Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue176/503/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

రాత్రి చీకటయ్యాక మొదలైంది అగ్నిపరీక్ష! బాబిగాడికి  సీసాతో పాలు పడుతూంటే దాన్ని తోసేస్తూ తల్లికోసం వెదుక్కుంటూ ఏడవసాగాడు. వేణుకు ఏం చేయాలో తెలియలేదు.
సుగుణమ్మ కూడా తల్లడిల్లిపోయింది... వాడిని భుజాన వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ, లాలిస్తూ ఎలాగో గోరువెచ్చగా కాసిని పాలు పట్టింది... తల్లికోసం ఏడుస్తూనే నిద్రలోకి జారాడు బాబి.
వాడిని ఉయ్యాలలో వేసి, కొడుకు దగ్గరకు వచ్చింది సుగుణమ్మ.
“వేణూ... పాపం మూటగట్టుకోకురా... రేపు వీడిని తీసుకువెళ్ళి మధుకు ఇచ్చేసి రా...” అంది అనునయంగా.
అయిష్టంగా తల తిప్పుకున్నాడు వేణు.
“ఆవిడే పరుగు పరుగున వస్తుంది లేమ్మా... ఇప్పటికే రెండు నెలలుగా పంతం పట్టి, మన దగ్గరకి రాకుండా ఆవిడగారి స్నేహితురాలి దగ్గర ఉంటోంది కదా... ఇప్పుడు పిల్లాడి కోసం వస్తుందిలే...” నిర్లక్ష్యంగా అన్నాడు.
“ఎప్పటికి మారతార్రా మీరు? ఎందుకిలా నన్ను శిక్షిస్తున్నారు? పసివాడిని చూసుకోవటం చాలా కష్టం నాయనా... అది కన్నతల్లికి తప్ప సాధ్యం కాదు...”
“అయితే నువ్వు చూసుకోలేనంటావా? ఆయాను పెడతానులే...” తేలికగా అన్నాడు వేణు.
నెత్తి కొట్టుకుంది సుగుణమ్మ.
***
“ఏమిటి సిస్టర్, అదోలా ఉన్నారు?” సర్వం పోగొట్టుకున్న దీనురాలిలా ఉన్న మధుబాలను పరికిస్తూ అడిగాడు స్వరూప్.
సమాధానం చెప్పబోయింది మధుబాల... ఈలోగా అటు వచ్చిన కన్నన్ వీళ్ళను వంకరగా  చూస్తూ, “చెప్పేవి శ్రీరంగనీతులు... చేసేవి తప్పుడు పనులూ...” అన్నాడు జనాంతికంగా...
“మిస్టర్ కన్నన్, వాటార్యూ టాకింగ్?” తీవ్రమైన కంఠస్వరంతో అన్నది మధుబాల.
వంకరగా నవ్వుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు కన్నన్.
“సారీ సిస్టర్... కన్నన్ మీ మీద దురుద్దేశ్యంతో ఉన్నాడు... నిన్ననే వాడి కుటిలపు ఆలోచనలన్నీ తెలిసాయి... మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది... వీలుంటే మీరు మీ భర్త దగ్గరకు వెళ్ళిపొండి...అదే మంచిది...” కన్సర్న్ గా అన్నాడు స్వరూప్.
“నా భర్తా? స్వంత కొడుకును కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయినవాడు, నాకు అనుక్షణము రంపపు కోతను కలిగించిన వాడూ నా భర్త... అటువంటి మనిషి దగ్గరకు ఎలా వెళ్ళమంటారు స్వరూప్?” నిర్వేదంగా అన్నది మధుబాల.
“సిస్టర్, ప్రతి మనిషీ తప్పులు చేస్తాడు... అవి తెలుసుకునే క్షణం రాక మానదు... ఇప్పుడు బాబును అతను తీసుకువెళ్ళారా?”
“అవును స్వరూప్ గారూ... ఊయల కేర్ సెంటర్ నుంచి నిన్న తీసుకువెళ్ళాడు... ఇప్పుడు నేను వెళ్ళి అడుక్కుంటే, తనకి ఇష్టమైతే ఇస్తాడు... లేకపోతే బాబు కోసం నాకు ఇష్టం లేకపోయినా అక్కడ ఉండాలి... అదే అతని వ్యూహం...”
“మరి...మీరు ఇప్పుడు ఏం చేయదలచుకున్నారు?”
“పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని...”
“అయ్యో... అదేమిటి సిస్టర్? అలా చేయకండి... మీ అత్తగారు, మామగారు... వారి పరువు ప్రతిష్టలు ఏం కావాలి? వారి గురించి ఆలోచించండి...”
“న్యాయం నా వైపు ఉన్నదనీ, నేను గెలుస్తాననీ తెలిసినా నేను న్యాయస్థానానికి వెళ్ళకూడదు... వాళ్ళ పరువు కాపాడాలి... భగవంతుడా, ఎలాంటి సమాజంలో సృష్టించావు నన్ను ఒక స్త్రీగా, దగా పడిన భార్యగా, అసహాయురాలైన తల్లిగా...” ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని మునిపంట పెదవి నొక్కి ఆపుకుంది మధుబాల.
“అయ్యో, బాధపడకండి సిస్టర్... ఈరోజు సాయంత్రం వెళ్ళి బాబును చూసి రండి... బాబును మీకు దూరం చేయరని అనుకుంటున్నా...”
“సరే స్వరూప్ గారూ...” తల పంకించి  పనిలో పడింది మధుబాల.
***
ఉదయమే ఊరినుంచి వచ్చింది సుచిత్ర. బాబును చూసి ఎంతగానో మురిసిపోయింది. పది గంటలకల్లా వచ్చేసిన వినత కూడా బాబిని చూసి సంబరంగా గంతులు వేసింది... తమ నాన్నగారి పోలికలతో బాబి కనిపించటమే అందుకు కారణం.
వాడిని ఎత్తుకుంటూ, ఆడిస్తూ, పాలు పడుతూ, జోల పాడుతూ, ఊయల ఊపుతూ ఎంతో ఆనందాన్ని అనుభవించారు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ... వేణూ సరే సరి...
“అయితే అన్నయ్యా, మధుబాల ఇక రానందా?” ఆరా తీసింది వినత.
“ఎవరికి  తెలుసు? ఇక్కడికి రావటం ఇష్టం లేకనే కదా తన ఫ్రెండ్ ఇంట్లో చేరింది? మధ్యలో నేను, అమ్మా ఫోన్ చేసినా తీయలేదు... ఇప్పుడు వస్తుందిలే... పిల్లాడి కోసం...” ఘనకార్యం చేసినవాడిలా నవ్వాడు వేణు.
“వేణూ... నీకు డబ్బుకేం తక్కువరా? వాళ్ళ అన్నయ్య తీసుకున్న డబ్బుకోసం అంత గొడవ ఎందుకు చేసావు? అసలు అయిన వాళ్ళ మధ్య అప్పులేమిట్రా? పాపం మధూ ఎంత బాధ పడి ఉంటుందో... అందుకే దాని మనసు విరిగిపోయి ఉంటుంది...” అంది సుచిత్ర తమ్ముడితో...
“అక్కయ్యా... నీకు తెలియదా, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే... బావ బావే, అప్పు అప్పే... అప్పు తీర్చమన్నంత మాత్రాన నన్ను ద్వేషించేయనక్కరలేదు నీ మరదలు... అయినా గట్టిగా అడిగేసరికి మర్నాడే నాకు డబ్బు పంపేశాడు మా బావమరిది... అతని దగ్గర లేకపోతే కదా... కాకపోతే మధు మద్దతు తీసుకుని, డబ్బు లేదంటూ  ఎగవేయటానికి ప్రయత్నించాడు...”
“మనకేం తెలుసు, ఎక్కడ అప్పు తీసుకువచ్చి కట్టారో? మీ ఇద్దరూ ఒకేలా తయారయ్యారు...” మార్చి మార్చి తమ్ముడినీ, చెల్లెలినీ చూస్తూ బాధగా అంది సుచిత్ర.
“అలా గడ్డి పెట్టవే పెద్దపాపా, నీ తమ్ముడికి, చెల్లెలికీ... కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు... అసలు వీడికి అనవసరంగా పెళ్లి చేసాం... అలా బ్రహ్మచారిగా వదిలేసి ఉంటే, ఈరోజు ఈ బాధలు ఉండేవి కావు...” కోపంగా అన్నది సుగుణమ్మ.
“అమ్మా, నువ్వు పిచ్చి దానివి... నాన్నగారిని మనకి దూరం చేసింది మధుబాలే... ఆ విషయం నువ్వు మరచిపోతున్నావు...” అంది వినత.
“కానీ నాన్న ఆరోగ్యం దిగజారిపోవటానికి, అపరాధభావనతో ఆయన కృశించి పోవటానికి కారణం నీ వికృత చేష్టలే అన్న సంగతి మాత్రం నీవు మర్చిపోతున్నావు వినతా...” కోపంగా అంది సుగుణమ్మ.
“అసలు నువ్వు కన్న తల్లివేనా?” తల్లి మీద విస్ఫులింగాలు కురిపిస్తూ అన్నది వినత.
“దురదృష్టవశాత్తూ అవునమ్మా... నిన్ను కన్న పాపిష్టి తల్లిని నేనే...” కళ్ళు వత్తుకుంది సుగుణమ్మ.
“అబ్బా, నీ చాదస్తం ఏమిటమ్మా? అయిన వాళ్లకి ఆకుల్లోనూ, కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డిస్తావు! వినత నీ ముద్దుల కూతురు... ఎప్పుడూ దాన్ని తప్పు పడతావేమిటి?” గుడ్డిగా చెల్లెలిని వెనకేసుకు వస్తున్న వేణును చూసి ముఖముఖాలు చూసుకున్నారు సుచిత్ర, సుగుణమ్మ...
***
ఆ సాయంత్రం తడబడే అడుగులతో ఆ  ఇంట్లోకి వచ్చింది మధుబాల.
“ఓ... మధుబాల గారా? చాలా రోజులకి గుర్తు వచ్చినట్టుంది మా ఇల్లు!” వ్యంగ్యంగా అన్నాడు వేణు.
“వేణూ, ప్లీజ్... బాబును ఇవ్వండి...” తగ్గు స్వరంతో తనలోని ఆవేశాన్ని నియంత్రించుకొంటూ అన్నది మధుబాల.
“బాబు నీకే కాదు, నాకూ కొడుకే... వాడిని నాకు దూరంగా పెంచటానికి నేను ఒప్పుకోను... నువ్వు ఇక్కడికి వచ్చేయాలి...” శాసిస్తున్నట్టుగా అన్నాడు వేణు.
“నేనంటే ఇష్టం లేని నీకు, నా కొడుకు ఎలా ఇష్టమయ్యాడు?” కసిగా ప్రశ్నించింది.
“నువ్వంటే కాదు... నీ పద్ధతులంటే నాకు ఇష్టం ఉండదు... నీ ఇష్టం వచ్చినట్టు డబ్బును అందరికీ పంచటం ఇష్టం ఉండదు... నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పిచ్చి స్నేహాలు నాకిష్టం ఉండదు...”
“నాక్కూడా... మీలోని ధనదాహం అంటే ఇష్టం ఉండదు... అయిన వాళ్ళను డబ్బుకోసం అవమానించటం ఇష్టం ఉండదు... స్నేహంలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోకపోగా, దురదృష్టవంతులను అర్థం చేసుకునే మనసు నీలో  లేకపోవటం నాకు ఇష్టం ఉండదు...”
“అయితే ఇప్పుడు ఏమంటావు?”
“మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు తీసుకుందాం... స్వంత ఆలోచనలన్నవి లేకుండా మీకు లోబడి ఉండే ఒక అనుకూలవతిని చేసుకుని సుఖపడండి...”
“ఏం, నువ్వు కూడా ఎవరినైనా చూసుకున్నావా? అంత తేలికగా నన్ను వదిలేయటానికి సిద్ధ పడుతున్నావు?” వెటకారంగా అన్నాడు వేణు.
బాణం దెబ్బ తిన్న లేడిలా విలవిలలాడింది మధుబాల.
“వేణూ... ఎందుకింత అమానుషంగా హర్ట్ చేస్తున్నావు నన్ను? ఇట్ ఈజ్ బ్రూటల్ యు నో?”
ఆమె మాట పూర్తి అవుతూ ఉండగా పెరట్లోంచి వచ్చిన సుగుణమ్మ “అమ్మా, మధూ, ఎలా ఉన్నావే?” అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంది.
“అత్తయ్యా...” ఆమె నిస్సహాయత ఆక్రందనగా మారగా తల్లి లాంటి అత్తగారి భుజమ్మీద తల వాల్చి రోదించింది.
“ఊరుకోమ్మా... ఊరుకో...” వీపు నిమురుతూ ఓదార్చింది సుగుణమ్మ.
“ఆఫీసు నుంచే వస్తున్నావా తల్లీ? బాబు పడుకున్నాడు... చాలా సేపైంది... ఇప్పుడు లేస్తాడేమో.. వాడు లేచే లోపుగా నువ్వు వేడిగా కాస్తంత కాఫీ తాగు...”
“ఉహు, వద్దత్తయ్యా...” అయిష్టంగా అన్నది.
“ముఖం చూడు ఎలా వాడిపోయిందో! మధ్యానం అన్నం తిన్నట్టు లేవు... రామ్మా...” అంది చేయి పట్టి వంటింట్లోకి తీసుకు వెళుతూ...
ఆమె మాట కాదనలేక వెంట వెళ్ళింది మధుబాల.
***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali