Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Under Eye Circles | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda) Ayurveda Advice By Murali Manohar Chirumamilla

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి సొగసులు చూతము రారండి ( తొమ్మిదవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

   కాంగ్రా లోయ --4

 

పాలంపూర్ ఓ అందమైన ప్రదేశం , డార్జిలింగ్ , ఊటీ , నైనితాల్ లాంటి వేసవి విడిదుల గురించి యెప్పటినుంచో వింటూవుంటాం కాబట్టి వాటిమీద మనకి ఓ అభిప్రాయం యేర్పడుతుంది , కాని పాలంపూర్ మేం ముందుగా అనుకుని వెళ్లిన ప్రదేశం కాదు , ఈ ప్రదేశం గురించి వినలేదు కూడా  . హిమాచల్ ప్రదేశ్ లో మిగతా ప్రదేశాలు చూస్తూ  వేరే ప్రదేశాలకు వెళుతూ మధ్యలో ఈ ప్రదేశం యెదురు పడటం వల్ల ఓ అందమైన ప్రదేశాన్ని చూడగలిగేం . ఈ ప్రదేశం చూస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ వుంది అదేంటంటే మనదేశం లో యెన్నెన్ని అద్భతమైన ప్రదేశాలు మరుగుపడి వున్నాయో కదా !  .

మరునాడు ఉదయమే మేం ' చింతపూర్ణి ' మందిరానికి బయలుదేరేం . హిమాచల్ లో ప్రయాణం డ్రైవరుకి యెంత కష్టంగా వుంటుందో పర్యాటకులకు అంత ఆనందంగా వుంటుంది . ప్రొద్దుటి లేలేత సూర్యకిరణాలలో దౌలాధార్ కొండలు , దట్టమైన దేవదారు అడవులు చూస్తూ సాగే ప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది గాని అలసటను కలుగజెయ్యదు .

చింతపూర్ణి హిమాచల్ ప్రదేశ్ లో వున్న ' ఊన ' జిల్లాలో కాంగ్రా పట్టణానికి సుమారు 55 కిలో మీటర్ల దూరంలో హోషియార్ పూర్ నుంచి ధర్మశాల కు వెళ్లే రోడ్డు మీద వున్న ' భార్వైన్ ' కి మూడు కిలో మీటర్ల దూరం లో వుంది . 940 మీటర్ల యెత్తున వున్న ' సోలాసింగి ' పర్వతాలలో అతి యెత్తైన శిఖరాన వుంది యీ మందిరం . చింతపూర్ణి శక్తిపీఠం , ఉత్తరాన పడమరహిమాలయాలు , తూర్పున శివాలిక్ పర్వతశ్రేణులు , పంజాబు రాష్ట్రాన్ని ఆనుకొని వుంది .  నాలుగు చక్రాల వాహనాలను చింతపూర్ణి బస్సుస్టాండు దగ్గరవున్న పార్కింగ్ వరకే అనుమతిస్తారు . అక్కడనుంచి సుమారు 1 1/2 కిలో మీటర్లు నడిచి చింతపూర్ణి ఆలయం చేరుకోవచ్చు . బస్టాండుకి నుంచి సుమారు 800 మీటర్ల తరువాత రద్దీ అయిన బజారులోంచి మందిరం చేరుతాము . బజారులో మిగతా వస్తువులతో పాటు చింతపూర్ణి దేవి పూజకు కావలసిన సామగ్రి దొరకుతుంది . పెద్దపెద్ద పళ్లాలతో అమ్మవారికి కానుకలు తీసుకొని వస్తూ భక్తులు కనిపిస్తారు .

సుమారు 200 పాలరాతి మెట్లు యెక్కి మందిర ముఖ్య ద్వారం చేరుతాము . ఇక్కడ భక్తుల రద్దీ యెక్కువగా వుంటుంది . చింతపూర్ణి పట్టణాన్ని పర్యాటక స్థలంగా కూడా తీర్చిదిద్దటంతో యీ ప్రదేశం యెప్పుడూ రద్దీగానే వుంటుంది . ఇక్కడ అన్ని తరగతులవారికి అందుబాటులో భోజన వసతి సదుపాయాలు వున్నాయి .

కోవెల 500 మీటర్లు వుందనగానే క్యూ మొదలవుతుంది . పాలరాతి పెద్ద ముఖ్యద్వారం మీద చింతపూర్ణి గా పిలువబడుతున్న చిన్మస్తక దేవి బొమ్మను చూడగానే చిన్నగా శరీరం కంపించింది .

చిన్మస్తకదేవి అంటే శిరస్సు ఖండించబడిన దేవి అని అర్దం .

 రతికేళిలో వున్న దంపతులపై నిలబడి కత్తితో శిరస్సు ఖండించుకొని ఖండింపబడిన మొండెం నుంచి కారుతున్న రక్తధారలు నగ్న శరీరాలతో వున్న జయవిజయులు త్రాగుతున్నట్లు , మరో రుధిరధార దేవి యొక్క ఖండింపబడిన శిరస్సు నోట్లో పడుతున్నట్లుగా , అమ్మవారు కూడా నగ్నంగా చిత్రీకరించబడింది .

హిందువులతో బాటూ సిక్కు మతస్థులు కూడా యీ మందిరాన్ని దర్శించుకుంటున్నారు .

చింతపూర్ణి అమ్మవారు స్వఛ్చమైన మనస్సుతో కోరుకున్న కోర్కెలన్నీ తీరుస్తుందని భక్తుల నమ్మకం .మందిరమంతా పాలరాతి పలకలు పరిచి వున్నాయి లోపల వున్న గర్భగుడిలో దేవి ' పిండి ( లింగ ) ' రూపంలో పసుపు కుంకుమ , పూలు , బంగారు ఆభరణాలతో అలంరింపబడి పూజలందుకుంటోంది .

గర్భగుడి బయట భక్తులు యెర్ర బట్టని చెట్టుకి కడుతున్నారు . మనసులో కోర్కెలు తీర్చమని అలా కడతారట , అక్కడ కూర్చొని వున్న పురోహితుడు భక్తుల చేతులకు యెర్ర రక్షదారం కడుతున్నారు . కొందరు ఫొటో గ్రాఫర్లు మందిరంతో పాటు భక్తుల ఫొటోలు తీస్తున్నారు . చాలా మందిరాలలో ఫోటోలు తీయడాన్ని నిషేధించేరు . కాని యిక్కడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు మందిరంలోపల ఫొటోలు తీస్తూవుండడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది .

ఈ మందిరం లో జరిగే వివాహాలు గ్రంధస్థం చెయ్యడం కూడా వుంది . అలాగే యిక్కడ దర్శనార్థం వచ్చే భక్తుల వివరాలు నమోదు చేసుకొని ఆ పుస్తకాలను కొన్ని వందల సంవత్సరాల వరకు సంరక్షించి ఆ వంశానికి చెందినవారు యెవరైనా వచ్చి వివరాలు కోరగానే అతి తక్కువ సమయంలో వివరాలు అందజెయ్యడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది . అక్కడ పూజారులు యెవరైనా మిమ్మల్ని మీ వివరాలు అడిగితే భయపడవలసిన అవుసరం లేదు , మీ వివరాలు నమోదు చేసుకుంటే మీకంటే ముందు మీ వంశస్థులు అక్కడకి వచ్చివుంటే వారి వివరాలు మీకు అందజేస్తారు , అలాగే మీ వివరాలు మీ తర్వాతి తరం వారికి అందజేస్తారు .

సారస్వత బ్రాహ్మణవంశానికి చెందిన పండిట్  ' మాయీ దాసు ' మందిర నిర్మాణం చేసి అమ్మవారికి పూజలు చేసినట్లుగా చెప్తారు , యిప్పటికీ యీ మందిర ట్రస్టీలుగా అతని వంశస్థులు కొనసాగుతున్నారు .

చిన్మస్త దేవి అని పిలువబడే యీ అమ్మవారు యెవరు ? యేమిటి అని కనుక్కుంటే ఆశ్చర్యకరమైన కథలు తెలిసాయి . మాకు తెలిసిన కథ , శివపురాణం ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడు చేసిన యజ్ఞానికి సతీదేవిని ఆహ్వానించకపోవడంతో శివుడు సతీదేవిని యజ్ఞానికి వెళ్లవద్దని వారిస్తాడు , సతీదేవి తండ్రి యజ్ఞానికి వెళ్లాలని నిశ్చయించుకొని దశమహావిద్యలను తనలోంచి సృష్టించి  పదిదిక్కులనుంచి శివుని నియంత్రించి దక్షవాటికకు వెళుతుంది . దక్షవాటికలో జరిగిన అవమానం సహించలేని సతీదేవి ఆత్మత్యాగం చేసుకొంటుంది . సతీదేవి వియోగాన్ని సహించలేని శివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని రుద్రతాండవం చేయగా ముల్లోకాలూ అల్లకల్లోలం మవుతాయి .  దేవతల కోరికమేరకు విష్ణుమూర్తి చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు . సతీ దేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాన్ని శక్తిపీఠం అంటారు .  ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క పాదం పడిన ప్రదేశం . సతీదేవి యొక్క 51 శక్తి పీఠాలలో వొకటి ,  మరియు వైష్ణవదేవి కి ఈమె అక్కచెల్లెలు . మన చింతలను తీర్చడానికి ' చింతపూర్ణి దేవి ' గా ఉధ్భవించింది అని .

ఇక్కడ అమ్మవారి ఉగ్రరూపం చూసేక చింతపూర్ణి అమ్మవారిని గురించి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది . దాంతో కొంత యిక్కడి పూజారుల సహాయంతోను , కొంత గూగులమ్మ సహాయంతోనూ తెలుసుకున్నాను . ఆ విషయాలే మీతో పంచుకుంటున్నాను .

శక్తి రూపిణి అయిన పార్వతీ దేవి యొక్క ప్రచండ శక్తులైన దశ మహావిద్యల ఉద్భవం గురించి ప్రచారంలో వున్న కథలు కొన్ని ----

శక్త మహాభాగవత పురాణం , బృహద్పురాణం ప్రకారం 

దక్షవాటికకు వెళ్లాలనే ఆతృతలో వున్న సతీదేవి శివుడు అనుజ్ఞ యివ్వని కారణాన సతీదేవి దశ మహావిద్యలను సృష్టించి అతనిని నియంత్రిస్తుంది . మరోకథ ప్రకారం పార్వతీ దేవి శివుని వివాహమాడి పర్వత రాజు వద్ద వున్న సమయంలో శివుడు పార్వతిని కైలాసానికి రమ్మని ఆహ్వానించగా పార్వతి శివుని కోరిక తిరస్కరించగా శివుడు వొంటరిగా కైలాసానికి ప్రయాణమౌతాడు , శివుని నియంత్రించేందుకు పార్వతీ దేవి దశ మహావిద్యల సృష్టి చేస్తుంది .

ఛండీ అవతారంలో రాక్షస సంహారం కావించిన పిదప వుగ్రరూపాన్ని ఉపసంహరించుకోమని కోరిన శివుని దశ మహావిద్యలను సృష్టించి నియంత్రిస్తుంది .

 పై కథల ప్రకారం దశమహావిధ్యలను  శివుని నియంత్రించేందుకు సృష్టించబడ్డాయి .

తాంత్రికోపాసకులు పార్వతీ దేవి అవతారాలైన 64 యోగినులను ఉపాసిస్తారు . 64 యోగినులలో చిన్మస్తకదేవి అతి ముఖ్యమైనది . సాధకులు రెండు రకాలు ఒకరకం అమ్మవారి సౌమ్యరూపాన్ని పూజిస్తారు , రెండవరకం అమ్మవారి ఉగ్రరూపాలైన యోగినులను పూజించి దుష్ట శక్తులను( చిల్లంగి లాంటివి ) పొందుతారు . మనదేశంలో చాలా తక్కువగా 64 యోగనీ మందిరాలు వున్నాయి . ఇక్కడ ఉపాసకులు పూజలు చేయడం కూడా వుంది . చాలా ప్రాంతాలలో రహస్యంగా యోగినీ సాధన జరుగుతూ వుంటుంది .

 ఈ క్షేత్రం తాంత్రికులకు సిద్దక్షేత్రం . అస్సాములో వున్న ' కామాక్య దేవి '  క్షేత్రం , చింతపూర్ణి క్షేత్రాలలో యోగినీ సాధకులు సాధన చేస్తూ వుంటారు .

యోగినీ సాధన హిందువులలోనే కాక బౌద్ద మతంలో కూడా కనిపిస్తూ వుంటుంది . చిన్మస్తా దేవిని బౌద్దులు ' చిన్ముండ , వజ్రయోగిని ' గా ఉపాసిస్తారు . హిందూ తంత్ర సార  ప్రకారం పార్వతీ దేవి తన ఛండీ రూపంలో ఢాకిని , వర్ణిని అనే పరిచారకులతో సర్వసిద్ది , సర్వబుద్ది గా పిలువబడుతోంది  .

ఇచ్చేదీ అమ్మే , తీసుకొనేదీ అమ్మే . కరుణామయీ అమ్మే , కఠినంగా శిక్షించేదీ అమ్మే అనేదానికి యీ చిన్మస్త ప్రతీక . సౌమ్య రూపంలో వరాలిచ్చేదీ అమే , దారి తప్పిన భక్తులను రుద్రరాపంలో శిక్షించేదీ ఆమే . చిన్మస్త రూపాన్ని పండితులు మనలోని వికారాలను మనలోంచి మనమే విసర్జించే రూపమనే వివరణ యిచ్చేరు .

మార్కండేయ పురాణం ప్రకారం పార్వతి ఛండీ అవతారంలో రాక్షస సంహారం కొరకు తన యోగినీ రూపాలతో కూడ వెళ్లి రాక్షస సంహారం కావించిన పిమ్మట యోగినీ రూపాలయిన జయవిజయలు తమ రక్త పిపాస తీరలేదని అనగా ఛండీ మాత తన శిరస్సు ను ఖండించు కొని ఆ రక్తంతో జమవిజయుల దాహం తీర్చి తిరిగి తన తలను అతికించుకుంటుంది .

ఈ కధ గురించి చదివిన తరువాత నాకు యోగినీ ఉపాసకులు అమ్మవారిని ప్రసన్నురాలిని చేసుకొనేందుకు రకరకాలైన నీచమైన పనులు చేసి , అమ్మవారికి నైవేధ్యంగా  రకరకాలైన బలులు యిచ్చి , కొన్ని సందర్భాలలో నరబలులు కూడా యిచ్చి సాధించుకొన్న శక్తులు తిరగబడి వుపాసకులనే బలితీసుకుంటాయి అనేది నిజమని , ఛండీ మాత కాబట్టి తన శిరస్సును అతికించుకో గలిగింది , సాధకులు ఆ శక్తి వుందా ? లేదు కాబట్టి ఆ శక్తులు సాధకులను బలి తీసుకుంటాయి , కాబట్టి అమ్మవారిని అమ్మ గానే ఆరాధించుకోవాలని అనిపించింది .

ఇక చింతపూర్ణి కథ లోకి వస్తే ' ప్రణతోషిణి తంత్ర శాస్త్రం ' లో ' నారద పంచరాత్ర ' ప్రకారం పార్వతీ దేవి మందాకినీ నదిలో స్నానమాచరిస్తున్నప్పుడు ఆమెలో తట్టుకోలేని శృంగారభావాలు చుట్టుముట్టగా వాటి ప్రభావం వలన పార్వతీ దేవి దేహం నల్లగా మారిపోతుంది , ఆ సమయంలో ఆమె పరిచారకులైన ఢాకిణి , వర్ణిని క్షుద్భాదను తట్టుకొనలేకఆహారం అడుగగా పార్వతి ఆమె తన నఖములతో శిరస్సును ఖండించుకొని తన రుధిరంతో వారి క్షుధ్బాదను తీర్చి తరిగి శిరస్సును ధరించి కైలాసానికి చేరుకుంటుంది .       '  ప్రణతోషిణి తంత్ర శాస్త్రం ' లోని ' స్వతంత్ర తంత్ర ' ప్రకారం పార్వతీ దేవి ఛండీ అవతారంలో శంకరుడితో రమించునపుడు తృప్తి చెందిన పార్వతీదేవి శరీరం నుంచి ఢాకిణి , వర్ణిని లు వుద్భవిస్తాయి . ఛండికవారితో ' పుష్ప భద్రానది ' లో స్నాన మాచరించడానికి వెళ్లి ఆ సమయంలో ఆమెలో శృంగార భావాలు ఉత్పన్నమవగా ఆమె శరీరం నల్లరంగులోకి మారుతుంది , ఛండీ కైలాసానికి మరలుతుండగా ఢాకిణి , వర్ణిని లు ఆహారమునకై పార్వతిని అడుగగా ఆమె తన శిరస్సును ఖండించుకొని తన రక్తధారలతో వారి ఆకలి తీరుస్తుంది .
బౌద్దులు చిన్మస్త దేవిని ' వజ్రయోగిని ' అని , ఢాకిణి , వర్ణిలతో కలిసి వున్న చిన్మస్త ను ' త్రికాయ వజ్రయోగిని ' గా ఉపాసిస్తారు .

 ఏడాది పొడవునా రద్దీగా వుండే యీ మందిరం లో చైత్ర నవరాత్రులు , ఆషాఢమాసం , ఆశ్వీజ నవరాత్రులు  విశేషపూజలు జరుగుతాయి ఆయా సమయాలలో భక్తులరద్దీ చాలా యెక్కువగా వుంటుంది .

భక్తుల కోర్కెలు తీరుస్తూ  పిలిస్తే పలికే దేవీగా భక్తుల చేత పూజలందుకుంటున్న చింతపూర్ణిని గురించి అనేక విషయాలు తెలుసుకున్నామనే తృప్తితో మందిరం బయటికి వచ్చేం .

 సమయాభావం వల్ల  ఈ వారం ధర్మశాల గురించి పరిచయం చెయ్యలేక పోయేను . పై వారం హిమాచల్ లోని మరికొన్ని వివరాలతో మీ ముందు వుంటాను అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope 19th august to 25th august