Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 19th august to 25th august

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యం 

అగస్త్య మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానం  తనకు తట్టని షణ్ముఖుడు ఆ ప్రశ్నకు జవాబు  నివ్వగలవాడు పరమశివుడు ఒక్కడే అని, కైలాసానికి అగస్త్యమహర్షితో పాటుగా మిగిలిన  అందరినీ తీసుకుని బయలుదేరాడు. తన నెమలి  వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు కుమారస్వామి. ఆ నెమలిని, దాని గమనపు తీరును వర్ణిస్తున్నాడు  తెనాలి రామకృష్ణుడు.

అది సజ్జస్యందనమై, 
మదకరియై, తత్తదుచితమార్గంబుల నే
ర్పొదవ నొక కొలత చని, పా
రదనిభ శుభమూర్తి నశ్వరత్నం బగుటన్                (కం)

ఆ నెమలి చక్కగా అలంకరింపబడ్డ రథంలాగా, మదపుటేనుగులాగా ఆయా  వాహనములకు తగిన రీతులలో కొంతదూరం నడిచింది. కొంతదూరం రథంలా, కొంతదూరం మదపుటేనుగులా నడిచింది! ఆ తర్వాత పాదరసముతో సమానమైన  స్వచ్చతతో, ఊహకు పట్టుచిక్కని వేగంతో గుఱ్ఱంలా దౌడు తీసింది. 

శితికంఠసుతుఁడు ఖచర
స్తుతుఁడై యా యిచ్ఛ రూపు తురికీ నాస్కం
దిత ధౌరితక ప్లుత రే
చిత వల్గితగతులఁ దరటుచేసిన నదియున్         (కం)

ఆ గరళకంఠుని కుమారుడైన షణ్ముఖుడు ఖేచరులచేత స్తుతింపబడిన వాడై, కోరుకున్న  రూపాన్ని ధరించగలిగిన తన నెమలి వాహనాన్ని, నెమలిని కొరడాతో అదలించి, దానిని  ఆస్కందితము, ధౌరితకము, ప్లుతము, రేచితము, వల్గితము అనే తీరులలో అది పరుగు  తీసేలా చేశాడు. మరీ నిదానము, మరీ వేగాముకాకుండా పరుగు తీయడం ఆస్కందితము అని వివరణ. మిగిలినవి అంతకన్నా ఒకదానికన్నా ఒకటి ఎక్కువ వేగంగా పరుగుతీసే విధానాలు. వేగము అనేదాన్ని బట్టి ఈ భేదాలు. యివి అశ్వశాస్త్ర రహస్యాలు. సమస్తశాస్త్ర రహస్యజ్ఞుడైన రామకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఇంతే కాదు,

మురళి గొని యురవణమునన్ 
బరువడి గోమూత్రికాది భంజళులఁ గడున్    
గెరలి చతుర్విధ ధావిత 
పరిపాటీ పాటవమునఁ బతి మెప్పించెన్           (కం)

వేగమును బట్టి కాక, దాని దౌడు తీరునుబట్టి మరొక  నాలుగు విధానాలు. మురళి, ఉరవణము,గోమూత్రికము, భంజళి అనేవి పరుగెత్తేప్పుడు గుఱ్ఱము యొక్క విన్యాసాల విధానాల భేదాలు.ముఖమును కొద్దిగా ప్రక్కకు, క్రిందికి దించి పరుగెత్తడం మురళి. మెడసాచి ప్రవాహంలాగా దూకుతూ వెళ్ళడం ఉరవణము. అటూ యిటూ వంకరగా దాట్లు కొడుతూ వెళ్ళడం భంజళి. పాములా వంకరలు తిరుగుతూ వెళ్ళే విధానానికి ఈ పేరు.  గోమూత్రికం అనేది భంజళిలో  మరొక శైలి. గోవు నడుస్తూ మూత్రం వదులుతూ వెళుతుంటే అటూ యిటూ వంకరగా ధారలు పడుతూ ఉంటాయి, కనుక ఈ పేరు, బహుశా! అలా తన వాహనం మీద కైలాసానికి చేరుకున్నాడు  కుమారస్వామి.

బలుపాఁపతలచుట్టు లలవరించినవారు,
లేఁతచందురులఁ దాలిచినవారు,
పునుక తమ్మొంటులఁ బొలుచు వీనులవారు,
నొసల మిక్కిలిచూపులెసఁగువారు,
బూదుపారఁగ మేన బూదిఁ బూసినవారు,
త్రిముఖాస్త్రములు కేలఁ ద్రిప్పువారు,
పులితోలు హొంబట్టు పుట్టముల్ గలవారు,
కొమ్ముతేజుల నెక్కి గునియు వారు,                          (సీ)

ఘోర తపముల హరుఁ దక్క గొన్నవారు,
కరటిదైతేయకుంభముక్తాలలామ
హారి భుజమధ్యములవా రుదారయశులు,
ప్రమథవీరులు గొలిచిరా బాహులేయు

అక్కడ ప్రమథవీరులు ఆ కుమారస్వామిని కొలిచి స్తుతించారు. ఆ ప్రమథవీరులు  పెద్దపెద్ద పాములను తలపాగాలుగా ధరించినవారు, లేత చంద్రులను దాల్చినవారు, పుర్రెల చెవికుండలములను ధరించినవారు, నుదుటిమీద అదనంగా కన్నులు, మూడో  కన్ను గలవారు, శరీరమునిండా బూడిద పూసుకున్నవారు, త్రిశూలాయుధములను  చేతులలో త్రిప్పుతున్నవారు, పులితోలును పట్టు పుట్టములుగా కట్టుకున్నవారు,  కొమ్ములున్న వాహనాలను, అంటే వృషభాలను ఎక్కి తిరిగేవారు, ఘోరమైన తపస్సు  చేసి శివుని తమకు దక్కేట్లుగా పొందినవారు, ఏనుగు రాక్షసుడిని చంపినపుడు వాడి  కుంభస్థలంలో ఉన్న మంచి ముత్యాలతో చేసిన హారాలు భుజాలమధ్యన, వక్షస్థలముల మీద వ్రేలాడుతున్నవారు, మిక్కిలి కీర్తి గలిగినవారు. అంటే వారందరూ శివుని ఆహార్య   వాహన భూషణాదులు కలిగినవారు, సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తిని పొంది  కైలాసంలో పరమశివుని సేవించేవారు. వారు కుమారస్వామిని కొలిచారు.

కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
sirasri question