Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ...  http://www.gotelugu.com/issue175/501/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

‘‘మంచిది మహాపద్మా. నీవిటుల ఏక పక్ష నిర్ణయము గైకొనునపుడు ఇక మా వంటి పెద్దల సూచనలు సలహాలతో పని యేమున్నది? మమ్ము పిలిచి ఉండ కూడదు. నీ యభిమతము ప్రకారము గానిమ్ము. మేము వెడలుచున్నాము.’’ అంటూ మరో మాటకు అవకాశం యివ్వకుండా ఆగ్రహంతో సభా మందిరం నుండి వెళ్ళి పోయారు వాళ్ళు. వారి వెనకే మరి కొందరూ వెళ్ళి పోయారు. వారిని ఆపే ప్రయత్నమూ చేయలేదు నాగ రాజు. ఇక అక్కడ మిగిలింది తక్షక కర్కోటక అనంతాది కొందరు పెద్దలే మిగిలారు.

‘‘ఎవరికిష్టమున్నను లేకున్నను నా నిర్ణయము మారదు. తక్షక మహోదయా శలవీయండి. ఆ ధనుంజయుని ఏ లోకమున పడ వేయుట ఉత్తమము?’’ అనడిగాడు తక్షకుడిని.

‘‘మనకు దిగువన అతల, వితల, సుతల, తలా తలాది లోకములున్నవి. వాటిలో చివరిదైన పాతాళ లోకము శ్రేయ స్కరము. అన్ని లోకములు దాటి అతడు భూ లోకము చేరుట దుర్లభము. మరణ సమము. పాతాళ ప్రభువు బలి చక్రవర్తి అన్యుల చొర బాటును ఆయన క్షమించడు’’ అంటూ నవ్వాడు తక్షకుడు.

‘‘యోచన అద్భుతము గనే యున్నది. కాని ఇది సాధించు కొచ్చు వారు ఎవరు? వక్ర దంతుని నమ్మ వచ్చునా?’’

‘‘నమ్మ వచ్చును నాగ రాజా. భేషుగ్గా నమ్మ వచ్చును. ఏదో అతడి చెడు కాలమున వారికి చిక్కి ఎలాగో బయట పడి వచ్చినాడు గాని ఇలాంటి మాయలు జేయుటలో వక్ర దంతుడే సమర్థుడు.’’

‘‘అవును ప్రభూ. నాకు మరో అవకాశము దయ చేయండి. విజయుడనై మరలి వచ్చెద’’ అన్నాడు నమ్మకంగా వక్ర దంతుడు.

‘‘మంచిది. నీ ఒక్కని వలన ఈ కార్యము అగునా? తోడు కావలెనా?’’ అడిగాడు నాగ రాజు.

‘‘కావలెను ప్రభూ. ఇచట రెండు కార్యములున్నవి. ఒకటి ధనుంజయుని గొనిపోయి పాతాళమున పడ వైచి వచ్చుట. ఇక రెండవ కార్యము ధనుంజయుడి అదృశ్యం పిమ్మట కూడ ఉలూచీశ్వరి మరలి వచ్చునను నమ్మిక నాకు లేదు. కొద్ది దినములు జూచి అటుల మరలి రాకున్న ఆ భద్రా దేవి ఉలూచీశ్వరికిని మయకము కల్పించి అశ్వ శకటమున రయమున వారి నిచటకు గొని రావలె. అందుకు కొందరు మన నాగ భటులతో బాటు ఒక అశ్వ శకటమును తమరు అనుగ్రహింప వలె’’ అంటూ వివరించాడు వక్ర దంతుడు.

‘‘మరి ఆ భూతం సంగతి ఏమి జేసెదవు? భద్రా దేవి నిచటకు గొని రావలదు సుమా!’’

‘‘చిత్తము. భద్రా దేవిని విడుతము. ఇక భూతమును ఏమార్చుటకు మన మాయా శృంగుడు చాలును’’ అన్నాడు వక్ర దంతుడు.

‘‘మంచిది. వలసిన వారిని దోడ్కొని అశ్వ శకటమున తక్షణమే బయలు దేరుము. ధనుంజయుడు ప్రస్తుతము మత్స్య దేశ భూ భాగమున పయనించు చుండును. ఎందుకైనా మంచిది మీరు మత్స్య దేశము వైపు వారికి ఎదురు వెళ్ళండి. వారి కంట పడకుండా కార్యము సాధించు కొని రండి. వెళ్ళండి.’’ అంటూ అనుజ్ఞ యిచ్చాడు నాగ రేడు. అంతే`

మరో జాము లోనే వక్ర దంతుని బృందం బలిష్టమైన అశ్వములు పూన్చిన ఒక అశ్వ శకటం మీద అంగ రాజ్యం వైపు సాగి పోయింది.

**********************************************

ఆ రోజు రాత్రికి`

హైహియ రాజ్యం లోని మైదాన ప్రాంతంలో గుట్ట మీద ధనుంజయ బృందం మజిలీ చేసింది. ఆ రాత్రి వూహించని విషయాలు చాలానే జరిగాయి. స్వయంగా నాగ రాజు తన కుమార్తె ఉలూచీశ్వరిని వెనక్కు తీసుకెళ్ళేందుకు స పరివారంగా ఆర్భాటంగా వచ్చాడు కాని ఏమీ చేయ లేక రిక్త హస్తాలతో మరలి పోయాడు. అంతే కాదు, వక్ర దంతుని గర్వ మణచి దయ దలచి విడిచి పెట్టాక, సూర్యోదయానికి పూర్వమే అక్కడి నుండి అంతా అశ్వాల మీద బయలు దేరారు.

వాతావరణం బాగుండటంతో సూర్యుడు నడిమింటికి చేరే లోపలే వారు సరి హద్దులు దాటి మత్స్య రాజ్య భూభాగంలో ప్రవేశించారు.
మత్స్య రాజ్యం.

ఒకప్పటి విరాటుని రాజ్యం.

అజ్ఞాత వాస కాలంలో పాండు పుత్రులకు ఆశ్రయమిచ్చిన దేశం. వలునిగా వంటలు చేస్తున్న భీమ సేనుడు సైరంధ్రి వేషం లోని ద్రౌపదీ దేవి కోసం వచ్చిన కీచకుని అంతం చేసిన రాజ్యం. అంతేనా`

ఉత్తర గోగ్రహణమున సుయోధనుడి గర్వమణచి అర్జునుడు గోవును మళ్ళించిన దేశం. తమ మూల పురుషుడైన పరీక్షిత్తుకు జన్మనిచ్చిన అభిమన్యు భార్య ఉత్తర పుట్టి పెరిగిన రాజ్యం. అందుకే మత్స్య దేశంలో కాలు పెట్టగానే తమ పూర్వీకులను తలచుకొని ఒడలు పులకరించగా అశ్వం దిగి నేలకు శిరస్సు ఆన్చి భక్తితో నమస్కరించాడు ధనుంజయుడు.

విరాటుని కాలం నాటి మత్స్య దేశం నాటికి నేటికి అలాగే వుంది. పెరగ లేదు తరగ లేదు. శతృ రహితమైన రాజ్యం. విరాటుని కుమారుడైన ఉత్తర కుమారుని సంతతి వారే నేటికీ మత్స్య దేశ పాలకులు. తర్వాతి తరాలు కూడా రాజ్యం పంచుకో లేదు. ఏ తరంలో అయినా పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసి తమ్ములు రాజ్య భారాన్ని వహిస్తూ సంరక్షిస్తుంటారు. పటిష్టమైన సైనిక వ్యవస్థ వుంది. ధర్మ పరిపాలన గావటంతో ప్రజు సుఖ శాంతులతో వున్నారు.

ఇప్పటికీ మత్స్య దేశ ప్రజలు వ్యవసాయం, గోసంపద మీదే ఆధార పడి జీవిస్తున్నారు. వర్తక వ్యాపారాలు కూడ జరుగుతున్నాయి. ప్రజలు గోసంపదను తమ జీవ నాడిగా భావిస్తారు.

రాజ్యంలో పైరు పచ్చల తో బాటు అడవులు గుట్టల వెంట మందలు మందలుగా గోవులు తిరుగుతూంటాయి. తోకలు లేపి చెంగు చెంగున దూకే తువ్యాయిల సందడి, తమ లేగలకు ప్రేమగా పాలిచ్చే గోమాతలు కను విందు చేస్తూంటాయి. దారిలో చెట్ల నీడన చేరి మురళి వాయించే గోప బాలురులు, కోతి కొమ్మచ్చి, చెడుగుడు మొదయిన ఆటలాడుకొంటున్న పశు కాపరుల సందడి ముందుకు పయనించే కొద్ది నయన మనోహరంగా వుంది ప్రకృతి.

సరి హద్దు దాటి కొంత దూరం వెళ్ళగానే`

బాట సారుల సౌకర్యార్థం మత్స్య ప్రభువు నిర్వహింప జేస్తున్న సత్రం ఒకటి వుంది. ధనుంజయ బృందం చాలా రోజు తర్వాత షడ్రుచులతో అక్కడ విందు భోజనం చేసారు. కొద్ది సేపు విశ్రాంతి గైకొని పొద్దు పడమర వాలుతూండగా తిరిగి ప్రయాణం ఆరంభించారు. ఎగువన సరి హద్దు అశ్వాల మీద పక్షం దినాల ప్రయాణ దూరం లోనే వుంది. ఆ దూరాన్ని ఇంకా ముందుగానే అధిగమించు ఉద్దేశంతో అశ్వాలను శర వేగంతో ప్రయాణిస్తున్నారు. మత్స్య దేశ రాజధానీ నగరం విరాట పురం దిశగా పోకుండా నేరుగా సరి హద్దు మార్గం లోనే సాగుతోంది వారి ప్రయాణం.

ఒక వారం దినములు నిర్విరామంగా సాగింది వారి ప్రయాణం. ఏ విధమైన ఆటంకములు ఎదురు కాలేదు. అయితే ఇంతటితో తమ ప్రయత్నము ఆపి మౌనంగా వుంటారని అనుకోవటం లేదు. నాగ రాజు మరో కుటిల ప్రయ్నతం ఏదో చేయకుండా వుండడని విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రయాణం పొడవునా కడు జాగరూకులై సాగుతున్నారు.

ఇదే వేగమున మరి కొన్ని దినములు ప్రయాణిస్తే చాలును. ఫ్రాగ్‌ జ్యోతిష పురము (ఒకప్పటి నరకాసురుడి రాజధాని) దాటి మర్మ భూమి అటవీ ప్రాంతంలో అడుగు పెట్టగలరు. తమ నాగ లోకమునకు మార్గము ఎలాగూ ఉలూచీశ్వరికి తెలుసు. అచటికి చేరగానే సమస్యను నాగరాజుతో ముఖాముఖి తేల్చుకో వచ్చును.

ఇలా ఉండగా`

ఎనిమిదవ దినము ఉదయమునకు దారిలో వున్న శివ నాగ పురమను చిన్న పట్టణమును సమీపించారు వారు. ఎగువన కొంత దూరంలో పట్టణం ఉందనగా ఇవతలగా బాట ప్రక్కనే చిట్టడివిలో కొంత దూరాన చిన్న కొండ మీద ఏ నాటిదో అద్భుతమైన ఒక శివాలయం కన్పిస్తోంది. ఆ గుట్ట పక్క నుంచే కొండ వాగు ఒకటి ప్రవహిస్తోంది. ఈ శివాలయాన్ని బట్టే ఆ వూరికి శివ నాగ పురమను పేరు వచ్చినది.
ఆ రోజు అచట ఏదో పర్వ దినము అగుటచే శివ నాగ పురముతో బాటు చుట్టు ప్రక్కల వూళ్ళ ప్రజలంతా అక్కడే వున్నారు.

అశ్వ శకటాలు, వృషభ శకటాలు అనేకం కన్పిస్తున్నాయి. కొందరు రంగు రంగుల వస్త్ర భాగములతో ఎత్తుగా ప్రభలు కట్టుకుని మ్రొక్కు తీర్చుకోవడానికొచ్చారు. వాగులో పుణ్య స్నానాలు గావించి దైవ దర్శనానికి కొండ పైకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. శివ దర్శనం చేసుకుని తిరిగి వచ్చే వాళ్ళు వస్తున్నారు.

ఆలయం వున్న గుట్టను చుట్టి`

ఎటు చూసినా జన సందోహం.

‘‘హర హర మహా దేవ శంభో హర శంకర’’ అంటూ భక్త జనం చేస్తున్న శివ నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగుతోంది. వింటున్న వారికి ఒడలు పులకరిస్తోంది.

‘‘ప్రియ భామలారా! పర్వ దినము అన్నప్పుడును రావు. వచ్చినప్పుడే మనమును పుణ్య స్నానములాచరించి స్వామి దర్శనం చేసుకుని సేవించి ముందుకు సాగుట శుభ దాయకం. పదండి’’ అంటూ అశ్వాన్ని అటు మళ్ళించాడు. భద్రా దేవీ ఉత్సాహంగానే వుంది. అశ్వాలు బాటను వదలి చిట్టడివి లోకి దారి తీసాయి.

ధనుంజయుని మాటల్ని నిద్ర మొద్దు భూతం ఘృతాచి విన లేదు గాని ధనుంజయుని తోలు సంచిలో వున్న శ్వేత నాగు రూపంలోని ఉలూచీశ్వరి వింది. తల బయటకు పెట్టి చూసింది. గగనంలో ఎక్కడా గరుడ పక్షుల జాడ లేదు. నెమ్మదిగా అశ్వం పైకి ప్రాకి ధనుంజయుని వెనక ఉలూచీశ్వరిగా రూపం మార్చుకుని కూచుంది. క్రమంగా గుట్టను సమీపిస్తుండగా ఎందుకో ఆమె మనసు కీడును శంకించనారంభించి ధనుంజయుని భుజ స్కంధాలను అదిమింది.

‘‘మనకిపుడు దైవ దర్శనం అవసరమా ప్రభూ? నాకిది ఉచితముగా తోచుట లేదు. శివ దేవుడు సర్వాంతర్యామి గదా. పిదప ఎప్పుడైనను దర్శింప వచ్చును. అశ్వమును మళ్ళించండి. నేరుగా పోవుదము’’ అంది.

‘‘లేదు లేదు సఖీ. ఆ స్వామి ఆశీస్సులు పొందే వెళ్ళెదము గాక’’ అన్నాడు కృత నిశ్చయంతో ధనుంజయుడు.

‘‘అయ్యో! మీకు అర్థము గాకున్నదే మా వాళ్ళ గురించి మీకు తెలియదు. ఇలాంటి చోట కాపు వేయ అవకాశము కలదు. ఆ పైన నా మనసు భీతిల్లుచున్నది. వాళ్ళిచట ఏ రూపమున తిరిగెదరో తెలియదు.

అక్కా! నీవైనను చెప్పుము’’ అంది భద్రా దేవితో.

‘‘అవును ప్రభూ! ఉలూచి మాటలు మన్నించి మన దారిన మనం ముందుకు పోవుదము. మన లక్ష్యం చేరువలో వున్నది. త్వరిత గతిని నాగ లోకము చేరుట గదా మనకి ముఖ్యము.’’ అంది భద్రా దేవి. అయితే చెడు కాలము దాపురించు నపుడు మంచి మాటలు చెవి కెక్కవు. యువతుల భీతి జూచి ఫక్కున నవ్వాడు ధనుంజయుడు.

‘‘అయ్యారే... మీరేల యిటుల బెదరు చున్నారో తెలియ కున్నదే. ఎన్నో యిడుముల కోర్చి ఇంత వరకు వచ్చినాము. శివ దర్శనము చేసుకొని వెడలి పోగలము. ఇంతకు ఇంతలో అదియును ఇంత జన సందోహమున ఎవరేమి చేయ గలరు? అంతకూ ఎవరేని తెగ బడి వచ్చిన ఈ సారి ఎవరినీ వదల. అందరినీ తుద ముట్టించెద. భయము వలదు. రండి’’ అన్నాడు.

అంత బింకముగా ధనుంజయుడు చెప్పిన పిమ్మట ఇక పట్టు బట్టి అతడ్ని వెనక్కు మరలించుట యుక్తము గాదనిపించింది. అందుకే అతివలిరువురూ ఇక మాట్లాడ లేదు. కాని ఎందుకైనా మంచిదని దారి పొడవునా భక్త జనం మీద ఓ కన్నేసి వుంచారు.
క్రమంగా అశ్వాలు గుట్టను సమీపించాయి.

ఎక్కడా నిలువకుండా జనం మధ్యగా అశ్వాల్ని పోనిస్తూ నేరుగా కొండ వాగు వద్ద స్నాన ఘట్టానికి సమీపం లోకి వెళ్ళి పోయారు. అక్కడే టెంకాయలు, పూలు, పండ్లు, శివ ప్రీత్యర్థం సమర్పించ వలసిన పూజా ద్రవ్యములు విక్రయించే అంగళ్ళు అనేకం వరుస దీరి వున్నాయి. అక్కడున్న ఒక శాలి వృక్షానికి అశ్వాల్ని బంధించారు. సరిగ్గా అక్కడికి ఎదురుగా వున్న అంగడికి వెళ్ళాడు ధనుంజయుడు. ఒక వృద్దుడు అతడి కొడుకు ఆ అంగడి నడుపుతున్నారు. తాము తిరిగి వచ్చే వరకు అశ్వాలను వాటి మీద సంచులను భద్రంగా చూడమని రెండు వరహాలిచ్చాడు. వెళ్ళేప్పుడు ఇంకో రెండు వరహాలు యిస్తాననగానే వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు.

అయితే వ్యాపారం మాని వాళ్ళు అశ్వాలనే చూస్తూ వుండరు. ఇలాంటి చోట చోరుల భయం ఉండనే వుంది. అందుకని భద్రా దేవి భూతం ఘృతాచిని లేపి అదృశ్య రూపమున అచట కావలి ఉండమని ఆదేశించిన పిమ్మట ముగ్గురూ సాన్నానికి బయలు దేరారు.
శ్రద్ధగా పుణ్య స్నానమాచరించారు.

పొడి దుస్తులు ధరించారు.

తడి దుస్తుల్ని పిండి తర్వాత ఆర బెట్టేందుకు తోలు సంచిలో వుంచారు. వెనక్కి వచ్చి ఆ సంచిని అశ్వానికి తగిలించారు. అదే అంగడిలో పూజా ద్రవ్యాలను ఒక బుట్ట లోకి తీసుకుని కాలి నడకన గుట్ట పైకి బయలు దేరారు.

ముందుగా ధనుంజయుడు, అతడి వెనకే బుట్టతో భద్రా దేవి చివరిగా ఉలూచీశ్వరి వరుసగా విశాలమైన బాట మీద ప్రవేశించారు. వారికి ముందు వెనక వరుసు తీరిన భక్త జన సందోహం వస్తోంది.

దారిలో తన వెనక నుంచి కొందరు అతివలు గుస గుస శబ్ధాలు చివరిగా వస్తున్న ఉలూచీశ్వరి చెవుల బడి నవ్వు పుట్టించాయి. ఓర కంట చూస్తే ఒకరు కాదు యిద్దరు కాదు, సీతా కోక చిలుకల్లా సింగారించుకున్న ఇరవై మంది కన్నెపిల్లలు గుంపుగా వస్తున్నారు. వారంతా పోటీ పడి ముందు పోతున్న ధనుంజయనే చూస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. వారంతా సమీపం లోని శివ నాగ పురం అమ్మాయిలు.
‘‘ఎవడే వీడు ఇంత సొగసుగా వున్నాడు. కంతుడా... జయంతుడా, భుమికి వచ్చిన చంద్రుడా. మనసును లాగేస్తున్నాడు. ఎవరయి వుంటాడు?’’ ఒక యువతి అడుగుతోంది.

‘‘అతడెవరైనా గానీ అతని వెంట అప్సర భామల్ని మించి యిద్దరు ముద్దుగుమ్మలున్నారు. మన వంక కన్నెత్తి చూడడు గాని పదండే’’ అంటోంది పక్క యువతి.

‘‘అక్కా! వింటున్నావా ఆ మాటలు?’’ అంది చిన్నగా భద్రా దేవితో.

‘‘నీవు వెనక సంగతి వింటున్నావ్‌. ఇటు ముందు చూడుము. పాపం ఎందరు భామలు మన సఖుని గాంచి మనసు పారేసుకుంటున్నారో. ఒడలు వేడెక్కి వూపిరి తీసుకో లేక విలవిల్లాడి పోవు చున్నారు’’ అంది నవ్వుతూ భద్రా దేవి.

‘‘ఇంతకూ మన ప్రభువుల వారి చూపు ఎటు వున్నదో’’ అంది కొంటెగా ఉలూచీశ్వరి.

‘‘ఎందరి వలపు చూపులు నాపై వున్నను నా చూపు మాత్రము మీ మీదనే సుమా’’ అన్నాడు వెను తిరిగి కొంటెగా చూస్తూ ధనుంజయుడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్