Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..http://www.gotelugu.com/issue176/504/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

దైవ దర్శనం గావించి గుట్ట దిగుతున్న అతివలు దారిలో నిలిచి పోయి మరీ ధనుంజయుని రూపు రేఖా విలాసాలను తనివి తీరా చూస్తున్నారు.

అవేమీ పట్టించు కోకుండా`

క్రమంగా గుట్ట పైకి చేరుకుని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారంతా. ఎదురుగా ఏనాటిదో పదహారు స్తంభాలతో కూడిన విశాలమైన రాతి సభా మండపం వుంది. దాని శిల్ప సంపద అపురూపంగా వుంది. దాన్ని దాట గానే ఎత్తయిన ధ్వజ స్తంభము దాని ముందు గర్భ గుడి లోని శివుని చూస్తూ అర మోడ్పు కనులతో ధ్యానిస్తూ కూచున్నట్టు నందీశ్వరుని అద్భుతమైన రాతి విగ్రహం వుంది. అక్కడి నుండే ఆలయ ప్రవేశ ద్వారం వుంది. చాలా పెద్ద ద్వారం. బయటి నుండే స్త్రీలకు రెండు వరుసలు, పురుషులకు రెండు వరుసలుగా ఏర్పరచి దర్శనానికి పంపించుటలో భక్తులు త్వరగా శివ దర్శనం గావించుకొని బయటకు రాగలుగుతున్నారు.

పురుషుల వరుసలో ధనుంజయుడు, స్త్రీ వరుసలో భద్రా దేవి, ఉలూచీశ్వరిలు నిలుచుని వరుసలో ముందుకు సాగుతున్నారు. అలా ఆ ముగ్గురూ స్త్రీ, పురుషులంటూ విడి పోవటమే అతి పెద్ద ప్రమాదానికి దారి తీసింది. వాళ్ళు క్రమంగా గర్భాలయ సమీపం లోకి వచ్చేసారు. అద్భుతమైన శివ లింగం కను విందు చేస్తోంది. పూజలు, అర్చనలు నిర్వహిస్తూ అర్చక స్వాములు క్షణం తీరిక లేకుండా వున్నారు. శివ నామ స్మరణతో గర్భాలయం పులకిస్తోంది. ఆ సమయంలో`

ఎవరో తన భుజం తట్టి పిలిచినట్టయింది యువ రాజు ధనుంజయుడికి. తిరిగి చూస్తే తన వెనక ఒక పొట్టి వాడు కన్పించాడు. తల మీద శంఖం బోర్లించినట్టు ఒక కొమ్ము వుంది వాడికి. వాడు ఇంతకు ముందు తన వెనక లేడు. ఎందుకు పిలిచాడో తెలీదు. కాని వాడికి పక్కనే పరిచయమున్న పొడుగు వాడ్ని చూసి ఉలికి పడ్డాడు. వంకర పళ్ళతో నవ్వుతున్నాడు వాడు. వాడు వక్ర దంతుడు. ఏదో జరగబోతోందని గ్రహించి జాగ్రత్త పడే లోపే మాయ శృంగుడనే పొట్టి వాడు ధనుంజయుని ముఖం మీద చేతిని ఆడించాడు. అంతే` ఉన్నట్టుండి తెలివి తప్పాడు ధనుంజయుడు.

అతడు కింద పడే లోపే లాగి భుజం మీద వేసుకుని ధనుంజయునితో సహా అదృశ్యమయ్యాడు వక్ర దంతుడు. వాడితో బాటే ఎటు పోయాడో కన్పించ కుండా పోయాడు మాయా శృంగుడు.

ఎప్పుడైతే అక్కడ అంతా చూస్తుండగానే ధనుంజయుడు అదృశ్యమయ్యాడో మరుక్షణం అలజడి చెల రేగిందక్కడ. అప్పటికి స్త్రీ వరుసలో కొంత దూరం ముందున్న భద్రా దేవి, ఉలూచీశ్వరిలు అలజడి విని తిరిగి చూసారు. పురుషుల వరుసలో ధనుంజయుడు వారికి కన్పించ లేదు. అదృశ్యమైంది తమ ప్రాణ వల్లభుడు ధనుంజయుడని తెలిసి నిశ్చేష్టులై అలాగే నిల బడి పోయారు.

*******************************************

వక్ర దంతుని ఆనందానికి అవధి లేదు.

స్పృహ లేని ధనుంజయుని తీసుకుని అధో లోకాలు ఒకటొకటే దాటు కొంటూ అనేక గుహా మార్గాలు బిల మార్గాలననుసరించి రివ్వున సాగి పోతున్నాడు.

ఒడుపుగా ధనుంజయుడు తనకు చిక్కటం కోతికి కొబ్బరి కాయ దొరికిన చందంగా వుంది వాడికి` ‘‘నరాధమా.. నీఛ మానవా... మా నాగ జాతి తోనే పంతములా నీకు? ఈ జన్మలో నీవు తిరిగి భూ లోకము జూడ జాలవు. ఆనతి లేదు గాని లేకున్న నిన్నిచటనే కడ తేర్చెద’’ అంటూ కోపము తీరా దారిలో ధనుంజయుని శరీరాన్ని రాతి గోడకు గుద్దు తున్నాడు. వాడు అలా చేయటమే మంచిదయింది. కొద్ది కొద్దిగా ధనుంజయునికి స్పృహ రానారంభించింది.

మూడు దినముల క్రితమే అంగ రాజ్యం మీదుగా వక్ర దంతుడి బృందం అశ్వ శకటంలో శివ నాగ పురం చేరుకుంది.  అక్కడ ప్రసిద్ధమైన బాల శివ నాగ దేవునికి మూడు నాళ్ళు తిరునాళ్ళు ఆరంభమైంది. ఇవాళో రేపో ధనుంజయ బృందం అక్కడికి చేరుకొంటుందని శివ దర్శనార్థం ఆగుతుందనే నమ్మకంతో తమ మనుషులతో కాపు వేసాడు. అది చక్కగా ఫలించింది. ఆఖరి రోజైన మూడో దినము ధనుంజయ బృందం అక్కడికి వచ్చి ఆగింది. వాళ్ళకి ఏ మాత్రం చివరి క్షణం వరకు సందేహం కలక్కుండా జాగ్రత్త పడి కార్యం సాధించాడు. తన అదృష్టం బాగుండి భద్రా దేవి చూడ లేదు గాని చూస్తే గుడి లోనే తనను భస్మం చేసి ఉండేది. భద్రా దేవి స్త్రీ వరుసలో లేకుండా ధనుంజయుడి ప్రక్కనే వున్నా తన పని నెర వేరేది కాదు.

ఇప్పుడా యువతుల ముఖాలు చూడాలి. ప్రియ సఖుని కోసం బోరున విపిస్తుంటారు. ఆహా! విజయం తనదే. ధనుంజయుని అడ్డంకి తొలగటంతో ఇక యువ రాణి ఉలూచీశ్వరి తనదే. నాగ రాజు అల్లుడు తను. భవిష్యత్తులో కాబోవు నాగ లోక ప్రభువు తను. ఇక తనకు ఎదురు లేదు. ఈ ఆలోచనే వక్ర దంతునికి మహదానందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

భూ లోకం వదల గానే అదృశ్య రూపం వదలటం వన ఇప్పుడు ఇరువురూ యధా రూపంలోనే వున్నారు. కాని చిక్కటి కాటుక లాంటి చీకటిలో తన సర్ప దృష్టితో వక్ రదంతుడు చూడ గలడు గాని ధనుంజయుడు చూడ లేడు. ఆ పైన దారిలో రాతి బండకు గుద్ద బడిన గాయాల బాధలో ధనుంజయునికి కొద్ది కొద్దిగా స్పృహ వస్తోంది. ఎవరో తనను భుజం మీద వేసుకుని చీకటి మార్గంలో ఎచటికో మోసుకు పోతున్నారు.

కన్ను తెరిస్తే చిమ్మ చీకటి.

తలంతా దిమ్ముగా వుంది.

కాసేపు ఏం జరిగిందీ ఏదీ`

గుర్తు లేకుండా పోయింది.

క్రమంగా గుడిలో సంఘటనలు ఒకటొకటిగా గుర్తు రా సాగాయి. ఇది వక్ర దంతుని అకృత్యమని అర్థం కాగానే ధనుంజయుని రక్తం సలసల మరగ నారంభించింది. ఈ దుష్టుడు తనను ఎచటకు తీసుకు పోతున్నాడో తెలీదు. అచట తన ప్రియ భామలిరువురూ తనను గానక ఎంతగా రోదిస్తున్నారో గదా.

ఇదే క్షణంలో ఒక విషయం గుర్తొచ్చి ధనుంజయుని మేని జలధరించింది. అదేమంటే, కొద్ది రోజుల క్రిందట తను ఒక భయంకరమైన కలగన్నాడు. సర్పాలు... అనేక కౄర సర్పాలు తనను వెంట బడి తరమటం కలలో చూసాడు. వాటి నుంచి తప్పించు కోడానికి తను పరుగెత్తి పరుగెత్తి ఒక బిల మార్గంలో పడి పోయాడు. ఆ బిల మార్గం వెంట ఎక్కడికో జారి పోయి ఒక మరు భూమిలో పడి రోధించాడు. నాటి ఆ స్వప్నం నేడు యధార్థం కాబోతోందా. నాడు కరుణతో ఈ వక్ర దంతుని క్షమించి విడిచి ఎంత తప్పయినదో ఇప్పుడు గదా అర్థమవుతోంది.
ధనుంజయుని ఆలోచనలు ఒక కొలిక్కి రాక ముందే భూమి పొరల్లో... చాలా లోతుల్లో ఎక్కడో ఒక బిల ముఖ ద్వారం వద్ద ఆగాడు వక్ర దంతుడు.

దిగువ ఎక్కడి నుండో నెల వంక వెన్నె వంటి మసక వెలుగు ఆ బిల మార్గంగా పైకి వ్యాపిస్తోంది. ఏట వాలుగా దిగువకు పోతోంది ఆ మార్గం.
భుజం మీది ధనుంజయుడు కదలటం గమనించి వికటాట్టహాసం చేసాడు వక్ర దంతుడు. ‘‘ఓరి మూర్ఖ మానవా. పొమ్మురా. నీ కొరకు మరు భూమి ఎదురు చూచుచున్నది. ఇదియే నీకు నా వీడ్కోలు. ఇక ఇచటనే నీవు కృశించి కృశించి నశించి పొమ్ము. యువ రాణి ఉలూచీశ్వరి నాది. హహహ’’ అంటూ ధనుంజయుని గిర గిరా తిప్పి బిల మార్గం లోకి విసిరేసాడు. ఎదిరించ టానికో ప్రతిఘటించేందుకో అవకాశమే లేక పోయింది ధనుంజయునికి.

గింగిరాలు తిరుగుతూ పోయి దబ్బున బిల మార్గంలో పడిన ధనుంజయుని శరీరం ఏటవాలుగా దిగవకు జారి పో సాగింది. పై నుంచి వక్ర దంతుని వికటాట్టహాసం చాలా దూరం వరకు ధనుంజయునికి విన్పిస్తూనే వుంది.

***********************************

ప్రొద్దు పడమట అస్తమిస్తోంది.

ఉత్తర దిక్కు నుండి`

నల్లటి మబ్బులు క్రమ్ముకొస్తున్నాయి.

ఇటు తూర్పు దిశగా ముసురు కొస్తున్నాయి చిమ్మ చీకట్లు.

ఇప్పుడు ఆ చిట్టడివిలో ఎక్కడా జన సంచారం లేదు. అశ్వాలను కట్టిన అదే శాలి వృక్షం క్రింద పుట్టెడు దుఖ్ఖంతో దిగాలు పడి కూచునున్నారు అతివలు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు.మధ్యాహ్నం గుడి లోనే ధనుంజయుడు అదృశ్యం గావటంతో ఏం చేయాలో తోచ లేదు వారికి.

‘‘అక్కా! మన ప్రభువుని తన సన్నిధి లోనే మాయం జేస్తుంటే మౌనముగా వేడుక జూచిన ఆ శివ స్వామి ని మనం దర్శనం చేయ రాదు. పదక్కా వెడలి పోవుదము’’ అంది కన్నీళ్ళతో ఉలూచీశ్వరి.

‘‘లేదు లేదు. మనము అంతగా వారించినా కూడ వినుకోకుండా తన దర్శనాని కొచ్చిన మన స్వామిని అదృశ్యం జేయు చుండగా ఆ శివ స్వామి ఏమి చేస్తున్నటు? మనకి సమాధానము కావలె. అంత దనుక మనం వేచి వుండాలె. పద. ధనుంజయుని క్షేమం కోరి ఆయన పేర మనమే అర్చన చేయించెదము’’ అంటూ కర్తవ్యం బోధించింది భద్రా దేవి.

అదే విధంగా లోనికి పోయి అర్చన చేయించి కాపాడమని కన్నీళ్ళతో వేడు కొని బయటి కొచ్చి అక్కడే రాతి మండపంలో కూచున్నారు.
పొద్దు పడమర వాలే వేళకి భక్త జనం తగ్గి పో నారంభించారు. అప్పటి గ్గాని అది స్వామి తిరు నాళ్ళు మూడవది ఆఖరి దినమని అతివలిరువురికీ తెలీ లేదు. అర్చక స్వాములు శివ దర్శనం నిలిపి వేసారు. ఆలయాన్ని శుద్ధి చేసే పనిలో అందర్నీ గుట్ట దిగువకు వెళ్ళి పొమ్మంటున్నారు. రాత్రిళ్ళు గుట్ట పైన ఎవరినీ ఉండ నీయరట. ఆలయాన్ని తిరిగి అమావాస్య  వెళ్ళిన శుద్ధ విదియ నాడు మాత్రమే తెరుస్తారు. కనీసం అక్కడ ఉండేందు క్కూడ వీలు లేదు. ఏమి చేయాలో పాలు పోక దుఖ్ఖాన్ని దిగ మ్రింగుతూ గుట్ట దిగి వచ్చేసారు.
అప్పటికే చిట్టడవిలో జన సంచారం పల్చ బడింది. మూడు దినాలుగా అమ్మకాలు సాగించిన పూలు, పండ్ల వ్యాపారులు, తిను బండారాలు, ఆట బొమ్మలు, గృహోప కరణాలు ఒక్కటేమిటి, వ్యాపారులంతా అంగళ్ళు తీసేసి వృషభ శకటాలకు ఎక్కించి వెళ్ళి పోతున్నారు.
నేరుగా తమ అశ్వాలను బంధించిన శాలి వృక్షం వద్దకొచ్చారు. అశ్వాలను తమ వస్తువుల్ని భద్రంగా చూసినందుకు రెండు వరహాలు అదనంగా యిస్తానని అంగడి వానికి మాట యిచ్చాడు ధనుంజయుడు. అప్పుడే బయలుదేరుతున్న అంగడి వృద్ధుడ్ని పిలిచి రెండు వరహాలు యిచ్చి పంపించింది భద్రా దేవి.

ధనుంజయుడి అశ్వం గరుడ తన యజమాని కన బడక దిక్కులు చూస్తోంది. భూతం ఘృతాచికి ఏం జరిగిందీ అర్థం గాక ఈసారి పిలవ కుండానే దగ్గర కొచ్చింది. భద్రా దేవి జరిగింది క్లుప్తంగా చెప్పి` ‘‘ఘృతాచి! చాలా కష్టాల్లో వున్నాము. నాగ దండు ఎంత మంది వచ్చారో తెలీదు గాని ఈ పరిసరములందే ఎచటనో మరుగున ఉండెదరు. పొమ్ము. వారి జాడు తెలుసుకొని రమ్ము’’ అంది.

‘‘నుడిలో పోయి వచ్చెద తల్లీ. మీకింత ఘాతుకము సల్పిన ఆ నీచుల వదల’’ అంటూ అదృశ్యమైంది ఘృతాచి.

అశ్వాల ప్రక్కనే నేల మీద కూచున్నారు.

దుఖ్ఖం పొంగుకొస్తోంది.

ఉలూచీశ్వరి అయితే భద్రా దేవి ఒడిలో తల పెట్టుకుని చిన్నగా రోదిస్తోంది. తన పరిస్థితీ అదే కాదంటే తనిప్పుడు ఒంటరి కాదు. ఉలూచీశ్వరి బాధ్యత తన మీద వుంది. కష్టాలు కన్నీళ్ళు తనకు కొత్త కాదు. భీమా నది తన జననీ జనకుల్ని మింగేసినపుడు దుఖ్ఖించింది. మళ్ళీ ఇప్పుడు దుఖ్ఖిస్తోంది. తన పరిస్థితి వేరు. కాని ఉలూచీశ్వరి అలా కాదు. నాగ లోక యువ రాణి. వలచిన ప్రియుని కోసం తన రాజ భోగాలు సుఖాలు వదులుకొని వచ్చి తమ వెంట ఉండి తమ కష్టాలు తనూ అనుభవిస్తోంది. ఇప్పుడీ విపత్కర పరిస్థితిలో తనూ రోదిస్తే కష్టాలు తీర్చే వారు లేక పోగా శతృవు కు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అవతల నాగ లోకం నుంచి దుండగులు ఎంత మంది వచ్చారో తెలీదు. ఎచట మకాం వేసి మాటు వేసి గమనిస్తున్నారో తెలీదు. ఇప్పటికే ధనుంజయుని తమకు దూరం చేసారు. ఇప్పుడు ఉలూచిని కూడ తనకు దూరం చేసే ప్రయత్నంలో వుంటారు. వారి ప్రయత్నాల్ని తిప్పి కొట్టి ప్రతీ కారం తీర్చు కోవాలి. ముఖ్యంగా ఆ వంకర పళ్ళ వెధవ వక్ర దంతుని పని పట్టాలి. గుండె రాయి చేసుకుని ఈ కష్టాన్ని అధిగమించాలి. కన్నీళ్ళు తుడుచుకుని ఉలూచీశ్వరి జుత్తు నిమిరింది. లేపి కన్నీళ్ళు తుడిచింది.

‘‘ఛఛ! ఏమి ఈ బేల తనము సోదరీ. కన్నీరు మన కష్టాలు తీర్చదు. అసలు మనకు కన్నీరు రాకూడదు’’ అంది.

‘‘అక్కా...’’ అంటూ బేలగా చూసింది ఉలూచీశ్వరి.

‘‘అవును. మనము ఎవరము? మరచితివా? మహా వీరుడు ధనుంజయుని ప్రియ సఖియలము. ఆయన ధైర్య సాహసములు సగమైనను మనకు ఉండ వలదా? మన ప్రభువుకి ఏమీ కాదు. ఇవాళ గాకున్న రేపు క్షేమముగా వచ్చి చేరెదరు. దానికి ముందు మనము చేయ వలసిన పనులు చాలానే వున్నవి. మనకు ఎడబాటు కల్పించి ఇంతోటి కష్టమున కెర జేసిన శత్రువు మీద పగ ప్రతీకారము కోపం లేవా? పగ సాధించాలి. దెబ్బకు దెబ్బ తీయాలి....’’‘‘కాని అక్కా....!’’

‘‘ఇంకేమియును జెప్పకు. నాకు దివ్య దృష్టి, జ్ఞాన దృష్టి ఇలాంటివి లేవు. మీ నాగ శక్తితో ఆ దృష్టి నీకున్నది ఆ ధూర్తుడు వక్ర దంతుడు మన ప్రాణ వల్లభుని ఎటకు గొని పోయినాడో అవలోకించి చెప్పుము’’ అంది.

‘‘మనము గుట్ట పైన గుడి మండపమందున్నప్పుడే ఆ పని జేసితి. మన సఖుడు భూలోకమున లేరు’’ అంది ఉలూచీశ్వరి.

‘‘లేరా....’’

‘‘అవును. లేరు’’

‘‘మరో లోకమునకు గోని పోయి వుండునా?’’

‘‘కాని... భూ లోకము తక్క ఇతర లోకము గాలించు మహా దృష్టి నాకు లేదక్కా.’’

‘‘సరి. ఇపుడు ఇంకో పరి అవలోకించుము. మన వల్లలభుని జాడ తెలియకున్న ఆ నీఛుడు వక్ర దంతుని జాడయిన అరయుము.’’

‘‘సరి...’’

వెంటనే బాసిం పట్టు వేసి కూచుని`

అర్థ నిమీలిత నేత్రాలతో`

జ్ఞాన దృష్టి లోకి వెళ్ళి పోయింది ఉలూచీశ్వరి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bhandham