Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sravanasree

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - ..

మనమీదేనర్రోయ్

ఆవిష్కరణ

నలుగురూ కలిసినపుడే పండగ! హాయిగా నవ్వినరోజే పండగ! తెలుగు లోగిళ్ళలో వెల్లివిరిసే అచ్చతెలుగు నవ్వుపువ్వుల్ని ఏరుకొచ్చి దండల్లా గుచ్చి పాఠకుల గుండెల్ని ఆత్మీయంగా తాకేలా అలంకరించారు మన కార్టూనిస్టు సరసి. ఒకటి కాదు, రెండు దండలు.

నవ్య వార పత్రికలో అప్రతిహతంగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న కార్టూన్ శీర్షిక మనమీదేనర్రోయ్. ఆ కార్టూన్లలో చచ్చులూ పుచ్చులూ ఏరి నికార్సయిన నాలుగువందల కార్టూన్లని రెండు సంపుటాలుగా వెలువరించారు సరసి. ఆ పండగే ఆదివారం ఆగస్టు 14 సాయంత్రం సికింద్రాబాదు ప్యారడైజ్ సర్కిల్ సమీపంలోని సన్ షైన్ హాస్పిటల్ ప్రాంగణంలోని శాంతా ఆడిటోరియం లో జరిగిన ఆవిష్కరణ ఉత్సవం.

సభా ప్రారంభానికి ముందు శ్రీమతి వేటూరి రమాదేవి హృద్యంగా కొన్ని పాత సినిమా పాటలు పాడి వినిపించారు. తదుపరి వేదిక మీది ఆహూతులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో బాపు-రమణల చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతులు వెలిగించి నివాళులు అర్పించారు.

అతిథుల్ని స్వాగతిస్తూ మాట్లాడిన సరసి - సమాజంలో తెలుగుదనం రాను రాను అంతరించి పోతోందని పేర్కొంటూ భవిష్యత్తులో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ వల్ల తెలుగు నేర్చుకొనే పిల్లలూ, నేర్పే ఉపాధ్యాయులూ కూడా ఉండరన్నారు. ఆ కారణంగా ముందుముందు తెలుగులో వెలువరించే కథలూ, కవితల పుస్తకాలూ చదివేవారుండరని, కాబట్టి తెలుగు వారందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతివారూ పుస్తకాలు కొని చదివే అలవాటు పెంపొందించుకోవాలనీ, శుభకార్యాలలో మంచి పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంస్కృతిని వృద్ధి చేసుకోవాలనీ అన్నారు.

సాహిత్య సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఆనాటి సభకు అధ్యక్షత వహించిన సినీనటులు శ్రీ రావికొండలరావు మాట్లాడుతూ హాస్యం అజరామరం ప్రతివారం సరసి వెలువరించే కార్టూన్లని చూసి ఆనందిస్తూ వుంటానన్నారు.

తదుపరి డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ తను సంపాదించింది డబ్బు కాదనీ, కళారంగంలోని ఇటువంటి మిత్రులనే అని అంటూ తమ సహృదయాన్ని చాటుకున్నారు. బాపుగారు తరచు సరసి కార్టూన్ల గురించి తనతో గొప్పగా చెప్పేవారనీ, తనుకూడా సరసి అభిమానిననీ అన్నారు. డాక్ట్ర్ల మీద సరసి వేసిన కొన్ని కార్టూన్లని ఉదహరించి, ప్రస్తుతం వెలువరించిన ఈ రెండు పుస్తకాలకే కాదు భవిష్యత్తులో సరసి వెలువరించే ఎన్ని కార్టూన్ పుస్తకాలకైనా తనే ఆర్థిక సహాయం చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. తదుపరి వారి చేతులమీదుగా పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. 

ఆ రెండు సంకలనాలనూ సరసి తమ మాతృమూర్తి శ్రీమతి సరస్వతుల వెంకటరమణమ్మ గారికి, భార్య శ్రీమతి రత్నకు అంకితమిచ్చారు. వృద్ధాప్య కారణంగా సభకు రాలేకపోయిన తల్లిగారి స్థానంలో కృతిని స్వీకరించిన సరసిజనాభ సోదరి శ్రీమతి వారణాసి కాత్యాయిని మాట్లాడుతూ ఎంతోమంది ప్పఠకుల మన్ననలకు పాత్రుడైన తమ సోదరుడి విజయానికి తన గుండె నిండిపోయిందనీ, సభకి రాలేకపోయిన తమ తల్లిగారి మనస్సంతా సభవైపే ఉందన్నారు. తమ సోదరుడు కార్టూన్ వేసినా, కథ రాసినా తన తల్లి పక్కన కూర్చుని ఆమెకు వినిపిస్తాడనీ అన్నారు. సరసిగారి శ్రీమతి రత్న మాట్లాడుతూ పుస్తకం అంకితం ఇస్తే ఏమి వస్తుందీ ఏ నెక్లెస్సో వడ్డాణమో చేయిస్తే బావుండేది కదా అని ఒక కార్టూనిస్టు భార్యగా చమత్కరించారు.

నవ్య వారపత్రిక పూర్వ, ప్రస్తుత సంపాదకులు శ్రీశ్రీరమణ, శ్రీ జగన్నాధ శర్మలు మాట్లాడుతూ నవ్య వీక్లీకి మనమీదేనర్రోయ్ శీర్షిక తలమానికం వంటిదనీ, వారం వారం అశేష పాఠకులు ఆదరిస్తోన్న విజయవంతమైన కార్టూన్లు వెలువరిస్తున్న సరసి అభినందనీయుడన్నారు. తదుపరి సినీనటులు శ్రీ ఎల్.బీ శ్రీరాం మాట్లాడుతూ సరసి తన జీవితాన్ని అంతటినీ ప్రతిఫలించేలా ఒక కార్టూను వేశారని, ఆయనకున్న వేలాది అభిమానుల్లో తను ప్రథముడినని అన్నారు.

రచయిత్రి డా. చిల్లర భవానీదేవి పుస్తక సమీక్ష చేస్తూ అనునిత్యం మన దైనందిన జీవితంలో తారసిల్లే అనేక సంఘటనల్లోని హాస్యాన్ని పట్టుకుని సరసి వెలువరిస్తున్న కార్టూన్లు నిత్యం మనను వెంటాడుతుంటాయని పేర్కొంటూ సంకలనాల్లోని అనేక కార్టూన్లని సభాసదుల మధ్య గుర్తు చేసుకున్నారు.

సీనియర్ జర్నలిస్టు శ్రీ ఎం. వి. ఎస్. ప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam