Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mprove Your Eye Sight |  | Dr. Murali Manohar M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి సొగసులు ( పదవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

 కాంగ్రా లోయ --5

ఛాముండాదేవి ---

పాలంపూర్ కి సుమారు 10 కిలోమీటర్లదూరంలో వుంది ఛాముండాదేవి . సాధారణంగా మందిరం చూడ్డానికి ప్రజలు రావడంతో వారి అవసరాలకొరకు మందిరం చుట్టుపక్కల వూరు పెరగడంతో ఆ వూరు కూడా అక్కడవున్న అమ్మవారి పేరు మీదనే పిలువబడసాగిందేమో అనిపిస్తుంది నాకు యిలాంటి ప్రదేశాలు చూసినప్పుడు .

ఏ విధమైన శిల్పకళగా లేక సామాన్యంగా వున్న  చిన్న మందిరం . కాని యిక్కడకు వచ్చే భక్తులను , సాధకులను చూస్తే యీ మందిర ప్రాముఖ్యత తెలుస్తుంది . కాని మందిరంలో కి ప్రవేశించగానే మందిరంలో యేదో శక్తి వున్నట్లనిపించింది .

యెత్తైన కొండలు దట్టమైన అడవుల మధ్య గలగలమని స్వచ్చమైన జలాలతో ప్రవహించే ' బనేర్ ' లేక  ' బనగంగ ' గా పిలువబడే నది వొడ్డున వున్న మందిరం . ఈ దేవిని రుద్ర ఛాముండాదేవి  అని కూడా పిలువడం వుంది . యెందుకంటే యిక్కడ శివుడు రుద్రరూపుడు . అతని కూడా వున్న అమ్మవారుకూడా రుద్రరూపి అయిందని అంటారు .

దుర్గాదేవి ' ఛండ - ముండ ' అనే రాక్షసులను సంహరించేందుకు తన లోనుండి ఛాముండాదేవిని సృష్టించిందని దేవీ పురాణం లో చెప్పబడింది .  ఛండ-ముండ రాక్షసుల అనుచరులైన ' శుంభ - నిశుంభులను ' సంహారసమయమున అష్ట మాతృకలను సృష్టిచేసి వారి సహాయముతో ' శుంభ-నిశుంభులను ' సంహరించి ' ఛండ - ముండ ' లను సంహరించేందుకు ఒక మాతృకను పంపగా ఆ మాతృక రాక్షస సంహారం కావించి దుర్గా దేవి వద్దకు రాగా దుర్గా దేవి సంతోషము పొంది ఆ మాతృక పృధ్విలో ఛాముండాదేవి అనే పేరుతో పూజలందుకోవాలనే వరం ప్రసాదిస్తుంది . పార్వతీ దేవి రూపమే ఛాముండాదేవి అని దేవీమహత్యంలో వివరింపబడింది .

మందిరం లోపల రామాయణ భారతాలలో గల దేవీ మహిమల చిత్రాలు వున్నాయి . దేవిని పట్టు వస్త్రాలతో అలంకరించేరు . అమ్మవారికి యిరువైపులా హనుమంతుడు , భైరవుడి విగ్రహాలు వున్నాయి . వీరిని దుర్గాదేవి ఛాముండాదేవి కి సహచరులు నియమించిందని అంటారు . ఓ పక్కగా రాతిపైన చిన్నచిన్న అడుగుల ముద్రలు వున్నాయి . ఇవి సాక్షాత్తు అమ్మవారి పాద ముద్రలని పూజిస్తారు . మందిరంలో ఓ పక్కగా వున్న మెట్లగుండా కిందికి దిగితే వున్న చిన్న గుహలో శివలింగం వుంది . శివభక్తులు యీ లింగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు .

ఛాముండాదేవి మందిరప్రాంగణ లో కూర్చొని నిర్మలమైన మనస్సుతో ' శత ఛండీ ' పఠిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందట . అమ్మవారికి నిత్య పూజలు , నిత్య నైవేద్యాలతో పాటు అయిదు మార్లు హారతి నిర్వహిస్తున్నారు .

400 సంవత్సరాలకు పూర్వం యీ అమ్మవారి మందిరం క్రూరజంతువులతో నిండిన అడవులలో  కొండలపై భక్తులు అతికష్టం మీద కూడా చేరుకోలేనటు వంటి ప్రదేశం లో వుండడం తో ఆ ప్రాంతపు రాజు , మందిర పూజారి అమ్మవారిని భక్తులు సులువుగా చేరుకొనే ప్రదేశం లో మందిర నిర్మాణం చేసేందుకు అనుమతి నివ్వవలసిందిగా కోరుతారు .అమ్మవారు పూజారిని అనుగ్రహించి అతనికలలో కనిపించి 'వనగంగ ' వొడ్డున మట్టిలో తను వున్నట్లు చెప్పి అక్కడ తనకు మందిరం కట్టించమని శలవిస్తుంది . అమ్మవారు చెప్పిన ప్రదేశంలో మట్టిని త్రవ్వగా అమ్మవారి విగ్రహం కనపిస్తుంది . పనివారు విగ్రహాన్ని తొలగించాలని యెంతమంది ప్రయత్నించినా విగ్రహాన్ని కదపలేకపోతారు . అప్పుడు అశరీరవాణి పూజారిని మరునాడు శుచిగా వచ్చి విగ్రహాన్ని బయటకు తీయమని చెప్తుతుంది . మరునాడు పూజారి స్నానాదులు చేసుకొని భక్తిగా అమ్మవారి విగ్రహాన్ని అవలీలగా బయటకు తీసి ప్రతిష్టించి మందిరనిర్మాణం చేసేరు .

వింధ్య పర్వతాలలో నివసించే ' ముండ ' అనే కొండజాతీయుల పూజలందుకొనే దేవి కాబట్టి దుర్గాదేవిని ఛాముండాదేవి అని పిలువబడ సాగింది అనేది మరో కధనం .

ఇక్కడ క్షుద్రోపాసకులు అధిక సంఖ్యలో కనిపిస్తారు . వీరు ప్రశాంతమైన ఆ పరిసరాలలో తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు .

ఛాముండాదేవిని నాలుగు , యెనిమిది , పది , పన్నెండు చేతులతో , ఒక్కోచేతిలో ఒక్కో ఆయుధం ధరించి , ఒక చేతిలో రుధిరం తో నిండిన ' కపాల ' పాత్ర , ప్రేతాన్ని వాహనంగా చేసుకొని , సర్పాలు , మానవ పుర్రెలు , యెముకల మాలలు ధరించిన వుగ్రరూపిణిగా వర్ణిస్తారు . దుర్గాదేవి యొక్క 64 యోగిని రూపాలలో ముఖ్యమైనది . యోగినీ వుపాసకులకు యిక్కడ ఛాముండాదేవి ని వుపాసించి సర్వసిధ్దులు పొందుతారట .

దేవీ పురాణం ప్రకారం దుర్గాదేవి అష్టమాతృకలలో కాళికాదేవిని ఒకటిగా చెప్పబడింది . దుర్గాదేవి రక్తబీజుని సంహరించేసమయాన అతని రక్తం నేలపైన పడకుండా పీల్చేందుకు పెద్ద నాలుకతో కాళిక ను సృష్టిస్తుంది . దేవీ పురాణం ప్రకారం కాళి , ఛాముండాదేవి దుర్గాదేవి యొక్క మాతృకలు , కాని వరాహాపురాణం ప్రకారం రక్తబీజుని నెత్తురు పీల్చేందుకు కాళిక నృసింహిణి పాదం నుండి సృష్టించబడింది , అంటే కాళిక దుర్గాదేవి యొక్క మాతృక కాదు .

ఈశ్వరుణ్ణి స్థితి లయ కారకుడు అని అంటారు . శివుడు చితాబస్మం ధరించి శ్మశానాలలో తిరుగుతూ వుంటాడు అంటారు . శివునికి చితాబస్మం ప్రియమైనది అంటారు . ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీ రోజూ ప్రాతః సంధ్యాసమయాలలో బస్మారతి పూజ  చేస్తూ వుంటారు . ఇక్కడ శివుడు వుగ్రరూపంలో వున్న వినాశకారకుడు , ఈ ప్రాంతంలో చుట్టుపక్కల 22 గ్రామాలకు సంబంధించిన శ్మశానం వుండడం కనిపించింది . మందిర పరిసరాలలో పితృకర్మలు చెయ్యడంకూడా వుంది .

హిందూ పురాణాల ప్రకారం ఛాముండాదేవి కృప కోరేవారు అమ్మవారికి జంతుబలులు , నరబలులు కూడా యిచ్చే వారని వుంది , బౌద్ద , జైనమతాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత ఆ మతగ్రంధాలలో ఛాముండాదేవి ప్రస్తావన లేకపోయినా ఛాముండాదేవి వుపాసన చేసిన దాఖలాలు వున్నాయి . కాని జైనమతస్థులు అమ్మవారికి బలి యిచ్చే అలవాటుకు బదులుగా ఫలాలు సమర్పించడం చేసేవారు . తిరిగి హిందూమతం ప్రాచుర్యం లోకి వచ్చేక తిరిగి బలులు యిచ్చే అలవాటు చోటు చేసుకుంది . ప్రస్తుతం ప్రభుత్వం చొరవతో 'బలి ' నిషేధించబడింది .

చక్కని ప్రశాంతమైన ప్రదేశంలో కూడా యీమందిర పరిసరాలను చూడగానే శరీరం చిన్నగా కంపించక మానదు .

ఈ అటవీ ప్రాంతాలలో యింకా క్షుద్ర పూజలు , ఉపాసనలూ జరుగుతూ వుండడం నాకు ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .

మా ప్రయాణం అక్కడనుంచి ధర్మశాల వైపు సాగింది .

ధర్మశాల--

కాంగ్రా పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వున్న కాంగ్రా జిల్లా ముఖ్యకేంద్రం ధర్మశాల . చుట్టుపక్కల వున్న చిన్నచిన్న గ్రామాలను కలిపి రూపుదిద్దిన పట్టణం .

పూర్వం యీప్రాంతం అంతా కాంగ్రా లోయ ను పరిపాలించిన ' కటోచ్ ' రాజుల ఆధీనంలో సుమారు 2 వేల సంవత్సరాలు వుంది . తరవాత సిక్కు రాజైన మహారాజా రంజిత్ సింగ్ పరిపాలనలో వుంది . ఏ రాజులకాలం లోనో ప్రయాణీకుల సౌకర్యార్దం దౌలాధర్ పర్వతాలలో సత్రవు కట్టించేరు . బ్రిటిష్ పాలనలోకి వచ్చేసమయానికి మన పొరుగు దేశమైన నేపాలునుంచి ' ఘుర్ఖా ' జాతి వారు అధిక సంఖ్యలో యీ ప్రాంతాలకు వలసవచ్చి నివాసాలు యేర్పరచుకున్నారు . అప్పటివరకు జనావాసాలు లేని యీ ప్రాంతాలలో ' ఘుర్ఖాగ్రామాలు ' వచ్చేయి . గ్రామాలకు కావలసిన అన్నిసౌకర్యాలతో పాటు ధార్మిక స్థానాలు నిర్మించబడ్డాయి . బ్రిటిష్ రాజ్ లో ఘుర్ఖా రెజిమెంటు మంచి పేరు సంపాదించుకుంది . ఘర్ఖా రెజిమెంటు కార్యాలయం కొరకు వెతుకుతూ  దౌలాధర్ పర్వతాలలో సత్రవు దగ్గర వున్న ఖాళీ ప్రదేశం అనువుగా అనిపించి , 1849 లో ఘుర్కా రెజిమెంటు కి కార్యాలయం నిర్మించాలనే ఆలోచనే ధర్మశాల( సత్రవు ) అనే పట్టణ నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి . 1860 లో 66 వ ' ఘుర్ఖా లైట్ ఇన్ఫేంటరీ ' ని యిక్కడకి తరలించేరు . తర్వాత దీనిని ' ఘుర్ఖా రైఫిల్స్ ' గా మార్చేరు .     1959 లో టిబెట్ ను  చైనా ఆక్రమించుకున్న తరువాత చైనా పరిపాలన వ్యతిరేకించిన టిబెటియన్స్ తమ మత గురువైన దలైలైమా తో యిక్కడకు శరణార్ధులుగా వచ్చి భారతదేశ ప్రభుత్వపు అనుమతితో యిక్కడ నివాసం యేర్పరచుకొని ' నంగ్యాల్ మోనష్ట్రీ నిర్మాణం చేసుకొని నివసించసాగేరు . దేశబహిష్కరణకు గురైన టిబిటియన్లు స్థాపించిన ' సెంట్రల్ టిబెటియన్స్ ఆడ్మినిష్ట్రేషన్ ' ముఖ్యకార్యాలయం ధర్మశాల లో వుంది .

దౌలాధార్ పర్వతాలలో దేవదారు అడవుల మధ్య జలపాతాలు , సరస్సులు కలిగి పర్యాటకులకు అహ్లాదాన్నిచ్చే ప్రకృతి మధ్య వుండడంతో అతి కొద్ది కాలంలోనే దేశవిదేశ పర్యాటకుల కి యిష్టమైన ప్రదేశంగా మారింది .

ధర్మశాలలో హిందూ , బౌద్ధమతాలు రెండూ కలిసి కనిపిస్తాయి .

దలైలామా వునికితో ధర్మశాల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది . 1970 లో దలైలామా ' లైబ్రరీ ఆఫ్ టిబెటియన్ వర్క్స్ అండ్ ఆర్చివ్స్ ' ప్రారంభించి సుమారు 80 వేలకు మించిన టిబెటియన్ చరిత్రకు సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలను ప్రజలకు అందుబాటులో వుంచేరు

గత కొద్ది సంవత్సరాలుగా యిక్కడి  క్రికెట్ గ్రౌండు  అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు వుండడం తో వన్ డే మేచ్ లు నిర్వహింపబడడంతో కూడా ధర్మశాల ప్రాముఖ్యతను సంతరించుకుంది .

భారత ప్రధాని మోడి గారి ద్వారా ధర్మశాల ' స్మార్ట్ సిటీ ' గా గుర్తింపబడింది .

ధర్మశాల పురాతన మందిరాలకు , జలపాతాలు , పర్వతశిఖరాలకు ప్రసిద్ది పొందింది .

పై వారం ధర్మశాలలోని దర్శనీయ స్థలాల గురించితెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam