Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుని అసహనం - అనంత

 

                                                సింగపూర్ పాఠం - - 6

ఒక దేశానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది..?


వస్తూత్పత్తి తయారీ- అమ్మకం, సేవలు - చేసిపెట్టటం ద్వారా..

ఎగుమతులు...

టూరిజ-వీటిద్వారానే ఒక దేశం ఆదాయం సంపాదిస్తుంది.

సంపదను కూడబెట్టుకుంటుంది.

కూడబెట్టుకున్న సంపద ద్వారా తమ దేశప్రజలకి సకల సౌకర్యాలు కల్పించటం అనేది ఏ దేశ ప్రభుత్వాలకైనా ప్రధానం. వస్తూత్పత్తి చేద్దామని వ్యాపారస్తులు గాని పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ప్రభుత్వోద్యోగులు చేయ్చాపుతారు. ఆ పైన అధికారంలో ఉండే పార్టీ నాయకులు చేయిచాపుతారు. పోనీ ఈ పై ఇద్దరి చేతులు తడిపితే లైసెన్సులు వస్తాయా? పనులు వేగంగా జరుగుతాయా? జరగవు...
ఎక్కడ...?

ఇక్కడ మనదేశంలోనే...

జాప్యం...జాప్యం...ఈ జాప్యాన్ని భరించలేక కొందరు పారిశ్రామికవేత్తలు నిరుత్సాహంతో వెనకడుగు వేస్టె, మరికొందరు మాత్రమే సహనంతో ఎదురుచూస్తుంటారు.

ఈలోపు పుణ్యకాలం గడిచిపోయి పరిశ్రమల పెట్టుబడి తడిచి మోపెడవుతుంది.

ఆ తరువాత విద్యుత్, నీరు, డ్రైనేజీ, రోడ్స్ కి సంబంధించిన అధికారులు సిబ్బంది నాయకులు మరోసారి చేతులు తడపమంటారు.

ఆ పైన వస్తు సేవలు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలంటే సదరు శాఖకు చెందిన సిబ్బంది,  అధికారులు, నాయకులు తమ చేతులూ తడపమంటారు.

ఇలా ప్రతి స్టేజ్ లోనూ తడిపి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల చేతులు పొడారిపోతాయి.

మనదేశం ఇంకా వెనుక బడి ఉండడానికీ, అనుకున్న స్థాయిలో ఎదగకపోవడానికీ ఇవికొన్ని కారణాలు.

ప్రజాధనాన్ని మంత్రులు సొంత ఇళ్ళు బాగు చేయించుకోవడానికి వృధా చేయటం...ముఖ్యమంత్రులు విలాసవంతమైన కొత్త కేంప్ ఆఫీసులు, కొత్త అధికార నివాసాలు కట్టించుకోవటానికి వృధా చేస్తున్నా అడిగే నాధుడు లేడు మనదేశంలో...

మరి కొంతమంది ముఖ్యమంత్రులు కొత్త కొత్త అతి ఖరీదైన, లగ్జరీ కార్లు హెలీకాప్టర్స్ కొనిపించుకొని అనుభవిస్తున్నా అడిగే నాధుడు లేడు.
ఈ వృధాని అరికట్టే వ్యవస్థ మనదేశంలో ఎందుకు లేదు? సామాన్యుడికి అర్థం కావటం లేదు.

దేశమూ, రాష్ట్రాలూ అసలే కరువు కాటకాలతో అలమటించి పోతుంటే....వాటిని గాలికొదిలేసి కొత్త సెక్రటేరియట్ లు కట్టించుకుంటుంటే .ఉన్నవాటితో సర్దుకుపోవచ్చనీ న్యాయస్థానాలు హెచ్చరించకపోవటం ఏమిటని సామాన్యుల ఆవేదన.

ఇంతకంటే ఘోరం మరొకటుంది...

ఒక్కో మంత్రికి రెండుమూడు కార్లు, అలాగే ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. లాంటి ఉన్నతాధికార్లకు కూడా రెండుమూడు కార్లు సహజమైపోయింది మనదేశంలో.

ఎవడబ్బసొమ్మని కులుకుతున్నారు వీళ్ళు..?

ప్రజాధనాన్ని వృధా చేసే వాళ్ళని ఎవరు అరికట్టాలి...?

సింగపూర్ ప్రధాని అధికార నివాసం కేవలం నాలుగు బెడ్ రూం లున్న రెండంతస్తుల పెంకుటిల్లు.

ఇక్కడ ఒక్కో ముఖ్యమంత్రి ఒక్కో దేశాధినేతలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నా కేంద్ర కేబినెట్ కి పట్టదు-ప్రధానమంత్రికీ పట్టదు.
దిక్కు లేని దేశమైపోయింది మనది.

పోనీ ఈ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆఖరికి కేంద్ర మంత్రులన్నా కష్టపడి పనిచేస్తున్నారా అంటే ..అదీలేదు.
వీళ్ళే పని చేయనప్పుడు ఇక ఎం.ఎల్.ఏ లు ఎంపీలేం పని చేస్తారు? సొంత వ్యాపారలు వెలగబెట్టుకోవడం తప్ప...

ఇవికాక వాళ్ళజీతాలు వాళ్ళే ఇబ్బడిముబ్బడి పెంచుకుంటూ పోతుంటారు. చట్టసభలో. 

దీన్ని అడిగే వ్యవస్థ కూడా లేదు మనదేశంలో.

సరే...ఇవన్నీ ఇలా వదిలేస్తే...

మనదేశంలో ఎన్ని కోటలున్నాయి...ఎన్ని ప్యాలస్ లున్నాయి..పురాతనమైన గుడులు..గోపురాలు, మసీదులు, చర్చ్ లు, వింతలు, విడ్డూరాలు...సరస్సులు...గుహలు...అడవులు..సైన్స్ కే అంతుపట్టని వింతలు మనదేశంలో ఎన్నున్నాయో లెక్కలేదు.
ఏ ఆధారం లేకుండా గాల్లో నిలబడి ఉండే రాతి స్తంభాలు...

సంవత్సరంలో ఒకసారి రాతి స్తంభానికి చెమటలు పట్టటం...

హంపీలో వరుసగా నిలబెట్టిన ఏడు స్తంభాల్ని ఎప్పుడు మీటినా స..రి..గ..మ..ప..ద..ని.. అనే స్వరాలు పలకటం...

సంవత్సరంలో ఒకరోజు లక్షలాది సర్పాలు వరుసబెట్టి ఒక ప్రవాహంలా ఓ వింత గుహలోకి వెళ్ళి తిరిగి రాకపోవటం...

శివలింగం మీద నెయ్యిపోసి రుద్దితే అది వెన్నలా మారిపోవటం....ఆధ్యాత్మిక అద్భుతాలు, విశేషమైన ఆయుర్వేద వనమూలికలున్న హిమాలయ పర్వతాలు...

సంవత్సరంలో ఒకసారి సూర్య దేవాలయంలో ఉన్న సూర్యభగవానుడి పాదాలమీద సూర్యకిరణాలు పడటం...కేవలం చెక్కతో కట్టిన పర్లాకి మిడి ప్యాలెస్.

ఒకటా..రెండా..వేలాది టూరిస్ట్ ప్లేసులున్నా స్వదేశీ, విదేశీ యాత్రికుల్ని ఆకర్షించలేని దుస్థితి మన దేశంలోనే ఉంది.

టూరిజానికి ఏటేటా కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయి?

సామాన్యుడిని తొలిచివేస్తున్న ప్రశ్న ఇది.

దేశం మొత్తం మీద ఒక్క గోవాలోనే కేసినో ఉంది.

కేసినో అంటే జూదశాల అని మన ఘనమైన నాయకుల ఆలోచన.

జూదం అన్నది మన రక్తంలోనే ఉన్నది.

మహాభారతంలో జూదం లేదా..?

సింగపూర్ లో ఉన్న మెరీనా బే సాండ్స్ ని అమెరికా లాస్ వెగాస్ కి చెందిన షెల్డన్. జి. అడెన్ సన్ నిర్మించాడు. ఈరోజు అది సింగపూర్ ప్రభుత్వానికి కోట్లు పన్ను రూపంలో చెల్లిస్తున్నది. లాస్ వెగాస్ లో వెనీషియన్, పలాజో, సేండ్స్ ఎక్స్ పో అండ్ కన్వెన్షన్ , చైనా దేశంలో మకావ్ లో ఉన్న కేసినో స్ వేలకోట్ల విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ కేసినోస్ అంటే విదేశస్థులకు తగని మోజు. ఇవి లేనప్పుడు విదేశీ యాత్రికులెందుకొస్తారు? 

మనకి ఆదాయం ఎందుకొస్తుంది...?

లా అండ్ ఆర్డర్ ని గాడిలో పెట్టలేని భారతదేశపు నాయకుల మూలంగానే మనదేశం ఎంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

డబ్బున్నవాడు ఆ వ్యసనమున్నవాడు ఆడుకుంటాడు-ఇందులో ప్రభుత్వాలకొచ్చిన కష్టమేమిటి?

సిగరెట్స్, గుట్కా, తయారు చేసుకోనిస్తారు. అమ్మకాలమీద పన్నులు వేస్తారు.

హానికరమని ప్రచారం చేస్తారు.

మద్యపానం తయారుచేసుకొని అమ్ముకోనిస్తారు.

అనారోగ్యకరమని ప్రచారం చేస్తారు. 

దానిబదులు తయారీనే ఎందుకు ఆపేయరు?

ఎవరికీ అర్థం కాదు.

ఇక సామాన్యులకేం అర్థమవుతుంది...?

మనదేశ పాలకులు, ఉన్నతాధికారులు సమూలంగా మారితే తప్ప మనదేశం బాగుపడదు.

అప్పటివరకు సామాన్యులు సఫరర్సే.

మరిన్ని శీర్షికలు
vrukshamulu  - jeeva samrakshakulu