Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kodi Palav

ఈ సంచికలో >> శీర్షికలు >>

'శ్రావణ శ్రీ' - వనం వెంకట వరప్రసాద రావు

sravana sri

శ్రావణ పౌర్ణమి - జంధ్యాల పౌర్ణమి

జన్నిదముల పౌర్ణమి దిన
మున్నతి గొన నూత్న యజ్ఞ ఉపవీతములన్
అన్నలు ధారణ జేతురు 
మన్ననఁ గాయత్రి మనన మాన్యత లొసగున్  (కం)

శ్రావణ పౌర్ణమి వచ్చింది. దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కొత్త జంధ్యాలను ధరిస్తారు.  జంధ్యాలు అనేది మామూలు వాడుక, నిజానికి అవి యజ్ఞోపవీతాలు. గాయత్రీ మననము  చేస్తారు, మాన్యత పొందడానికి.

బ్రాహ్మీమయమిది యంతయు 
బ్రాహ్మణులకు నిది విధి గద ప్రార్థన గొనగన్
బ్రాహ్మిని సవితను వాణిని 
బ్రాహ్మణులకు మూడు విధులు ప్రాక్తన నిధులున్     (కం)

అంతా బ్రాహ్మీమయమే. అది తెలిసినవాడు ఎవరైనా బ్రాహ్మణుడే, ముందు ముందు వివరంగా చెప్పబోతున్నాడు కవి. బ్రాహ్మి, సవిత, సరస్వతి అనే మూడు నిధులు, వారిని సమాజ శ్రేయస్సు కోసం పూజించి  ప్రార్ధించడం అనే పురాతన విధులు బ్రాహ్మణులకు. 

తొలి సంధ్యన బ్రాహ్మికి నగు
మలి సంధ్యన గద సవితకు మన ప్రణతులగున్
తెలియఁ సరస్వతికి పిదప
వలయు త్రిసంధ్యలను విధిగ వందనమిటులన్    (కం)

ఉదయకాలపు సంధ్యలో బ్రహ్మికి, మధ్యాహ్న సంధ్యలో సవితకు(సావిత్రికి), సాయం సంధ్యలో సరస్వతికి యిలా త్రిసంధ్యలలో వందనం చేయడం విధి.

తొలి సంధ్యన దేవతలకు
మలి సంధ్యన వందనమన మనకగు ఫలముల్
తెలియఁ జగము కొరకు తుదిది
కలిమి చెలిమి బలిమి కొరకు కదర త్రిసంధ్యల్   (కం)

తొలిసంధ్యలో, అంటే ఉదయకాలంలో చేసినదాని ఫలితం దేవతలకు, మధ్యాహ్నం చేసినదాని  ఫలితం కర్తకు, సాయంత్రం చేసినదాని ఫలితం సమాజానికి అందుతాయి, అందుకని మూడు సంధ్యలలో చేయడం. యిలా సమాజం కోసం, దేవతలకోసం, అలా చేయడంకోసం కావలసిన  శక్తిని తాము పొందడం కోసం చేసేవాడే బ్రాహ్మణుడు.

బ్రాహ్మణునికి జనియించిన 
బ్రాహ్మణుడవబోడు, పరమ బ్రహ్మమునెరుగన్
బ్రాహ్మణుడనబడును, పుటక 
బ్రాహ్మణు డొక డగును, కర్మ బ్రాహ్మణు డొకడౌ!   (కం)

అసలు బ్రాహ్మణుడు ఎవరు అన్నది చెబుతున్నాడు, తన ఉద్దేశాన్ని, కవి. బ్రాహ్మణుడికి  జన్మించినంతమాత్రంచేత బ్రాహ్మణుడు కాదు. పుటకతో బ్రాహ్మణుడు ఒకడు, కర్మచేత నిజమైన బ్రాహ్మణుడు మరొకడు అంటున్నాడు. 

ప్రజ్ఞానము కద బ్రహ్మము 
ప్రజ్ఞానికి సకల జగము బ్రహ్మమయంబౌ 
విజ్ఞానికి తెలియుట సరి 
ప్రజ్ఞానికి ఆచరణము ప్రథమం బెపుడున్    (కం)

విశిష్టమైన ఉన్నతమైన జ్ఞానమే బ్రహ్మము. ఆ జ్ఞానం ఉన్నవాడికి సృష్టి అంతా  బ్రహ్మమయమే. మామూలుగా తెలుసుకుని ఊరుకునేవాడు విజ్ఞాని. ఆచరించేవాడు 

ప్రజ్ఞాని, మహాజ్ఞాని.
చీమయు, బ్రహ్మయు, నింద్రుడు 
నీ మనుషులు సకలములన నీశ్వరమయముల్ 
ఏమిట లేదని బ్రహ్మము 
నీమముగ చరాచరమగు నిఖిలముఁ నిండెన్!    (కం)

చీమలో, బ్రహ్మలో, యింద్రునిలో, మానవులలో అన్నింటా, అందరిలోనూ బ్రహ్మమే ఉన్నది. అని తెలియుట ప్రజ్ఞానము 

గొనుటల కది జన్మము నిది గోవిందు డిడెన్ 
మనుగడ కొరకగు కర్మలు 
గొనుటల గుణ భేదములగు గొప్పలు గలరే?     (కం)

ఈ సత్యాన్ని తెలుసుకోవడము, దానిని  ఆచరణలో చూపడం, అంటే అన్నిటినీ, అందరినీ  సమానంగా చూడడం, గౌరవించడం, ప్రేమించడం అది ప్రజ్ఞానము. అది బ్రహ్మజ్ఞానము.  దాన్ని కలిగినవాడే బ్రాహ్మణుడు.

శిక్షణల నగును విప్రుడు 
రక్షణ నగు క్షత్రియుడు నిరతి కృషిఁ ధనమున్ 
లక్షణములు వైశ్యులకగు 
సుక్షమతో సేవలనిడ శూద్రుడు యగుటన్    (కం)

విద్యా శిక్షణలకోసం, అంటే చదువుకొనడం వలన, చదువు చెప్పడం వలన, అంటే,  జ్ఞానాన్నిఆర్జించి, జ్ఞానాన్ని పంచిపెట్టడం వలన బ్రాహ్మణుడు అవుతాడు

చదువును నమ్మినవాడును 
చదువుల నమ్మక వలపుల చదివించెడు వా 
డెదనిడి శిష్యుల సుతుల ప
గిది సాకెడి వాడనఁ పొసగెడు బ్రాహ్మణుడౌ    (కం)

చదువును నమ్ముకున్నవాడు, చదువును అమ్ముకోనివాడు, ప్రేమగా చదివించేవాడు, శిష్యులను  కన్నబిడ్డలను చూసుకున్నట్లు చూసుకునేవాడు ఎవరైనా బ్రాహ్మణుడే అంటున్నాడు. 

యజనము చేయుచు నిరతము 
యజనము చేయించుచు జప యమ నియమములన్ 
రజ తమముల నణచి వెలుగు 
నిజ సత్త్వ ప్రదీప కళికనినఁ బ్రాహ్మణుడౌ    (కం)

యజ్ఞము చేస్తూ, చేయిస్తూ, జప, యమ, నియమాదులద్వారా రజో గుణాన్ని, తమోగుణాన్ని  అణిచివేసి, సత్త్వగుణ దీపమువలె వెలిగేవాడే బ్రాహ్మణుడు. లోకహితంబుకోస మగు లోకులుమెచ్చెడి కర్మ యజ్ఞమౌ,  ఆకలి, యాదినాగరిక ఆటవికంబగురీతి లేని యా 

వేకువకోసమై కదలు వేగిరపాటుల కాంక్ష యజ్ఞమౌ,
ఈ కఠినంపు యాజ్ఞికము లెవ్వడు చేసిన బ్రాహ్మణుండె పో!    (ఉ)

అసలు యజ్ఞము ఏమిటి? లోకహితంకోసము చేసేది, లోకులు మెచ్చేది ఏ పని అయినా యజ్ఞమే. ఆకలి, బలం ఉన్నవాడిదే మనుగడ అనే ఆదిమనాగరికుల అణచివేతలు లేని శుభోదయంకోసం కదిలే, కాంక్షించే, త్వరపడే క్రియ ఏదైనా యజ్ఞమే! ఈ కఠినమైన 
యజ్ఞాలు చేసేవాడు ఎవడైనా బ్రాహ్మణుడే ! 

కాసుకు కాంతకు లొంగక  
మోసము లెరుగని నగవులు మోమున వెలుగన్ 
వీసము కలతల చెదరని 
ఈసుల నెరుగని ప్రతినరు డిల బ్రాహ్మణుడౌ!    (కం)

కాసుకు, కాంతకు లొంగనివాడు, మోసపు నవ్వులు తెలియనివాడు, కలతలకు, కష్టాలకు  వీసమైనా చెదరనివాడు, అసూయలేనివాడు ఎవడైనా బ్రాహ్మణుడే!

ఉత్తమమౌ వివేకమును ఉల్లమునందున శాంతి దాంతియున్ 
చిత్తమునందునన్ సకలజీవులపైన దయానురాగముల్ 
విత్తముపై విరోధమును వేదవిశేషపు జ్ఞానబోధయున్   
సొత్తులు సత్యవాక్యునిగ శోభిలు బ్రాహ్మణ సత్యమూర్తికిన్!    (ఉ)

ఉత్తమమైన వివేకము, మనసులో శాంతి, దాంతి, చిత్తములో అన్నిజీవులపట్లా దయ, అనురాగము, డబ్బు మీద ఏవగింపు, విశేష వేద జ్ఞానము అనేవి నిజమైన బ్రాహ్మణుడికి  ఉండే సంపదలు. ఈ గుణాలు ఎవరికి ఉంటె వారె బ్రాహ్మణులూ, లేకుంటే కారు.  

శౌర్యపరాక్రమాది గుణ శాలియు సోమరి గానివాడు స
త్కార్యనిరంతరాభిరుచి దానగుణంబు దయాగుణంబులున్
ధైర్యము ఆర్తరక్షణల దండిగ దోర్బల మొంచ దుష్టులన్  
కార్యములైనవాడుననగా నెవడైనను క్షత్రియుండెపో!            (ఉ)

శౌర్యము, పరాక్రమము మొదలైన గుణాలు ఉన్నవాడు, సోమరిపోతు కానివాడు, నిరంతరమూ సత్కార్యాలు చేయాలనే అభిరుచి ఉన్నవాడు, దానగుణము,  దయాగుణము, ధైర్యము ఉన్నవాడు, కావలసిన భుజబలం ఉన్నవాడు, ఆర్త రక్షణ, దుష్ట శిక్షణచేసేవాడు ఎవరైనా క్షత్రియుడే!  

పౌరుష వాక్కుగాకెవడు పైకము విల్వను గుర్తెరింగి వ్యా 
పారపరిశ్రమంబుల నపారసమాజ పురోభివృద్ధికై 
దారులు దారులట్లుగ సదారతిఁ సంపదఁ పెంచి సంఘమున్ 
ఊరువులట్లు నిల్పుఘను డుత్తము డాతడు వైశ్యుడౌననన్     (ఉ)

పౌరుషంగా మాట్లాడనివాడు, డబ్బువిలువ తెలిసినవాడు, వ్యాపార పరిశ్రమలతో, కృషితో  విశాలమైన సమాజ పురోభివృద్ధికి దారులు వేసేవాడు, బాటల వెంట వృక్షాల్లా నీడనిచ్చేవాడు, ఎప్పుడూ కోరికతో సంపదను పెంచి మనిషికి తోదలలాగా, సంఘానికి శక్తిని యిచ్చి నిలబెట్టేవాడు  ఎవరైనా వైశ్యుడే.  

స్వేదజలంబు గంగలుగ సేవల కన్నులు చెమ్మగిల్లగా 
సోదర! నీవుగా, రుచిర శోభల పాదము సంఘ మూర్తికిన్, 
పాదము వేదమూర్తికని, పాదము నీవన, జీవనాదమా!   
లేదుర నీవులేనిది చలింపగ, లేవగ, నిల్చు శక్తియున్     (ఉ)

పవిత్రమైన గంగలాంటి తన స్వేదజలంతో తన సేవలతో కన్నులు చెమ్మగిల్లేలా చేసేవాడు, సంఘము అనే మూర్తికి, వేదమూర్తికి పాదమువంటివాడు, జీవ నాదమువంటివాడు, తను లేక  కదలడానికి, లేవడానికి, నిల్చోడానికి, నడవడానికి సంఘము అనే మూర్తికి శక్తిలేనివాడు ఆ  పవిత్ర సోదరుడు ఎవరైనా నాలుగవ వర్ణమువాడే. అంటే తనే నిజానికి అందరికన్నా  ఉత్తముడు, పూజ్యుడు!     

ఎవరు పిన్నలెవరు ఎందులో మిన్నలు 
ఎవరి కన్న లఘువు లెవరు కారు 
ఎరుక గలుగు ఘనుడు ఎగిరెగిరిపడడు 
గొప్పయగును ఒక్క గోపకుండు                      (ఆ.వె.)

అలా అని చెప్పి, ఎవరూ చిన్నా కాదు, ఎవరూ పెద్దా కాదు, ఎవరూ వేరే ఎవరికన్నా తక్కువ  కారు,ఈ సత్యాని తెలిసినవాడు వాడే గొప్పవాడు, ఆ గొప్పవాడు ఎగిరెగిరిపడడు. ఆ గోపకుడు,  ఆ ఆది పశువులకాపరి, ఆ గోవిందుడే తప్ప వేరెవరూ గొప్పవారు కారు. ఇంద్రియాలకు పశువులు  అని పేరు. ఆ ఇంద్రియాలకు శక్తినిచ్చేవాడు, తృప్తిని యిచ్చేవాడు, వాటిని సక్రమంగా  నడిపించేవాడు కనుక ఆయన పశుపలుడు, గోపాలుడు, ఆయన కన్నా గొప్పవాడు ఎవడూ  లేడు, ఆయన ఒక మహత్తర కాంతిపుంజం, మిగిలిన జీవులు అందరూ, అన్నీ ఆయన వెలుగుల  కిరణాలే, సమానమే అన్న భావాన్ని వెల్లడిస్తున్నాడు కవి.   

శ్రావణ మంగళ వారము 
పావన మరుదెంచె భవము భావమునందున్
నీవనవరతము నిలువుము 
మా వనితలఁ దయను గనుము మంగళ గౌరీ!     (కం)

యిక పవిత్రమైన శ్రావణమంగళవారం వచ్చింది. మనసులో, మహిలో నిరంతరమూ  నిలిచి మా స్త్రీలను దయగా జూడు తల్లీ అని మంగళగౌరిని ప్రార్దిస్తున్నాడు కవి.  వారు చల్లగా వుంటే అందరూ హాయిగా ఉంటారు!

మూసి వాయినంబు ముదిత తల్లికినిచ్చు 
ముద్దుపట్టికిచ్చి మురియుఁ జనని
మూడు జగము లేలు ముత్తైదువలు మెచ్చఁ 
నాతి కలలు పండు నాకమిలను                           (ఆ.వె.)

పేరంటంలో తల్లికి కుమార్తె, కుమార్తెకు తల్లి మూసి వాయినం యిచ్చుకుంటారు.  మురిసిపోతారు. ముజ్జగాలనేలే ముగ్గురమ్మలు మెచ్చి, స్త్రీల కలలు ఫలిస్తాయి.    

అంగములను పులకలెగయ
పొంగుచు పతిముఖ కమలపు పొందులగొను శ్రీ  
భ్రుంగియు సంగడిగత్తెలు   
మంగళముల సిరుల మహికి మహిళలకిచ్చున్!     (కం)

శరీరము పులకలెత్తుతుండగా తన నాధుడి ముఖకమలాన్ని మురిసి చూసే మహాలక్ష్మి, ఆమె  స్నేహితురాళ్ళు, గౌరీ, సరస్వతి ధరణికి, స్త్రీలకు సిరులను యిచ్చెదరు గాక.  

ముగ్ధగ నాథుని వలపుల   
దుగ్ధల చూపుల విరులను దూసెడి దగు శ్రీ 
దుగ్ధజలధి కొమరిత పరి   
దగ్ధము జేయును వెతలను ధన గుణఝరులన్    (కం)

తననాధుడిని ప్రేమ నిండిన చూపులవిరులతో దూసే పాలకడలి ముద్దులపట్టి, శ్రీ మహాలక్ష్మి  అందరి వెతలను దహించివేస్తుంది.   

విశ్వముఁ సురలు, సురేంద్రుడు 
శాశ్వత పదవులఁ ముదములఁ శార్ఙ్గియు నట శ్రీ  
శశ్వత్కరుణలఁ మనకును  
ఈశ్వరి శశి సుధల భగిని ఈప్సిత మొసగున్!     (కం)

ప్రపంచంలో అందరూ, దేవతలు, దేవేంద్రుడు, శ్రీహరి అందరూ ఆ చంద్రుడికి,  అమృతానికి తోబుట్టువు ఐన శ్రీమహాలక్ష్మి కరుణచే శాశ్వతమైన ఉన్నత పదవులు  పొందుతారుట. ఆమె మనకు కూడా కోరుకున్నవాటిని యిచ్చునుగాక.      
హరిని బడసి, మురిసి, మెరిసి
అరవిరిసిన అతివ కనులు ఆనందములన్
కురియును ధరణిని, నరులకు
సిరులు, చెలిమి, సుగుణ సహనశీలము కలుగున్!    (కం)
 
హరిని పొంది, మురిసి, మెరిసి, అరవిరిసిన ఆమె కనులు ధరణి మీద ఆనందపు వర్షాన్ని 
కురిపించునుగాక. సిరులు, చెలిమి, సుగుణాలు, సహనశీలము నరులకు అందరికీ 
కలుగుగాక. 

అండగ గొని వెడద యురము 
దండగ తనురుచుల నమర దండల నడుమన్ 
నిండగ కామనలు హరికి 
నండగు కమలాలయ గను నందును శుభముల్    (కం)

శ్రీహరి విశాలమైన వక్షస్థలం మీద, ఆయన దండల మధ్య దండవలె ఉండి, ఆయనకు  కూడా కోరికలను తీర్చగల ఆ కమలాలయ, శ్రీమహాలక్ష్మి మనను దయగా చూస్తుంది. శుభములు కలుగుతాయి. 

హరియురమను మేఘపటలి
నొరసిన మెరుపనఁ వెలుగుల నొప్పెడి హరిణీ
అర గనులను భవజలధిని   
దరియగ మకరాలయ వర తనయా గనవే!             (కం)

శ్రీహరి వక్షస్థలం అనే మేఘమండలి మీద మెరుపుతీగవలె మెరిసిపోయే ఆ తల్లి  అరగన్నులతో దయగా చూసి మనలను సంసార సముద్రాన్ని దాటించునుగాక.  

చెడుతలపులఁ చెడునడతల
చెడుపనులను చెడు బికారి శిశువులపై నీ
తడి కనులను కరుణఁ గురిసి
వడనుడుపుము వడిఁ నరహరి వలపులరాణీ!    (కం)

చెడు తలపులు, నడతలు, పనులు చేసి, చెడిపోయే బికారులైన నీ శిశువులమీద ప్రేమతో,  దయతో చెమ్మగిల్లిన కనులతో కరుణను వర్షించి వేడిమిని దూరంచేయి తల్లీ, శ్రీమహాలక్ష్మీ!  

యష్టుల నగు నాకము నీ 
దృష్టులఁ బడసిన నగునట తృప్తిన్ పుష్టిన్ 
ఇష్టము లిడఁ మముఁ గను పర 
మేష్టికి వెలు గటులనఁ వినమే యిది కమలా!     (కం)

యశ్తులు మొదలైనవాటివలన కలిగే ఫలితము నీ దృష్టి సోకితే చాలు, కలుగుతుందిట.  యిష్టములు లభిస్తాయిట. శ్రీహరికి కూడా అలానేనట. అలాగే నీ దృష్టిని మాపై ప్రసరించు  

తల్లీ, శ్రీమహాలక్ష్మీ! 
నీవే బ్రాహ్మివి వైష్ణవి 
వీవే శైవియు జగముల విందుల గొనుచున్
నీవే జేతువు చూతువు 
నీవే హేతువు బొలయగఁ నీకగు ప్రణతుల్     (కం)

బ్రాహ్మివి, వైష్ణవివి, శైవివి ముగ్గురివీ నీవే. సృష్టిని చేసేది, జాగ్రత్తగా చూసేది, నాశనం  చేసేది నీవే. అమ్మా, శ్రీమహాలక్ష్మీ! నీకు వందనములు.

శృతి వగుదువు శుభముల నిడ 
రతివగుదువు గుణముల నిడ రమణీయములన్ 
శత దళ కమలము నెలవగు 
హితవగు పుష్టివి ప్రథమ మహిళవే! ప్రణతుల్!     (కం)

శుభములను, గుణములను యిచ్చే శ్రుతివి, రతివి నీవే. వందరేకుల కమలములో ఉండే,  పుష్టినిచ్చే ప్రథమ మహిళవు నీవే. (యోగమార్గంలో అయితే శతదళపద్మంలో మనసులో ఉండే తల్లివి నీవే) అమ్మా, శ్రీమహాలక్ష్మీ! నీకు ప్రణామములు.   

వందనములు పద్మముఖికి 
వందనములు జలధి సుతకు వందన శతముల్ 
చందురునికి సుధకు గరువ
మొందగ చెలియలుగ వెలుగు మురరిపు సతికిన్     (కం)

పద్మమువంటి వదనము గలనీకు, జలధిసుతవైన నీకు, చంద్రునికి, అమృతానికి గర్వకారణమైన సోదరివి ఐన నీకు, మురారి సతివైన నీకు వందనములు తల్లీ! మొదలు పుట్టింటివారిని, తరువాత మొగుడిని పొగిడితే సంతోషించకుండా  ఉంటుందా? సంతోషిస్తే కోరికలను నెరవేర్చకుండా ఉంటుందా?   

సంపద, సకలేంద్రియముల
కింపుగ మోదము, విభవ మకించను లందన్
త్రెంపగ పాపపు లతలను
సొంపగు చూపులు సుతులకు సోకగ నిమ్మా!     (కం)

సంపదను, సకల యింద్రియములకు ఆనందాన్ని, వైభవాన్ని ప్రసాదించి, పాపపు లతలను  తెంచి, నీ సొంపైన చూపులను మాపై సోకేట్లు చూడమ్మా! 

కమలా!శ్రీహరి దయితా!
మముఁ దయఁ కడ గనులను గను మమ్మా! కడు న్యూ
నము బతుకులఁ ప్రథములమగు 
మముఁ గను మమ్మా సహజపు మమతల లహరీ!     (కం)

అమ్మా! శ్రీహరి పత్నీ! దయతో నీ కడగన్నులతో మమ్ము చూడు తల్లీ! అతి శూన్యమైన  బ్రతుకులలో ప్రథములమైన మమ్ము దయగా చూడమ్మా సహజమైన మమతల లహరీ,  

శ్రీమహాలక్ష్మీ! 
నీ కరుణా కలితములగు 
సోకగు చూపులు సుఖములఁ సుతులకు నిచ్చున్ 
మాకు మనసు పలుకు పనియు 
నేకతముగ నీ పదముల నిలువగ నిమ్మా!     (కం)

అలాంటి నీ చూపులు మాకు సుఖాలను యిస్తాయి కనుక, త్రికరణ శుద్ధిగా నీ పాదాలకు దాసులమయ్యేట్లు చూడమ్మా!

సరసిజమును నెలవుగ గొని 
సరసిజ మొక చేతనగొని శారద జ్యోత్స్నల్ 
బరగెడు చీరను మాలను 
ధరియించిన హరిసతి మముఁ దయగనవమ్మా!     (కం)

ఒక పద్మములో కూర్చుని, ఒక పద్మాన్ని చేత బట్టి, చంద్రుని వెన్నెల వంటి తెల్లనిచీరను, పూలమాలను ధరించిన తల్లీ, శ్రీహరిపత్నీ! మము దయతో చూడుమమ్మా!

దిగ్గజముల తుండములను 
నిగ్గుల సురగంగ పొంగ నిండిన కడవల్ 
మొగ్గఁగఁ జలకము లాటల 
సిగ్గుల మొగ్గకు ప్రణతులు శ్రీహరి సతికిన్!     (కం)

దిగ్గజములు తమ తొండాలతో సురగంగ నిండిన కలశములను ధరించి అభిషేకిస్తుండగా  జలకములాడుతున్న సిగ్గులమొగ్గ ఐన శ్రీహరి పత్నీ! నీకు వందనములు. అని కవి ఆమెను  ప్రార్ధించాడు(ఈ స్తుతి అంతా శ్రీమహాలక్ష్మిని ఉపాసించే విధానములోని రహస్యాలు.
జగద్గురువు ఆదిశంకరాచార్యుల కనకధారా స్తవానికి అనువాదాలుగా, ఆయన పాదములకు  వందనములతో కవి అందజేస్తున్నాడు) 

అరనగవుల సుధలు గురియఁ 
సిరి పలికెను సుగుణములను సిరులవి సిరులౌ
నరునకు నిటు నను గొలువగ
సిరులగు బుధజనులు బొగడు సిరి ధరఁ గలుగున్!     (కం)

తన స్తుతికి సంతోషించిన శ్రీమహాలక్ష్మి చిరునవ్వులను కురిపిస్తూ, సుగుణములను  మించిన సిరులు ఏమున్నాయి? ఇలా నన్ను స్తుతించడం వలన సిరులు, బుధులు  పొగిడే సద్గుణములు అనే సిరులు కలుగుతాయి! అన్నది.

పండును పొలముల పంటలు, 
పండును వలపులు, కడుపుల పంటలు పండన్, 
పండును సిరి కరుణఁ కలలు, 
తిండికి గుడ్డకు నిడుముల తిప్పలు తొలగున్     (కం)

మీ పొలాలు చక్కగా పండుతాయి! మీ మీ ప్రేమలు చక్కగా పండుతాయి! మీ కడుపులు చల్లగా  చక్కగా పండుతాయి! నా కరుణవలన అందరి కలలూ పండుతాయి! తిండికి, గుడ్డకు బాధలు  అనే తిప్పలు తొలిగిపోతాయి! ఒక్కమాటలో, ఏది లేనివారికి అది కలుగుతుంది!
 
తల్లులు, తల్లుల తల్లులు, 
కల్ల కపటమెరుగని మమకారపు వల్లుల్
మల్లెల చిరునవ్వుల చిరు 
తల్లులు శుభముల బడయుడు దనరుచు ధరణిన్!     (కం)

తల్లులు, వారి తల్లులు, కల్లా కపటములు తెలియని మమకారపు వల్లులైన చిన్నారి తల్లులు, అందరూ భూమి మీద సంతృప్తిగా శుభములతో వర్ధిల్లండి అని శ్రీమహాలక్ష్మి ఆశీర్వదించింది! 

శ్రీరస్తు!

సంపూర్ణం)
మరిన్ని శీర్షికలు
mana arogyam mana chetullo