఉలూచీశ్వరి. అవునా?’’

‘‘ఆ మాట నిక్కము. కాని...’’

‘‘మహా పద్మా! ధనుంజయుని మరణంతో నీ సమస్య పరిష్కారమగునని తలంప వలదు. ఏలయిన ధనుంజయుని కాటేసి విషం గ్రక్కినను ఆ భద్రా దేవి అతన్ని పునర్జీవితుడ్ని చేయగల సమర్థురాలు. వంశ పారంపర్యంగా వచ్చిన దివ్య మంత్ర శక్తులామెవి. కాబట్టి ధనుంజయుని జంపు ఆలోచన విరమించి అతన్ని అదృశ్యము గావించిన ఎటులుండునో ఆలోచింపుము’’ అంటూ సూచించాడు తక్షకుడు.
‘‘అదృశ్యము... అది ఎటుల సంభవము?’’

‘‘సంభవమే. ధనుంజయుడు మానవుడు. అతను మహా వీరుడే గాని అతని వద్ద దివ్య శక్తు లేమియును లేవు. ఆ పైన భూ లోకము దక్క వేరే లోకమూ తెలియదు. అతను నిద్రించు సమయమున భూలోకము నుండి గొని పోయి మరో లోకమున విడిచి వచ్చిన అతడు తిరిగి భూ లోకమునకు రా గలడా?’’

‘‘రాలేడు...’’

‘‘అపుడు అతడి జాడ తెలియక విసిగి వేసారి చివరకు ఆశ వదులు కొని మన ఉలూచీశ్వరి పితృ సదనమును వెదుకుకొనుచూ యిచటికి రాగలదు’’

‘‘మరి ఆ మానవ వనిత భద్రా దేవి...?’’

‘‘ఆమెయును ఆశ వదులుకొని స్వ గృహమున కేగును. ఆమె కూడ మానవ మాత్రురాలే గదా’’

‘‘ఆహా... యోచనయనిన యిది. అద్భుతం. అమోఘము’’ అంటూ తక్షకుని సలహాకు ఆనంద భరితుడయ్యాడు నాగ రాజు.
కాని అంతలోనే మరో సందేహం కలిగింది.

‘‘యోచన బాగున్నది కాని ఈ కార్యమును సాధించు వారు ఎవరు?’’ అనడిగాడు.

‘‘ప్రభూ! నేను సాధించెద. ఈ తూరి విఫలము చెందు వాడను గాను’’ అన్నాడు వెంటనే వక్ర దంతుడు.

‘‘బాగు బాగు. కాని ఉలూచీశ్వరి ధనుంజయుని జాడరయ సమర్థు రాలే గదా. తిరిగి ధనుంజయుని భూ లోకమునకు రప్పించు ప్రయత్నము జేయ కుండునా?’’ అంత వరకు వింటూ వున్న అనంతుడను కుల పెద్ద మరో సందేహాన్ని బయట పెట్టాడు.
‘‘అసంభవము’’ అన్నాడు వెంటనే నాగరాజు.

‘‘ఉలూచీశ్వరికి ఇంత దనుక మరో లోకము మేము జూప లేదు. భూ లోకమున ఎచట వున్నను అరయు దివ్య దృష్టి మాత్రమే ఆమె కున్నది. ఇతర లోకము గాలించు మహా దృష్టి ఆమెకు లేదు’’ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు.

‘‘అటులయిన ఈ యోచన దివ్యముగ నున్నది’’ అన్నాడు అనంతుడు.

‘‘యోచన దివ్యము గనే యున్నది. కాని అది నీచమని మీరు ఎరుంగరా?’’ అంత వరకు మౌనంగా వింటున్న వాసుకి యను కుల పెద్ద ఇక సహింప లేక గట్టిగా అడిగాడు.

‘‘ఒక నాగ కన్య మానవ వీరుని వరించుట కన్ననూ యిలా వక్ర మార్గమున నీతి బాహ్యమైన కుతంత్రము జేసిన మన నాగలకు ప్రతిష్ట ఇనుమడించునా? ఇక మానవ వీరుని ఏమియు జేయ లేక, మరో లోకమున మోసమున విడిచి వచ్చుటయా! ఇంత కన్ననూ సిగ్గిల కార్యమొండు గదా? నాగలకు న్యాయ ధర్మము నీతి సూత్రము గాదని ఇటు అక్రమ మార్గమును నీవే పురిగొల్పుట ఇది యేమి దురాగతము? ఇంత కన్ననూ, ఆ రాకుమారునికి పాద ప్రక్షాళనము జేసి కన్యా దానము గావించి దివ్య నాగ మణిని కానుక జేసి సగౌరవముగ రత్న గిరికి పంపించి మన పరువును కాపాడు కొనుట ఉత్తమ మార్గము గదా’’ అంటూ హితవు పలికాడు.

‘‘హుఁ...! ఏమంటిరి? బూజు పట్టిన మన న్యాయ ధర్మము నీతి సూత్రము ఎవరికి గావలె? వర్ణ సంకరము జాతి సంకరమును సమ్మతించుటకు నేను మా తండ్రి గారు పద్ముడను గాను. కలి కాలమున మానవులకే గాదు పుడమిపై సమస్త జీవుకు వక్ర మార్గములు తప్పవు. మా తనయ తెచ్చిన తల వంపు ఎన్నటికీ మరువ జాల. అది సరి దిద్ధుటకు ఏ వక్ర మార్గమైననూ అనుసరించెద. నా ఈ నిర్ణయమున మార్పు లేదు. తక్షకుల వారి యోచన అద్భుతముగ నున్నది. ఉలూచీశ్వరి స్వగృహము చేరుటకు ధనుంజయుని మరో లోకమున పడవైచుటే ఉత్తమ మార్గము. అటులే చేయవలె’’ అంటూ తన కఠోర నిర్ణయాన్ని తెలియ జేసాడు.ఆ మాటలు వినగానే`
వాసుకితో బాటు మరి కొందరు నాగలకు పెద్దలు దిగ్గున లేచారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్