Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు


..నీళ్ళు పట్టుకునేదే...ఇడిసేది లేదు...ఎవరొస్తారో రండి..!' గౌరమ్మక్క గట్టిగా అరుస్తూ...బిందెల్ని చేత్తో బలంగా నెట్టేసింది.ఇది ఎవరూ అనుకోలేదు. కొంగు బిగించి సవాల్ విసరడంతో ..అందరూ వెనక్కి తగ్గారు. ఇంక చూస్కో..ఆ పొద్దంతా ఆయమ్మ విషయమే..! అలా ఎలా మాట్లాడింది? అని కొందరు..భలే మాట్లాడిందని మరి కొందరు. ఆరోజు సుద్దులంతా ఆయమ్మ చుట్టే. కుళాయికాడ మాదే అని తెగ ఇదైపోయేవారి నోట్లో ఒక్కమాట వస్తే ఒట్టు. కమానులో రోజూ ఉదయం ఇది మామూలే.! పదమూడిళ్ళుండే కమానులో ఒక్క కుళాయే దిక్కు. ఏ అర్ధ గంటో నీళ్ళు వచ్చేవి. ఆ కొద్దిసేపూ అరుపులు..కేకలూ రచ్చ రచ్చ! కొత్తసినిమా వద్ద టికెట్ క్యూలా ఉండేది వ్యవహారం. సినిమా అని ఎందుకంటునానంటే... చుట్టుపక్కల వీధి వాళ్ళకి ఇదో ఉచిత వినోదం. నీటి సమస్య వారికి మాత్రం లేదా అంటే....సుబ్బరంగా ఉంది. కానీ మనింట్లో ఏముందో కాదు కదా, ఇరుగుపొరుగు వాళ్ళ ఇబ్బందులే బ్రేకింగ్ న్యూస్ లు!

కుళాయి వద్ద ఒక్క బిందె నీరు వంతుదాటి నింపుకున్నట్టు అనుమానం వస్తే వ్యవహారం మామూలుగా ఉండదు. ఆ నీకతలు నాకు తెలీవా..నువ్వేమన్న పైనుంచి దిగొచ్చావా...మాటలు తిన్నగా రానీ..ముందు నువ్వు సరిగా మాట్లాడు...పేలుతున్న మాటల తూటాలు...వాతావరణం భయంకరంగా ఉండేది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో తిట్టుకునేవారు. కొఓమలమ్మ, శాంతమ్మ, విశాలాక్షమ్మ, లాంటి వాళ్ళ గొంతులు గట్టిగా వినిపించినా...ఇంకొందరు చేతల్లోనే వ్యవహారం నడిపించేవారు. కమానులో ఎవరైనా కొత్తగా వస్తే ఆ ధాటికి బెదిరిపోవాల్సిందే.. అయిపోయింది...ఇంక కొట్టేసుకుంటారేమో అనుకునేంతలోపు...ఉన్నట్టుండి మాటలు ఆగిపోయేవి..కుళాయి బంద్ అయిందన్నమాట.! ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఇంకొందరు ' ఏమోనక్కా .. ఈ నీల్లకాడ సానా పజీతవుతుండాది..ఎవుర్ది వాళ్ళకే కరెక్టు..మాటాడెకి లేదు. నీళ్ళు పట్టుకునేకి ఇడిసేది లేదు. ఇంకా ఎంతకాలమో ఈ పీకులాట....' గొణుక్కుంటూ ఖాళీ బిందెలతో ఇంటికెళ్ళేవాళ్ళు.

ఇంత జరిగిందా, అయిదు నిముషాలయ్యాక వెళితే ఏముండేది కాదు. ఇక్కడేనా కుళాయి ఊడబెరికేలా కుమ్ములాడింది? అనిపించేది. వాగుకు పేద్ద వరద వచ్చి ఆగిపోయినట్లుండేది. ఒకపక్క ఇంతపెద్ద కత నడుస్తుంటే మగాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. కనీసం ' ఇంక కొట్లాడింది చాల్లే, లోపలికి రా ' అనేవారూ కాదు. ఆ ఎంతకాలం నుంచి చూడట్లేదూ ఉరుములే గానీ...వర్షం వచ్చిందీ లేదు చచ్చిందీ లేదు అన్నట్టుండేవారు.

తెల్లవారుఝామున వచ్చే నీళ్ళకోసం రాత్రే వంతులు మొదలయ్యేవి. కుళాయి ఆనుకుని ఉన్న కట్టపై ఆ క్యూ పెద్ద వరస కనిపించేది. చిన్న చిన్న సీసాలు, రాళ్ళు, కొబ్బరి చిప్పలు...ఇవన్నీ వంతుల లెక్కలే...! అయితే అసలు తతంగం ఇక్కణ్ణుంచే మొదలు. వంతులు ముందూ వెనుకా కాకుండా ...వళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాయాల్సి వచ్చేది. ప్రతి ఇంటినుంచి ఒకరు ఈ పనిపైనే ఉండేవారు. ఇంట్లో పిల్లలకే ఈ పని. ఇది అంత సులువేం కాదు. అందరూ కుంకుదీసెటపుడు లేచుండాలి. గట్టిగా మాట్లాడుకోరాదు. అర్ధరాత్రి దాటుతున్నా.. కంటిపై నిద్ర ముంచుకొస్తున్నా...కళ్ళు చికిలించి మరీ చూస్తుండాలి. ఓ రకంగా ఇది గస్తీపనే..! ఏ చిన్న అలికిడి అయినా వెంటనే లేచి కూర్చొనేవాళ్ళం. బిందె నీళ్ళకోసం ఇంత వ్యవహారమా? అనుకున్నా....అప్పట్లో మాకది చావో...రేవో.

రోజులో నాలుగైదు గంటలు నీళ్ళు మోసేపనే. నీళ్ళు తీసుకు రావటం ఒక ఎత్తయితే, అసలు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోడానికి నానా తంటాలు పడాలి. కమాను వెనకాల వీధిలో ఓ చేతి బోరు. అక్కడా వంతు కోసం నిలువు కూలే.! చేతులు పడిపోయేలా కొడితే తప్ప ఓ బిందె నిండదు. ఉదయం, మద్యాహ్నం, రాత్రి ఓ వేళంటూ లేకుండా ఎప్పుడు గచ్చు ఖాళీ అయితే అప్పుడు బిందె పట్టుకుని పరుగులు తీయడమే. దూరం ఉంటే బదులు ఇచ్చుకోవాలి. ఒకరు సగం దాకా తెస్తే..మరొకరు ఇంటిదాకా, ఎప్పుడొస్తాయో తెలియని నీళ్ళనుబట్టే కార్యక్రమాలు.. కమాను నీటి కష్టాలు బహిరంగ రహస్యం. చుట్టుపక్కల ఎక్కడ చూసినా వీళ్ళే. చంకలో బిందెతోనో...చేతిలో ఖాళీ బిందెతోనో.
' నీళ్ళు దొరికేదే కష్టం. ఇలా పోసేస్తే ఎలా? ' అంటూ నాన్న విసుక్కునేవాడు. ' తెచ్చుకునేది మేమే కదా!' ఇది అమ్మ వాదన. ఇంట్లో సగం గొడవలకి నీరే కారణం. బట్టలు ఉతకడానికి, పాత్రాలు కడగడానికి. బండ్లలకడానికి ప్రతీదీ నీళ్ళతోనే కదా,! కానీ నీళ్ళు అయిపోతుంటే బ్యాంకులో డబ్బు ఖాళీ అయినంతగా నాన్న బాధపడేవాడు. నీళ్ళువాడే తీరునుబట్టే సంసారం ఎలా వుందో చెప్పొచ్చు...' ' మిమ్మల్ని ఎడార్లో పడేయాలీ, అప్పుడుగానీ తెలిసిరాదూ నాన్న రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నా...అమ్మ మాత్రం ' ఆ...ఎప్పుడుండేదే ఈయన చాదస్తం ' అంటూ ఒక్కమాటలో కొట్టిపారేసేది. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ ఇదే గొడవ. కొన్ని ఇళ్ళల్లో నీటి పొదుపు చర్యలు చాలా గట్టిగా ఉండేవి.స్నానానికి బకెట్లో చెంబు ఎన్నిసార్లు ముంచితీస్తారో శబ్దం లెక్కెట్టి ' ఆ ఆ ఇంక చాల్చాలు..బకెట్ నీళ్ళు పోసుకోనక్కర్లేదు...' అంటూ హూంకరించేవారు.

నీళ్ళ్ వేటలో మాకు సరిహద్దులంటూ ఏవీలేవు. చుట్టు పక్కల ఎప్పుడు ఎక్కడ నీళ్ళు దొరుకుతాయో చూడకుండానే చెప్పేవాళ్ళం. కమాను ఎదుర తుంగా బసప్ప వాళ్ళిల్లు. చాలా పెద్దది. అప్పుడప్పుడు నీళ్ళువదిలేవాళ్ళు. ఎప్పుడూ మూసి ఉండే ఆ గేటు ఎప్పుడు తెరుస్తారా,,లోపల దూరుదామా అని కాచుక్కూచునేవాళ్ళం. కమాను వెనుక బెళ్ళుళ్ళి బావి. కుళాయి బంద్ అయితే అక్కడికి పరిగెత్తాలి. ఇంకాస్త దూరం వెళితే పాకిస్తాన్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంటికి పాకిస్తాన్ అనే పేరు ఎందుకొచ్చిందో మాకిప్పటికీ తెలీదు. కుళాయి వస్తోందని తెలిసిన వెంటనే అక్కడ హాజరు వేయించుకునేవాళ్ళం. మరో నాల్గడుగులు వేస్తే వెంకటనరప్ప గుడి,  అందులో బావి., కుళాయి రెండూ ఉన్నాయి. అక్కడ్నుంచీ నీళ్ళు తెచ్చేవాళ్ళం. ఇక కమాను ముందు వైపున డైమండ్ కుసుమావతమ్మ ఇల్లు. వైద్యం వాళ్ళ ఇల్లు. అది ఉదయమా, మద్యాహ్నమా, రాత్రా అని చూసేవాళ్ళం కాదు. పోనీ ఆ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో అని మొహమాటమూ ఉండేది కాదు. వెయ్యిళ్ళ పూజారుల్లా...శరణార్థుల్లా నీళ్ళకోసం ఎక్కేగుమ్మం దిగేగుమ్మంలా ఉండేది.

ఫలానా ఇంట్లో నీళ్ళు వదులుతున్నారని తెలిస్తే సరిపోదు. చాలా పైరవీలు చెయ్యాలి. కమాను వాళ్ళకు ఈ విద్య బాగా తెలుసు. అవసరం అలాంటిది మరి. కుళాయిలున్న ఇళ్ళవాళ్ళతో కలలో కూడా పోట్లాడే వాళ్ళు కాదు అప్పుడప్పుడు వారిని పలకరించడం, పేరంటాలకు వెళ్ళడం, పూజలప్పుడు  పిలవడం ఇవన్నీ సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే! కానీ ఈ వ్యవహారం చాలా సహజంగా ఉండేది. నాన్న ట్యూషన్లు చెబుతుండడంతో మాకు కొన్ని ప్రత్యేక అధికారాలు దక్కేవి. కమానుకు కాస్త దూరంలో మఠం సుబ్బి ఇంట్లో నీళ్ళు తెచ్చుకోవడానికి అందరికంటే మాకే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఆయన కొడుకు ట్యూషన్ కు వచ్చేవాడు. అయినా ఆ సమయానికి మా వెనుక మరొకరు బిందెతో వచ్చేవాళ్ళు. ఎందుకొచ్చావనిగానీ...రావద్దనిగానీ, అనేవీల్లేకపోయేది. మనసులో కారాలు మిరియాలు నూరుకుంటూ పాఇకి మాత్రం పెదాలపైకి కాసింత నవ్వు పూసుకుని ...' నువ్వూ వచ్చావా..రా..' అనాల్సివచ్చేది. ఎక్కడ నీళ్ళువస్తాయో తెలుసుకోవడంకన్నా ఎవరెవరు తేవాలి? ఇదో యుద్ధ కాండ. అమ్మ మమ్మల్ని కసిరే సందర్భాలు ఇవే. ఒక్కోసారి బతిమాలి పంపేది. చెరోవైపున వెళ్ళి నీళ్ళు పట్టుకు రావాలి. అదే అదనుగా అది తెస్తా..ఇది ఇప్పిస్తే తెస్తా అని వేపుకు తినేవాళ్ళం.

ఎండాకాలం వచ్చిందంటే ఆ రణమండల ఆంజనేయసామే దిక్కు. కుళాయి రెండుమూడ్రోజులకొకసారి వచ్చేది. నీళ్ళు నిల్వ ఉంచుకునేందుకు బ్యంకులుండేవి కావు. ఉన్నది ఒకేగచ్చు. అందరి స్నానాలయ్యే సరికి సగం ఖాళీ. సలవులని చుట్టాలొస్తే గుండె లబలబలాడేది. దొరికే నీళ్ళు అంతే, జనాలెక్కువ. ! మామూలు కష్టం కాదులే! బళ్ళారి నుంచి అక్క వస్తే చిన్నాయన ఇంటికెళ్ళి స్నానాలు చేయాల్సి వచ్చేది. అందుకే నాన్న ' బంగారం ఇవ్వొచ్చు గానీ..బిందెడు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టం ' అనేవాడు. దీనికితోడు మడుగు నీళ్ళు. మడుగు స్నానాలు..దేవుడా కష్టాలన్నీ మాకేనా అనేట్టుండేది. పోనీ మడుగు స్నానాలు వదులుకుంటారా అనడిగారనుకోండి, ప్రాణాలు వదులుకుంటారా అన్నట్టు వినిపించేది. శివరాత్రి వెంకటనరసప్ప గుళ్ళో వెయ్యి కుండల అభిషేకం.లక్ష్మమ్మ జాతరలో రథం వచ్చిందంటే రోడ్డుపై నీళ్ళుపోయడం...కమాను ఆడవాళ్ళకు ఇవేవీ వదులుకునే పనులు కావు. కావాలంటే మరో రెండుగంటలు ఎక్కువ శ్రమించి...మరో రెండిళ్ళ గుమ్మాలు ఎక్కి దిగేవాళ్ళు.

కమాను ఆడవాళ్ళూ తేనెటీగల్లాంటివారే! వళ్ళు హూనం అయ్యేలా ఇంతింత లావు బిందెల్లో నీళ్ళు మోశారు.కనిపించిన ప్రతి ఇళ్ళకూ వెళ్ళారు. కొత్తవాళ్ళతో పరిచయాలు పెంచుకున్నారు. పాత వాళ్ళ బంధాలు తెగకుండా కాపాడుకున్నారు. అంత శ్రమలోనూ కాసింత సంతోషం ఒంపుకున్నారు. ఇదంతా గతం. ఇప్పుడు కమానులో ఆ కష్టాల్లేవు. ఇంటింటికి కుళాయిలు వచ్చేశాయి. బైట బిందె సందళ్ళు లేవు. గట్టిగా కేకలేసుకునేవారూ లేరు. ఆ హడావుడి అంతా వీధిలోంచి మాయమైపోయింది. నాకుమాత్రం ఇప్పటికీ కుళాయివద్ద వంతులు కాచినట్టే ఉంది. విసుర్లు, తిట్లు, చెవుల్లో గింగిర్లు కొడుతూ గిలిగింతలు పెడుతున్నట్టే ఉంది. కష్టాలనుభవించిన ఆ మొహాల చాటున నవ్వుల వెలుగులేవో పలకరిస్తున్నట్టే వుంది. యాభై ఏళ్ళు దొర్లిపోయాయి. ఆ జ్ఞాపకాలు మాత్రం ఇంకా పచ్చగా మెరుస్తూనే ఉన్నాయి!!

మరిన్ని కథలు
sukhamudrika