Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue175/500/telugu-serials/atulitabandham/atulita-bhandham/


నిర్మలకు మహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టిన పదిహేను రోజులకే మధుబాలకు పనస పండంటి మగపిల్లవాడు పుట్టాడు. వెంటనే వియ్యాలవారికి కబురుచేసాడు అనంతరామయ్య. కానీ తండ్రి ఆస్తి వ్యవహారాలలో బాగా బిజీగా ఉన్నానంటూ వేణుగోపాల్ పసిబిడ్డను చూడటానికి రాలేదు. సుగుణమ్మ బయలుదేరబోయినా ఆమెను వెళ్ళనీయకుండా ఆపేసాడు.

మధుబాలకు చాలా వేదనగా అనిపించింది. అసలు ఈ అకారణ కోపం ఏమిటో తెలియటం లేదు. తనకూ భర్తకూ కనబడని అగాధం, తన ప్రమేయమేమీ లేకుండానే  పెరిగిపోయింది. మనసు చంపుకొని, తానే భర్తకు ఫోన్ చేసింది మధుబాల.

“వేణూ... నా మీద కోపం ఎందుకు మీకు? అన్నీ మరచిపోయి, బాబును చూడటానికి రండి... మీకోసం మేమిద్దరం ఎదురుచూస్తున్నాము...”

“తీరిక లేదు మధూ... వారం రోజుల్లో వస్తాను... బై ద వే, మీ అన్నయ్యను అడిగి ఆ డబ్బు రెడీ చేయి... వచ్చి తీసుకువెళతాను...” ముక్తసరిగా అన్నాడు వేణుగోపాల్.

“అది కాదు... సంవత్సరం తర్వాత తానే ఇచ్చేస్తాడు... ఇప్పుడు అడగటం బావుండదు... వాడికీ కూతురు పుట్టింది... బారసాల ఖర్చులూ అవీ ఉంటాయి... మా వదిన పుట్టింటివాళ్ళు చాలా పేదవాళ్ళు... ఇటు మన బాబుకూ, అటు వాడి పాపకూ ఖర్చులన్నీ వాడే భరిస్తున్నాడు... అర్థం చేసుకోండి...” దీనంగా అన్నది మధుబాల.

“అసలు చెల్లెలి దగ్గర డబ్బు తీసుకోవటమే మీ అన్నయ్య తప్పు... నీకేం ఎక్కువ చేసేయటం లేదు మీ అన్న... మొదటి పురుడు పుట్టింటివారు పోయటం ఆనవాయితీ... మీ అక్కలకు పోయలేదూ? డబ్బు సిద్ధం కాగానే ఫోన్ చేయమను... వచ్చి తీసుకుంటాను... మూడో నెలలో నిన్నూ, బాబునూ తీసుకువెళతాను...”

వేణుగోపాల్ మాటలు మధుబాలను చాలా బాధించాయి. ఇదేమిటి? తాను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు తన పుట్టింటివారికి ఇవ్వకూడదా? అది అప్పుగానే అన్నయ్య భావించి తిరిగి ఇచ్చేస్తాననే అన్నాడు... కానీ ఒకదానితర్వాత మరొకటి ఖర్చులు ముంచుకు రావటం వలన కూరుకుపోతున్నాడు... ఎంత వివరంగా చెప్పినా తన భర్త అర్థం చేసుకోవటం లేదు... ఛ! అంత ప్రేమా గాలిలో కలిసిపోయిందా? తన రక్తంలో రక్తం...తొలి సంతానం... కడుపున పుట్టిన బిడ్డను చూడాలని అతనికి అనిపించటం లేదు...  ఎన్ని వంకలు చెబుతున్నాడు?

పచ్చి బాలింత అయిన మధుబాల తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది.

***

 చిలికి చిలికి గాలివాన అయినట్టు మధుబాల, వేణుగోపాల్ ల మధ్య మొదలైన అపార్థాలు ఇద్దరి మధ్యా కనిపించని అగాధాలను సృష్టించాయి.  కొడుకును చూడటానికి తల్లితో వచ్చిన వేణు, మధుబాలతో చాలా  ముభావంగా వ్యవహరించాడు. సుగుణమ్మ మనవడిని ఎత్తుకొని సంబరపడిపోయింది. వేణుగోపాల్ కొడుకును చూసి ఊరుకున్నాడు. ముమ్మూర్తులా తల్లిని పోలి ఉన్న పసివాడిని చూస్తే, అకారణంగా కోపం వచ్చింది. మళ్ళీ తనను తాను తిట్టుకుంటూ వాడి బుగ్గలను తాకాడు ప్రేమగా... వాడు చిరునవ్వులు చిందించాడు... బుగ్గల్లో సొట్టలు పడగానే, ఆ బోసి నవ్వుల్లో  తండ్రి పోలికలు కనిపించాయి. అప్పుడు ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగినట్టు అయింది అతనికి.

మూడవ నెలలో చలిమిడి చేసి, కూతుర్ని, మనవడినీ దిగబెడతామని చెప్పింది పూర్ణమ్మ. బారసాలంటూ జరగలేదు కానీ బాబును ‘బాబి’ అని పిలుస్తున్నామని చెప్పారు. తమకు బంధు బలగం ఎక్కువ కాబట్టి ఇంటికి వచ్చాకే నామకరణ మహోత్సవం చేస్తామని చెప్పింది సుగుణమ్మ.

అంజమ్మ పేరున ఉన్న రెండెకరాల చెలక అమ్మకానికి పెట్టాడు గిరి. వారసత్వంగా వచ్చే ఆస్తి కాబట్టి పత్రాల మీద అందరూ సంతకాలు పెట్టాలి. పొలం అమ్మకం విషయం తెలిసిన మధు నిర్ఘాంతపోయింది. గట్టిగా అడిగితే తెలిసిన  విషయం ఏమిటంటే, వేణు తన అన్నతో  డబ్బు విషయంలో చాలా అవమానంగా మాట్లాడాడు అని. మధుకు చాలా ఉక్రోషంగా, అవమానంగా అనిపించింది.

డబ్బుకి ఇంత ప్రాధాన్యత ఇచ్చే వేణుగోపాల్, అనుబంధాలను, మానవ సంబంధాలను  విస్మరించటం శోచనీయం. అసలు తమ ఇద్దరి అభిప్రాయాలకు, మనస్తత్వాలకు ఎక్కడా పొంతన అన్నది లేనే  లేదు... అంత ఆస్తిపరులకు ఇప్పుడు ఈ  డబ్బు అవసరం ఏం వచ్చిందని? కేవలం తన మీద పంతం కొద్దీ అన్న మీద ఒత్తిడి తీసుకువచ్చాడు... తన బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి లేదు... జాయింట్ అకౌంట్ కాబట్టి అతనే వాడేసుకున్నాడు. తనకీ ఆరునెలలుగా జీతం లేదు... ఇప్పుడు అన్నయ్య చెప్పిన చోట్ల సంతకాలు పెట్టటం తప్ప గత్యంతరం లేదు తనకు... ఈరోజు వేణు మూర్ఖత్వం వల్ల, ధన దాహం వల్ల  అన్నం పెట్టే  భూమాతను అమ్ముకోవలసి వస్తోంది... ఎంతటి దౌర్భాగ్యమిది?

ఆ రాత్రి ఐశ్వర్య ఫోన్ చేస్తే మాటల్లో అన్ని విషయాలూ ఆమెతో చెప్పి బాధపడింది మధుబాల.

“అరె, రెండు లక్షల భాగ్యానికి పొలం అమ్ముకోవటం ఎందుకే? అమ్ముకంటే మళ్ళీ సంపాదించుకోగలమా?” మందలింపుగా అన్నది ఐశ్వర్య.

“ఏం చేయాలి ఐశూ? అయినవాళ్ళే పగవాళ్లై, అప్పు కాని అప్పును తీర్చమంటూ  పీకల మీద కూర్చుంటుంటే ఏమి చేయాలి? డబ్బు చెల్లించక పోతే మా కుటుంబ పరువు తీసేలా ఉన్నాడు వేణు... మా అన్నయ్య కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళు అయిందో... తొలిచూలు కూతురు పుట్టిందన్న సంతోషం లేదు... వెయ్యి టన్నుల భారాన్ని గుండెల మీద మోస్తున్నట్టు తిరుగుతున్నాడు... ఈ పరిస్థితుల్లో పొలాన్ని అమ్మేయమని మా నాన్నమ్మే చెప్పింది... అంతకన్నా గత్యంతరం లేదు కూడా...” దిగులుగా అంది మధు.

“రేపు నేను ఎక్కడైనా ప్రయత్నించి,  డబ్బు అరేంజ్ చేసి మీ అన్నయ్య అకౌంట్ కి పంపిస్తాను... తొందర పడకండి... భూమిని అమ్మటం అంత మంచిది కాదు... ప్లీజ్... నేను మీ అన్నయ్యతో మాట్లాడనా?” అంది ఐశ్వర్య.

“వద్దు ఐశూ... అప్పు చేయటమనేది నా నిఘంటువులోనే లేదు... ఇలాగే కానిద్దాం...” అయిష్టంగా అన్నది మధుబాల.

“కాదులే, ఒక్క రెండు రోజులు ఆగండి... ఆ తర్వాత ఏ మార్గం లేకపోతే ఇలాగే చేద్దాం...  అన్నయ్య ఫోన్ నెంబర్ మెసేజ్ చేయి...” ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఐశ్వర్య.

ఏం చేయాలో తెలియక కంట నీరు నింపుకుంది మధుబాల.

“అయ్యో,  బాబు ఏడుస్తున్నాడు కదమ్మా మధూ... వాడికి పాలివ్వు...” బాబీని తెచ్చి ఒడిలో వేసింది పూర్ణమ్మ.

కూతురి హృదయంలో చెలరేగుతున్న పెను తుఫాను ఆమెకు తెలుసు.

***

ఏం చేసిందో, ఎలా చేసిందో కాని గిరి బాంకు ఖాతాలోకి మర్నాటికల్లా రెండు లక్షల రూపాయలు జమ చేసింది ఐశ్వర్య.  ఆ డబ్బును వెంటనే వేణుగోపాల్ కి పంపించివేసాడు గిరి. ఐశ్వర్యకు ఎన్నెన్నో కృతజ్ఞతలు కూడా చెప్పాడు మరీ మరీ.
 

మధుబాల మనసు ఐశ్వర్య పట్ల కృతజ్ఞతను, ప్రేమను మించిపోయిన భావంతో నిండిపోయింది... అవధులు లేని ఆనందంతో, దుఃఖంతో ఐశ్వర్యకు ఫోన్ చేసి గట్టిగా ఏడ్చేసింది... పరిస్థితులు అన్నీ చక్కబడతాయని చెబుతూ, ఆమెను సముదాయించింది ఐశ్వర్య.

***

మధుబాల లీవ్ అయిపోవచ్చింది. బాబుకు మూడో నెల వచ్చింది. సుగుణమ్మ ఫోన్ చేసింది, మధుబాలను, బాబునూ  పంపించమంటూ...

కానీ, మధుకు తిరిగి అత్తవారింటికి వెళ్ళడానికి, వేణుతో ఏమీ జరగనట్టుగా ఇదివరకటిలా మాట్లాడుతూ, కాపురం చేయటానికి మనస్కరించటం లేదు... అటు ఆఫీసు నుంచి ఫోన్ లు వస్తున్నాయి, ఎప్పుడు జాయిన్ అవుతారంటూ...

చివరికి ఒక నిర్ణయానికి వచ్చిందామె. తనను భర్త ఇంటికి పంపించవద్దనీ, కొన్నాళ్ళు విడిగా ఉంటాననీ, తండ్రినీ, అన్ననూ కోరింది. ఆమె కోరిక విన్న ఇంటిల్లిపాదీ నిర్ఘాంతపోయారు. కాపురం చెడగొట్టుకోవద్దని మరీ మరీ బ్రతిమిలాడి చెప్పింది పూర్ణమ్మ.

మధు సమాధానం ఒక్కటే... ఇక్కడే ఉంటే ఉద్యోగం పోతుంది... అక్కడే అత్తవారింట్లో ఉంటే మనశ్శాంతి కరువౌతుంది... అంచేత కొన్నాళ్ళు విడిగా ఉండి, మనసు కుదురుకున్నాక తిరిగి తానే అత్తవారింటికి వెళతానని, ప్రస్తుతానికి ఐశ్వర్య ఫ్లాట్ కి వెళతానని అందరికీ నచ్చజెప్పింది. తనను బలవంతం చేయవద్దనీ, మనసులేని కాపురం చేయలేననీ గట్టిగా చెప్పింది. ఏమనాలో తెలియక ఊరుకున్నారు అంతా... ఎందుకంటే, గిరి ఫోన్ చేసినా వేణు ఆ కాల్స్ కట్ చేసేస్తున్నాడు. మధుబాలకీ అతనికీ మాటలే లేవు... ఈ పరిస్థితుల్లో అక్కడికి పంపాలన్నా భయమే... ఆ వినత పసికందును ఏమైనా చేస్తే ఎలాగన్నది మరో ప్రశ్న...

బాబును తన దగ్గర వదిలేసి వెళ్ళమని అడిగింది పూర్ణమ్మ.

“వద్దే, పసివాడు, తల్లిపాలకు దూరం చేయకు...” అని గట్టిగా చెప్పింది అంజమ్మ... నిస్సహాయంగా ఊరుకుంది పూర్ణమ్మ.

మధు కోరిక ప్రకారం గిరి ఆమెను ఐశ్వర్యకు అప్పగించి వెనుదిరిగాడు.

***

బాబును ‘ఊయల’ అనే బేబీ కేర్ సెంటర్ లో వేసి, తాను ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది మధుబాల. ఐశ్వర్య ఎంత నచ్చ జెప్పినా అత్తవారింటికి వెళ్ళలేదు.

ఆ రెండు లక్షల కోసం ఐశ్వర్య తన బంగారం అంతా పెట్టి బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుందన్న విషయం పిన్ని గారి ద్వారా తెలిసింది. బాబాయ్ గారే ఆ అప్పును ఇప్పించారని కూడా తెలిసింది.

మధుబాల గుండె ఐశ్వర్యకు పాదాక్రాంతమై పోయింది... స్నేహానికి మారు రూపుగా నిలిచిన ఐశ్వర్య ఋణాన్ని తానెప్పటికి తీర్చుకోగలదు? ఇంత గొప్ప స్నేహితురాల్ని తనకు కానుకగా ఇచ్చిన ఆ దైవానికి పదే పదే  కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ఇంత మంచి అమ్మాయిని ఎన్ని సార్లు దూషించారు వినత, వేణు? అసలు వాళ్లకి ఐశ్వర్య పేరు ఎత్తే అర్హత కూడా లేదనుకుంది కసిగా...

తనకి ఇద్దరు పిల్లలు... అందులో పెద్దది ఐశ్వర్య... దాన్ని బాగా చూసుకోవాలి... రెండోవాడు బాబీ... తామిద్దరూ ఉండగా వాడికి లోటు లేదు... బాబీని ఆడిస్తూ, వాడికి పాలు పడుతూ, నిద్ర పుచ్చుతూ... తాను కూడా వాడికి మరో తల్లిగా మారిపోయింది ఐశ్వర్య...
అన్నీ ఇప్పుడిప్పుడే ఒక దారిలో పడుతూ ఉండగా... ఇదిగో ఇప్పుడు ఇలా దొంగతనంగా బాబీని తీసుకువెళ్ళాడు వేణు.
జరిగిందంతా నెమరు వేసుకున్న మధుబాల, బాబీ ఊసులూ, కేరింతలూ, నవ్వులూ పదేపదే గుర్తు వస్తూ ఉంటే వెక్కి వెక్కి ఏడవసాగింది.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam